Saturday, August 29, 2015

రక్షాబంధన్ సందేశం

నేను మీకు రక్ష.. మీరు నాకు రక్ష.. మనమంతా ఈ దేశానికి, సమాజానికి, ధర్మానికి రక్ష.. ఇదే రక్షా బంధన్ సందేశం..
భారత దేశ మంతటా జరుపుకునే పండుగ రక్షాబంధన్.. సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఉత్సవం ఇది. తన సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి సోదరి కోరుకుంటుంది.. అలాగే తన సోదరికి రక్షకునిగా నిలవాల్సిన బాధ్యత సోదరునికి గుర్తు చేస్తుంది..
రక్షాబంధన్ కేవలం సోదర, సోదరీమణులకు సంబంధించిన ఉత్సవం మాత్రమే కాదు.. దీని అర్థం మరింత విస్తృతమైనది.. ఈ దేశానికి, సమాజానికి, ధర్మానికి కూడ అండగా నిలవాలనే సందేశాన్నిస్తుంది రక్షా బంధన్..

అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు..

Friday, August 28, 2015

సంకల్పంతో పాటు పాలనా యంత్రాంగం కూడా మారాలి..

సంకల్పం మంచిదే.. కానీ ఆచరణ కూడా ముఖ్యం.. ఆర్థిక రంగంలో చైనాకు ధీటుగా ఎదగాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశయం.. కానీ మనకు అంత సీన్ లేదంటారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. నాయకుల్లో దూకుడు ఉంటే సరిపోదు.. యంత్రాంగంలో బద్దకాన్ని కూడా వదిలించాలి.. రౌతు ఎంత సమర్ధుడైనా, గుర్రం సహకరించకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు?.. ముందు మన పాలనా వ్యవస్థను సంస్కరించాలి..

వరములిచ్చే వరలక్ష్మీ..

వరాలిచ్చే దేవత శ్రీమహాలక్ష్మికి చేసే పూజే వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు.. లక్ష్మీదేవి కొలిచే వారికి కొంగు బంగారమై వరాలు ఇస్తుందని ప్రతీతి.. ఈ రోజున లక్షీదేవిని పూజిస్తే అష్ట లక్ష్ములను పూజించినంత పుణ్య ఫలం లభిస్తుంది.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.. ముఖ్యంగా మహిళలు ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తారు. తన భర్త, సంతానం, అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులకు శుభం కలగాలని ప్రార్ధిస్తారు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Wednesday, August 26, 2015

ఉల్లి కష్టాలు..

గల్లీ నుండి దిల్లీ దాకా ఉల్లి లొల్లి..
ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు తల్లీ..

ఉల్లి గడ్డలు కొందామని కిరాణా షాపుకు పోతే అక్కడ చెప్పిన రేటుకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రైతు బజార్ సబ్సిడీ కేంద్రాలకు పోతే పర్లాంగుల కొద్దీ లైన్లు.. ఇచ్చే రెండు కిలోలకు ఆధార్ కార్డు అడుగుతున్నారు.. మళ్లీ రాకుండా వేలిపై ఓటింగ్ మార్కు చుక్క పెడుతున్నారు.. ఈ పోరు పడలేక బహింగ మార్కెట్లో ఉల్లి కొంటే జేబు గుళ్లవుతోంది.. అయినా సాహసిస్తే పాన్ కార్డు కూడా అడుగుతారనే భయం వేస్తోంది.. జిహ్వా చాపల్యం చంపుకోలేక ఉల్లి కొన్న నేరానికి, ధనికుల కేటగిరీలో చేర్చి, ఆదాయపు పన్ను వాళ్లు దాడులకు వస్తారని భయంగా ఉంది.. (జస్ట్ సెటైర్.. నవ్వుకోండి..)

Tuesday, August 25, 2015

కాల్చమన్నది ప్రకాశం పంతులు కాదు..

గుత్తొంకాయ కూర పేరు వినగానే నోరూరుతుంది.. ఇందులో కీలకం వంకాయ అయినా తగిన మసాలా పడనిదే రుచి రాదు.. ఆపిల్ పండుకు ఎంతో పోషక విలువలున్నాయని అందరికీ తెలుసు.. కానీ వ్యాపారి మైనం పూసి నిగనిలాడిస్తున్న పండునే కొనడానికి ఇష్టపడతాం..
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మన్యంలో తిరుగుబాటు లేపి తెల్లవాడి గుండెల్లో నిద్ర పోయాడు.. ఆ మహా వీరుని పోరాటాన్ని తెరకెక్కించే క్రమంలో సీత పాత్రను సృష్టించారు.. వస్తాడు నా రాజు ఈ రోజు..అనే పాట ఎంత ప్రఖ్యాతి గాంచిందో చెప్పనక్కరలేదు.. నిజానికి అలూరి సీతారామరాజు జీవితంలో ప్రేమ కానీ, సీత పాత్ర కానీ లేనే లేవు.. ఇది కల్పితం అని స్వయానా ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరికీ పట్టలేదు..
ఇక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విషయానికి వద్దాం.. దేశ స్వాతంత్ర్యం కోసం తన ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని, చివరి దశలో చేతిలో ఏమీ లేక చాలా ఇబ్బంది పడ్డ మహనీయుడు ఆయన.. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటంలో దమ్ముంటే కాల్చరా..అంటూ ప్రకాశం పంతులు తన గుండెను చూపించినట్లు ప్రచారంలో ఉంది.. ఆయన జీవితంపై నిర్మించిన చిత్రంలోనూ ఈ సన్నివేశం పెట్టడంతో మరింత ప్రాచుర్యం పొందింది..
నిజానికి ఆ రోజున కాల్చమన్నది ప్రకాశం పంతులు కాదు.. ఆయన పక్కన ఉన్న ముస్లిం యువకుడు.. ఈ విషయాన్ని ప్రకాశం పంతులు స్వయంగా తన ఆత్మకథ నా జీవిత యాత్రలో వెల్లడించారు.. ఆంధ్రకేసరి ఔన్నత్యాన్ని తగ్గించి చూపడం నా ఉద్దేశ్యం కాదు.. కానీ స్వయాన ఆయన చెప్పిన విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా మరో విధంగా ప్రచారం పొందడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది..

( ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నేను పోస్టు చేసిన టాంగ్ టూటీ పీర్ ఖాసిం కథ చూసిన సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి గారు పంపిన నా జీవిత యాత్రలోని పేజీ లింక్ ఇక్కడ జత చేశాను.. గమనించగలరు. వారికి ధన్యవాదాలు)

Monday, August 24, 2015

కుక్కతోక, పాకిస్తాన్ వైఖరి ఒకటే..

ఇండియాతో వేయేళ్లయినా యుద్ధం చేస్తామని పాకిస్తాన్ పాలకులు దశాబ్దాల కిందటే ప్రకటించారు.. అందుకు అనుగుణంగానే మన దేశంలో ఉగ్రవాద చర్యలు కొనసాగుతున్నాయి.. భారత వ్యతిరేకతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ.. ఇదంతా అక్కడి సైన్యం, ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తుంది.. పాలకులు నామమాత్రం.. తరాలు మారినా పాకిస్తాన్ విధానంలో మార్పు రాలేదు.. పైగా మరింత వేగంగా వారి కార్యకలాపాలు విస్తరించాయి..
భారత్ తో చర్యలకు సిద్ధం.. కానీ సరిహద్ధుల్లో కాల్పులు జరుపుతాం, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయిద్ లకు మేపుతాం, కాశ్మీర్ వేర్పాటు వాదులకు దావత్లు ఇస్తూనే ఉంటాం.. ఇదీ పాకిస్తాన్ వైఖరి.. శాంతి చర్చలకు, కాశ్మీర్ కు లింకు.. భారత ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు సంసిద్దత వ్యక్తం చేసినా, ఆ దేశంతో శాంతి ప్రక్రియకు సిద్దమైనా ఈ సామరసర్య వాతావరణాన్ని ఎలా చెడగొట్టుకుందామనే ప్రయత్నిస్తుంది పాకిస్తాన్.. గతంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ..

పాకిస్తాన్ వైఖరి ఎప్పుడూ కుక్కతోక లాంటిదే.. కుక్కతోక వంకరను సరిచేయలేమూ, పాకిస్తాన్ విధాన్నాన్నీ మార్చలేమూ.. ఇది గత చరిత్ర చెబుతున్న వాతావరణం.. ఇకవైపు ఉగ్రవాదంపై పోరు అంటూ అమెరికా నుండి డాలర్లు రాబట్టుకుంటూ, ఆ ధనాన్ని భారత దేశంలో అభద్రత కోసం వెచ్చించడం నగ్న సత్యం.. ఇలాంటి సైతాను దేశంతో అసలు చర్చలు అవసరమా? ముల్లును ముల్లుతోనే తీయాలి..

Sunday, August 23, 2015

టాంగ్ టూటీ పీర్ ఖాసిం..

దమ్ముంటే ఇక్కడ కాల్చరా..’ అంటూ పోలీసులకు తన గుండెను చూపించి ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కూడా మంచి సంబంధాలుండేది.. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టేట్ కాంగ్రెస్ కు దిశానిర్దేశం కూడా చేసేవారు.. ఆ సందర్భంలో ప్రకాశం పంతులు ఒకసారి తెలంగాణకు వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం ప్రభుత్వం ఆయన బస చేసిన ప్రాంతానికి విచారణ కోసం ఓ పోలీసును పంపింది.. అక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుల నడుమ పంతులు గారు ఠీవీగా కూర్చున్నారు.. వచ్చిన పోలీసాయన ఇదర్ టాంగ్ టూటీ పీర్ ఖాసిం  కోన్ హై అంటూ ప్రశ్నించాడు.. పోలీసు చేతిలో ఉన్న లేఖలో టంగుటూరి ప్రకాశం పేరు ఉర్దూలో రాసి ఉంది.. అది ఆయనకు అర్ధం కాక టాంగ్ టూటీ పీర్ ఖాసిం (కాలు విరిగిన పీర్ కాసిం అనుకున్నాడు.. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఒకరి మోహాలు ఒకరు చూసుకొని ఇదర్ కిసీకా టాంగ్ నహీ టూటీ..’ (ఇక్కడ ఎవరి కాలూ విరగలేదు) అని చూపించారు.. అందరి కాళ్లూ పరిశీలించిన పోలీసాయన టాంగ్ టూటీ పీర్ ఖాసి ఎవరూ లేరని నిర్ధారిచుంకొని వెళ్లిపోయారు.. అన్నట్లు ప్రకాశం పంతులుగారు మంచి భోజన ప్రియులు.. ఆ సమావేశంలో పాల్గొన్న వారి కోసం గంపెడు ఇడ్లీలు తెస్తే సగం ఆయనే లాగించారట.. ఈ విషయం దాశరథి కృష్ణమాచార్యుల జీవిత కథ యాత్రాస్మృతిలో రాసి ఉంది..

టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143వ జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుందాం..

Friday, August 21, 2015

రాజీవ్ జయంతి నాడే ఠాగూర్ జయంతి జరుపుకున్నారట.. గాంధీ భవన్ తెలివి తెల్లారినట్లే ఉంది.. కాస్త చరిత్ర తెలుసుకోండి బాబులూ..

Thursday, August 20, 2015

రేపిస్టు ఓటు బ్యాంకు సారధి..

ఓటు బ్యాంకు రాజకీయాల విస్తృతి పెరిగింది.. ఇప్పటి వరకూ కుల, మత, ప్రాంత, భాష ఆధారంగా ఓట్లు అడుక్కునేవారు.. ఇప్పుడు రేపిస్టులకూ ఓటు బ్యాంకు తయారు చేశాడో పెద్ద మనిషి.. దేశంలోకెళ్లా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, సోకాల్డ్ జనతా పరివార్ సారధి ఆయనే శ్రీమాన్ ములాయం సింగ్ యాదవ్..
మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నారు.. చాలా మంది ఇలాంటి వారికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కానీ ములాయం మాత్రం అలాంటి వారి పట్ల వకాల్తా పుచ్చుకున్నాడు. అబ్బాయిలు తప్పు చేస్తుంటారు.. అంత మాత్రా వారిని ఉరి వేయాలా?అని అమాయకంగా ప్రశ్నించాడు గతంలో..
తాజాగా ములాయం అంతకన్నా అమాయకత్వాన్న నటిస్తూ వ్యాఖ్యలు చేశాడు.. ‘ సామూహిక అత్యాచారాలు అసాధ్యం.. ఒకరు అత్యాచారం చేస్తే, ప్రతీకారం తీర్చుకోడానికి నలుగురి పేర్లు చెబుతారు..  అని అంటాడీ పెద్దమనిషి..

మహిళలపై అత్యాచారాలను సిగ్గు లేకుండా వెనుకేసుకు వస్తూ, మృగాళ్లను సమర్ధించే ఇలాంటి నాయకులను ఛీ కొట్టాల్సిందే.. లేక పోతే రేపిస్టుల ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా మొదలవుతాయి..

Wednesday, August 19, 2015

ప్రధాని మోదీపై దుష్ప్రచారం..

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, విధానపరమైన నిర్ణయాలు, విదేశీ పర్యటనలు తదితర మంచీ చెడులపై అర్ధవంతమైన చర్చ జరగాలి.. కానీ కొన్ని శక్తులు మన ప్రధానిపై వ్యక్తిగత ద్వేషంతో చాలా నీఛంగా బురద చల్లుతున్నాయి..  అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి.. మోదీ శుద్ద శాఖాహారి అని అందరికీ తెలుసు కానీ ఆయన యూఏఈ పర్యటనలో బీఫ్ తిన్నారని దుష్ప్రచారం చేస్తూ కేరళకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రచారంలో పెట్టారు.. ఈ ఫోటో మార్ఫింగ్ చేసింది అని మనం గమనించవచ్చు.. అసలు, నకిలీ ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు..

నాగ పంచమి నాడు పాలు వృధా చేయకండి..

సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ పరమాత్మున్ని చూడమని మన సనాతన ధర్మం చెబుతోంది.. పాములు కూడా ఈ సృష్టిలో భాగమే.. విష్ణుమూర్తి పాన్పు ఆదిశేషువు, పరమ శివుని కంఠాభరణం నాగ దేవత.. నాగులను పూజించే సాంప్రదాయమే నాగ పంచమి.
మనం భగవంతుని కోసం పెద్ద మొత్తంలో ప్రసాదాన్ని సిద్దం చేస్తాం.. కాని భగవంతునికి నైవేద్యంగా పెట్టేది కొద్దిగానే.. మిగతాదంతా భక్తులకు ప్రసాదం రూపంలో పంచుతాం.. మరి మనం నాగ పంచమి రోజున పాలను పెద్ద మొత్తంలో పుట్టలో ఎందుకు పోస్తున్నాం.. నాగ దేవత ఎంత అవసరమో అంతే స్వీకరిస్తుంది.. మిగతాదంతా వృధాయే కదా?.. అందుకే భక్తులంతా తాము తెచ్చిన పాలను పెద్ద పాత్రలో పోయాలి. పుట్టలో నైవేద్యంగా కొద్ది పాలను పోస్తే చాలు.. మిగతా పాలను నిరుపేద, అనాధ బాలలకు పంచితే పుణ్యం, పురుషార్థం రెండూ మనకు దక్కినట్లే కదా..

నాగ పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Sunday, August 16, 2015

ఆలోచింపజేసిన మాచిస్..

స్కూల్లో మా మాస్టారు అడిగారు.. స్వాతంత్ర్యం ఎలా వచ్చిందని.. రక్తపాతంతో వచ్చిందని చెప్పాను నేను..  అప్పుడు పిల్లవాడినైనా దేశ విభజన విషయాలు బాగా గుర్తున్నాయి..  రక్తపాతంతో అంటావా అని మాస్టారు తరగతి గదిలో నిలబెట్టారు.. మిగతా పిల్లల్ని అడిగారు.. స్వాతంత్ర్యం ఎవరు తీసుకొచ్చి ఇచ్చారని.. దీనికేమైనా సమాధానం ఉందా నువ్వే చెప్పు?.. అరె.. ఒక వ్యక్తి పోయి, పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని ఎత్తుకొచ్చేశాడా?.. ఇదిగో తీసుకొండి.. స్వాతంత్ర్యం మీ కోసం తెచ్చాను.. పంచుకోండి అని ఇచ్చాడా?.. తండ్రులు, తాతలు చచ్చింది మావాళ్లు.. ఇళ్లూ, వాకిలి పోగొట్టుకున్నది మేము.. కానీ స్వాతంత్ర్యం తెచ్చింది ఇంకెవరోనట..
1996లో విడుదలైన Maachis (మాచిస్) సినిమాలో సనాతన్ (ఓంపురి), క్రిపాల్ (చంద్రచూడ్ సింగ్)ల మధ్య సంభాషణ ఇది.. ప్రఖ్యాత సినీ కవి, రచయిత గుల్జార్ దర్శకత్వం వహించిన చిత్రం.. ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ యువతలో ఎలా చిచ్చు రేపిందో, వారి జీవితాలు ఎలా బుగ్గి అయ్యాయో తెలియజేసే ఆలోచనాత్మక, సందేశ చిత్రం మాచిస్..  దేశ విభజనలో భాగంగా పంజాబ్ రాష్ట్రం భారత్, పాకిస్తాన్ల మధ్య చీలిపోయింది. సరిహద్దుల్లో రక్తం పారింది.. సర్వం కోల్పోయిన అభాగ్యులు కట్టుబట్టలతో తరలివచ్చారు.. వారి గోడు పట్టని మన నాయకులు స్వాతంత్రం తెచ్చామంటూ సంబరాలు జరుపుకున్నారు.. మాచిస్ చిత్రంలో సనాతన్ పాత్ర ఈ విషయాన్నే ఎత్తి చూపింది..

మాచిస్ చిత్రంలోని ఈ పంచ్ డైలాగులు అప్పట్లో అందరినీ ఆలోచింపజేశాయి.. ఈ సినిమా విడుదలైన సమయంలో సోకాల్డ్ గాంధీల కుటుంబం దేశంలో అధికారంలో లేదు..  ఉన్నుంటే ఈ డైలగ్స్ సెన్సార్ కత్తెరకు గురయ్యేవేమో?.. 

Saturday, August 15, 2015

జై హింద్..


స్వాతంత్ర్యం విలువేంటో తెలుసా?

