Friday, May 15, 2015

విజయ ఎందుకు వెనుకబడింది? అమూల్, నందిని ఎలా దూసుకుపోతున్నాయి?

హైదరాబాద్  మహానగరంలో క్షీర విప్లవం వచ్చేసింది.. దేశంలోని ప్రధాన మిల్క్ బ్రాండ్లు నగరంపై దాడికి దిగాయి. రెండు నెలల క్రితం నగరంలో ఓ ప్రధాన ప్రయివేటు కంపెనీ పాల ధర లీటర్ రూ.42.. మిగతా కంపెనీలు ఇంచు మించుగా రూ.40 వరకూ ఉండేవి.. గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్ధ అమూల్ నగర ప్రవేశం చేయడంతో పరిస్థితి తలకిందులైంది. వస్తూనే రూ.38 ధరను నిర్ణయించింది అమూల్.. పైగా అత్యంత నాణ్యత, నమ్మకమైన దేశంలోనే నెం.1 బ్రాండు.. నిజానికి అమూల్ రూ.36కి లీగర్ ప్యాకెట్ ఇవ్వడానికి సిద్దపడ్డా, తెలంగాణ/ఆం.ప్ర. ప్రభుత్వ రంగ సంస్థ విజయతో పోటీ వద్దని నిర్ణయం తీసుకుంది. విజయ బ్రాండ్ పాల ధర రూ.38..
అమూల్ ప్రవేశంతో హైదరాబాద్ పాల మార్కెట్లో ఒక్క కుదుపు వచ్చేసింది. ప్రజలంతా అమూల్ వైపు మొగ్గు చూపే సరికి అన్ని కంపెనీలు దిగి వచ్చేశాయి.. తమ ధరలనూ సవరించుకున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో అమూల్ నెం.1 స్థానంలో ఉందంటున్నారు.. ఈ దశలో కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ నందిని మరింత షాకింగ్ ఆఫర్ తో హైదరాబాద్ లోకి వచ్చింది. నందిని పాల ధర లీటర్ రూ.36 మాత్రమే.. హైదరాబాద్ వాసుల పరిస్థితి ఇప్పుడు తంతే పాల గ్లాసులో పడ్డట్లుగా ఉంది..
పాల ధర తగ్గితే వినియోగదారునికి లాభం సరే, మరి రైతు సంగతి ఏమిటనే ప్రశ్న రావడం సహజం.. అయితే అమూల్, నందిని డెయిరీలు దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ ధర ఇచ్చి తమ రాష్ట్రాల్లో రైతుల నుండి పాలను సేకరిస్తున్నాయట.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలకన్నా మన తెలంగాణ, ఆం.ప్రల్లోనే పాల ధరలు అధికంగా ఉన్నాయి.. మరి అమూల్, నందిని ఎందుకు దూసుకుపోతున్నాయి?.. మన ప్రభుత్వ రంగ సంస్థ విజయ ఎందుకు కుదేలైంది?.. అసలు నంగతి అక్కడే ఉంది..
విజయ బ్రాండ్ ధర తక్కువ, విశ్వసనీయత ఉన్నా మార్కెటింగ్ లోపం ఎదుర్కొంటోంది. ప్రయివేటు డెయిరీలు ఎక్కువ ధరకు పాలను సేకరిస్తూ, ఎక్కువ ధరకే అమ్ముతున్నా మార్కెట్ ను ఆక్రమించుకున్నాయి.. విజయను వట్టిపోయిన గేదెగా మార్చడంలో ఆనాటి ప్రభుత్వ పెద్దల పాత్రే అధికంగా ఉంది.. తమ కుటుంబం, బంధుమిత్రులు, రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలున్న ప్రయివేటు డెయిరీలకు లబ్ది కలిగించేందుకే ప్రభుత్వ రంగ సంస్థ విజయను నీరు గార్చాయన్నది బహిరంగ రహస్యం.

20-25 ఏళ్ల క్రితం కేవలం మార్కెట్లో విజయ బ్రాండ్ పాలే దొరికేవి.. ఆ పాల జనం పొద్దున్నే వెళ్లి కోసం డీలర్ల షాపుల ముందు క్యూలు కట్టేవారు.. క్యూలోని వారందరికీ పాలు దొరుకుతాయనే గ్యారంటీ లేదు.. విధి లేని పరిస్థితిలో బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు పాల ప్యాకెట్లు కొనాల్సి వచ్చేది.. ప్రయివేటు డెయిరీలకు గేట్లు బార్లా తెరవడంతో పరిస్థితి మారిపోయింది.. కానీ విజయ కుదేలైపోయింది.. మళ్లీ విజయ బ్రాండ్ మార్కెట్ ను శాసించే స్థితికి రావాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment