Saturday, August 15, 2015

స్వాతంత్ర్యం విలువేంటో తెలుసా?

ఆగస్టు 15 మళ్లీ వచ్చింది.. ఎప్పటిలాగే జెండా ఎగురేశాం.. జాతీయగీతం ఆలపించాం.. మిఠాయిలు పంచుకున్నాం.. వచ్చిన ముఖ్య అతిధి ఉపన్యాసం విన్నాం.. జై హింద్.. మళ్లీ జనవరి 26న షరా మామూలే.. కాకపోతే ఇప్పుడు స్వాతంత్ర్య దినం.. అప్పుడు గణతంత్ర దినోత్సవం..
స్వాతంత్ర్యం.. అంటే ఏమిటి?.. హఠాత్తుగా అడిగితే జవాబు చెప్పడానికి తడుముకునేవారు ఎక్కువే.. దురదృష్టం ఏమిటంటే కొందరికి ఆగస్టు 15, జనవరి 26 తేడా తెలియదు.. వారికి తెలసింది జెండా పండుగ మాత్రమే.. కానీ ఎందుకు ఎగరేస్తున్నారంటే చెప్పలేరు..
ఇవాళ ఆగస్టు 15 వచ్చిందంటే టీవీ ఛానెళ్లు రంగులు మార్చుకొని ఎక్కడలేని దేశ భక్తిని పులిమేసుకుంటాయి.. యాంకర్లు ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తులకెళ్లిపోతారు.. ఎఫ్ఎం రేడియోల్లో దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఇక సోషల్ మీడియాల్లో గ్రీటింగులు, ఎస్సెమ్మెస్ సందేశాలు సరేసరి.. పిల్లలకైతే మరీ పండుగ.. స్కూళ్లలో జెండావందనంలో మిఠాయిలిస్తారు.. వీధుల్లో, బస్తీల్లో, కాలనీల్లో మన నేతాజీలు జెండా ఎగురేస్తారు.. గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చేస్తారు.. కాలంతో పాటు జాతీయ గీతం తీరు మారింది.. సాంప్రదాయ బాణీ పోయి ఏఆర్ రెహమాన్ మా తుజే సలాం, వందే మాతరం, జయ్ హో.. మార్మోగిపోతాయి.. మధ్యాహ్నానికి అందరికీ మత్తు వదిలిపోతుంది.. ఇదేనా స్వాతంత్ర్య దినోత్సవం @ జెండా పండుగ అంటే..
ఆగస్టు 15, 1947న మన దేశం స్వాతంత్ర్యం వచ్చింది.. వేయి సంవత్సరాలు బానిస పాలన నుండి విముక్తి లభించింది.. మనల్ని మనం పాలించుకుంటున్నాం.. ఎందరో మహనీయులు ఆ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేశారు.. జీవితాలను అంకితం చేశారు.. ఎవరో అప్పనంగా ఇచ్చిన స్వాతంత్ర్యం కాదిది.. పోరాటం చేసి సాధించుకున్నాం.. ఈనాడు మనం స్వదేశంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామంటే అది వారి త్యాగాల పుణ్యమే..
స్వాతంత్ర్యం అంటే కొందరికి ఇదొక జడపదార్థం.. దేశమన్నా, సమాజం అన్నా వారికి అర్ధం కాని బ్రహ్మ పదార్ధం.. ఈ దేశం ఇంతే.. వెరీ పూర్.. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, అత్యాచారాలు, నేరాలు, అంధ విశ్వాసాలు, కుల మతాలు, అసమానతలు, లింగ వివక్షత అంటూ గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు మేధావులు..
ఓటు బ్యాంకు రాజకీయాలు సరేసరి.. దేశంలో అసమానతలు తొలగించే ప్రయత్నం దేవుడెరుగు.. కుల మతాల పేరిట సమాజాన్ని నిలువునా చీల్చేసి వారికింత, వీరికింత అని తాయిలాలు అప్పనంగా ప్రకటించేస్తారు మన నాయకులు.. దేశమేమైతే వారికేం ఓట్లు, అధికారం ఉంటే అదే పది వేలు..
మరి కొందరు మేతావులున్నారు.. ఎవడో ఆజాదీ అంటే, ఇచ్చేద్దాం అంటూ సమర్ధిస్తారు.. మన దేశంపై యుద్ధం ప్రకటించినోడిని, మారణకాండకు పాల్పడ్డవాన్ని శిక్షించొద్దు, క్షమాభిక్ష పెడదాం అంటారు.. వీరికి వారికి చుట్టరికాలు ఏమిటో దేవుడెరుగు.. దేశ భద్రత అనేది వీరి దృష్టిలో ప్రాధాన్యత లేని విషయం.. ఇలాంటి వారే మన దేశానికి ప్రమాదకరం..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు పూర్తవుతోంది.. కానీ ఈ పోటీ ప్రపంచంలో మన దేశం ఎక్కడుంది అనే విషయమే ఎవరికీ పట్టదు.. దేశంలో ఎంతమందికి తిండి, గుడ్డ, గూడు ఉన్నాయో ఏనాడైనా ఆలోచించామా? కుల మతాలకు తావులేకుండా అందరికీ చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా? మన పరిసరాలను స్వచ్చంగా ఉంచుకుంటున్నామా? తోటి వారితో గౌరవప్రదంగా మెలుగుతున్నామా అన్నది కూడా ముఖ్యమే..
ఈనాడు ప్రపంచంలో భారత దేశానికి అంతో, ఇంతో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే కారణం మన మానవ వనరులే.. భారతీయులు ఏ విధంగా చూసినా తీసిపోరు.. ఇతర దేశాలతో పోలిస్తే కష్టపడి పని చేసే తత్వం మన రక్తంలోనే ఉంది.. అయితే వీటిని మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లనే సమస్యలు ఏప్పడుతున్నాయి.. భారత దేశం శక్తివంతమైన దేశంగా రూపొందడానికి మరెంతో కాలం పట్టదు.. మనం ప్రపంచాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాసించడం ఖాయం..
ఇదంతా సాధ్యమేనా?.. ఎందుకు సాధ్యంకాదు.. మరి మనం చేయాల్సిన పనేమిటి?.. మనపై మనం ముందుగా విశ్వాసాన్ని పెంచుకోవాలి.. దేశం మనకేమిచ్చిందన్నది కాదు.. దేశానికి మనం ఏమిస్తున్నాం, మన భాగస్వామ్యం ఏమిటి? అని ఆలోచించాలి..

చివరగా.. స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మరోసారి ఈ ప్రశ్న వేసుకుందాం.. దీనికి నేరుగా చెప్పే సమాధానం ఒక్కటే.. అది పోగొట్టుకున్నవారికే దాని విలువ తెలుస్తుంది..

No comments:

Post a Comment