Sunday, May 31, 2015

పొగాకు మీ జీవితాలను మింగేస్తుంది..

మీకెవడైనా పగోడున్నాడా?.. వాన్ని మూడో కంటికి తెలియకుండా లేపేద్దామనుకుంటున్నారా?.. చాలా సులభం..  వాడితో తీయగా, స్నేహంగా మాట్లాడుతూ సిగరెట్ ఆఫర్ చేయండి.. అలవాటుగా మార్చేయండి.. ఇక వాడి చావుకూ, మీకూ ఎలాంటి బాధ్యత లేదు.. ఇది హస్యాస్పదంగా అనిపించవచ్చు.. కానీ నమ్మలేని వాస్తవం.. సిగరెట్ సైలెంట్ కిల్లర్.. అది కాలుతూ మీ జీవితాన్ని బూడిద చేస్తుంది.. చివరకు పాడె మీదకు చేరుస్తుంది..
సిగరెట్ తో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులైన చుట్ట, బీడీ, జర్దా, గుట్కా, పాన్ మసాలా ఏదైనా ప్రమాదకరమైనవే.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 లక్షల మందిని పొగాకు ఉత్పత్తులు పొట్టన పెట్టుకుంటున్నాయి.. భారత దేశంలో ఈ సంఖ్య 10 లక్షలు.. అంటే పొగాకు చంపేస్తున్న వారిలో ఆరో వంతు భారతీయులే.. మన దేశంలో ప్రమాదకరమై క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్న వారిలో నూటికి 66 శాతం పొగాకు ఉత్పత్తులను వాడే వారే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది పొగాకు కారణంగానే మరణిస్తారని అంఛనా..
పొగాకు ఉత్పత్తులు మొదట దెబ్బతీసేది మన నోటినే.. ఆ తర్వాత ఊపిరితిత్తులను, మెదడు, రక్తనాళాలు, జీర్ణకోశం, మూత్ర పిండాలను పనికి రాకుండా చేస్తాయి.. సిగరెట్టు పెట్టెపై పొగాకు వాడకం ప్రమాదకరమని ఎంత పెద్దగా రాసినా ఫలితం ఉండదు.. అసలు ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తాయని ఆశించడమే అత్యాశ.. పొగాకు ఉత్పత్తుల అమ్మకాల వల్ల ప్రభుత్వానికి భారీ సుంకాలు వసూలవుతున్నాయి.. అలాగే ఎగుమతులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి..  ప్రభుత్వానికి బంగారు గుడ్లు పెట్టే కోళ్ల లాంటి పొగాకు ఉత్పత్తులను వదులు కోవడం కత్తిమీద సాములాంటిదే..
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించడంతో పాటు, అమ్మకాలను కూడా పూర్తిగా అరికట్టాల్సిందే..  పొగాకు రైతులకు, ఈ వ్యాపారంపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదు.. ఇకప్పుడు ఐటీసీ కంపెనీకి పొగాకు వ్యాపారమే పెద్ద దిక్కు.. ఈ రోజు ఆ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టి భారీగా విస్తరించింది.. అన్నింటకన్నా ముఖ్యం ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టే పొగాకు ఉత్పత్తులను పూర్తిగా అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే.. పొగాకు వల్ల కలిగే అనర్ధాలను తెలుసుకొని, వాటికి దూరంగా ఉండటంతో పాటు ఇతరులనూ అప్రమత్తం చేయాలి..

అన్నట్లు పై పేరాలోకి మళ్లీ వెళదాం.. సిగరెట్, బీడీ, చుట్ట ఏదైనా.. అది పీల్చే వారితో పాటు, పక్కనుండే వారికీ ముప్పే.. సో మీరు ఆ అలవాటు ఇతరులకు నేర్పినా, వారి పక్కన ఉండే మీకు కూడా ముప్పే..

Saturday, May 30, 2015

సోషల్ మీడియా సేవకు గుర్తింపు..

నారద జయంతి సందర్భంగా సమాచార భారతి సంస్థ విశిష్ట పాత్రికేయులకు పురస్కారాలు అందించింది.. నాతో పాటు వేదుల నరసింహం, వక్కలంక రమణ, మేడపాటి రామలక్ష్మి గార్లకు ఈ పురస్కారాలు అందజేశారు.. రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో ఉన్న నేను సోషల్ మీడియా ద్వారా జాతీయ భావాలను ప్రచారం చేస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.. కార్యక్రమానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 
ఈ పుస్కరానికి నన్ను ఎంపిక చేసి, బాధ్యతలను పెంచిన సమాచార భారతి అధ్యక్షులు హరిహర శర్మ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రావు, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ గార్లకు.. పురస్కారాన్ని నాకు అందజేసిన కిస్మత్ కుమార్ గారికి, కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్న మిత్రులు రామ్మోహన్, కృష్ణమూర్తి, నాగరాజారావు, నీలేష్, వీరప్ప, ప్రదీప్ నంబియార్, రాఘవేందర్ గార్లకు ధన్యవాదాలు.. 
ఈ పురస్కారంతో పాటు చెక్కు రూపంలో అందజేసిన నగదును నేను గ్రామ భారతి సంస్థకు అందజేయాలని నిర్ణయించుకున్నాను.. నాకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.. 

Friday, May 29, 2015

సూటు బూటు వేసుకోడానికి అర్హత ఏమిటి రాహుల్?