ఆగస్టు 15 మళ్లీ వచ్చింది.. ఎప్పటిలాగే జెండా ఎగురేశాం.. జాతీయగీతం ఆలపించాం.. మిఠాయిలు పంచుకున్నాం.. వచ్చిన ముఖ్య అతిధి ఉపన్యాసం విన్నాం.. జై హింద్.. మళ్లీ జనవరి 26న షరా మామూలే.. కాకపోతే ఇప్పుడు స్వాతంత్ర్య దినం.. అప్పుడు గణతంత్ర దినోత్సవం..
స్వాతంత్ర్యం.. అంటే ఏమిటి?.. హఠాత్తుగా అడిగితే జవాబు చెప్పడానికి తడుముకునేవారు ఎక్కువే.. దురదృష్టం ఏమిటంటే కొందరికి ఆగస్టు 15, జనవరి 26 తేడా తెలియదు.. వారికి తెలసింది జెండా పండుగ మాత్రమే.. కానీ ఎందుకు ఎగరేస్తున్నారంటే చెప్పలేరు..
ఇవాళ ఆగస్టు 15 వచ్చిందంటే టీవీ ఛానెళ్లు రంగులు మార్చుకొని ఎక్కడలేని దేశ భక్తిని పులిమేసుకుంటాయి.. యాంకర్లు ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తులకెళ్లిపోతారు.. ఎఫ్ఎం రేడియోల్లో దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఇక సోషల్ మీడియాల్లో గ్రీటింగులు, ఎస్సెమ్మెస్ సందేశాలు సరేసరి.. పిల్లలకైతే మరీ పండుగ.. స్కూళ్లలో జెండావందనంలో మిఠాయిలిస్తారు.. వీధుల్లో, బస్తీల్లో, కాలనీల్లో మన నేతాజీలు జెండా ఎగురేస్తారు.. గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చేస్తారు.. కాలంతో పాటు జాతీయ గీతం తీరు మారింది.. సాంప్రదాయ బాణీ పోయి ఏఆర్ రెహమాన్ మా తుజే సలాం, వందే మాతరం, జయ్ హో.. మార్మోగిపోతాయి.. మధ్యాహ్నానికి అందరికీ మత్తు వదిలిపోతుంది.. ఇదేనా స్వాతంత్ర్య దినోత్సవం @ జెండా పండుగ అంటే..
ఆగస్టు 15, 1947న మన దేశం స్వాతంత్ర్యం వచ్చింది.. వేయి సంవత్సరాలు బానిస పాలన నుండి విముక్తి లభించింది.. మనల్ని మనం పాలించుకుంటున్నాం.. ఎందరో మహనీయులు ఆ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేశారు.. జీవితాలను అంకితం చేశారు.. ఎవరో అప్పనంగా ఇచ్చిన స్వాతంత్ర్యం కాదిది.. పోరాటం చేసి సాధించుకున్నాం.. ఈనాడు మనం స్వదేశంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామంటే అది వారి త్యాగాల పుణ్యమే..
స్వాతంత్ర్యం అంటే కొందరికి ఇదొక జడపదార్థం.. దేశమన్నా, సమాజం అన్నా వారికి అర్ధం కాని బ్రహ్మ పదార్ధం.. ఈ దేశం ఇంతే.. వెరీ పూర్.. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, అత్యాచారాలు, నేరాలు, అంధ విశ్వాసాలు, కుల మతాలు, అసమానతలు, లింగ వివక్షత అంటూ గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు మేధావులు..
ఓటు బ్యాంకు రాజకీయాలు సరేసరి.. దేశంలో అసమానతలు తొలగించే ప్రయత్నం దేవుడెరుగు.. కుల మతాల పేరిట సమాజాన్ని నిలువునా చీల్చేసి వారికింత, వీరికింత అని తాయిలాలు అప్పనంగా ప్రకటించేస్తారు మన నాయకులు.. దేశమేమైతే వారికేం ఓట్లు, అధికారం ఉంటే అదే పది వేలు..
మరి కొందరు మేతావులున్నారు.. ఎవడో ఆజాదీ అంటే, ఇచ్చేద్దాం అంటూ సమర్ధిస్తారు.. మన దేశంపై యుద్ధం ప్రకటించినోడిని, మారణకాండకు పాల్పడ్డవాన్ని శిక్షించొద్దు, క్షమాభిక్ష పెడదాం అంటారు.. వీరికి వారికి చుట్టరికాలు ఏమిటో దేవుడెరుగు.. దేశ భద్రత అనేది వీరి దృష్టిలో ప్రాధాన్యత లేని విషయం.. ఇలాంటి వారే మన దేశానికి ప్రమాదకరం..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు పూర్తవుతోంది.. కానీ ఈ పోటీ ప్రపంచంలో మన దేశం ఎక్కడుంది అనే విషయమే ఎవరికీ పట్టదు.. దేశంలో ఎంతమందికి తిండి, గుడ్డ, గూడు ఉన్నాయో ఏనాడైనా ఆలోచించామా? కుల మతాలకు తావులేకుండా అందరికీ చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా? మన పరిసరాలను స్వచ్చంగా ఉంచుకుంటున్నామా? తోటి వారితో గౌరవప్రదంగా మెలుగుతున్నామా అన్నది కూడా ముఖ్యమే..
ఈనాడు ప్రపంచంలో భారత దేశానికి అంతో, ఇంతో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే కారణం మన మానవ వనరులే.. భారతీయులు ఏ విధంగా చూసినా తీసిపోరు.. ఇతర దేశాలతో పోలిస్తే కష్టపడి పని చేసే తత్వం మన రక్తంలోనే ఉంది.. అయితే వీటిని మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లనే సమస్యలు ఏప్పడుతున్నాయి.. భారత దేశం శక్తివంతమైన దేశంగా రూపొందడానికి మరెంతో కాలం పట్టదు.. మనం ప్రపంచాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాసించడం ఖాయం..
ఇదంతా సాధ్యమేనా?.. ఎందుకు సాధ్యంకాదు.. మరి మనం చేయాల్సిన పనేమిటి?.. మనపై మనం ముందుగా విశ్వాసాన్ని పెంచుకోవాలి.. దేశం మనకేమిచ్చిందన్నది కాదు.. దేశానికి మనం ఏమిస్తున్నాం, మన భాగస్వామ్యం ఏమిటి? అని ఆలోచించాలి..

చివరగా.. స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మరోసారి ఈ ప్రశ్న వేసుకుందాం.. దీనికి నేరుగా చెప్పే సమాధానం ఒక్కటే.. అది పోగొట్టుకున్నవారికే దాని విలువ తెలుస్తుంది..

Friday, August 14, 2015

భారతజాతి చరిత్రలో విషాద దినం..

ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారత జాతి జాగృతమై స్వాతంత్ర్యాన్ని పొందుతున్నది..మరి కొద్ది గంటల్లో తాను చేసే ఉపన్యాస ప్రతికి మెరుగులు దిద్దుతున్నారు జవహర్ లాల్ నెహ్రూ.. కానీ ఆ సమయంలో భారత మాత మహా విషాదంలో మునిగిపోయింది.. స్వాతంత్ర్యంతో పాటే కన్నీరు కార్చాల్సిన దురదృష్టకర సందర్భం..
ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బానిసత్వ పాలన నుండి విముక్తి.. కానీ ఒక రోజు ముందే ఆగస్టు 14న దేశం ముక్కలైంది.. బ్రిటిష్ వారి కుటిల నీతి, కాంగ్రెస్ ముస్లింలీగ్ నాయకుల అధికార దాహానికి మన మాతృభూమి చీలిపోయింది.. పాకిస్తాన్ ఆవిర్భావం.. భరతమాతకు తీరని శోకం.. లక్షలాది మంది భారతీయులు రాత్రికి రాత్రే పరాయి దేశస్తులైపోయారు.. నెత్తురు చిందింది.. మాన ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులెందరో.. నాయకులు చేసిన పాపానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు.. ఆస్తిపాస్తులు కోల్పోయారు.. ప్రాణాలు చేతిలో పట్టుకొని కట్టు బట్టలతో కాందీశీకులై తరలివచ్చారు.. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర సందర్భమిది..
భారతమాతకు విదేశీ సంకెళ్ల నుండి విముక్తి కల్పించడానికి ఎందరో మహనీయులు పోరాడారు.. త్యాగాలు చేశారు.. ప్రాణాలు కోల్పోయారు.. కాని ప్రతిఫలం ఏమిటి? దేశ విభజనతో స్వాతంత్ర్యమా?.. త్యాగాలు చేసింది ఒకరైతే అప్పణంగా ఫలాలు అనుభవించింది ఒకరు..
రవి అస్తమించని సామ్రాజ్యం నుండి భారత్ తమ చేజారక తప్పదని రెండో ప్రపంచ యుద్ధానికి ముందే బ్రిటిష్ వారికి అర్థమైంది.. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవ వీరులు, సుభాష్ చంద్రబోసు లాంటి తిరుగుబాటు యోధులు, మహాత్మా గాంధీ సత్యాగ్రహం, భారతీయుల్లో పెరుగున్న పోరాట స్పూర్తిని చూసిన తర్వాత తమకు రోజులు దగ్గర పడ్డాయని అర్థమైపోయింది బ్రిటిష్ పాలకులకు.. భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చారు.. కానీ అలాగే ఇచ్చేస్తే తమకు ముప్పు తప్పదని భయపడ్డారు.. ఈ నేపథ్యంలో పురుడు పోసున్నదే దేశ విభజన కుట్ర..
ఈ కుట్రకు కాంగ్రెస్, ముస్లింలీగ్ నాయకులే పావులు.. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్దాంతాన్ని తెర పైకి తెచ్చారు.. స్వాతంత్ర్యం ఇవ్వాలంటే ముందు దేశాన్ని విభజించాలని పట్టుబట్టాడు జిన్నా.. ఇందు కోసం ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చాడు.. దేశ వ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగి వేలాది మంది అమాయకులు ఊచకోతకు గురయ్యారు.. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులపై వత్తిడి పెరిగింది.. అప్పటికే వారిలో వృద్ధులు పెరిగిపోయారు.. దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యానికి అంగీకరించకపోతే తమ జీవిత కాలంలో పదవులు అనుభవించలేమేమో అనే బెంగ పుట్టుకుంది.. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీని ఫలితమే మన దేశ విభజన.. స్వాతంత్ర్యం..

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న వేళ కొత్తగా ఏర్పడ్డ సరిహద్దుల అవతల కోట్లాది మంది భారతీయులు పరాయివారైపోయారు.. వారి కన్నీటిని తుడిచే నాధుడే కరువయ్యాడు.. వేయేళ్ల బానిసత్వ పాలన నుండి విముక్తి లభించినందుకు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిందే.. కానీ అదే సమయంలో మన మాతృభూమికి జరిగిన ద్రోహాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి.. అందుకు మన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి..

Wednesday, August 12, 2015

వేప, ఉప్పు, బొగ్గే ముద్దు..

ఈ మధ్య ఎక్కడ చూసినా దంత వైద్యశాలలు కనిపిస్తున్నాయి.. కొన్ని వీధుల్లో అయితే ఈ డెంటల్ హస్పిటల్స్ కిరాణా షాపుల స్థాయిలో పోటీ పడుతున్నాయి..
ఎందుకిలా? దంత సమస్యలతో బాధ పడే రోగులు గణనీయంగా పెరిగిపోతున్నారు కాబట్టి, అదే స్థాయిలో ఆస్పత్రులూ పెరుగుతున్నాయి..
గిరాకీ లేనిదే వారెందుకు హాస్పిటల్ పెట్టుకుంటారు? అవును ఇదీ నిజమే..
మరి దంత సమస్యలు పెరగడానికిని కారణం ఏమిటి? ఎందుకేమిటి. మన ఆహారపు అలవాట్లే..
సరే ఏది తింటేనేం.. పళ్లు సరిగ్గా తోముకుంటే సమస్య ఉండదు కాదా? ఎంత చక్కగా దంత ప్రక్షాళన చేసుకున్నా ఎందుకో దంత సమస్యలు తప్పడం లేదు..
కారణం ఏమిటి? మన నోటి నుండా రసాయనాలు పులుముకుంటున్నాం.. అవే సగం జబ్బులకు కారణం అవుతున్నాయి..
కరెక్ట్.. మనం అసలు పాయింట్ కు వచ్చేశాం..
ఒకప్పుడు మన పెద్దలు వేప పుల్లతో పళ్లు తోముకునేవారు.. వారి దంతాలు కూడా గట్టిగా ఉండేవి.. కొన్నిబస్తీలు, గ్రామాల్లోకి బొగ్గు, బూడిదను పళ్లు తోముకోడానికి ఉపయోగించేవారు.. ఇంట్లో పిల్లలు పంటినొప్పి, గొంతు సమస్యతో బాధపడుతుంటే పెద్దవాళ్లు ఉప్పుతో పళ్లు తోముకొని వేడినీతో పుకిలించమని సూచించేవారు.. ఈ పద్దతులన్నీ ప్రస్తుత కాలం యువతకు అనాగరికంగా, మొరటుగా అనిపించడం సహజం..
మన దేశంలో టూత్ పేస్టులు రంగ ప్రవేశం చేసి వందేళ్లు దాటింది.. కానీ జనాలకు అవి అలవాటు కావడానికి మాత్రం దశాబ్దాలు పట్టింది.. బ్రష్, పేస్టులతో పళ్లు తోముకునే అలవాటు 20 ఏళ్ల క్రితం వరకూ పట్టణాల వరకే ఉండేది.. కానీ ఈ రోజున మారు మూల ప్రాంతాల్లో సైతం టూత్ పేస్ట్ అందుబాటులోకి వచ్చింది..
గతంలో కూడా దంత సమస్యలు ఉండేవి. కానీ జనాభా నిష్పత్తితో పోలిస్తే ఈ స్థాయిలో ఉండేవి కాదనేది సుస్పష్టం.. మనం పొద్దున్నే చక్కగా టూత్ పేస్టుతో పళ్లు తోముకుంటున్నా ఈ స్థాయిలో పళ్ల జబ్బులు ఎందుకు వస్తున్నాయి?..
కొంత కాలంగా పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు గమనించే ఉంటారు.. టూత్ పేస్టు కంపెనీలు మా పేస్టులో ఉప్పు ఉంది.. వేప గుణాలు ఉన్నాయి అని ఊదర గోట్టేస్తున్నాయి.. చివరకు బొగ్గుతో కూడా పేస్ట్ వచ్చేసింది.. ఇంత కాలం మనం అనాగరికం అనుకున్న వారినే ఈ టూత్ పేస్టు కంపెనీలు ఎందుకు ప్రచారం  చేస్తున్నాయి? ఆలోచించండి..

