Thursday, June 28, 2012

ఎన్నాళ్ళీ వారసత్వాలు?..


మన దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబస్వామ్యం వర్ధిల్లుతోంది.. బీజేపీ, వామపక్షాలను మినహాయిస్తే  దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఈ దరిద్రం పట్టింది.. జాతీయ  స్థాయిలో కాంగ్రెస్ ఇందిరా గాంధీ హయంలోనే కుటుంబ పార్టీగా మారిపోయింది.. నకిలీ గాంధీల గుప్పిట్లో కాంగ్రెస్ విలవిల లాడుతోంది.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ.. రేపు రాహుల్ గాంధీ.. అ తర్వాత కేతు గాంధీ.. శివ సేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జెడి, జేడీ(ఎస్), బిజెడి, డిఎంకే పార్టీలలో కూడా ఇదే వరస.. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికొద్దాం.. చంద్రబాబు నాయుడు తెలుగు యువత పగ్గాలను తన తనయుడు లోకేష్ బాబుకు ఇవ్వడం ద్వార రూట్ క్లియర్ చేస్తున్నారు.. ఎన్టీఅర్ నుండి కైవసం చేసుకున్న టీడీపీ పగ్గాలను తనయునికి అప్పజెప్ప బోతున్నారు.. అంటే టీడీపీ నాయకత్వం నందమూరి వారి నుండి నారావారికి బదిలీ అయ్యిందన్న మాట.. పాపం జూ.ఎన్టీఅర్..  అసలు టీడీపీకి చంద్రబాబే శాశ్వతంగా అధ్యక్షునిగా ఎందుకుండాలి? దేవేందర్ గౌడ్, ఎర్రన్నాయుడు, యనమల, కోడెల, కడియం తదితర సీనియర్లలో ఎవరో ఒకరికి అప్పగించ వచ్చు కదా?.. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో సోకాల్డ్ గాంధీ వంశం లాగే ఏపీలో వైఎస్ వంశాన్ని నిలపెడదామనుకున్న జగన్ పై గిట్టని వారు పగ బట్టారు.. అది వేరే విషయం లెండి.. 

Wednesday, June 27, 2012

సరబ్జీత్ సింగ్ విషయంలో పాకిస్తాన్ పరిహాసం సహించరానిది.. భారత్ పట్ల పెద్ద హాస్యాస్పదం వ్యవహరించింది.. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం ద్వారా యుపీఏ ప్రభుత్వం తన అసమర్ధతను నిరూపించుకుంది.. ఇంత జరిగినా మన చిదంబరం మహాశయుడు చెబుతున్న అరిగిపోయిన చావుకబుర్లను ఒక్కసారి గమనించండి.. "దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడు.. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది.. " ఈ విషయాలు మన దేశంలో చిన్న పిల్లలకు కూడా తెలుసు.. మీరేం చేయబోతున్నారో చెప్పండి చిదంబరం మహాశయా..

నరసింహన్ కాంగ్రెస్ నాయకుడా?..

నరసింహన్ గారు ఈ రాష్ట్రానికి గవర్నరా? లేక కాంగ్రెస్ నాయకుడా?.. ఢిల్లీ వెళ్ళిన నరసింహన్ కాంగ్రెస్ అధ్యక్షురాలిని కలిసిన తర్వాత వచ్చిన అనుమానం ఇది.. గవర్నెర్ నరసింహన్ రాజ్యాంగ హోదాలో రాష్ట్రపతికి తన నివేదిక ఇవ్వాలి.. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర పరిస్తితులను వివరించ వచ్చు.. కానీ సోనియా గాంధీని అయన ఏ హోదాలో కలిసి నివేదిక ఇచ్చినట్లు?.. గతంలో ఐపీఎస్ అధికారిగా పని చేసిన నరసింహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఏపీకి గవర్నర్గా వచ్చారా? లేక గవర్నర్ అయ్యాక కాంగ్రెస్లో చేరారా?

Sunday, June 24, 2012

రాష్ట్రపతిగా అత్యధిక విదేశీ పర్యటనలు చేసి రికార్డు నెలకొల్పిన ప్రతిభా పాటిల్, మరో ఘనత కూడా సాధించారు.. మరణ శిక్ష పడిన ౩౫ మని కహిదిలకు క్షమాభిక్ష పెట్టేశారు.. క్షమాభిక్ష పొందిన వారిలో కరడుగట్టిన హంతకులు, కిడ్నాపర్లు, రేపిస్టులు ఉన్నారు.. మహిళలు, చిన్నారులను అత్యాచారానికి గురిచేసి హత్య చేసిన ఘనులు ఉన్నారు..ఇంకా నయం వీరిలో అఫ్జల్ గురు, కసబ్ లేరు.. ఎందుకు ఈ క్షమాభిక్ష? దేశానికి సేవ చేసి క్షణికావేశంలో నేరం చేసిన వారిని క్షమిస్తే అర్థం చేసుకోవచ్చు.. వీరి వాళ్ళ సమాజానికి జరిగే మేలేమిటి? ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఆర్జించిన ఖ్యాతి ఇదేనా? 