థాయ్ లాండ్ ఎందుకు వెళ్లొచ్చాడో తెలియదు కానీ, అక్కడి నుండి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ తెగ మట్లాడేస్తున్నారు.. ఆ మాటలకు భలే భలే అంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతూ, చంకలు చరచుకుంటూ ఆనందిస్తున్నారు.. అంతే కదా ఆలస్యంగా మాటలు నేర్చిన పిల్లోడు ఏం మాట్లాడినా అతని తల్లి దండ్రులకు, బంధు మిత్రులకు ముద్దుగా, అబ్బురంగా అనిపిస్తుంది..
ప్రధాని నరేంద్ర మోదీ పాలన సూటు, బూటు సర్కార్ అంటూ ఎక్కడపోయినా అరిపోయిన రికార్డింగ్ వినిపించేస్తున్నారు రాహుల్.. మరి పదేళ్ల యూపీఏ పాలన లూఠ్, జూఠ్ అయినందునే ప్రజలు తిరస్కరించారని మాత్రం ఆత్మ విమర్శ చేసుకోలేకపోతున్నారు.. మోదీ సూటు వేస్తేనేమి, బూటు వేస్తేనేని అది ఆయన ఇష్టం.. రాహుల్ తాత జవహర్లాల్ నెహ్రూ, తండి రాజీవ్ గాంధీ సూట బుటూ వేసినోళ్లే కదా.. ఇప్పుడు ఆయన బావ రాబర్ట్ వాద్రా సూటు బూటు వేయడం లేదా? దాని గురుంచి ఎందుకు మాట్లాడరు రాహుల్..
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ వేసిన సూట్ విషయంలో పెద్ద రాద్దాంతం చేశారు.. పది వేలు కూడా విలువ చేయని ఆ సూటు విలువను లక్షలు ఖరీదు చేస్తుందంటూ లెక్క కట్టి డిమాండ్ పెంచారు.. మోదీ ప్రతి ఏటా తాను వాడిన వస్తువులను వేలం వేసి సామాజిక సేవా కార్యక్రమాలకు ధనం చేకూర్చడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.. విమర్శకుల పుణ్యమా అని దాని విలువ ఏకంగా రూ.4.32 కోట్లు పలికింది.. అదీ మోదీ విలువ.. నెహ్రూ, రాజీవ్, రాబర్ట్ దుస్తుల విలువెంత? వేలం వేసి చూడండి తెలుస్తుంది.. పోనీ రాహుల్ బట్టల విలువెంతో?..

స్వాతంత్రోద్యమ కాలంలో ఇండియాలో సరైన లాండ్రీ సదుపాయాలు లేవని నెహ్రూతో పాటు కొన్ని ఉన్నత కుటుంబాలు తమ సూటు బూట్లను లండన్, ప్యారీస్ లాండ్రీలకు పంపేవారని కథలు కథలుగా చెప్పుకుంటారు.. తమ కుటుంబం భేషుగ్గా సూటు బూటు వేసుకోవచ్చు.. కానీ నరేంద్ర మోదీ మాత్రం వేయకూడదు.. ఓ చాయ్ వాలా దేశ ప్రధాని కావడం ఏమిటి? సూటు బూటు వేయడం ఏమిటని ఓర్వలేకపోతున్నావా రాహుల్?..

Thursday, May 28, 2015

వీర సావర్కర్ ను గుర్తు చేసుకుందాం..

దేశం కోసం జీవితాన్నే సమర్పించుకున్న ప్రఖ్యాత సమర యోధుడు.  రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి 27 ఏళ్లు అండమాన్ జైలు శిక్ష అనుభవించిన విప్లవ వీరుడు..  1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు, ప్రథమ స్వాతంత్ర్య సమరమని బయటపెట్టిన చరిత్రకారుడు.. కవిగా, రచయితగా సమాజంలో చైతన్యం రగిలించారు.. అంటరానితనం, అసమానతలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త.. హిందుత్వ సిద్దాంతకర్త.. హిందూ మహాసభ వ్యవస్థాపకుడు.. ఎంతో మంది సమరయోధులను తీర్చి దిద్దిన స్పూర్తి ప్రధాత.. ఇలా ఆయన గురుంచి ఎన్ని చెప్పినా తక్కువే..
వినాయక్ దామోదర్ సావర్కర్.. స్వాతంత్ర్య వీర సావర్కర్ పేరిట ప్రఖ్యాతుడు..

దేశం కోసం సర్వస్వాన్ని కోల్పోయిన ఈ మహనీయుడి జయంతి ఈరోజు.. వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుందాం.. వారి నుండి స్పూర్తిని పొందుదాం..

దేశ భద్రత విషయంలో రాజీలేదు: రాంమాధవ్

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇతరుల నుండి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్ట చేశారాయన. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం, ప్రజ్ఞా భారతి, ఫోరమ్ ఫర్ లీడర్ షిప్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దేశ భద్రతకు సవాళ్లు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ వరకూ, పాకిస్తాన్ నుండి చైనా వరకూ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడారు రాంమాధవ్.. పొరుగు దేశాలతో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని, అదే సమయంలో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారికి గట్టి బదులు స్తున్నామని వివరించారు. పాకిస్తాన్ వేర్పాటు వాదులతో చర్చలు జరిపినందు వల్లే ఆ దేశంతో సత్సంబంధాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు రాంమాధవ్.. చైనా పర్యటనలో సరిహద్దు వివాదాల విషయంలో ఆ దేశాలని మన వైఖరిని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
కాశ్మీర్ పండితులను న్యాయం చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, గతంలో కాంగ్రెస్ పార్టీ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు రాంమాధవ్.. ఆర్టికల్ 370 విషయంతో తమ విధానం చాలా స్పష్టమని అందులో అనుమానాలకు ఆస్కారం లేదన్నారు.. జమ్మూలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఆ ప్రాంతానికి అన్యాయం చేయరాదనే లక్ష్యంతోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరిందని వివరించారు. చరిత్రలో తొలిసారిగా కాశ్మీర్ లోయతో సమానంగా జమ్మూకు ప్రాంతానికి నిధులు అందుతున్నాయని తెలిపారు.
రాహుల్ గాంధీ కొత్తగా మాటలు నేర్చిన చిన్నపిల్లాడని ఎద్దేవా చేశారు రాంమాధవ్.. మోదీ ప్రభుత్వాన్ని సూటు బూటు ప్రభుత్వం అని చెబుతున్న రాహుల్, ఇప్పటి వరకూ తాము అందించింది లూఠ్ జూఠ్ అని మరుస్తున్నారని విమర్శించారు. బట్టలను విదేశాల్లోని లాండ్రీకి పంపుకున్న ఘనత వారి కుటుంబానికి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదం ఇస్తూ పేదలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిందని ఆరోపించిన రాంమాధవ్, బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తుంటే తట్టుకోలేక అర్ధం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. మంచి పాలన అందిస్తున్న నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత కూడా లేకుండా పోయిందని, మోదీ ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలన్నీ అర్ధం లేనివే అని స్పష్టం చేశారు రాంమాధవ్.. మన్మోహన్ సింగ్ తో పోలిస్తే, విదేశీ పర్యటనల్లో మోదీకి అభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని అన్నారు.. అందుకే అర్థంలేని ఆరోపణలకు దిగుతోందని ఎద్దేవా చేశారు.
నరేంద్ర మోదీ పాలనలో దేశం ఆర్ధికంగా బలోపేతం అవుతోందని, మన వృద్ధి రేటు ఘననీయంగా పెరిగిందని వివరించారు రాంమాధవ్.. ఈ విషయంలో విదేశీ పత్రికలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయన్నారు.
భూసేకరణ బిల్లుపై అవాస్తవాల ప్రచారం జరుగుతోందని రాంమాధవ్ వివరించారు. మోదీ ప్రభుత్వం కార్పోరేట్లకు లాభం చేస్తోందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలులేవన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన మేరకే భూసేకరణ జరుగుతుందని, రైతులకు నాలుగింతల పరిహారం అందుతుందని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని రాంమాధవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి ఛైర్మన్ హనుమాన్ చౌదరి, జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు, ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.తిరుపతి రావు పాల్గొన్నారు.


