Friday, April 14, 2017

అంబేద్కర్ ను అర్థం చేసుకుందాం..

డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్
ఆధునిక భారత దేశ చరిత్రను ప్రభావితం చేసిన మహనీయుల్లో అగ్రగామి.. స్వతంత్ర భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, స్వాతంత్రోద్యమ నేత, గొప్ప దేశ భక్తుడు, న్యాయవాది, సామాజిక శస్త్రవేత్త, చరిత్రకారుడు, రచయిత, ఉపన్యాసకారుడు.. ఇలా ఎంత చెప్పినా తక్కువే..
మహర్ కుటుంబంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచే పేదరికంకన్నా ఎక్కువగా అంటరానితనం, కుల వివక్షను ఎదుర్కొన్నారు.. సమాజంలో అడుగడుగునా అవమానాలు భరిస్తూనే ఎంతో పట్టదలతో ఉన్నత చదువులు చదివారు.. భారత దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు పోరాటం తీవ్రవైన రోజులు అవి.. స్వాతంత్ర్యంతో పాటు అస్పృశ్యతకు వ్యతిరేకంగా అదే స్థాయి ఉద్యమం జరగాలని భావించారు అంబేద్కర్.. అంటరానితనానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం పోరాడారు..
స్వతంత్ర భారత దేశ తొలి న్యాయ శాఖమంత్రిగా, రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ బాధ్యతలు నిర్వహించారు బాబాసాహెబ్. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసి మన దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేశారు. చదువు, ఉద్యోగం, రాజ్యాధికారం మాత్రమే అణగారిన వర్గాల కష్టాలను తీర్చేందుకు పరిష్కారం అని భావించిన అంబేద్కర్ రిజర్వేషన్లను పొందుపరిచారు.. హిందూ సమాజానికి రాచపుండులా దాపురించిన కుల వ్యవస్థను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడారు.. హిందూ మతాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న అంబేద్కర్ విదేశీ మతాలను అవలంభించేందుకు తిరస్కరించారు.. జీవిత చరమాంకంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు..
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఎన్నో ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది.. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి.. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది.. ఈ రోజున బాబాసాహెబ్ పేరును దుర్వినియోగం చేస్తున్నవారు పెరిగిపోయారన్నది నిజం..
రిజర్వేషన్లు పరిమిత కాలం ఉండాలని అంబేద్కర్ భావించారు.. కానీ ప్రస్తుత నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రిజర్వేషన్లను తాయిలంగా మార్చేశారు.. రిజర్వేషన్లను పొడగిస్తూ పోతున్నారు.. ఇవి కొన్ని వర్గాలకు పరిమితం అవుతున్నాయి.. దక్కిన వారే మళ్లీ మళ్లీ పొందుతున్నారు. రిజర్వేషన్లు న్యాయంగా అందాల్సిన వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు.. ప్రస్తుతం కొన్ని అగ్ర కులాలు సైతం రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలకు దిగాయి.. చివరకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు బరితెగించాయి ప్రస్తుత ప్రభుత్వాలు..
కుల నిర్మూళన ద్వారానే సమ సమాజ నిర్మాణం సాధ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ చేప్పేవారు.. దురదృష్లవశాత్తు కులాల పేరిట ఉద్యమాలు కుంపట్లుగా మారి దేశ సమగ్రత, సామరస్యానికి విఘాతంగా కలిగించేవిగా మారాయి.. అవి అగ్రవర్ణాలవి కావచ్చు.. బడుగు బలహీనవర్గాలని కావచ్చు.. ఈరోజున ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు.. కానీ ఆయనను అర్థం చేసుకున్నవారు, విధానాలను అనుసరిస్తున్నవారు చాలా అరుదు.. ముందు మనం తక్షణం చేయాల్సిన పని ఇదే..
(ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు కోరుకున్న సమాజ నిర్మాణం కోసం మనమంతా అంకితం అవుదాం)

No comments:

Post a Comment