Thursday, May 31, 2012

అన్నా బృందంలో అతిగాళ్లు..

అన్నాహజారే బృందం చేస్తున్న మతిలేని ప్రకటనలు చూస్తుంటే అవినీతిపై వారు చేస్తున్న పోరాటం విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మంత్రివర్గ సహచరులు అవినీతిపరులని అన్నాహజారే బృందం తేల్చేసింది.. అయితే తన బృందం విడుదల చేసిన నివేదికను అన్నాజీయే నమ్మకలేక పోయారు.. ప్రధాని నిజాయితీ పరుడే అంటూ వివరణ ఇచ్చారు.. ఇదేమిటయ్యా అని టీమ్ అన్నాను ప్రశ్నిస్తే, హజారేజీకి ఇంగ్లీష్ రానందున తమ నివేదికను చదవలేదని ఇకిలించారు.. ప్రధాని అవినీతి పరుడని అన్నాయే నమ్మనప్పుడు దేశ ప్రజలు ఎలా నమ్మగలరు? కనీసం టీమ్ అన్నా సభ్యుల జీవిత భాగస్వాములైనా నమ్మగలరా? తాను అవినీతిపరున్నని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ప్రధానమంత్రి ప్రకటించారు.. మన్మోహన్ సింగ్ అసమమర్థ ప్రధాని అనడంలో సందేహం లేదు.. అవినీతిని అరికట్టడంలో, దేశ ఆర్థిక రంగాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.. యూపీఏ ప్రభుత్వంలో ఆయనో కీలు బొమ్మ, అసలు రిమోట్ సోనియా గాంధీ దగ్గర ఉంటుందని అందరికీ తెలుసు.. ఈ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కం ఆర్థికవేత్తకు ఉన్న క్లీన్ ఇమేజీని అడ్డంపెట్టుకొని దేశాన్ని దోచేస్తున్నవారెవరో అందరికీ తెలుసు.. చేతనైతే అన్నా బృందం వారి వెంట పడాలి.. ప్రజలు కూడా మద్దతు ఇస్తారు.. నోరులేని ప్రధానిపై చేస్తున్న విమర్శలు నవ్వును తెప్పించడంతో పాటు అన్నా బృందాన్ని చులకన చేస్తున్నాయి.. కేజ్రీవాల్, ప్రశాంత్ భూషన్, కిరణ్ బేడీల లొసుగులేమిటో అందరికీ తెలుసు.. ఈ గురవింద అతిగాళ్లను అన్నా హజారే ఎలా భరిస్తున్నారో?.. వీరిని వదిలించుకుంటే అన్నాజీ గౌరవం పదింతలవడం ఖాయమని నేను కచ్ఛితంగా చెప్పగలను..

Wednesday, May 30, 2012

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?


నిరసన తెలియజేయడానికి బంద్ నిర్వహించడాన్ని అర్థం చేసుకోవచ్చు.. కానీ రాజకీయ పార్టీల బందులు ప్రాణాలు తీయడానికి దారి తీస్తే అందుకు ఎవరు బాధ్యత వహించాలి?  రాజకీయ పార్టీలన్నీ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.. ఇటీవల జరిగిన ఒక బంద్ రోజున రంగారెడ్డి జిల్లా లోని ఇబ్రహీంపట్నం సమీపంలో కొందరు వ్యక్తులు వేగంగా వెళ్ళుతున్న బస్సుపై రాళ్లు విసిరారు. డ్రైవర్ కంటిలో అడ్డం ముక్కపడి బస్సు అదుపు తప్పి కరెంట్ పోల్ కు గుద్దుకుంది.. పాపం డ్రైవర్ మరణించాడు.. అయన కుటుంబాన్ని ఓదార్చే వారెవరు? ఈ సంఘటన జరగటానికి రెండు రోజుల ముందు వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు? ఇందుకు ఒక పార్టీ వారినే తప్పు పట్టడం తగదు.. రాజకీయ పక్షాలన్నీ దోషులే.. 

టీజేఏసీ తుగ్లక్ చర్య

పరకాల ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) నిర్ణయం హాస్యాస్పదంగా ఉంది.. నిష్పాక్షికంగా, తటస్థంగా ఉండాల్సిన టీజేఏసీ ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటు.. సర్వే సాకుగా చూపి నిర్ణయాన్ని ప్రకటించడం అర్థం లేని పని..  భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించలేనప్పుడు తటస్థంగా ఉండాల్సింది.. జేఏసీ పదవుల నుండి తొలగిస్తాం అనే బ్లాకు మెయిల్ కు  భయపడి నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది.. ౨౦౧౪ ఎన్నికల్లో ఒక పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు వారిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మాల్సి వస్తోంది.. అసలు సర్వే నిర్వహించక ముందే  టీజేఏసీ నిర్ణయం ఏమిటో వెల్లడైన నేపథ్యంలో, సర్వే నివేదికను సాకుగా చూపడం ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టడానికి? తెలంగాణ రావాలంటే మరెన్నో పోరాటాలు చేయాలి.. బ్రేకులు ఇచ్చుకుంటూ ఉద్యమాలు చేసే జేఏసీ. పరకాల ఫలితం వల్ల తెలంగాణ వాదానికి ఏదో అవాంతరం వస్తున్నట్లు భయపడటం అర్థంలేని పని..  టీజేఏసీ తుగ్లక్ చర్యలు తెలంగాణ ఉద్యమానికి ప్రమాదకరంగా మారాయి.. అందరిని కలుపుకోవడం చేతకాకపోతే పదవులూంచి తప్పుకోవడం బెటర్..

Tuesday, May 29, 2012

చిచ్చు పెట్టకండి..