Tuesday, May 26, 2015

ఏడాది పాలనలో ప్రజామోదీ..

365 రోజులు పూర్తయింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజలు ఇచ్చిన సమయం ఐదేళ్లు.. అప్పుడే ఏడాది పూర్తయింది.. ఈ సంవత్సర కాలంలో మోదీ ఏం చేశారు అన్నది సమీక్షించి, రాబోయే నాలుగేళ్లు ఏం చేయబోతారన్నది బేరీజు వేయడం న్యాయమే.. అదే సమయంలో అన్యాయమైన విమర్శలు చేసేవారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం.. నిజం నిద్రలేచే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వస్తుందనే నానుడిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి..
నరేంద్ర మోదీ ఏడాది పాలనలో అవినీతి, కుంభకోణాలు కనిపించాయా?.. గతంలో మాదిరిగా భారీగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా?.. విదేశాల్లో భారత దేశ ప్రతిష్ట పెరిగిన మాట వాస్తవం కాదా?.. మన దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరగడం, ద్రవ్యోల్భనం సగానికి తగ్గడం, దేశంలో విద్యుత్ ఉత్పాదన ఘననీయంగా పెరగడం, పారిశ్రామిక ప్రగతి పుంచుకోవడం ఎవరి పుణ్యం?.. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్ ఏర్పాటు, స్మార్ట్ సిటీస్, బేటీ బచావో-బేటీ పడావో, జన్ ధన్ యోజన, ముద్రా బ్యాంకు, పేదలకు కారు చౌకగా బీమా, పెన్షన్ పథకాలు ఎవరికి లబ్దిని కలిగిస్తాయి?.. మన్మోహన్ పదేళ్ల పాలన, మోదీ ఏడాది పాలనను బేరీజు వేసుకొని చూడండి..
మోదీని ఎన్నారై ప్రధాని అని విమర్శిస్తున్న వారు ఓ విషయాన్ని గమనించాలి.. యూపీఏ పాలకుల హయాంలో మన విదేశాంగ విధానం గాడి తప్పింది.. మన ఇరుగు పొరుగున ఉన్న చిన్న దేశాలు సైతం మనను బెదిరించే స్థాయికి ఎదిగాయి.. పాకిస్తాన్, చైనా సాగించే అగడాలు అన్నీ ఇన్నీ కావు.. అంతర్జాతీయంగా మనకు మద్దతు ఇచ్చేవారు పెరిగితే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.. ఇందుకు దూరదృష్టి అవసరం, దేశానికి ఘననీయంగా పెట్టుబడులు వచ్చినప్పుడే పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన సాధ్యం అవుతుంది.. ఇవన్నీ రాత్రికి రాత్రో, ఏడాదిలోగానో పూర్తయ్యే పనులు కావు.. అయినా ఫలితాలు కనిపిస్తున్నాయి.. మన ప్రధాని వెళ్లిన ప్రతి దేశంలోనూ అక్కడి ప్రవాస భారతీయులను కలుస్తున్నారు.. వారిలో ఉత్సాహాన్ని నింపుతూ మాతృదేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు..
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నరేంద్ర మోదీ విదేశాల నుండి నల్ల ధనాన్ని రప్పించలేదు.. ధనికులు-పెట్టుబడి దారుల కొమ్ము కాస్తోంది.. భూసేకరణ చట్టంతో రైతులకు అన్యాయం చేస్తోంది అనే విమర్శలు చేస్తున్నవారు ఒక విషయాన్ని ఆలోచించాలి.. ప్రధాని పదవిలో ఉన్నవారు ఏదైనా ప్రయత్నం చేయకుండా నోరు మూసుకొని మూలన కూచోవాలని కోరుకుంటున్నారా? అలాంటప్పుడు మౌనీ బాబా మన్మోహన్ కు మోదీకి తేడా ఏముంటుంది.. ఏదైనా సాధించాలంటే ప్రయత్నించాలి.. ఆ ప్రయత్నం మొదలైందా లేదా అన్నది గమనించాలి.. మన చట్టాలకు పదును పెట్టడం, విదేశాలపై నల్లధనం రప్పించడ కోసం వత్తిడి తేవడం మీరు గమనించలేదా?.. అక్కడి చట్టాలు, పరిమితుల కారణంగా ఆలస్యం జరగడం వాస్తవం.. ఈ ప్రయత్నాన్ని గత ప్రభుత్వాలు చేశాయా? పెట్టుబడి దారులను భూతాల్లా చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్ అయింది.. వారిని పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములను చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందించకుండా, విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి కల్పించడం వల్ల ఎవరికి ఉపయోగం? ఈ క్రమంలో అవినీతి, కుంభకోణాలు చోటు చేసుకుంటే నిలదీయాలి. కానీ గుడ్డి వ్యతిరేకత వల్ల ఫలితం ఉంటుందా?.. భూసేకరణ చట్ట సవరణ విషయంలో వాస్తవాలకన్నా అవాస్తవాలే ఎక్కువ ప్రచారం అవుతున్నాయి.. పేదలకు, రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతంలోని మర్మాన్ని కూడా గ్రహించాలి.. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఏ విధంగా విస్మరిస్తుంది?.. మోదీ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు నష్టాన్ని కలిగిస్తే ప్రజలే బుద్ది చెబుతారు..  నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా ఆరోపణలకే పరిమితం అవుతున్న వీరు ఏమి కోరుకుంటున్నారు..

