Saturday, May 2, 2015

అమెరికా కమిషన్ గురవింద నీతి..

గురవిందకు తన కింద ఉన్న నలుపును చూసుకోకుండా అవతలివారిని గేలి చేస్తుందట.. మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (USCIRF) వ్యవహారం ఇలాగే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత దేశంలో మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయట.. ఆరెస్సెస్ వంటి సంస్థలు బలవంతపు మత మార్పిడులకు పూనుకున్నాయట.. మైనారిటీలను రక్షించడంలో, వారికి న్యాయం చేయడంలో భారత్ విఫలమైందట.. ఇందులో వాస్తవం ఎంత? ఏ దర్యాప్తు సంస్థ తేల్చింది ఈ విషయాలను?
భారత దేశంలో మిషనరీలు సాగిస్తున్న మత మార్పిడుల సంగతి కూడా ఆ నివేదికలో ఉందా?.. ఎంత మంది హిందువులు అన్యమతంలోకి మారారు? ఎంత మంది క్రైస్తవులు, ముస్లింలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు?.. దేశంలో ఎన్ని చర్చీలు, మసీదులపై దాడులు జరిగాయి? ఎన్ని హిందూ ఆలయాలపై జరిగాయి?.. ఇవేవీ ఆ నివేదికలో ఉండవు ఎందుకంటే.. భారత దేశాన్ని అస్థిర పరచడమే USCIRF లక్ష్యం కనక..
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ, సిక్కు ప్రార్ధనాలయాలపై దాడులు జరిగాయి.. హిందూ, ముస్లిలు అమెరికా నుండి గెట్ ఔట్ అంటూ రాతలు రాశారు.. పలువురు హిందూ, సిక్కులపై దాడులు హత్యలూ జరిగాయి.. ఎంతో మంది ముస్లింలను ఉగ్రవాదులంటూ అరెస్టు చేశారు.. ఉగ్రవాదంపై పోరు పేరుతో మధ్య ప్రాచ్యంలో మీరు చేస్తున్న దగుల్బాజీ పనులు ఏమిటి? చివరకు క్రైస్తవ మతాన్నే పాటిస్తున్న నల్ల జాతీయులపై దాడులు పెరిగిపోయాయి. పోలీసులే వారిని దోమల్ని చంపేసినట్లు మట్టు పెడుతున్నారు.. దీనిపై నల్లజాతీయులంతా పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఆస్తుల దగ్దం చేశారు, లూఠీలకూ దిగారు.. ఈ వార్తలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి..

మరి ఈ వార్తలు USCIRF వారికి కనిపించలేదా? మీ సొంత దేశంలో మత పరమైన అసహనం, జాతి వివక్షత ఇంతా పెరిగిపోతుంటే, భారత దేశంపై బురద చల్లడంలో మతలబు ఏమిటి? ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు. అమెరికన్ ప్రజల సొమ్ముతో ఏర్పాటైన కమిషన్ ఇలాంటి తప్పుడు రిపోర్టులను రూపొందిస్తుంటే అక్కడి ప్రభుత్వం ఏమి చేస్తోంది.. ముందు మీ సొంత దేశాన్ని చక్కదిద్దుకోండి నాయనా.. మీ మొహాన్ని, మచ్చలను అద్దంలో చూసుకోంది.. ఆ తర్వాతే ఇతర దేశాల గురుంచి మాట్లాడండి..

No comments:

Post a Comment