మత పరమైన రిజర్వేషన్లు వద్దని రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చెంపపెట్టే.. జగన్ వార్తల మాయలో ఏపీ మీడియా ఈ వార్తకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకున్నా జాతీయ మీడియా మన రాష్ట్ర నాయకులతో డిబేట్లు పెట్టడం గమనార్హం.. ఇప్పటికే విద్య, వృత్తి రంగాల్లో కులపరమైన రిజర్వేషన్లు సమాజంలో ఉన్న అగాధాన్ని మరింత పెంచుతున్న క్రమంలో అసలు రిజర్వేషన్ల పైనే సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది.. బాబా సాహెబ్ ప్రతిపాదించిన రిజర్వేషన్ల స్పూర్తికి భిన్నంగా మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో కొత్త కొత్త చిక్కులు తెస్తున్నారు.. రిజర్వేషన్ల కేటగిరిలో ఉన్న కులాలు కూడా పూర్తి స్థాయిలో లబ్ది పొందడం లేదు..క్రీమీలేయర్ అమలు చేయాలనే ప్రతిపాదన ఉన్న అమలుకు నోచదు.. రిజర్వేషన్లు పొందిన వారి వారసులే మళ్లీ మళ్లీ ఫలాలు అనుభవిస్తారు.. ప్రమోషన్లలోను  రిజర్వేషన్లు లభిస్తాయి.. ఈ విషయం అందరికి తెలుసు.. కానీ నోరు మెదపరు.. ఎవరి భయాలు వారివి.. కులంతో పాటు ఆర్థిక స్థితిని గమనించి రిజర్వేషన్లు ఇచ్చే విధానం రావాలి.. ఇప్పటికైనా సంకుచిత కుల వోటు బ్యాంకు రాజకీయాలను కట్టి పెట్టాలి.. కానీ తేనే తుట్టెను కదిపేదెవరు?

Monday, May 28, 2012

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు, దేశ భక్తుడు, కవి, రచయిత, చరిత్రకారుడు, హిందుత్వ సిద్ధాంతకర్త, సంఘ సంస్కర్త.. ఇలా పరిచయం చేస్తూ పోతే పేజీలు చాలవేమో.. జీవితాంతం దేశ హితం కోసమే పోరాటం చేసిన మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్.. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం..

అందరూ గురవిందలే..

జగన్ అరెస్టయ్యాడని కొందరు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.. మరి కొందరు విచారిస్తున్నారు.. తమనూ అరెస్టు చేస్తారేమోనని భయపడే నాయకులూ ఉన్నారు.. వీరూ, వారూ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులున్నారు.. అందరూ దొంగలే.. గురవిందలే.. తన లోపాన్ని కప్పిపుచ్చుకొని ఎదుటివారిపై బురద చల్లేవారే.. తాను నిజాయితీ పరులమని మనస్సాక్షిగా, ఇష్ట దైవంపై ప్రమాణం చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? వీరందరినీ అరెస్టు చేస్తూ పోతే రాష్ట్రంలో జైళ్లు చాలవేమో? నీతి, నిజాయితీ ఉన్న నాయకులకు గుర్తింపు లేకుండాపోయింది.. నీతి వాక్యాలు మాట్లాడే ‘సత్తా’ పార్టీకి సైతం అవినీతి పరులకు టికెట్లిచ్చిన చరిత్ర ఉంది..ఇందుకు మన వ్యవస్థను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.. లోపం మన ప్రజల్లోనే ఉంది.. ఈ విషయంలో మరింత లోతుకు వెళ్లకపోవడమే ప్రస్తుతానికి మంచిదేమో..

Saturday, May 26, 2012

క్రమశిక్షణ కోల్పోతున్న భాజపేయులు..

ఒకప్పడు క్రమ శిక్షణకు పేటెంట్ ఆ పార్టీ.. పూర్వాశ్రమంలో క్రమ శిక్షణ తప్పిన అధ్యక్షున్నే పార్టీ నుండి బహిష్కరించుకుంది.. కాలక్రమంలో అధికారంలోని వచ్చాక లంచం తీసుకున్నారనే అభియోగం ఎదుర్కొన్న అధ్యక్షున్ని వదిలించుకుంది.. జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా అవతరించినప్పడు తమది రాజకీయాలనే బురదలొంచి వికసించిన స్వచ్ఛమైన కమలమని గర్వంగా చెప్పున్నారు.. కానీ అధికారం అనే రుచి చూశాకా అన్ని రకాల అవలక్షణాలు పులుముకుంది.. అగ్రనేతలు సైతం క్రమశిక్షణ గాలికొదిలేసి ముఠాలు కట్టేసి పార్టీని కనుసన్నల్లో నడుపుకునే ప్రుయత్నం చేస్తున్నారు.. తాజా జాతీయ కార్యకర్గ సమావేశాలను చూస్తే.. తనకు పడని సంజయ్ జోషిని తప్పిస్తే కానీ సమావేశాలకు రాలేదు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ.. మోడీకి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి అనకబూనారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్.. అవినీతి కేసుల్లో ఇరుక్కొన్ని కోల్పోయిన పదవిని మళ్లీ ఇవ్వాలంటూ పేచీ పెడుతున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను బుజ్జగించి సమావేశాలకు పిలిచిన తీరుకు ఆగ్రహించారు అగ్రనేత అద్వానీ.. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే.. తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ పార్టీ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే అలిటమేటం ఇచ్చేశారు రాజఅవినీతి, అసమర్థ విధానాలతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న యూపీఏ ప్రభుత్వంపై పోరాడాల్సిన కమలనాథులు అంతర్గత కుమ్ములాటలతో కార్యకర్తలకు కన్నీరును, ఇతర విపక్షాలకు వినోదాన్ని, ప్రజలకు ఆగ్రహాన్ని ఏక కాలంటో పంచుతున్నారు..

అందరూ దొంగలే..


