Saturday, May 19, 2012

మనకొద్దీ ఐ'ఛీ'ఎల్!

11 మంది పిచ్చోళ్లు ఆడుతుంటే, మరో 11 వేల మంది పిచ్చోళ్లు చూస్తుంటారని జార్జ్ బెర్నార్డ్ షా క్రికెట్ ఆట గురుంచి ఆనాడే వ్యాఖ్యానించాడు.. ఒకప్పడు ఇంగ్లాండ్ కే పరిమితమైన ఈ పిచ్చోళ్ల సంఖ్య లక్షలు, కోట్లు దాటి ఖండాంతరాలకు వ్యాపించడం చూస్తూనే ఉన్నాం.. ఈ తరహా పిచ్చోళ్లు మన దేశంలోనే అత్యధికంగా ఉండటం మన దురదృష్టకరం.. జాతీయ క్రీడ హాకీ కన్నా క్రికెట్టే ప్రధానమైపోయింది మనకు.. కొందరు క్రికెట్ ఆటనే మతంగా, ఆటగాళ్లనే దేవుళ్లుగా ఆరాధిస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తిలేదు.. ఈ పిచ్చినే కొన్ని వ్యాపార సంస్థలు సొమ్ము చేసుకుంటూ క్రికెట్ ఆటను అంగడి సరుకుగా మార్చేశాయి.. చివరకు ఇండియన్ క్రికెట్ కు ఐపీఎల్ అనే క్యాన్సర్ వచ్చేసింది.. ప్రాంచైజ్ల పేరిట క్రికెటర్లను పశువుల్లా కొనేశారు.. క్రికెట్ జెంటిల్‌మెన్ గేమ్‌గా పేరు తెచ్చుకుంటే.. దాని అక్రమ సంతానమైన ఐపీఎల్ కు మాత్రం అన్ని రకాల వ్యసనాలు వచ్చేశాయి.. తాగుబోతులు, తిరుగుబోతులు, స్త్ర్లీలోలులు, గర్వపోతులు, ఫిక్సింగ్ గాళ్లు, విశ్వాస ఘాతకులు, దేశ ద్రోహులు ఐపీఎల్ నిండా కనిపిస్తున్నారు.. మందు, మగువ, మనీ.. ఇవే ఐపీఎల్ క్రికెట్‌కు మూడు స్టంపులు! ఫిక్సింగ్ ప్రపంచమే దీని మైదానం!.. ఒక విదేశీ ఆటగాడు ఓ క్రికెట్ అభిమానిపై అత్యాచారానికి ప్రయత్నిస్తే, ఓ ప్రాంచైజీ యజమాని కం ప్రముఖ నటుడు స్టేడియంలో అనుచితంగా ప్రవర్తించి నిషేధాన్ని కొని తెచ్చుకున్నాడు.. కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్ని వేశ్యలకన్నా అధ్వాన్నంగా వ్యవహరించారు.. డబ్బు అనే గబ్బు జబ్బు పట్టిన ఐపీఎల్, బీసీసీఐ అధికారులు అవినీతి కంపులో మునిగి తేలుతూ క్రికెట్ అభిమానులకు జిగుస్స కలిగిస్తున్నారు.. క్రికెట్‌ను ఐపీఎల్ డ్యాన్స్, డ్రామా స్థాయికి దిగజార్చింది. తాము చట్టానికి అతీతులమని బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు భావిస్తున్నారు.. ఈ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం.. వరుస వివాదాలతో భ్రష్టుపట్టిన ఐపీఎల్‌ను రద్దు చేయడమే ఉత్తమం.. అప్పుడే జంటిల్మెన్ క్రీడగా క్రికెట్ బతికి బట్టకడుతుంది.. లేకపోతే ఈ సంకర క్రీడ క్రికెట్ ఆటనే మింగేస్తుంది..

No comments:

Post a Comment