Saturday, June 23, 2012

రూపాయి పతనాన్ని అడ్డుకోలేని అసమర్థ ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి కావాలని కలలు కంటున్నారు.. 
మీరు జర్నలిస్టా?.. సమాచారం కోసం మొబైల్ ఫోనులో అదే పనిగా మాట్లాడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. దొంగ చెవులున్నాయ్..బజారుకీడ్చేస్తాయ్.. ఈ పని చేసేది పోలీసులే కాదు, రాజకీయ పార్టీలు చేస్తాయ్.. వారికి గిట్టని వారితో అదే పనిగా మాట్లాడారో మీ బతుకు బజారుపాలే.. తస్మాత్ జాగ్రత్త..  

Thursday, June 21, 2012

సార్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది..  తెలంగాణ వాదుల మధ్య ఐక్యత కరువైంది.. ఉద్యమం పంతులు లేని తరగతి గది అయిపొయింది..  ఎవరికీ వారే యమునా తీరే.. అందరిని కలుపుకొని పోయే నాయకుడేడి?.. మళ్లీ జయ శంకర్ పుట్టాలి.. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి..

ప్రజల రాష్ట్రపతి


రాష్ట్రపతి పదవికి నేరుగా ఎన్నికలు ఉంటే గెలిచేది ఎవరో తెలుసా?.. కచ్చితంగా అబ్దుల్ కలాంజీయే.. వ్యక్తిత్వంలో ఆయనను మించిన అభ్యర్థి ఎవరున్నారు? దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాభిమానం ఉన్న వ్యక్తీ కలాంజీయే.. పజలు ఆయననే రాష్ట్రపతిగా కోరుకుంటున్నారని పలు సర్వేలలో తేలింది.. గతంలో రాష్ట్రపతి పదవి నిర్వహించిన అబ్దుల్ కలాం నిష్పక్షపాతంగా, సమర్థంగా వ్యవహరించారు.. ప్రణబ్, సంగ్మాలతో పోలిస్తే కలాం వంద శాతం ఉత్తమ అభ్యర్థి.. కుళ్ళు రాజకీయాలు నచ్చకే అబ్దుల కలాంజీ పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టం.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. కలాంజీనే రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకొని దేశప్రజల అభిమతాన్ని మన్నించాలి.. దేశ ప్రజల రాష్ట్రపతి కలాంజీయే..

Friday, June 15, 2012

సానుభూతి పవనాలతో ఫ్యాన్ గాలి వీచింది.

Tuesday, June 12, 2012

యే దోసితీ..

నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నరాందేవ్ బాబాకు యావదాంధ్రలో ఏకైక నిజాయితీ పరుడు, మచ్చలేని పోరాట యోధుడు దొరికాడు.. తన దేశ యాత్రలో భాగంగా భాగ్యనగరం వచ్చిన బాబా, ఆయన్ని మాత్రమే కలిసి అర్జంటుగా తిరిగి వెళ్లిపోయారు.. గతంలో కూడా బాబా ఇలాగా బిజీ షెడ్యూల్డ్ కారణంగా మరెవరినీ కలవకుండా బాబును మాత్రమే కలుసుకున్నారు.. పాపం బాబా రాందేవ్ కళ్లకు తెలుగునాట ఇంతకన్నా మంచి స్వాతిముత్యాలు దొరలేదు మరి.. ‘యే దోసితీ.. న కభీ చోడింగే..(షోలే)’ అంటూ స్నేహ గీతాలు పాడుకుంటూ కౌగిలింతలతో పరవశించి పోయారిద్దరూ.. మెరిసే దంతా బంగారం కాదని బాబాకు తెలియదా?.. లేక ఏపీలోని రాందేవ్ శిష్యలు ఇక్కడి పరిస్థితులను బాబాకు చెప్పలేదా?.. లేక అన్నీ తెలిసే బాబా దోస్తీ కలుపుకున్నారా?.. నాకు పచ్చకామెర్లు సోకాయేమో తెలియదు కానీ బాబా వేసుకున్న దుస్తుల్లో కాస్త పసుపుదనం కనిపించింది.. జూబ్లీహిల్స్ నేస్తాన్ని చూడటానికి వచ్చిన బాబా, చంచల్ గూడా దోస్తును కలవకుండానే పోయారెందుకో?..

Sunday, June 10, 2012

కార్టూన్లపై పగ..