ఏ పని చేసినా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వారిని ఒప్పించడం కష్టమే.. మోదీ సూటు బూటు వేసుకుంటున్నారు, సెల్పీలు దిగుతున్నారు అని ఏడ్చేవారు ఆ పని వారూ చేయొచ్చు ఎవరొద్దన్నారు.. ఎందుకిలా ఏడవడం?.. ఇసుక నుండి సైతం తైలం తీయవచ్చు కానీ మూర్కులను రంజిపలేము అని భర్తృహరి తన సుభాషితంలో చెప్పారు.. ఏడాది మోదీ పాలనకు జీరో మార్కులేశారు కొందరు మహానుభావులు.. అచ్చే దిన్ ఏవీ అని తెచ్చి పెట్టుకున్న అమాయకపు ప్రశ్న వేస్తున్నారు.. అచ్చేదిన్ దేశానికి, ప్రజలకే కానీ వారికి కాదు అని గ్రహించడం మంచిది.. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు..

Friday, May 22, 2015

అనగారిన వర్గాల 'భాగ్య'విధాత

హైద‌రాబాద్ న‌గ‌రంలో చాద‌ర్‌ఘాట్ చౌర‌స్తా దాటి ఉమెన్స్ కాలేజీ వైపు వెళుతుంటే ఎడ‌మ వైపు గంభీర‌మైన భ‌వ‌నం క‌నిపిస్తుంది.. ఆ భవనంపైన ఆది హిందు భవన్అనే అక్షరాలు కనిపిస్తాయి.. అదే రోడ్డులో మరి కొంచెం ముందుకు వచ్చాక కుడివైపున చిన్న గణేష్ గుడి పక్కన మాదరి భాగ్యరెడ్డి రోడ్డుఅనే మున్సిపల్ బోర్డు కనిపిస్తుంది.  ఒక హైదరాబాదీగా నా చిన్నప్పటి నుండీ నాకివి సుపరిచిత దృశ్యాలు.. నాలాగే చాలా మంది చూసే ఉంటారు..  ఆది హిందూ భవన్ ఏమిటి? మాదరి భాగ్యరెడ్డి వర్మ రోడ్డేమిటి? ఎవరీ భాగ్యరెడ్డి వర్మ? అనే విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా?


చరిత్రకు జరిగిన అన్యాయాల్లో ఇదీ ఒకటి.. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జోతిబా పులే విగ్రహాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాడవాడలా కనిపిస్తాయి.. కానీ తెలుగు నాట దళితోద్యమానికి బాటలు వేసిన భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఎందుకు కనిపించడదు?. కనీసం హైదరాబాద్ నగరంలో కూడా ఆ మహనీయుని విగ్రహం ఒక్కటైనా కనిపించదేం?.. భాగ్యరెడ్డి వర్మ గురించి నేటి తరానికి ఎందుకు తెలియదు? తెలిసినా ఓట్ల రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తితో మనకేం సంబంధం అని నేతాజీలు నటిస్తున్నారా?.. 
నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో అనగారిన వర్గాల గొంతుక భాగ్యరెడ్డి వర్మ.. 1888 సం. మే 22 నాడు మాదిరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారాయన.. తొలిపేరు భాగయ్య.. అయితే వారి కుల గురువు భాగ్యరెడ్డి అనే పేరు పెట్టారు.. (రెడ్డి అంటే పాలకుడు అనే అర్థం కూడా ఉంది) చిన్నప్పటి నుండి సామాజిక స్పృహను అలవరచుకున్న భాగ్యరెడ్డిపై ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, బౌద్ధం ప్రభావం కూడా ఉంది. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాను చూసి ఆర్యసమాజం వర్మ అనే బిరుదును ఇచ్చింది.. అలా భాగ్యరెడ్డి వర్మ పేరు వచ్చింది.
అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ.. తదనంతర కాలంలో బాబా సాహెబ్ తో  కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు  మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..అని సగర్వంగా చాటారు.. అనగారిన కులాలను ఆది హిందువులు అని పిలవాలని పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మ సూచన మేరకు హైదరాబాద్, మద్రాసు ప్రభుత్వాలు వారిని ఆది హిందువులుగా గుర్తించాయి. ప్రారంభంలో జగన్ మిత్ర మండలి, ఆ తర్వాత కాలంలోఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. 1910లో చాద‌ర్‌ఘాట్ దగ్గర ఆది హిందూ పాఠశాల ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఈ పాఠశాలను సందర్శించారు. కాలక్రమంలో ఆది హిందూ  పాఠశాలలు 26కు విస్తరించాయి. 
భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. 1917లో విజయవాడలో అంటరాని కులాల సదస్సును నిర్వహించారు. ఆంధ్ర జిల్లాల్లో కూడా పర్యటించి అనగారిన వర్గాల్లో చైతన్యం తీసుకు వచ్చారు.  లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో కన్నుమూశారు. 51 ఏళ్లకే ఆయన అకాల మరణంతో ఆది హిందూ ఉద్యమం, అనగారిన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి విఘాతం కలిగించింది. భాగ్యరెడ్డి వర్మ 127వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకుందాం.. మన తెలుగు వాడైన భాగ్యరెడ్డి వర్మను నేటి తరం గుర్తు చేసుకోవడానికి వీలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను

Tuesday, May 19, 2015

దేవుని సన్నిధిలో అబద్దాలు ఏల?

తిరుమలకు ఆంధ్ర, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి ఎంతో మంది వీఐపీలు వస్తుంటారు.. వీరిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు ఉంటారు..
శ్రీవారిపై సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వీరు వచ్చి దర్శించుకుంటారు..ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. అవి ఫలప్రదం కావలని మొక్కుకోవడానికి, తమ రంగాల్లో సాధించిన విజయం నేపథ్యంలో మొక్కు చెల్లించుకోవడానికి వేంకటేశ్వర స్వామి కొలువుకు రావడం ఆనవాయితీగా మారింది..
వీఐపీలు ఆలయం వెలుపలికి రాగానే మీడియా ప్రతినిధులు చుట్టుముడతారు.. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే రాజకీయ నాయకులు దేవుని సన్నిధిలోనే అందమైన అబద్దాలు చెప్పడం మీరు ఎప్పుడైనా గమనించారా? దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరు అభివృద్ది చెందాలని స్వామివారిని కోరకున్నామని చెబుతారు జాతీయ స్థాయి నాయకులు.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం భగవంతున్ని మొక్కుకున్నామని బడాయిలు చెబుతారు మన ఏపీ, తెలంగాణ నాయకులు.. ఇతర ప్రముఖులు మాత్రం నిజాయితీగా మొక్కు చెల్లించుకోడానికి వచ్చినట్లు చెబుతారు.. 