దొంగల్లో మూడు రకాలు ఉంటారు.. ఒకరు దొరికిన దొంగలైతే, మరొకరు దొరకని దొంగలు, మూడో రకం తేలు కుట్టిన దొంగలు.. ఇప్పడు మన రాష్ట్ర రాజకీయ నేతలు ఈ మూడు పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.. తండ్రీ కొడుకులు అధారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నారని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కోరస్ గా ఆలపిస్తున్నాయి.. ఇందుకు బాధ్యునిగా దివంగత నాయకుని కుమారున్ని కేసుల్లో ఇరికించేశారు..

సదరు కుమార రత్నం మాత్రం ఇది అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలు కలిసి తనపై పన్నిన కుట్ర అని, ప్రభుత్వంలో జరిగన వ్యవహారాలకు తానెలా బాధ్యన్నని ప్రశ్నిస్తున్నారు? అవినీతి ఆరోపనలు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతను వదిలి తన వెంటే ఎందుకు పడ్డారని అడుగుతున్నారు..

అయితే అధికారంలో ఉన్న వారేమో తమ పార్టీకి నాయకత్వం వహించిన దివంగత నాయకుని వ్యవహారాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని చేతులు దులుపుకుంటున్నారు.. పెద్దాయన చెప్పినట్లే చేశాం పరిణామాలతో మాకేమీ సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు..

ఇక తాను చేస్తే కరెక్టు, వారు చేస్తే తప్పు అనే ఆలోచనా ధోరణి ప్రధాన ప్రతిపక్ష నాయకునిది.. తన హయాంలో జరిగిన వ్యవహారాలను మాత్రం సమర్థించుకుంటూ అవతలి వారిపై బురద చల్లే పాత్రను చక్కగా పోషిస్తున్నారు..

అందరూ గొంగట్లో వెంట్రుకలు ఏరుకునేవారే.. దొరికినప్పుడే దొంగలు, అప్పటి వరకూ అందరూ దొరలే అనేది లోకోక్తి అయితే ఇక్కడ అందరూ దొంగలైనా, దొరల్లా ఫోజులు కొడుతున్నారు.. ఎవరిని నమ్మాల్లో ఎవరిని నమ్మొద్దో అర్థం కావడం లేదు.. ఈ మూడు ముక్కలాట నుండి ప్రజలకు విముక్తి లేదా?

Thursday, May 24, 2012

మమత అంటే అంత పగా?

West Bengal Chief Minister Mamata Banerjee alleged that Communist Party of India-Marxist was plotting with Maoists to kill her with the help of Pakistan's Inter-Services Intelligence and financed by North Korea, Venezuela and Hungary. సీపీఎం-మావోయిస్టులు మమత శత్రువులు, పాకిస్తాన్ మన దేశానికి శత్రువు కావచ్చు కాబట్టి ఆమె ఆరోపించ వచ్చేమో.. కానీ పాపం కొరియా, వెనిజులా, హంగేరీలకు మమతపై ఎందుకింత పగో.. ఆమెకే తెలియాలి మరి..

పెట్రో బాధ..


 అర్థరాత్రి తర్వాత పెట్రోలు ధర ఏకంగా రూ.81.44(హైదరాబాద్)కు చేరుతోందనే వార్త రానే నగర ప్రజలు ధనిక, పేద తేడా లేకుండా బంకులవైపు పరుగెత్తారు.. అక్కడ కిలో మీటర్ల కొద్దీ కార్లు, బైకులు బార్లు తీరడాన్ని చూడగానే ఒకవైపు నవ్వు, మరోవైపు ఆగ్రహం వచ్చేసింది.. కొద్ది రూపాయలకు ఆదా చేయడానికి వేసవి ఉక్కపోతలో చమటలు కక్కుతూ గంటల కొద్దీ లైన్లలో నిల్చొని సమయం వృధా చేసుకోవడం కన్నా, నెలో రెండో, మూడో రోజులు ఒక రోజు వ్యక్తిగత వాహనాన్ని ఉపయోగించడం మానేస్తే సరి అనిపించింది.. కానీ ఇది అందరకీ సాధ్యం కాకపోవచ్చు.. ఎవరి అవసరాలు వారికుంటాయి కదా?..

పెట్రోలు ధర పెరిగినందుకు సగటు పౌరునిగా నేనూ ప్రభుత్వ పెద్దలను తిట్టేశాను.. అంతకన్నా మరేంచేయగలను? రూ.73.08 నుండి రూ.81.44 ఖర్చు చేయడం అంటే నాలాంటి బడ్జెట్ పద్మనాభంలకు ఇబ్బందే మరి..
దేశ వ్యాప్తంగా పెట్రోలు ధర పెరుగుదల చూస్తే మన రాష్ట్రంలోనే అధికంగా ఉంది.. పెట్రోలుపై గోవాలో 0.1% వ్యాట్ ఉంటే ఆం.ప్ర.లో 33% వ్యాట్ విధిస్తున్నారు.. పెట్రోలు డీజిల్లపై పన్నుల భారం ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ.. నిన్నటి దాకా మన రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.71.08 ఉంటే గోవాలో కేవలం రూ.55 మాత్రమే.. మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కాగానే 29% పన్నును 0.1% తగ్గించి ఆదర్శ పాలకునిగా ప్రజల మన్ననలను పొందుతున్నారు.. ఆం.ప్ర. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నుండి ఇలాంటి రాయితీలు ఆశించడం దండగా.. పెట్రో ధరలు, పన్నుల భారానికి మీరంటే మీరే కారకులంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకుంటాయి.. కానీ ఇద్దలు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ప్రజల జేబులకు కన్నాలు వేస్తున్నారు.. పెట్రోలు, డీజిల్పై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నట్లుగా బీద అరుపులు వినిపిస్తారు మన పాలకులు..

