Thursday, May 28, 2015

దేశ భద్రత విషయంలో రాజీలేదు: రాంమాధవ్

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇతరుల నుండి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్ట చేశారాయన. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం, ప్రజ్ఞా భారతి, ఫోరమ్ ఫర్ లీడర్ షిప్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దేశ భద్రతకు సవాళ్లు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ వరకూ, పాకిస్తాన్ నుండి చైనా వరకూ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడారు రాంమాధవ్.. పొరుగు దేశాలతో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని, అదే సమయంలో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారికి గట్టి బదులు స్తున్నామని వివరించారు. పాకిస్తాన్ వేర్పాటు వాదులతో చర్చలు జరిపినందు వల్లే ఆ దేశంతో సత్సంబంధాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు రాంమాధవ్.. చైనా పర్యటనలో సరిహద్దు వివాదాల విషయంలో ఆ దేశాలని మన వైఖరిని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
కాశ్మీర్ పండితులను న్యాయం చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, గతంలో కాంగ్రెస్ పార్టీ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు రాంమాధవ్.. ఆర్టికల్ 370 విషయంతో తమ విధానం చాలా స్పష్టమని అందులో అనుమానాలకు ఆస్కారం లేదన్నారు.. జమ్మూలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఆ ప్రాంతానికి అన్యాయం చేయరాదనే లక్ష్యంతోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరిందని వివరించారు. చరిత్రలో తొలిసారిగా కాశ్మీర్ లోయతో సమానంగా జమ్మూకు ప్రాంతానికి నిధులు అందుతున్నాయని తెలిపారు.
రాహుల్ గాంధీ కొత్తగా మాటలు నేర్చిన చిన్నపిల్లాడని ఎద్దేవా చేశారు రాంమాధవ్.. మోదీ ప్రభుత్వాన్ని సూటు బూటు ప్రభుత్వం అని చెబుతున్న రాహుల్, ఇప్పటి వరకూ తాము అందించింది లూఠ్ జూఠ్ అని మరుస్తున్నారని విమర్శించారు. బట్టలను విదేశాల్లోని లాండ్రీకి పంపుకున్న ఘనత వారి కుటుంబానికి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదం ఇస్తూ పేదలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిందని ఆరోపించిన రాంమాధవ్, బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తుంటే తట్టుకోలేక అర్ధం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. మంచి పాలన అందిస్తున్న నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత కూడా లేకుండా పోయిందని, మోదీ ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలన్నీ అర్ధం లేనివే అని స్పష్టం చేశారు రాంమాధవ్.. మన్మోహన్ సింగ్ తో పోలిస్తే, విదేశీ పర్యటనల్లో మోదీకి అభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని అన్నారు.. అందుకే అర్థంలేని ఆరోపణలకు దిగుతోందని ఎద్దేవా చేశారు.
నరేంద్ర మోదీ పాలనలో దేశం ఆర్ధికంగా బలోపేతం అవుతోందని, మన వృద్ధి రేటు ఘననీయంగా పెరిగిందని వివరించారు రాంమాధవ్.. ఈ విషయంలో విదేశీ పత్రికలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయన్నారు.
భూసేకరణ బిల్లుపై అవాస్తవాల ప్రచారం జరుగుతోందని రాంమాధవ్ వివరించారు. మోదీ ప్రభుత్వం కార్పోరేట్లకు లాభం చేస్తోందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలులేవన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన మేరకే భూసేకరణ జరుగుతుందని, రైతులకు నాలుగింతల పరిహారం అందుతుందని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని రాంమాధవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి ఛైర్మన్ హనుమాన్ చౌదరి, జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు, ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.తిరుపతి రావు పాల్గొన్నారు.


No comments:

Post a Comment