ఇతరులతో పోలిస్తే రాజకీయ నాయకులు స్వామివారి ఆలయం వెలుపల ఎందకీ అందమైన అబద్దాలు చెబుతారు.. భగవంతుని సన్నిధిలో అబద్దాలు చెప్పేందుకు వారి అంతరాత్మ ఎలా అంగీకరిస్తోంది.. ప్రజలను నమ్మించడానికి భగవంతున్ని వాడుకోవడం ఎందుకుఆలోచించండి..

Friday, May 15, 2015

విజయ ఎందుకు వెనుకబడింది? అమూల్, నందిని ఎలా దూసుకుపోతున్నాయి?

హైదరాబాద్  మహానగరంలో క్షీర విప్లవం వచ్చేసింది.. దేశంలోని ప్రధాన మిల్క్ బ్రాండ్లు నగరంపై దాడికి దిగాయి. రెండు నెలల క్రితం నగరంలో ఓ ప్రధాన ప్రయివేటు కంపెనీ పాల ధర లీటర్ రూ.42.. మిగతా కంపెనీలు ఇంచు మించుగా రూ.40 వరకూ ఉండేవి.. గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్ధ అమూల్ నగర ప్రవేశం చేయడంతో పరిస్థితి తలకిందులైంది. వస్తూనే రూ.38 ధరను నిర్ణయించింది అమూల్.. పైగా అత్యంత నాణ్యత, నమ్మకమైన దేశంలోనే నెం.1 బ్రాండు.. నిజానికి అమూల్ రూ.36కి లీగర్ ప్యాకెట్ ఇవ్వడానికి సిద్దపడ్డా, తెలంగాణ/ఆం.ప్ర. ప్రభుత్వ రంగ సంస్థ విజయతో పోటీ వద్దని నిర్ణయం తీసుకుంది. విజయ బ్రాండ్ పాల ధర రూ.38..
అమూల్ ప్రవేశంతో హైదరాబాద్ పాల మార్కెట్లో ఒక్క కుదుపు వచ్చేసింది. ప్రజలంతా అమూల్ వైపు మొగ్గు చూపే సరికి అన్ని కంపెనీలు దిగి వచ్చేశాయి.. తమ ధరలనూ సవరించుకున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో అమూల్ నెం.1 స్థానంలో ఉందంటున్నారు.. ఈ దశలో కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ నందిని మరింత షాకింగ్ ఆఫర్ తో హైదరాబాద్ లోకి వచ్చింది. నందిని పాల ధర లీటర్ రూ.36 మాత్రమే.. హైదరాబాద్ వాసుల పరిస్థితి ఇప్పుడు తంతే పాల గ్లాసులో పడ్డట్లుగా ఉంది..
పాల ధర తగ్గితే వినియోగదారునికి లాభం సరే, మరి రైతు సంగతి ఏమిటనే ప్రశ్న రావడం సహజం.. అయితే అమూల్, నందిని డెయిరీలు దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ ధర ఇచ్చి తమ రాష్ట్రాల్లో రైతుల నుండి పాలను సేకరిస్తున్నాయట.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలకన్నా మన తెలంగాణ, ఆం.ప్రల్లోనే పాల ధరలు అధికంగా ఉన్నాయి.. మరి అమూల్, నందిని ఎందుకు దూసుకుపోతున్నాయి?.. మన ప్రభుత్వ రంగ సంస్థ విజయ ఎందుకు కుదేలైంది?.. అసలు నంగతి అక్కడే ఉంది..
విజయ బ్రాండ్ ధర తక్కువ, విశ్వసనీయత ఉన్నా మార్కెటింగ్ లోపం ఎదుర్కొంటోంది. ప్రయివేటు డెయిరీలు ఎక్కువ ధరకు పాలను సేకరిస్తూ, ఎక్కువ ధరకే అమ్ముతున్నా మార్కెట్ ను ఆక్రమించుకున్నాయి.. విజయను వట్టిపోయిన గేదెగా మార్చడంలో ఆనాటి ప్రభుత్వ పెద్దల పాత్రే అధికంగా ఉంది.. తమ కుటుంబం, బంధుమిత్రులు, రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలున్న ప్రయివేటు డెయిరీలకు లబ్ది కలిగించేందుకే ప్రభుత్వ రంగ సంస్థ విజయను నీరు గార్చాయన్నది బహిరంగ రహస్యం.

20-25 ఏళ్ల క్రితం కేవలం మార్కెట్లో విజయ బ్రాండ్ పాలే దొరికేవి.. ఆ పాల జనం పొద్దున్నే వెళ్లి కోసం డీలర్ల షాపుల ముందు క్యూలు కట్టేవారు.. క్యూలోని వారందరికీ పాలు దొరుకుతాయనే గ్యారంటీ లేదు.. విధి లేని పరిస్థితిలో బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు పాల ప్యాకెట్లు కొనాల్సి వచ్చేది.. ప్రయివేటు డెయిరీలకు గేట్లు బార్లా తెరవడంతో పరిస్థితి మారిపోయింది.. కానీ విజయ కుదేలైపోయింది.. మళ్లీ విజయ బ్రాండ్ మార్కెట్ ను శాసించే స్థితికి రావాలని కోరుకుంటున్నాను..

Wednesday, May 13, 2015

8 రోజుల సమ్మె తర్వాత హైడ్రామా..

ఈయన 43కు ఒప్పుకుంటే, పక్కాయన 44కు ఓకే చెప్పేసిండు.. ఏమిటీ హైడ్రామా?.. ఎనిమిది రోజుల సమ్మె తర్వాత ఇంత పెద్ద నాటకమా?.. ఒకరిని మించి ఒకరూ భలేగా నటించేశారు.. ఈ ఫిట్మెంట్ ఫిట్టింగేదో ముందే ప్రకటించి ఉంటే ఎనిమిది రోజుల పాటు ప్రజలకు నరకయాతన తప్పేది కదా? సమ్మె చేసిన కార్మికులకు జీతాలు పెరిగాయి.. హ్యాపీ.. సమ్మె కాలానికి కూడా జీతం కట్టి ఇస్తారు.. వెరీ హ్యాపీ.. కానీ వెర్రి వెంగప్ప ప్రయాణీకుడైపోయాడు.. మీ ఎరియర్లు మీకు వస్తాయి.. కానీ ఈ ఎనిమిది రోజులు ప్రయివేటు వాహనాల దోపిడీ తాలూకు నష్టాన్ని ఎవరు రీయంబర్స్ చేస్తాడు?.. మీరికి జీతాలు పెంచామనే సాకుతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు ప్రయాణీకులపై వేసే వడ్డింపులు ఎవడు భరించాలి? చివరకు విరిగేది సామాన్యుడి నడ్డే కదా?