కనికరం లేకుండా పెట్రో బాంబు పేల్చిన ప్రభుత్వ పెద్దలను చూస్తే వీరు ప్రజా ప్రతినిధులేనా? ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ములతో సర్కారీ ఎర్ర బుగ్గల వాహనాల్లో దర్జాలు ఒలకబోస్తూ తిరిగే వారికి తమకు ఓట్లేసిన వారి బాధలు పట్టవా అనే సందేహం వచ్చింది.. ప్రతి పక్షులు నాలుగు రోజుల వీధులకెక్కి ఉద్యమించడం, ఆ తర్వాత నోర్లు మూసుకోవడం శరా మామూలైపోయింది.. మొద్దు జనం రెండు రోజులకే సర్దుకొని మౌనంగా ఉండిపోతున్నారు..ఒక స్ట్రాతో పెట్రోలు, మరో స్ట్రాతో ప్రజల రక్తం తాగడానికి అలవాటు పడ్డ ఈ ప్రభుత్వ పాలకులకు సద్భుద్ది కలగాలని వారు ప్రార్థించే ఇష్ట దైవాలను వేడుకుంటున్నాను..

Wednesday, May 23, 2012

అసమర్థపాలనకు మూడేళ్లు..

కేంద్రంలో యూపీఏ-2 సర్కారు మూడేళ్ల అసమర్థపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.. ఈ నిర్వాకానికి ఎంతో గర్వపడ్డ ప్రధాని మన్మోహన్ సింగ్ భాగస్వామ్య పక్షలకు విందు ఇచ్చారు.. దేశంలో దారిద్ర్యం తగ్గి వృద్ధి రేటు పెరిగిందంటూ గర్వపడ్డారాయన.. పాపం ఈ రిమోట్ మౌనీ బాబా ఇంతకన్నా చేయగలిగిందేమిటి? రాబోయే రెండేళ్లలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళలానని పాత అరిగిపోయిన రికార్డును మరోసారి వినిపించారు.. యూపీఏ పాలనలో జరిగన కుంభకోణాలు, ధరల పెరుగుదల, పెట్రోధరల భారం, రూపాయి పతనం, దేశ భద్రతపై రాజీ, తెలంగాణ విషయంలో అస్పష్టవైఖరి  తదితర వైఫల్యాలపై మాత్రం మౌన వ్రతం పాటించారు.. ఏం చేస్తాం.. మరో రెండేళ్లు ఈ అసమర్థ నాయకత్వాన్ని భరించాలి..

Tuesday, May 22, 2012

ఏవీ భాగ్యరెడ్డి వర్మ స్మృతులు?..


చాదర్ ఘాట్ బ్రిడ్జి దాటి ఉమెన్స్ కాలేజీ రోడ్డు వైపు వస్తుంటే కుడి వైపున ఓ భవంతి గంభీరంగా కనిపిస్తుంది.. ఆ భవనంపైన ‘ఆదిహిందు భవన్’ అనే అక్షరాలు కనిపిస్తాయి.. అదే రోడ్డులో మరి కొంచెం ముందుకు వచ్చాక కుడివైపున చిన్న గణేష్ గుడి పక్కన ‘మాదరి భాగ్యరెడ్డి రోడ్డు’ అనే మున్సిపల్ బోర్డు కనిపిస్తుంది (రోడ్డు విస్తరణలో తొలగించనందుకు జీహెచ్ఎంసికి ధన్యవాదాలు).. ఒక హైదరాబాదీగా నా చిన్నప్పటి నుండీ నాకివి సుపరిచిత దృశ్యాలు.. నాలాగే చాలా మంది చూసే ఉంటారు.. కానీ గుర్తుండకపోవచ్చు.. అసలు ఈ ఆదిహిందూ భవన్ ఏమిటి? మాదరి భాగ్యరెడ్డి వర్మ రోడ్డేమిటి? ఎవరీ భాగ్యరెడ్డి వర్మ అనే విషయాలు బీజీ సిటీ లైఫ్లో ఎవరికి తట్టి ఉండకపోవచ్చు..

నన్ను అమితంగా బాధపెట్టే విషయాల్లో ఇది కూడా ఒకటి.. హైదరాబాద్ చరిత్రకు జరిగిన అన్యాయాల్లో ఇదీ ఒకటి.. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జోతిబా పులే విగ్రహాలు తెలుగు నేలపై, తెలంగాణలో, భాగ్యనగరంలో వాడవాడలా కనిపిస్తాయి.. కానీ ఎక్కడా, కనీసం హైదరాబాద్ నగరంలో కూడా భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఒక్కటైనా కనిపించదేం.. ఆ మహా నాయకున్ని మరిచిపోయారా? బహుషా ఆ నాయకుని గురించి నేటి తరానికి తెలియదేమో? తెలిసినా ఓట్ల రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తితో మనకేం సంబంధం అని నేతాజీలు నటిస్తున్నారా?.. తెలుగు నాట దళితోద్యమానికి బాటలు వేసిన ఈ మహానేత చరిత్ర ఎక్కడా కనిపించదేం?

నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో దళితోద్యమానికి బాటలు వేసపిన మహానేత భాగ్యరెడ్డి వర్మ.. 1888 సం. మే 22 నాడు జన్మించారాయన.. అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడాయన.. తదనంతర కాలంలో బాబా సాహెబ్తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు.. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు భాగ్యరెడ్డి వర్మ.. ‘ మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..’ అని గర్వంగా చాటారు.. ఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. తెలుగు నేలపై విజయవాడ తదితర ప్రాంతాలకూ విస్తరించారు.. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. దురదృష్టవశాత్తు ఇంటర్నెట్లో (వీకీపీడియాలో అస్పష్ట సమాచారం) కూడా భాగ్యరెడ్డి వర్మ గురుంచి పూర్తి సమాచారం అందుబాటులో లేదు.. వచ్చే ఏడాది 125వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. కనీసం ఆనాటికైనా ఈ మహనీయుని స్మృతి చిహ్నలు ఏర్పాటు కావాలని కోరుకుందాం.