బ్యాక్ టూ రూట్స్.. నాగరికత ముసుగులో మనవైన కొన్ని అలవాట్లను కోల్పోతున్నాం.. కాలక్రమంలో వాటిలో విలువ, సుగుణాలు తెలిసి వస్తున్నాయి.. అందుకే మళ్లీ వెనక్కి తిరిగి మూలాల్లోకి వెళ్ల తప్పని పరిస్థితి ఏర్పడింది..

Sunday, August 9, 2015

యాదిలో పాత పట్నం బోనాలు..

బోనాలను చూడాలంటే మా పాత బస్తీకి రావాల్సిందే.. భాగ్యనగరంలో గోలుకొండ, కార్వాన్, లష్కర్ బోనాల తర్వాత వచ్చేవి పాత బస్తీ బోనాలు.. పాత బస్తీ అనగానే లాల్ దర్వాజా, అక్కన్నమాదన్న మాదన్న ఆలయాలు గుర్తు వస్తాయి.. వీఐపీలంతా ఇక్కడికే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోతుంటారు.. కానీ పాతబస్తీలో ఇంకా ఎన్నో అమ్మవారి ఆలయాలు ఉన్నాయని పాపం వారికి కూడా తెలియకపోయిండువచ్చు..

పాత నగరంలో బోనా
ల సందడే వేరు.. కులాల ప్రసక్తి కనిపించని సమాజాన్ని చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే.. చిన్నప్పుడు మా కందికల్ గేట్, భట్ జీ నగర్, ఉప్పుగూడ, ఛత్రినాక, గౌలిపురా, అలియాబాద్ తదితర బస్తీల్లో చూసిన బోనాలను ఎప్పటికీ మరువలేను.. దరువుల సండదిలో పోతరాజుల నాట్యాలు.. సామూహికంగా బోనాలెత్తి సముందుకు సాగే మహిళలు.. ఆ సందడే వేరు. పిల్లలు, పెద్దలు హొయ్ రా.. హొయ్ రా అంటూ పోతరాజులను కవ్వించి, అతని కొడడా దెబ్బ తినాలని సంబరపడే వారు.. కొరడా తాకితే శుభం అనుకున్నా, పోతరాజు ఎక్కడ గట్టిగా కొడతాడో అని పిల్లలు పరుగెత్తేవారు.. అలా అమ్మవారి ఆలయం దాకా సాగుతుందీ ఊరేగింపు.. దురదృష్టవశాత్తు మా బస్తీలను వదిలేసి మేం కాందీశీకులం అయిపోయాం.. అయినా కొత్త ప్రాంతాల్లో ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి.. పాత నగర మూలాలు, జ్ఞాపకాలు మా మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి.. అందరికీ పాతబస్తీ బోనాల శుభాకాంక్షలు..

Tuesday, August 4, 2015

కలాంజీ ఫేక్ ఫోటో..

నమ్మేవాడుంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అని చెప్పొచ్చు.. అబ్దుల్ కలాం చిన్నప్పుడు సైకిల్ మీద పేపర్లు  వేస్తున్న ఫోటో అంటూ కొత్తగా ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు..
ఆ మధ్య చార్మినార్ నిర్మిస్తున్నప్పటి ఫోటో అని ఫేక్ ఫోటో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టారు.. 420 ఏళ్ల క్రితం ఫోటోగ్రఫీ ఎక్కడిదిరా ఫోర్ ట్వంటీ వెధవా అంటూ నేనా వ్యక్తిని చివాట్లు పెట్టాను.. వాస్తవానికి ఆ ఫోటో ఫలక్ నూమా ఏరియల్ వ్యూ ను మార్ఫింగ్ చేసి సృష్టించారు..

అసలు విషయానికి వద్దాం.. కలాం చిన్నప్పుడు రేంజర్ సైకిల్స్ ఉన్నాయా? రామేశ్వరంలో ఆనాడు ఇంతమంచి రోడ్లు ఉన్నాయా? వీధి దీపాలు కూడా ఆనాటికి కావు.. ఇంకా చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న మహిళల వస్త్రధారణ కూడా కలాం ఊరిది కాదు.. ఎవరిని మోసగిద్దామని ఈ ఫేక్ ఫోటో.. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటే ఇదే కదూ..