కోర్టు చీవాట్లేస్తే కానీ రెండు ప్రభుత్వాలు దిగిరావా?.. ఈ ఫిట్మెంట్ ఏదో అప్పుడే అంగీకరించి ఉంటే ఇంత నష్టం జరిగేదా? సమ్మె విరమించాలని కార్మిక సంఘాలను న్యాయ స్థానం హెచ్చరించాక వారికి వేరే మార్గం లేదు.. కానీ క్లైమాక్స్ చేరాక హీరోల్లా ఇద్దరు సీఎంలు రంగ ప్రవేశం చేయడంలోని ఆంతర్యం ఏమిటి? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ హైడ్రామా?

Sunday, May 10, 2015

ఆర్టీసీ సమ్మె ఎంత కాలం? ఎవరికోసం?

ఆర్టీసీ సమ్మెతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?.. లాభం: ప్రయివేటు వాహనాలకు. నష్టం: ముందు ప్రజలకు, ఆ తర్వాత ఆర్టీసీ సంస్థకు, కార్మికులకు, ప్రభుత్వానికి.. ఇక్కడ ఎలాంటి నష్టం లేనిది కార్మిక సంఘాలకు మాత్రమే. ప్రయివేటు ఆపరేట్ల ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లాభపడేది రాజకీయ నాయకులే..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సహేతుకమే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమనే అడుగుతున్నారు కార్మికులు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారి జీతాలు చాలా తక్కువే కాదనలేం.. కానీ మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటుంన్నాం అనే విషయాన్ని మరచిపోవద్దు..
ఆర్టీసీ బస్సులు తిరగక పోవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారంతా సొంత వాహనాలు లేదా ప్రయివేటు వాహనాలు ఉపయోగించుకుంటున్నారు.. పేద ప్రయాణీకులు మాత్రం ప్రయివేటు ఆపరేట్ల దోపిడీకి గురవుతున్నారు.. అయితే ప్రయివేటు ట్రాన్స్ పోర్టు వాహనాలు పెరిగిన కొద్దీ పోటీ కారణంగా ఛార్జీలు తగ్గుతాయి.. అప్పుడు ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులు ఎక్కమన్నా ఎక్కరు..  అప్పుడు ప్రభుత్వం వీలు చూసుకొని ప్రయివేటీకరణకు దారులు తెరుస్తుంది.. ఇది ఆర్టీసీ కార్మికులకు శరాఘాతమే..
నిజానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆర్టీసీ సంస్థ కానీ, ప్రభుత్వం కానీ కార్మిక సంఘాలు కోరుతున్న డిమాండ్లు తీర్చడం కష్టమే.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. వారికి వాగ్దానాలు చేసి ఓట్లు పొంది అధికారానికి వచ్చిన పార్టీలు ఇప్పుడు దీన్ని తమకు సంబంధం లేని వ్యవహారంగానే చూస్తున్నాయి. ఎందుకంటే నేను పైన చెప్పిన కారణమే నిజం కానుంది కనక..

మరి కొద్ది రోజుల్లో, ఇంకా స్పష్టగా చెప్పాలంటే కొద్ది గంటల్లోనే ఆర్టీసీ రెండు ముక్కలవుతోంది.. ఏపీఎస్ఆర్టసీ, టీఎస్ఆర్టీసీ ఏర్పడుతున్నాయి.. ఈ రెండు సంస్థల కార్మికుల ప్రయోజనాలకు కాపాడాల్సిందే.. అదే సమయంలో సాధారణ ప్రయాణీకుల సమస్యపై కూడా దృష్టి పెట్టాలి.. ఇది జరగాలంటే కార్మిక సంఘాలు, ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరిని పక్కన పెట్టిన మెట్టుదిగిరావాలి.. ఉభయులకు ఆమోద యోగ్యమైన పరిష్కారం ఆచరణ సాధ్యమే.. ఉండాల్సింది చిత్తశుద్ది మాత్రమే..

Saturday, May 9, 2015

భారత మిత్రుడు కామెరాన్

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ గతంలోకన్నా పూర్తి మెజారిటీ సాధించడం, డేవిడ్ కామెరాన్ తిరిగి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టడం భారత దేశానికి లాభదాయకం.. కామెరాన్ మొదటి నుండి మన దేశానికి మద్దతుదారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారాయన. మన దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం చేసుకునేందకు కృషి చేస్తున్న కామెరాన్ ఐక్య రాజ్య సమితిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. స్వతహాగా లేబర్ పార్టీ భారత దేశానికి సన్నిహితమైనా, కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కామెరాన్ ఈ పరిస్థితిని మార్చేశారు. బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు కూడా గతానికి భిన్నంగా కన్జర్వేటివ్లకు మద్దుతు ఇవ్వడానికి కామెరానే కారణం. ఈ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టడంలో భారతీయులు కూడా ప్రధాన పాత్ర పోషించారు.

డేవిడ్ కామెరాన్ స్వతహాగా ఆంగ్లికన్ క్రిస్టియన్ అయినా హిందూ మతం, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలంటే చాలా ఇష్టపడతారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు స్వామినారాయణ ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు కామెరూన్.. గతంలో కూడా ఆయన రెండు సార్లు ఆలయాన్ని సందర్శించి, దీపావళి పూజల్లో కూడా పాల్గొన్నారు. కామెరాన్ సతీమణి సమంత భారతీయ వస్త్ర ధారణతో రావడం గమనించాల్సిన విషయమే.. బ్రిటన్ హిందూయిజం నుండి స్పూర్తి పొందాలని, రామాయణం చదవండం ద్వారా తాను కుటుంబం, సమాజం, సేవ, విలువల గురుంచి తెలుసుకున్నానని కామెరాన్ ప్రకటించారు.. కామెరాన్ నాయత్వంలోని బ్రిటన్ తో సన్నిహిత సంబంధాలు విస్తరించడం ద్వారా భారత దేశానికి అన్ని రకాలుగా లాభ దాయకంగానే కనిపిస్తోంది.


Friday, May 8, 2015

సామాజిక హోదాను బట్టి శిక్షా?