నిజంగా తెల్ల పేపరే..


కొండను తొవ్వి ఎలుకను పట్టడం కూడా కళే.. ఈ కళలో మన దాదా నిష్ణాతుడు.. నల్ల ధనంపై ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేసిన శ్వేతపత్రం చూసి ఆర్థిక వ్యవహాలపై అవగాహన లేనివారు, చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.. స్విస్ తదితర విదేశీ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచుకున్న సొమ్ము ఎంత? దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి దేశాభివృద్ధి కోసం ఉపయోగిస్తారనే విషయంలో ఈ శ్వేతపత్రం సరైన వివరణ ఇవ్వలేకపోయింది.. స్విస్ బ్యాంకుల్లో లక్ష కోట్లకుపైగా భారతీయులు అక్రమంగా దాచుకున్న నల్లధనం ఉందని అద్వానీ తదితర ప్రతిపక్ష నేతలు, పత్రికలు గత కొన్నేళ్లుగా ఘోషిస్తూనే ఉన్నా.. ప్రణబ్ దాదా తేల్చింది మాత్రం కేవలం రూ.9,300 కోట్లు మాత్రమే.. ఇది ఎవరి చేవుల్లో పూలు పెట్టడానికి చెబుతున్న మాటో దాదానే తేల్చాలి.. స్వయంగా స్విస్ నేషనల్ బ్యాంకు ప్రకటించిన గణాంకాల ప్రకారం 2006 సంవత్సరంలో భారతీయులు దాచుకున్న డబ్బు రూ.23,373 కోట్ల రూపాయలు.. 2010 నాటికి ఇది రూ.9,295కి పడిపోయింది.. ఇన్నేళ్లుగా ప్రతిపక్షాలు,దేశ ప్రజలు పెడుతున్న గగ్గోలు చూసి నల్ల ధన దొరలు తెలివిగా అక్కడి నుండి తప్పించేశారనేది సుస్పష్టం.. ఈ దొరలు ఎవరో వెల్లడించే ధైర్యం కూడా యూపీఏ సర్కారుకు లేదని స్పష్టమైపోయింది.. ఈ నల్ల దొరలపై మమకారంతోనే ఇంత కాలం ప్రభుత్వం చేష్టలుడిగినట్లు నటించిందేమో.. నల్లధనాన్ని అడ్డుకునే దిశగా ప్రణబ్ దాదా తన శ్వేతపత్రంలో ప్రకటించిన పప్పు బెల్లం లాంటి స్వాంతన చర్యలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి మరి..

Monday, May 21, 2012

రాజీవ్ గాంధీకి ఇచ్చే నివాళి ఇదేనా?


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ. హత్య చేసి నేటికి 21 సం. అవుతోంది.. రాజీవ్ హత్య జరిగిన రోజును మన ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదుల చేతిలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను పోగొట్టుకున్నాగుణపాఠం తెచ్చుకోకపోవడం దురదృష్టకరం.. వోటు బ్యాంకు రాజకీయాలతో రాజీ పడుతున్న కాంగ్రెస్, తమిళ పార్టీలు, సంస్థలకు లొంగిపోయి రాజీవ్ హంతకులను కాపాడటం సిగ్గుచేటు.. పార్లమెంట్ పైన దాడి కుట్రదారు అఫ్జల్ గురు, ముంబై దాడుల నిందితుడు కసబ్ ను కూడా జైళ్లలో ముప్పొదుల మేపుతున్నారు.. వేరేం ఘనకార్యం చేసారని క్షమాభిక్ష ఇవ్వాలి?..  రాజీవ్ గాంధీకి ఇచ్చే నివాళి ఇదేనా? 

Saturday, May 19, 2012

మనకొద్దీ ఐ'ఛీ'ఎల్!

11 మంది పిచ్చోళ్లు ఆడుతుంటే, మరో 11 వేల మంది పిచ్చోళ్లు చూస్తుంటారని జార్జ్ బెర్నార్డ్ షా క్రికెట్ ఆట గురుంచి ఆనాడే వ్యాఖ్యానించాడు.. ఒకప్పడు ఇంగ్లాండ్ కే పరిమితమైన ఈ పిచ్చోళ్ల సంఖ్య లక్షలు, కోట్లు దాటి ఖండాంతరాలకు వ్యాపించడం చూస్తూనే ఉన్నాం.. ఈ తరహా పిచ్చోళ్లు మన దేశంలోనే అత్యధికంగా ఉండటం మన దురదృష్టకరం.. జాతీయ క్రీడ హాకీ కన్నా క్రికెట్టే ప్రధానమైపోయింది మనకు.. కొందరు క్రికెట్ ఆటనే మతంగా, ఆటగాళ్లనే దేవుళ్లుగా ఆరాధిస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తిలేదు.. ఈ పిచ్చినే కొన్ని వ్యాపార సంస్థలు సొమ్ము చేసుకుంటూ క్రికెట్ ఆటను అంగడి సరుకుగా మార్చేశాయి.. చివరకు ఇండియన్ క్రికెట్ కు ఐపీఎల్ అనే క్యాన్సర్ వచ్చేసింది.. ప్రాంచైజ్ల పేరిట క్రికెటర్లను పశువుల్లా కొనేశారు.. క్రికెట్ జెంటిల్‌మెన్ గేమ్‌గా పేరు తెచ్చుకుంటే.. దాని అక్రమ సంతానమైన ఐపీఎల్ కు మాత్రం అన్ని రకాల వ్యసనాలు వచ్చేశాయి.. తాగుబోతులు, తిరుగుబోతులు, స్త్ర్లీలోలులు, గర్వపోతులు, ఫిక్సింగ్ గాళ్లు, విశ్వాస ఘాతకులు, దేశ ద్రోహులు ఐపీఎల్ నిండా కనిపిస్తున్నారు.. మందు, మగువ, మనీ.. ఇవే ఐపీఎల్ క్రికెట్‌కు మూడు స్టంపులు! ఫిక్సింగ్ ప్రపంచమే దీని మైదానం!.. ఒక విదేశీ ఆటగాడు ఓ క్రికెట్ అభిమానిపై అత్యాచారానికి ప్రయత్నిస్తే, ఓ ప్రాంచైజీ యజమాని కం ప్రముఖ నటుడు స్టేడియంలో అనుచితంగా ప్రవర్తించి నిషేధాన్ని కొని తెచ్చుకున్నాడు.. కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్ని వేశ్యలకన్నా అధ్వాన్నంగా వ్యవహరించారు.. డబ్బు అనే గబ్బు జబ్బు పట్టిన ఐపీఎల్, బీసీసీఐ అధికారులు అవినీతి కంపులో మునిగి తేలుతూ క్రికెట్ అభిమానులకు జిగుస్స కలిగిస్తున్నారు.. క్రికెట్‌ను ఐపీఎల్ డ్యాన్స్, డ్రామా స్థాయికి దిగజార్చింది. తాము చట్టానికి అతీతులమని బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు భావిస్తున్నారు.. ఈ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం.. వరుస వివాదాలతో భ్రష్టుపట్టిన ఐపీఎల్‌ను రద్దు చేయడమే ఉత్తమం.. అప్పుడే జంటిల్మెన్ క్రీడగా క్రికెట్ బతికి బట్టకడుతుంది.. లేకపోతే ఈ సంకర క్రీడ క్రికెట్ ఆటనే మింగేస్తుంది..