Monday, August 3, 2015

మీ పిల్లలకు ఆ సైట్లు చూసే స్వేచ్ఛ ఉందా?

ఇంత అన్యాయమా?.. మోదీ స్వేచ్ఛను హరించేస్తున్నాడు.. అప్పుడే కంప్యూటర్ని షట్ డౌన్ చేస్తూ గదిలోకి వచ్చిన మీడియా మిత్రునితో అన్నాడా నాయకుడు..
ఏం అన్యాయం? ఎవరికి జరిగింది?.. ’ అసక్తిగా ప్రశ్నిండా విలేఖరి తన చిరకాల రాజకీయ మిత్రున్ని..
మరీ తెలీనట్లు అడుగుతావేంటి.. అదే పోర్న్ సైట్ల బ్యాన్ గురుంచే నేను మాట్లాడేది..
నిషేధించొద్దంటారా?.. ‘                                       
ఎందుకు నిషేధించాలి?..
అలాగా.. అయితే మీరు పోర్న్ సైట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రాసుకోమంటారా?
ఓ నారద మహర్షీ.. నా కొంప కొల్లేరు చేసేట్టున్నావే.. ఇప్పటికే నా సంసారం అంతంత మాత్రంగా సాగుతోంది.. ఈ వార్త మా ఆవిడ చూసిందంటే అన్నం పెట్టడం మాట అట్లా ఉంచి. నన్ను ఇంట్లోకి కూడా రానీయదు..
సరే సరే.. నేనేం రాయనులే.. కానీ మీరు రెగ్యులర్ గా ఆ సైట్లను చూస్తుంటారా?.. ఇంకా షట్ డౌన్ పూర్తి కాని కంప్యూటర్ వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడా మీడియా మిత్రుడు..
ఏం చూస్తే తప్పేంటి?.. నాకు ఆ స్వేచ్ఛ ఉంది..
ఓహో.. అయితే ఇంట్లో మీ పిల్లలకు కూడా ఆ స్వేచ్ఛ ఇచ్చారా?.. ఈ ప్రశ్నకు అవాక్కైపోయాడు మన నాయకుడు.
ఓకే మీరు ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది.. చివరి ప్రశ్న.. మీరు ఆ సైట్లు చూస్తారన్న విషయం మీ ఇంట్లో తెలుసా?...
పాపం బిత్తరబోయాడు నాయకుడు.
నారద మహర్షీ.. ఈ రోజుకు మీకు టీ కూడా ఇచ్చుకోలేను.. తమరు దయచేస్తారా?.. సవినయంగా గెటవుట్ అని చెప్పాడా నాయకుడు.

సరే నా టీ కూడా మీరే తాగేయండి.. మళ్లీ వస్తా.. కుర్చీ లోంచి లేచి బయటకు వచ్చేశాడు మన మిత్రుడు..

Sunday, August 2, 2015

స్నేహం అంటే ఒక్క రోజులో పుట్టి చచ్చేదేనా..

స్నేహానికి హద్దులు, పద్దులూ లేవు.. స్నేహానికి సరిహద్దులూ, ఎల్లలూ లేవు.. స్నేహం నిత్యం, ప్రతి క్షణం.. స్నేహం స్వచ్ఛమైనది, విలువైనది.. ఏదీ ఆశించనిదే స్నేహం.. ఆపదలో ఉంటే ఆదుకునేది స్నేహం.. అవసరమైతే ప్రాణం ఇచ్చేది స్నేహమే.. జీవితంలో స్నేహాన్ని మించిన ఆస్తి, సంపదలు లేవు.. ప్రేమ, ఆత్మీయత, ఆనందం, త్యాగం కలబోస్తేనే స్నేహం..
ఇలాంటి పవిత్ర పదానికి ఒక దినమా.. స్నేహాన్ని ఒక్క రోజులో పాటించి వదిలేయడానికి ఇదేమన్నా జన్మదినమా, వర్ధంతా?.. ఈ రోజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పుకొని, మళ్లీ వచ్చే ఏడాది వరకూ కోల్డ్ స్టోరేజీ పెట్టేద్దామా స్నేహాన్ని..
మనకీ దినాల సంస్కృతి ఎందుకు?.. ప్రతి అంశానికి తేదీ నిర్ణయించి వేడుక జరుపుకోవాల్సి అవసరం మనకేమిటి? కొద్ది సంవత్సరాల క్రితం వరకూ గ్రీటింగు కార్డులు, గిఫ్టులు అమ్ముకోడానికి ఈ దినాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు ఈ దినాల వ్యాపారం విస్తరించింది.. పత్రికల వారు ప్రకటనలు, మొబైల్ కంపెనీలు ఎస్సెమ్మెస్, టీవీ ఛానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్, కొత్తగా ఆన్ లైన్ వ్యాపారులు గిఫ్ట్ వ్యాపారం కోసం ఈ దినాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.. ఒకప్పుడు రక్షాబంధన్ నాడు రాఖీ కట్టేవారు.. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ బాండ్స్ అట..

మనకు ఒక్క రోజుతో ముగిసే స్నేహాలు, వద్దు.. సంవత్సరంలో 365 రోజులూ ఉంటే స్నేహాలు కావాలి.. జీవితాంతం తోడుండే స్నేహితులు కావాలి.. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం..