Tuesday, May 22, 2012

ఏవీ భాగ్యరెడ్డి వర్మ స్మృతులు?..


చాదర్ ఘాట్ బ్రిడ్జి దాటి ఉమెన్స్ కాలేజీ రోడ్డు వైపు వస్తుంటే కుడి వైపున ఓ భవంతి గంభీరంగా కనిపిస్తుంది.. ఆ భవనంపైన ‘ఆదిహిందు భవన్’ అనే అక్షరాలు కనిపిస్తాయి.. అదే రోడ్డులో మరి కొంచెం ముందుకు వచ్చాక కుడివైపున చిన్న గణేష్ గుడి పక్కన ‘మాదరి భాగ్యరెడ్డి రోడ్డు’ అనే మున్సిపల్ బోర్డు కనిపిస్తుంది (రోడ్డు విస్తరణలో తొలగించనందుకు జీహెచ్ఎంసికి ధన్యవాదాలు).. ఒక హైదరాబాదీగా నా చిన్నప్పటి నుండీ నాకివి సుపరిచిత దృశ్యాలు.. నాలాగే చాలా మంది చూసే ఉంటారు.. కానీ గుర్తుండకపోవచ్చు.. అసలు ఈ ఆదిహిందూ భవన్ ఏమిటి? మాదరి భాగ్యరెడ్డి వర్మ రోడ్డేమిటి? ఎవరీ భాగ్యరెడ్డి వర్మ అనే విషయాలు బీజీ సిటీ లైఫ్లో ఎవరికి తట్టి ఉండకపోవచ్చు..

నన్ను అమితంగా బాధపెట్టే విషయాల్లో ఇది కూడా ఒకటి.. హైదరాబాద్ చరిత్రకు జరిగిన అన్యాయాల్లో ఇదీ ఒకటి.. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జోతిబా పులే విగ్రహాలు తెలుగు నేలపై, తెలంగాణలో, భాగ్యనగరంలో వాడవాడలా కనిపిస్తాయి.. కానీ ఎక్కడా, కనీసం హైదరాబాద్ నగరంలో కూడా భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఒక్కటైనా కనిపించదేం.. ఆ మహా నాయకున్ని మరిచిపోయారా? బహుషా ఆ నాయకుని గురించి నేటి తరానికి తెలియదేమో? తెలిసినా ఓట్ల రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తితో మనకేం సంబంధం అని నేతాజీలు నటిస్తున్నారా?.. తెలుగు నాట దళితోద్యమానికి బాటలు వేసిన ఈ మహానేత చరిత్ర ఎక్కడా కనిపించదేం?

నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో దళితోద్యమానికి బాటలు వేసపిన మహానేత భాగ్యరెడ్డి వర్మ.. 1888 సం. మే 22 నాడు జన్మించారాయన.. అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడాయన.. తదనంతర కాలంలో బాబా సాహెబ్తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు.. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు భాగ్యరెడ్డి వర్మ.. ‘ మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..’ అని గర్వంగా చాటారు.. ఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. తెలుగు నేలపై విజయవాడ తదితర ప్రాంతాలకూ విస్తరించారు.. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. దురదృష్టవశాత్తు ఇంటర్నెట్లో (వీకీపీడియాలో అస్పష్ట సమాచారం) కూడా భాగ్యరెడ్డి వర్మ గురుంచి పూర్తి సమాచారం అందుబాటులో లేదు.. వచ్చే ఏడాది 125వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. కనీసం ఆనాటికైనా ఈ మహనీయుని స్మృతి చిహ్నలు ఏర్పాటు కావాలని కోరుకుందాం.

No comments:

Post a Comment