Friday, May 8, 2015

సామాజిక హోదాను బట్టి శిక్షా?

సమాజంలో వీఐపీలు, సెలబ్రిటీలు తప్పు చేస్తే శిక్షించిల్సిన అవసరం లేదా? వారికి ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వాలా?.. కొందరి వాదన చాలా విడ్డూరంగా ఉంటోంది.. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సత్యం రామలింగ రాజు తదితరులకు న్యాయా స్థానాలు శిక్షలు విధించినప్పుడు వచ్చిన కామెంట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
చట్టం ముందు అందరూ సమానమే అంటారు. మరి సమాజంలో వారికి ఉన్న గుర్తింపు ఆధారంగా శిక్షలు విధించాల్సిన అవసరం ఎందుకు?.. వారి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి శిక్షలు ఖరారు చేయాలని వారి తరుపు లాయర్లు కోర్టుల్లో వాదిస్తుంటారు.. పైన ప్రస్థావించిన ముగ్గురు సమాజానికి సేవ చేశారనడాన్ని కాదనలేం.. నిజానికి న్యాయమూర్తులు దీన్ని పరిగణనలోకి తీసుకొనే శిక్షల్లో కొంత మినహాయింపులు ఇచ్చారు. తెలిసీ తెలియక తప్పులు చేసే సాధారణ ప్రజలు చట్టం ముందు నేరగాళ్లుగా నిలిచినప్పుడు న్యాయస్థానాలు ఇదే దృష్టితో చూడగలవా?
తాజాగా సల్మాన్ ఖాన్ ఉదంతం చూద్దాం.. తాగిన మత్తులో నిర్లక్ష్యంగా కారు ఫుట్ పాత్ మీదకు తోలి, అక్కడ నిద్రిస్తున్న వారు చావడానికి, గాయపడటానికి కారకుడయ్యాడు.. ప్రభుత్వం సల్మాన్ కోసం నియమించిన బాడీగార్డు ఎంతో నిజాయితీగా పోలీసు స్టేషన్ వెళ్లి ఈ ఘటనపై సాక్ష్యం ఇచ్చాడు.. దీంతో శిక్ష నుండి సల్మాన్ ఖాన్ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేసు ఏళ్ల తరబడి విచారణ జరిగి తీర్పు వెలువడే సమయానికి తాను కారు నడపలేదని, మరొకరు నడిపారని బొంకినా న్యాయస్థానం నమ్మలేదు. చివరకు ఈ నటుడికి శిక్ష పడింది..
సల్మాన్ ఏదో స్వాతంత్ర సమరంలో పాల్గొన్ని అన్యాయంగా జైలు పాలైనట్లు లబోదిబోమంటూ ఆయన్ని వెనకేసుకు వస్తున్నారు సన్నిహితులు, అభిమానులు.. ఆయన ఇంటికి జాతరకట్టి సానుభూతి ప్రకటిస్తున్నారు.. ఎవరి అభిమానం వారిది అని సరిపెట్టుకోవచ్చు, కానీ వీరిలో కొందరి వాదనలు చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఫుట్ పాత్ పై పడుకోవడమే నేరమట, అందుకు వారిని శిక్షించాలట.. రోడ్డు పక్కన పడుకునేది కుక్కలే కానీ మనుషులు కాదట. (అందుకే సల్మాన్ వారికి కారు రూపంలో మరణ శిక్ష ఇచ్చాడా?).. పేద వారిపై చింతన లేని ధన మదంతో చేసిన ఈ వ్యాఖ్యలను మనం సమర్ధించ వచ్చా..

ఈ కథలో క్లైమాక్స్ ఏమిటంటే సల్మాన్ జైలుకు వెళ్లడానికి కీలక సాక్ష్యం ఇచ్చిన రవీంద్ర పాటిల్ అనే బాడీగార్డు దిక్కులిన చావు చచ్చాడు.. పోలీసు కానిస్టేబుల్ వృత్తిలో ఉన్న రవీంద్రను ప్రభుత్వ సల్మాన్ కు బాడీగార్డుగా నియమించింది. సల్మాన్ తాగి ప్రమాదానికి కారకుడైన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు.. కేసు వాపస్ తీసుకోవాలని అతనిపై వత్తిడులు, బెదిరింపులు వచ్చాయి.. అయినా భయపడలేదు.. చివరకు వత్తిడితో మానసికంగా కృంగిపోయాడు. ఒక దశలో పిచ్చివాడిలా తిరుగుతూ కోర్టుకు హాజరు కాలేదు. ఫలితంగా న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. భార్య విడాకులు తీసుకొని పోయింది, ప్రభుత్వ ఉద్యోగమూ పోయింది. చివరకు క్షయవ్యాధి సోకి ఎముకల గూడుగా మారిపోయి జీవితాన్ని ముగించాడు.. సల్మాన్ నిర్ల్యక్ష్య డ్రైవింగ్ కారణంగా చనిపోయిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు నేటికీ పరిహారం అందలేదు.. తమ అభిమాన హీరో జైలు పాలయ్యాడని గుండెలు బాదుకునే వారు దీనికి ఏమంటారు?

No comments:

Post a Comment