ప్రజాస్వామ్యం దేశంలో ఉంటూ కార్టూన్లను చూసి సహించలేక పోతున్నారు మన నేతలు.. పత్రికా స్వేచ్ఛను గౌరవించలేకపోతున్నారు.. ఎన్నో ఏళ్ల క్రితం ప్రముఖ కార్టూనిస్టులు గీసిన చిత్రాలను పట్టుకొని రంద్రాన్వేషణ చేస్తున్నారు.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించారంటూ కొందరు పార్లమెంట్ సభ్యులు చేసిన మతిలేని రాద్దాంతానికి యూపీఏ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది.. పాఠ్య పుస్తకాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఏళ్లలో ప్రచురించిన ఈ కార్టూన్ పై అప్పట్లో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు కూడా ఈ కార్టూన్ విషయంలో అభ్యంతరాలు లేవు.. తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి దశాబ్దాల నాటి ఓ కార్టూన్ను పట్టుకొని కొత్త రాద్దాంతానకి తెర తీశారు.. ఈ వృద్ధ నేతకు మరేపని లేనట్లుంది.. ఓ ప్రొఫెసర్ తనపై అభ్యంతరకర కార్టూన్ను ఎవరికో మెయిల్ చేశాడంటూ బెంగాళీ కంగాళీ మమత దీదీ ఆయన్ని ఏకంగా జైలుకు పంపింది.. జవహర్లాల్ నెహ్రూ, ఎన్టీ రామారావు లాంటి నేతలు తమపై వచ్చిన కార్టూన్లపై ఏనాడూ నొచ్చుకోలేదు, అభ్యంతర పెట్టలేదు.. పైగా ఎంతో ఎంజాయ్ చేస్తూ కార్టూనిస్టులను ప్రోత్సహించారు.. ఈ నేతలు కార్టూనిస్టుల పాలిట ప్యారడైజ్లు.. అలాంటి స్పూర్తి ఇప్పుడు ఏమైపోయిందో?.. ఇప్పటి నేతలు కార్టూన్లపై ఎందుకు పగబట్టినట్లో..

అందరూ దొంగలే..

వారూ, వీరూ అనే తేడా లేదు.. అందరిదీ ఒకే కులం.. అది రాజకీయ కులం. పార్టీలు వేరు కావచ్చు, కానీ అందరూ దొంగలే.. మద్యం సిండికేట్లు, మామూళ్ల వ్యవహారం దీన్ని నిరూపించింది.. పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలకు ఇప్పుడు గొంతు పెగలడం లేదు.. మంత్రుల కుటుంబాలు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ.. చివరకు కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు మద్యం కంపులో మునిగి తరించిన వారేనని ఏసీబీ బయట పెట్టింది.. మున్ముందు ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో చూడాల్సిందే..

Friday, June 8, 2012

చేప మందుపై ఎందుకీ పగ?

రాజేంద్రనగర్ లో చేప మందు కోసం వచ్చి తొక్కిసలాటలో గాయపడటం, ఒకరు మరణించడం బాధాకరం.. దీనికి బాధ్యత వహించాల్సింది సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వమే.. రెండు రోజు ముందు వరకూ చేప మందు పంపిణీ వేదికను నిర్ణయించకపోవడం, చివరకు ఇచ్చిన స్టేడియం దగ్గర తొక్కిసలాటకు దారి తీపే పరిస్థితి కల్పించడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. అసలు ఏటా పంపిణీ జరిగే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎందుకు అనుమతి ఇవ్వనట్లో..

మృగశిర కార్తె నాడు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప మందుకు యవద్దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.. సేవా భావంతో వారు ఇచ్చే మందు పర్యాటక పరంగా కూడా హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది.. కొన్ని నాస్తిక వేదికలు అనవసరంగా చేప మందుపై బురద చల్లుతున్నాయి.. చేప మందుపై నమ్మకంతో వచ్చే వారిని వీరు అడ్డుకోవడం ఎంత వరకూ సమంజసం? జలుబు వచ్చిన వాడు రిలీఫ్ కోసం విక్స్ వేసుకుంటాడు.. అంత మాత్రాన జలుబు తగ్గిపోతుందా?.. ఆస్తమా రోగులకు కూడా చేప మందు ఓ రిలీఫ్ అని ఎందుకు భావించ కూడదు.. చేప మందు మందును అడ్డుకునే వారు కేవలం మతాన్ని మాత్రమే టార్గెట్ చేసినట్లు మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.. తాయెత్తులు, పసరు మందులు, స్వస్థత ప్రార్థనలు చేసే మతాల జోలికి వెళ్లే సాహసం వీరెప్పుడైనా చేశారా? చేప మందు శాస్త్రీయమా, అశాస్త్రీయమా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ నాస్తిక వేదికలు ఆస్తమా రోగులకు ఇంతకన్నా మెరుగైన సేవ ఏమైనా చేస్తున్నాయా? కనీసం మద్యపాన దురాచారాన్ని మాన్పించే ప్రయత్నాలేమైనా చేశారా? తమకు చేత కానప్పుడు ఒకరు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని, అందునా ఒక విశ్వాసం వారిని అడ్డుకొని ఎవరి కొమ్ము కాస్తున్నట్లు?

