Thursday, May 24, 2012

పెట్రో బాధ..


 అర్థరాత్రి తర్వాత పెట్రోలు ధర ఏకంగా రూ.81.44(హైదరాబాద్)కు చేరుతోందనే వార్త రానే నగర ప్రజలు ధనిక, పేద తేడా లేకుండా బంకులవైపు పరుగెత్తారు.. అక్కడ కిలో మీటర్ల కొద్దీ కార్లు, బైకులు బార్లు తీరడాన్ని చూడగానే ఒకవైపు నవ్వు, మరోవైపు ఆగ్రహం వచ్చేసింది.. కొద్ది రూపాయలకు ఆదా చేయడానికి వేసవి ఉక్కపోతలో చమటలు కక్కుతూ గంటల కొద్దీ లైన్లలో నిల్చొని సమయం వృధా చేసుకోవడం కన్నా, నెలో రెండో, మూడో రోజులు ఒక రోజు వ్యక్తిగత వాహనాన్ని ఉపయోగించడం మానేస్తే సరి అనిపించింది.. కానీ ఇది అందరకీ సాధ్యం కాకపోవచ్చు.. ఎవరి అవసరాలు వారికుంటాయి కదా?..

పెట్రోలు ధర పెరిగినందుకు సగటు పౌరునిగా నేనూ ప్రభుత్వ పెద్దలను తిట్టేశాను.. అంతకన్నా మరేంచేయగలను? రూ.73.08 నుండి రూ.81.44 ఖర్చు చేయడం అంటే నాలాంటి బడ్జెట్ పద్మనాభంలకు ఇబ్బందే మరి..
దేశ వ్యాప్తంగా పెట్రోలు ధర పెరుగుదల చూస్తే మన రాష్ట్రంలోనే అధికంగా ఉంది.. పెట్రోలుపై గోవాలో 0.1% వ్యాట్ ఉంటే ఆం.ప్ర.లో 33% వ్యాట్ విధిస్తున్నారు.. పెట్రోలు డీజిల్లపై పన్నుల భారం ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ.. నిన్నటి దాకా మన రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.71.08 ఉంటే గోవాలో కేవలం రూ.55 మాత్రమే.. మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కాగానే 29% పన్నును 0.1% తగ్గించి ఆదర్శ పాలకునిగా ప్రజల మన్ననలను పొందుతున్నారు.. ఆం.ప్ర. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నుండి ఇలాంటి రాయితీలు ఆశించడం దండగా.. పెట్రో ధరలు, పన్నుల భారానికి మీరంటే మీరే కారకులంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకుంటాయి.. కానీ ఇద్దలు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ప్రజల జేబులకు కన్నాలు వేస్తున్నారు.. పెట్రోలు, డీజిల్పై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నట్లుగా బీద అరుపులు వినిపిస్తారు మన పాలకులు..

కనికరం లేకుండా పెట్రో బాంబు పేల్చిన ప్రభుత్వ పెద్దలను చూస్తే వీరు ప్రజా ప్రతినిధులేనా? ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ములతో సర్కారీ ఎర్ర బుగ్గల వాహనాల్లో దర్జాలు ఒలకబోస్తూ తిరిగే వారికి తమకు ఓట్లేసిన వారి బాధలు పట్టవా అనే సందేహం వచ్చింది.. ప్రతి పక్షులు నాలుగు రోజుల వీధులకెక్కి ఉద్యమించడం, ఆ తర్వాత నోర్లు మూసుకోవడం శరా మామూలైపోయింది.. మొద్దు జనం రెండు రోజులకే సర్దుకొని మౌనంగా ఉండిపోతున్నారు..ఒక స్ట్రాతో పెట్రోలు, మరో స్ట్రాతో ప్రజల రక్తం తాగడానికి అలవాటు పడ్డ ఈ ప్రభుత్వ పాలకులకు సద్భుద్ది కలగాలని వారు ప్రార్థించే ఇష్ట దైవాలను వేడుకుంటున్నాను..

No comments:

Post a Comment