Friday, May 18, 2012

హిందూ దేవతలకు అవమానం


కొన్ని విదేశీ కంపెనీలు తమ వ్యాపార ఉత్పత్తులపై హిందూ దేవతలను అవమానిస్తూ బొమ్మలను ముద్రించడం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. బూట్లు, లోదుస్తులు, టాయిలెట్ సీట్లపై గణపతి, లక్ష్మి, సరస్వతి, హనుమాన్ తదితర చిత్రాలు ముద్రించడం, హిందూ సంస్థల ఆగ్రహంతో క్షమాపణలు చెప్పడం తెలిసిందే.. తాజాగా Burnside అనే అమెరికన్ బీర్ కంపెనీ తమ కొత్త మద్యం బ్రాండ్ కాళీమా పేరిట విడుదల చేసే ప్రయత్నం చేసింది.. ఈ బాటిల్ పైన హనుమంతుడి బొమ్మ కూడా ఉంది.అయితే హిందువుల ఆగ్రహంతో తోక ముడిచి సారీ చెప్పింది.. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ రవిశంకర్ పార్లమెంట్లో ప్రస్థావించినప్పటికి మన ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదు దేశ ప్రజలు ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం సిగ్గుచేటు.. మన తోలు మందం హిందువుల ఉదాసీన వైఖరి వల్లే విదేశీయులు ఇలాంటి దుస్సాహసానికి పూనుకుంటున్నారు..

Thursday, May 17, 2012

రూపాయి పతనం ఎవరి పాపం?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రూపాయి మారకపు విలువ అమెరికా డాలర్ కు రెండున్నర రూపాయలుగా ఉండేది.. కరెన్నీని సులభంగా మార్చుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం రూ.2.50 నోటును ముద్రించింది.. మన పాలకుల అస్థవ్యస్థ ఆర్థిక విధానాల పుణ్యమా అని రూపాయి మారకం విలువ రూ.54.49కి పెరిగింది.. సెన్సెక్స్ ఒక్కసారిగా 298 పాయింట్లకు పడిపోయి మధుపరులకు ఒక్కసారిగా రూ.77,000 కోట్ల నష్టం వాటిల్లింది.. దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఎన్నడూ ఇంతటి దుస్థితి కలగలేదు.. పరిస్థితులను గమనిస్తే దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లుతోందా? 1991 నాటి పరిస్థితులు రానున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఒక ప్రముఖ ఆర్థిక వేత్త ప్రధానమంత్రిగా వెలగబెడుతున్న దేశానికి ఎంత దుస్థితి.. ఇందుకు మన్మోహన్ సింగ్ సిగ్గుతో తలొంచుకోవాలి.. రాష్ట్రపతి అవుదామని కలలు కంటున్న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నైతిక బాధ్యత వహించాలి.. దేశ ర్థిక వ్యవస్థ తగా దిగజారుతున్నా ఈ ఇద్దరు నేతలు బరి తెగించిపోవడం మన దురదృష్టకరం..

Sunday, May 13, 2012

తల్లిని ప్రతిరోజూ పూజిద్దాం..

జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయసీ.. తల్లి, పుట్టిన నేల స్వర్గం కన్నా గొప్ప అని శ్రీరాముడు తన సోదరునితో చెప్పారు.. అమ్మ కనిపించే ప్రత్యక్ష దైవం.. తొలి దైవం కూడా.. దురదృష్టవశాత్తు మదర్ డే పేరిట తల్లిని ఒకరోజు ప్రేమకే పరిమితం చేసే దౌర్భాగ్య సంస్కృతి వచ్చింది.. మాతృమూర్తిని ప్రతిరోజూ పూజించాలి, గౌరవించాలి, ప్రేమించాలి.. జన్మనిచ్చిన తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేం.. ఇలాంటి దినాలు మనకొద్దు.. దినాలు పెట్టడం మన సంప్రదాయంలో అశుభానికి సంకేతమని గుర్తుంచుకోండి..

మన పార్లమెంట్.. మన దేశం..