సమాజంలో వీఐపీలు, సెలబ్రిటీలు తప్పు చేస్తే శిక్షించిల్సిన అవసరం లేదా? వారికి ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వాలా?.. కొందరి వాదన చాలా విడ్డూరంగా ఉంటోంది.. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సత్యం రామలింగ రాజు తదితరులకు న్యాయా స్థానాలు శిక్షలు విధించినప్పుడు వచ్చిన కామెంట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
చట్టం ముందు అందరూ సమానమే అంటారు. మరి సమాజంలో వారికి ఉన్న గుర్తింపు ఆధారంగా శిక్షలు విధించాల్సిన అవసరం ఎందుకు?.. వారి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి శిక్షలు ఖరారు చేయాలని వారి తరుపు లాయర్లు కోర్టుల్లో వాదిస్తుంటారు.. పైన ప్రస్థావించిన ముగ్గురు సమాజానికి సేవ చేశారనడాన్ని కాదనలేం.. నిజానికి న్యాయమూర్తులు దీన్ని పరిగణనలోకి తీసుకొనే శిక్షల్లో కొంత మినహాయింపులు ఇచ్చారు. తెలిసీ తెలియక తప్పులు చేసే సాధారణ ప్రజలు చట్టం ముందు నేరగాళ్లుగా నిలిచినప్పుడు న్యాయస్థానాలు ఇదే దృష్టితో చూడగలవా?
తాజాగా సల్మాన్ ఖాన్ ఉదంతం చూద్దాం.. తాగిన మత్తులో నిర్లక్ష్యంగా కారు ఫుట్ పాత్ మీదకు తోలి, అక్కడ నిద్రిస్తున్న వారు చావడానికి, గాయపడటానికి కారకుడయ్యాడు.. ప్రభుత్వం సల్మాన్ కోసం నియమించిన బాడీగార్డు ఎంతో నిజాయితీగా పోలీసు స్టేషన్ వెళ్లి ఈ ఘటనపై సాక్ష్యం ఇచ్చాడు.. దీంతో శిక్ష నుండి సల్మాన్ ఖాన్ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేసు ఏళ్ల తరబడి విచారణ జరిగి తీర్పు వెలువడే సమయానికి తాను కారు నడపలేదని, మరొకరు నడిపారని బొంకినా న్యాయస్థానం నమ్మలేదు. చివరకు ఈ నటుడికి శిక్ష పడింది..
సల్మాన్ ఏదో స్వాతంత్ర సమరంలో పాల్గొన్ని అన్యాయంగా జైలు పాలైనట్లు లబోదిబోమంటూ ఆయన్ని వెనకేసుకు వస్తున్నారు సన్నిహితులు, అభిమానులు.. ఆయన ఇంటికి జాతరకట్టి సానుభూతి ప్రకటిస్తున్నారు.. ఎవరి అభిమానం వారిది అని సరిపెట్టుకోవచ్చు, కానీ వీరిలో కొందరి వాదనలు చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఫుట్ పాత్ పై పడుకోవడమే నేరమట, అందుకు వారిని శిక్షించాలట.. రోడ్డు పక్కన పడుకునేది కుక్కలే కానీ మనుషులు కాదట. (అందుకే సల్మాన్ వారికి కారు రూపంలో మరణ శిక్ష ఇచ్చాడా?).. పేద వారిపై చింతన లేని ధన మదంతో చేసిన ఈ వ్యాఖ్యలను మనం సమర్ధించ వచ్చా..

ఈ కథలో క్లైమాక్స్ ఏమిటంటే సల్మాన్ జైలుకు వెళ్లడానికి కీలక సాక్ష్యం ఇచ్చిన రవీంద్ర పాటిల్ అనే బాడీగార్డు దిక్కులిన చావు చచ్చాడు.. పోలీసు కానిస్టేబుల్ వృత్తిలో ఉన్న రవీంద్రను ప్రభుత్వ సల్మాన్ కు బాడీగార్డుగా నియమించింది. సల్మాన్ తాగి ప్రమాదానికి కారకుడైన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు.. కేసు వాపస్ తీసుకోవాలని అతనిపై వత్తిడులు, బెదిరింపులు వచ్చాయి.. అయినా భయపడలేదు.. చివరకు వత్తిడితో మానసికంగా కృంగిపోయాడు. ఒక దశలో పిచ్చివాడిలా తిరుగుతూ కోర్టుకు హాజరు కాలేదు. ఫలితంగా న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. భార్య విడాకులు తీసుకొని పోయింది, ప్రభుత్వ ఉద్యోగమూ పోయింది. చివరకు క్షయవ్యాధి సోకి ఎముకల గూడుగా మారిపోయి జీవితాన్ని ముగించాడు.. సల్మాన్ నిర్ల్యక్ష్య డ్రైవింగ్ కారణంగా చనిపోయిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు నేటికీ పరిహారం అందలేదు.. తమ అభిమాన హీరో జైలు పాలయ్యాడని గుండెలు బాదుకునే వారు దీనికి ఏమంటారు?

Wednesday, May 6, 2015

మీడియా అతి తెచ్చిన చేటు..

