Tuesday, August 25, 2015

కాల్చమన్నది ప్రకాశం పంతులు కాదు..

గుత్తొంకాయ కూర పేరు వినగానే నోరూరుతుంది.. ఇందులో కీలకం వంకాయ అయినా తగిన మసాలా పడనిదే రుచి రాదు.. ఆపిల్ పండుకు ఎంతో పోషక విలువలున్నాయని అందరికీ తెలుసు.. కానీ వ్యాపారి మైనం పూసి నిగనిలాడిస్తున్న పండునే కొనడానికి ఇష్టపడతాం..
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మన్యంలో తిరుగుబాటు లేపి తెల్లవాడి గుండెల్లో నిద్ర పోయాడు.. ఆ మహా వీరుని పోరాటాన్ని తెరకెక్కించే క్రమంలో సీత పాత్రను సృష్టించారు.. వస్తాడు నా రాజు ఈ రోజు..అనే పాట ఎంత ప్రఖ్యాతి గాంచిందో చెప్పనక్కరలేదు.. నిజానికి అలూరి సీతారామరాజు జీవితంలో ప్రేమ కానీ, సీత పాత్ర కానీ లేనే లేవు.. ఇది కల్పితం అని స్వయానా ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరికీ పట్టలేదు..
ఇక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విషయానికి వద్దాం.. దేశ స్వాతంత్ర్యం కోసం తన ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని, చివరి దశలో చేతిలో ఏమీ లేక చాలా ఇబ్బంది పడ్డ మహనీయుడు ఆయన.. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటంలో దమ్ముంటే కాల్చరా..అంటూ ప్రకాశం పంతులు తన గుండెను చూపించినట్లు ప్రచారంలో ఉంది.. ఆయన జీవితంపై నిర్మించిన చిత్రంలోనూ ఈ సన్నివేశం పెట్టడంతో మరింత ప్రాచుర్యం పొందింది..
నిజానికి ఆ రోజున కాల్చమన్నది ప్రకాశం పంతులు కాదు.. ఆయన పక్కన ఉన్న ముస్లిం యువకుడు.. ఈ విషయాన్ని ప్రకాశం పంతులు స్వయంగా తన ఆత్మకథ నా జీవిత యాత్రలో వెల్లడించారు.. ఆంధ్రకేసరి ఔన్నత్యాన్ని తగ్గించి చూపడం నా ఉద్దేశ్యం కాదు.. కానీ స్వయాన ఆయన చెప్పిన విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా మరో విధంగా ప్రచారం పొందడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది..

( ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నేను పోస్టు చేసిన టాంగ్ టూటీ పీర్ ఖాసిం కథ చూసిన సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి గారు పంపిన నా జీవిత యాత్రలోని పేజీ లింక్ ఇక్కడ జత చేశాను.. గమనించగలరు. వారికి ధన్యవాదాలు)

No comments:

Post a Comment