భారత పార్లమెంట్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఎన్నో మైలు రాళ్లను దాటేసింది.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యంగా పేరు రావడానికి పార్లమెంట్ దోహదపడింది.. అయితే ఎమర్జెన్సీ గడ్డు రోజులతో పాటు అవినీతి మన సమాజానికి మాయని మచ్చగా మారింది.. చట్ట సభలకు ఎన్నికౌతున్న ప్రతినిధులు ప్రజాసేవకన్నా సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు.. అంతమాత్రాన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిందించడం తగదు.. ప్రజల చేతిలో ఓటు హక్కు పవిత్రమైన, శక్తివంతమైన ఆయుధం.. దీన్ని మనం సక్రమంగా ఉపయోగించనందువల్లే ఈ దుస్థితి వచ్చింది.. నీతివంతులనే చట్టసభలకు ఎన్నుకుందాం.. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..

Saturday, May 12, 2012

పత్రికా స్వేచ్ఛ అంటే..

ఇటీవల పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దుమారం చూసిన తర్వాత నాకు తత్వం బోధపడింది.. పత్రికా స్వేచ్ఛ అంటే యాజమాన్యాలు చేసే అడ్డగోలు వ్యాపారాలను ప్రశ్నించరాదని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అర్థం.. పత్రికా స్వేచ్ఛ కొన్ని మీడియా సంస్థలకే వర్తిస్తుంది.. ఒక మీడియా సంస్థ యజమాని చేసేది తప్పు.. మరో యజమాని చేస్తే ఒప్పు.. జర్నలిస్టు సంఘాలు సైతం కొన్ని మీడియా సంస్థల స్వేచ్ఛనే కాపాడతాయి.. తమకు నచ్చే లేదా ప్రయోజనాలు ఇస్తున్న యాజమాన్యాలకే మద్దతు ఇస్తాయి.. ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డ జర్నలిస్టులతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు.. సో లాంగ్ లీవ్ ప్రెస్ ఫ్రీడమ్.. పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లాలి.

Friday, May 11, 2012

ఆంగ్ల ప్రదేశ్ మనది..

ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం సబబే అంటూ ఆదర్శ పాఠశాలల్లో నియామకాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఉంది.. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం అంటూ చంకలు బాదుకునే మన నాయకులు సిగ్గుతో తలొంచుకోవాలి.. అన్ని స్థాయిల్లో తెలుగును భాషను కచ్ఛితంగా అమలు చేయడంలో విఫలమైనందుకు ముక్కు నేలకు రాసి మరీ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలి.. పొరుగు రాష్ట్రల్లో వారి మాతృ భాషను న్యాయస్థానాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిల్లో అమలు చేస్తుంటే, మన పాలకులకు మాత్రం అది అసాధ్యమైన వ్యవహారంలా అనిపిస్తుంది.. ప్రధాన అధికార కేంద్రాలైన ముఖ్యమంత్రి, శాసనసభాపతి స్థానాల్లో ఉన్న వారికే తెలుగు భాష మాట్లాడటం నామోషీ అయినప్పుడు ఈ విషయాన్ని ఇంతకన్నా ఎక్కువగా చర్చించుకోవడమే అనవసరమేమో.. పేరులోనే తెలుగు ఉండి, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీ అధినేత అధినేత కూడా ఈ విషయంలో కపట నిద్ర నటిస్తున్నారు.. టీడీపీతో సహా ఏ రాజకీయ పార్టీ కూడా హైకోర్టు తీర్పుపై స్పందించక పోవడం సిగ్గు.. సిగ్గు.. సిగ్గు చేటు.. తెలుగు ప్రజలకు సైతం ఈ విషయం పట్టలేదు.. అందుకే అన్నారేమో ఆంధ్రులు ఆరంభ శూరులని..

Wednesday, May 9, 2012

మీడియా టార్గెటా?

రాజకీయ నాయకులు, పార్టీలు తమ లక్ష్యాలను సాధించుకోవడం కోసం సొంత మీడియాను ఎంచుకోవడం కొత్తేమీ కాదు.. గాంధీజీ, నెహ్రూలు సైతం సొంత పత్రికలు పెట్టుకున్నారు.. మన రాష్ట్రంలో కూడా అలాంటి ఉదాహరణలున్నాయి.. ప్రస్తుత సమాజంలో ఈ ధోరణి మరింత పెరిగింది.. అయితే మీడియాలో పని చేసే సిబ్బందికి (కొందరికి ఉండవచ్చేమో కానీ..) సహజంగా యజమానుల రాజకీయాలతో సంబంధం ఉండదు.. తన పత్రిక, ఛానెల్ బాగుంటేనే తన జీతం సకాలంలో వస్తుందనే ఆశాజీవులు వారు.. రాష్ట్రంలో పెద్ద పెద్ద పత్రికలు (కొన్ని ఛానెల్స్ కూడా) మూత పడి ఉద్యోగాలు లేక రోడ్డు పాలైన పాత్రికేయులెందరో ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఒక మీడియా సంస్థను బలి చేయడం కలవరాన్ని కలిగిస్తోంది.. ప్రభుత్వం, సీబీఐలకు జగన్ టార్గెట్ అయితే మరో రూపంలో చూసుకోవచ్చు.. కానీ సాక్షి పత్రిక, ఛానెల్ బ్యాంక్ అకౌంట్లను అడ్డుకోవడం ఎంత వరకూ సమంజసం.. జగన్ ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తు దాదాపు అర ఏడాదికిపై కాలం నుండి నడుస్తోంది.. ఇప్పుడు అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వల్ల కొత్తగా సాధించేది ఏమిటి? దర్యాప్తు పూర్తయ్యాక నేరం రుజువైతే ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం ఉన్నప్పడు ఇప్పటికిప్పుడు తొందర పడాల్సిన అవసరం ఏమిటి? ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియాతో ఢీకొని ఫలితం అనుభవించిన వారి చరిత్రలు పాలకులు ఒక్కసారి చదువుకుంటే మంచిది..