అతి సర్వత్ర వర్జయేత్.. నేపాల్ ను భూకంపం శిథిలం చేయడం నిజం. పెద్ద ఎత్తున సాయానికి భారత్ రంగంలోకి దిగడమూ వాస్తవమే.. కానీ మీడియా వ్యవహరించిన తీరు మాత్రం దారుణం..
కష్టాల్లో ఉన్న పొరుగు దేశం నేపాల్ ను ఆదుకోవడం బాధ్యతగా భారత ప్రభుత్వం భావించింది. ఆపరేషన్ మైత్రి పేరిట పెద్ద ఎత్తున సైన్యాన్ని, సహాయ సిబ్బందిని, వైద్యం, ఆహారం తదితర సామాగ్రిని పంపించింది. మన వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడి శిథిలాలు , తొలగించడం, గాయపడిన వారిని రక్షించి తక్షణ చికిత్స అందించడం, వారికి ఆహారం అందించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని కాఠ్మాండూలో పాటు మారుమూల కొండ ప్రాంతాల్లో సైతం సేవలు అందించారు. కానీ మన మీడియా అతిగాళ్ల అతి వల్ల అవన్నీ బూడిదలో పోయిన పన్నీరైపోయాయి..
ఆకలి కన్నా, ఆత్మ గౌరవం ముఖ్యం అంటారు. నేపాలీలను బాధించింది అదే.. ఈ సునితత్వాన్ని భారత మీడియా గ్రహించలేపోయింది. మన మీడియాకు ఎక్కడలేని దేశభక్తి పొంగుకొచ్చింది. ఏకంగా ఇండియాను పెద్దన్నగా చిత్రీకరించారు. నేపాల్ సైన్యం, ఇతర దేశాల సహాయ సిబ్బందికన్నా భారతే అద్వితీయంగా సహాయ కార్యక్రమాల్లో దూసుకెళుతోందని ఊదరగొట్టారు. ఇది నిజమే అయినా చెప్పగంలో తేడా ఉంటుంది. భూకంపం రాగానే నేపాల్ ప్రధానికన్నా, భారత ప్రధానికే ముందుగా వార్త తెలిసిందని, మోదీ ట్వీట్ ద్వారా కోయిరాలా ఈ వార్త అందుకొని స్వదేశానికి వచ్చారనే వార్త అతికి పరాకాష్ట. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించకుండా కెమెరాలు పెట్టి బైట్లు అడగడం పీటూసీలు ఇవ్వడం ఏ విలువలకు ప్రతీక.
దేశంలో ఉన్నప్పుడు మనం ఏదైనా చెప్పుకోవడచ్చు.. కార్గిల్ విజయం లాంటి యుద్ద వార్తలకు, యెమెన్ లో చేపట్టిన ఆపరేషన్ రాహత్ లాంటి విజయాలకు ప్రచారం ఇస్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ కష్టాల్లో ఉన్న పొరుగువారిపై మనం ఆధిక్యతను ప్రదర్శించుకొని మురిసిపోవడం ఎంత వరకూ సమంజయం అందుకే నేపాలీలకు మండింది. అందుకే వారు గో హోమ్ ఇండియన్ మీడియా అంటూ ట్వీట్లు చేస్తున్నారు
భారత్ ఒక్కదాన్నే పొమ్మనడం బాగుండదని, అన్ని దేశాలూ తమ సహాయ కార్యక్రమాలు చాలించి వెళ్లిపోవాలని.. మిగతాది తాము చూసుకుంటామని మర్యాద పూర్వకంగా వెళ్లగొట్టింది నేపాల్ ప్రభుత్వం. భారత్ తక్షణం స్పందించి అందించిన సాయానికి నేపాల్ ధన్యవాదాలు చెప్పుకుంది

శత్రువుపై ఆధిక్యత ప్రదర్శించుకోవాలి.. కానీ నమ్మకమైన మిత్రునిపై కాదు.. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.

Tuesday, May 5, 2015

గొంగట్లో వెంట్రుకలు ఏరతారెందుకు?

వారు అధికారంలో ఉంటే వీరిని, వీరు అధికారంలో ఉంటే వారిని చంపుకోవడం షరా మామూలే.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా పార్టీ నాయకులను చంపేస్తున్నారని గగ్గోలు పెట్టడం గొంగట్లో వెంట్రుకలు ఏరడమే.. గతంలో మీరు చేసిన పనే ఇప్పుడు వారు చేస్తున్నారు.. రేపు మీరు అధికారంలోకి వచ్చినా మళ్లీ చేసేది ఇవే శవరాజకీయాలు కదా? ఒక వేలు అవతలి వారి వైపు చూపించేప్పుడు మూడు వేళ్లు మిమ్మల్ని చూపుతున్నాయని మరచిపోతే ఎలా?

Saturday, May 2, 2015

అమెరికా కమిషన్ గురవింద నీతి..

గురవిందకు తన కింద ఉన్న నలుపును చూసుకోకుండా అవతలివారిని గేలి చేస్తుందట.. మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (USCIRF) వ్యవహారం ఇలాగే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత దేశంలో మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయట.. ఆరెస్సెస్ వంటి సంస్థలు బలవంతపు మత మార్పిడులకు పూనుకున్నాయట.. మైనారిటీలను రక్షించడంలో, వారికి న్యాయం చేయడంలో భారత్ విఫలమైందట.. ఇందులో వాస్తవం ఎంత? ఏ దర్యాప్తు సంస్థ తేల్చింది ఈ విషయాలను?
భారత దేశంలో మిషనరీలు సాగిస్తున్న మత మార్పిడుల సంగతి కూడా ఆ నివేదికలో ఉందా?.. ఎంత మంది హిందువులు అన్యమతంలోకి మారారు? ఎంత మంది క్రైస్తవులు, ముస్లింలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు?.. దేశంలో ఎన్ని చర్చీలు, మసీదులపై దాడులు జరిగాయి? ఎన్ని హిందూ ఆలయాలపై జరిగాయి?.. ఇవేవీ ఆ నివేదికలో ఉండవు ఎందుకంటే.. భారత దేశాన్ని అస్థిర పరచడమే USCIRF లక్ష్యం కనక..
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ, సిక్కు ప్రార్ధనాలయాలపై దాడులు జరిగాయి.. హిందూ, ముస్లిలు అమెరికా నుండి గెట్ ఔట్ అంటూ రాతలు రాశారు.. పలువురు హిందూ, సిక్కులపై దాడులు హత్యలూ జరిగాయి.. ఎంతో మంది ముస్లింలను ఉగ్రవాదులంటూ అరెస్టు చేశారు.. ఉగ్రవాదంపై పోరు పేరుతో మధ్య ప్రాచ్యంలో మీరు చేస్తున్న దగుల్బాజీ పనులు ఏమిటి? చివరకు క్రైస్తవ మతాన్నే పాటిస్తున్న నల్ల జాతీయులపై దాడులు పెరిగిపోయాయి. పోలీసులే వారిని దోమల్ని చంపేసినట్లు మట్టు పెడుతున్నారు.. దీనిపై నల్లజాతీయులంతా పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఆస్తుల దగ్దం చేశారు, లూఠీలకూ దిగారు.. ఈ వార్తలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి..

మరి ఈ వార్తలు USCIRF వారికి కనిపించలేదా? మీ సొంత దేశంలో మత పరమైన అసహనం, జాతి వివక్షత ఇంతా పెరిగిపోతుంటే, భారత దేశంపై బురద చల్లడంలో మతలబు ఏమిటి? ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు. అమెరికన్ ప్రజల సొమ్ముతో ఏర్పాటైన కమిషన్ ఇలాంటి తప్పుడు రిపోర్టులను రూపొందిస్తుంటే అక్కడి ప్రభుత్వం ఏమి చేస్తోంది.. ముందు మీ సొంత దేశాన్ని చక్కదిద్దుకోండి నాయనా.. మీ మొహాన్ని, మచ్చలను అద్దంలో చూసుకోంది.. ఆ తర్వాతే ఇతర దేశాల గురుంచి మాట్లాడండి..