ఉరి తీసినా తక్కువ శిక్షే..

మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు మన పెద్దలు.. నేను తప్పనిసరి పరిస్థితిలో కొన్ని కఠిన పదాలు ఉపయోగిస్తున్నందుకు క్షమించాలి.. జెండర్ పై ఉపాధ్యాయ కరదీపిక తయారు చేసిన అడ్డగాడిదెవరు?.. అసలు వాడు మనిషేనా?.. అన్నమే తింటున్నాడా?.. తన ఇంట్లో పిల్లలతో ఇలాంటి భాషే వాడతాడా?.. ఇంతకీ వీడు ఉపాధ్యా వృత్తికి అర్హుడేనా? వాడు స్పృహలో ఉండే ఈ కరదీపిక రాశాడా?.. లేక మద్యం మత్తులో రాశాడా?.. కనీసం స్త్రీలపై కూడా గౌరవం లేదా.. ఈ చెత్త వెధవకు? ఇలాంటి కరదీపికను ప్రచురించిన రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్, జనగణం అధికారుల బుద్దేమైనట్లు?.. ప్రజల సొమ్ముతో మీరు చేస్తున్న నిర్వాకం ఇదా?.. ఇలాంటి వెధవలందరినీ ఉరి తీసినా తక్కువ శిక్షే..  

Thursday, June 7, 2012

ఈ జేడీ ఇంకెంత మందికి బేడీలు వేస్తాడో..

Wednesday, June 6, 2012

జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే..

కాలాన్ని వెనక్కి తిప్పలేం.. జరిగి పోయిన సంఘటనల ప్రతిఫలాన్ని మాత్రమే చూడగలం.. ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచనలు చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం మాత్రమే..

జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఏమి జరిగేది? వైఎస్ తనయుడిగా ఆయనకు కచ్ఛితంగా కేంద్ర మంత్రి పదవి దక్కేది.. తనకున్న ఎమ్మెల్యేల మద్దతుతో కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా ముఖ్యమంత్రి పదవిని కూడా పొంది ఉండే వారేమో? అన్నింటికన్నా ముఖ్యం అసలు సీబీఐ కేసు కూడా తెర మీదకు వచ్చేది కాదు.. ఈ విషయం చెప్పడానకి రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు.. బుర్రున్న కుర్రాడెవరైనా చెప్పగలడు..

కానీ గులాం నబీ ఆజాద్ నోరు విప్పడం వల్ల కందిరీగ తుట్టె కదిపినట్లైంది.. అసలు విషయం చెప్పేసి నాలిక కరచుకొని తన ఉద్దేశ్యం అది కాదని బుకాయించినా, ముసుగును తొలగించేశారు..

నిజమే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడకుంటే సీబీఐ కేసు ఉండేదే కాదేమో?.. పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన వెంటే ఉండే వారేమో? అధిష్టానానికి ఇష్టంలేకున్నా సంఖ్యా బలంతో తనకు ఇష్టమైన ముఖ్యమంత్రి పదవిని దర్జాగా పొందేవారేమో?.. యూపీఏ ప్రభుత్వాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకునే వారేమో?.. అన్నింటికన్నా ముఖ్యంగా అవినీతి సామ్రాజ్యానికి చట్ట బద్దత వచ్చి దర్జాగా ఉండే వారేమో?.. పులివెందుల బిడ్డ తిరగబడుడే పాపమైపోయింది..

Sunday, June 3, 2012

అవినీతిపై సమరంలో ఈ ఐక్యత నిలవాలి కలకాలం.. అన్నా హజారే, రాందేవ్ బాబాల పోరాటానికి నైతిక మద్దతు ఇద్దాం..

Friday, June 1, 2012

అన్యాయ మూర్తి..

న్యాయ మూర్తి అంటే న్యాయాన్ని ఏకీలుకాకీలు విరిచి అమ్ముకునేవాడా?.. న్యాయ వ్యవస్థకే కళంకితమైన ఇలాంటి అన్యాయ మూర్తులుంటే దావూద్ ఇబ్రహీమ్, కత్రోచీలు దేశంలోనే రొమ్ము విరుచుకొని తిరిగేవారు.. అప్ఝల్ గురు, కసబ్ లాంటి వారిని నిరపరాధులగా వదిలేసేవారు.. పట్టాభి రామారావును తేలికగా వదిలేస్తే, మరి కొందరు ఈయన్ని ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది.. ఇలాంటి అన్యాయమూర్తులను కఠినంగా శిక్షించాల్సిందే..