Tuesday, May 8, 2012

ఎవరు ఎవరితో ఎందుకు కుమ్ముక్కయ్యారు?

కిరణ్, బాబులు కుమ్ముక్కయ్యారని జగన్ అంటారు.. కిరణ్, జగన్ కుమ్ముక్కయ్యారని బాబు చెబుతారు.. ఇప్పు కిరణ్ అంటారు కదా..బాబు, జగన్, కేసీయార్ కుమ్ముక్కయ్యారని. నాకయితే అర్థం కాలేదు. ఎవరు ఎవరితో ఎందుకు కుమ్ముక్కయ్యారని.. ఒకటి మాత్రం నిజం వీరంతా కుమ్ముక్కై ప్రజలను మోసం చేస్తున్నారని..

Thursday, May 3, 2012

ఎందుకీ రాద్దాంతం?

జగన్ తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించడాన్ని కొందరు పనిగట్టుకొని వివాదాస్పదం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. క్రైస్తవుడైన జగన్ వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్నట్లు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయంలోకి ప్రవేశించడాన్ని తప్పు పట్టలేం.. అతిథి దేవో భవ అనేది హిందూ మత సాంప్రదాయం.. అతిథులు ఎవరైనా గౌరవించి, ఆహ్వానించాల్సిందే.. స్వామిని దర్శించు కోవాలనే ఆసక్తి కారణంగానే ఆయన ఆలయానికి వచ్చారే తప్ప మన మతంపై దండయాత్రకు రాలేదు.. ఇక్కడ అపవిత్రం అనే ప్రసక్తే లేదు.. హిందూ దేశంపై దండయాత్ర చేసిన నవాబులు, బ్రిటిష్ వారు సైతం (కొందరు మూర్ఖులు తప్ప) వెంకన్నకు భక్తి కొద్ది కానుకలు సమర్పించి భక్తుల మనోభావాలను గౌరవించారు..పెడర్థాలు తీసే రాజకీయ విమర్శకులు తాము ఏమాత్రం మతాచారాలను గౌరవిస్తున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ఇలా గగ్గోలు పెట్టేవారంతా తిరుమల కొండపై అనాచారాలు, అన్య మత ప్రచారాలు జరగకుండా తమ వంతు శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది.. అయితే జగన్ ఆలయ సందర్శన సందర్భంగా కొంత అపచారం జరిగింది.. ఆలయ ఆచారాలు ఆయనకు తెలియని కారణంగానో లేదా వెంట ఉన్న పార్టీ ప్రముఖుల అత్యుత్సాహమే ఇందుకు కారణం.. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీవారి సన్నిధికి రావాలని జగన్ వెంట ఉన్న టిటిడి మాజీ ఛైర్మన్ భూమన తెలియజేస్తే బాగుండేది.. అలాగే అనవసరపు ఆర్భాటం, వేంకటేశ్వరస్వామికి బదులు జగన్కు జైకొట్టడం ముమ్మాటికీ తప్పే.. ఇది లెంపకాయలేసుకుంటే పోయే తప్పే కానీ క్షమించరానంత పెద్ద నేరమేమీకాదు..

Tuesday, May 1, 2012

ప్రణబ్ దాదా రాష్ట్రపతా?.. ఇందులో కుట్ర ఉందా?

ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. బెంగాల్లో విఫల నేతగా పేరున్న దాదాను ఒక దశలో రాజీవ్ గాంధీ కూడా నమ్మలేదు.. యూపీఏ అంతరంగిన సమస్యల పరిష్కారకర్తగా పేరు సంపాదించిన ప్రణబ్ ముఖర్జీని ఏకాభిప్రాయ సాధనలో భాగంగా రాష్ట్రపతిని చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది.. దాదాపై అంత ప్రేమ ఉంటే ఏఐసీసీ అధ్యక్షునిగానో, లేదా ప్రధానమంత్రి పదవినినో ఇవ్వవచ్చు కదా? నోరు తెరవని దృతరాష్ట్ర మన్మోహనునికన్నా అంతో ఇంతో ఈయనే బెటరు కదా? అసలు లోగుట్టు ఇక్కడే ఉంది.. క్రియాశీలకంగా ఉన్న దాదాను రాష్ట్రపతి అనే గౌరవ హోదాలో కూర్చోపెట్టి ఆయన రాజకీయ ప్రాభవానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే కుట్ర జరుగుతోందా? కష్ట సమయంలో దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకున్న సంస్కరణల సారధి పీవీ నరసింహారావుకే ఎసరుపెట్టిన కాంగ్రెస్ నేతలు ప్రణబ్ విషయంలో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు.. ప్రణబ్ దాదా వివాద రహితుడు కావచ్చేమో? కానీ దేశంలో ధరల పెరుగుదలను అరికట్టడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యాడని ప్రజలంతా గుర్రుగా ఉన్నారు.. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎలా దాట వేస్తున్నాడో పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలంతా చూస్తూనే ఉన్నారు.. ఇప్పుడు చెప్పండి ప్రణబ్ దాదాను రాష్ట్రపతిని చేద్దామా? అసలు రాజకీయ నాయకులు బదులుగా మేధావులకు రాష్ట్రపతి పదవి ఇస్తే ఏ గొడవా ఉండదుగా?....

అద్భుతం.. మనోహరం..

నలమల అడవి మధ్యలో మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఇలాంటి అందమైన దృశ్యాలెన్నో కనిపించాయి.. మన తెలుగు సినిమా వాళ్లు ఇలాంటివి వదిలేసి ఎక్కడెక్కడో విదేశీ లొకేషన్లకు పరుగులు తీస్తారెందుకో?..
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో కందుకూరు - ఆమన్ గల్ మధ్యలో కనిపించిన అపురూప దృశ్యాల్లో ఒకటిది..