Monday, December 31, 2012

My Calendar for 2013..

Sunday, December 30, 2012

ఇతర కీచకుల సంగతి ఏమిటి?

ఢిల్లీలో ఓ యువతి సామూహిక అత్యాచారం, ఆమె మరణానికి యావద్దేశం చలించిపోయాంది.. అమానత్ కు జరిగిన అన్యాయంపై యువత తిరగబడింది.. అత్యాచారం చేసిన వారికి ఉరి తీయాలంటూ ఆక్రోశించింది.. ఆమెకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది కాదనలేం.. అమానత్ పోతూ పోతూ మన ముందు ఎన్నో ప్రశ్నలను వదిలి వెళ్లింది..
దేశంలో గతంలో ఇంతకన్నా దారుణ అత్యాచార సంఘటనలు జరగలేదా? వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎన్నో భయంకరమైన సామూహిక అత్యాచార సంఘటనలు, హత్యలు జరిగాయి.. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డవారిలో కేవలం నేరగాళ్లు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, ఉన్నతాధికారులు.. వారి సంతానంపై కూడా ఎన్నో కేసులు నమోదయ్యాయి.. పలుకుబడి ఉన్న వారు ఎలాంటి శిక్షలు పడకుండా తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు..
అమానత్ అత్యాచార సంఘటన తర్వాత ఇంత పెద్ద ఆందోళన జరిగినా, రేపిస్టులు ఎలాంటి భయం లేకుండా తమ పని తాము కానించారు.. పలు చోట్ల అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. దేశ రాజధానిలో జరిగిన సంఘటన  కాబట్టి అమానత్ కు జరిగిన అన్యాయం అతి పెద్దదిగా కనిపించి ఉండవచ్చు.. కానీ అమానత్ విషయంలో స్పందించిన వారు మిగతా వారి విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది..

పంచ కట్టులోనే తెలుగుదనం..

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు తమ సాంప్రదాయ వస్త్ర ధారణలో చక్కగా కనిపిస్తారు.. కానీ ఆంధ్ర ప్రదేశ్ నాయకులే ప్యాంటు, షర్టు లేదా ఉత్తరాది లాల్చీ, పైజామా ధరిస్తారు.. పంచ కట్టుకోవడానికి ఎందుకంత నామోషి?.. పీవీ, ఎన్టీఆర్, వైఎస్, వెంకయ్య సాంప్రదాయ వస్త్ర ధారణలో ఎంత చక్కగా ఉంటారో గమనించారా?.. తెలుగు మహా సభల పుణ్యమా అని మన సీఎం కిరణ్ గారు మోహమాటానికి ఉత్తరీయం లేని పంచ కట్టారు.. సంతోషం.. చంద్రబాబు తన కొడుకు లోకేష్ పెళ్లి నాడు చక్కని పంచ కట్టులో కనిపించడం చాలా దగ్గరగా చూసాను.. కిరణ్, బాబు ప్రతి రోజు పంచ ధరిస్తే ఎవరు వద్దంటారు? తెలుగు సంస్కృతి, సంప్రదాయాల రక్షణ ఈ ఇద్దరు నేతల నుండే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను..

Saturday, December 29, 2012

చనిపోయింది ఆమె కాదు.. మానవత్వం

అమానత్.. దామిని.. నిర్భయ.. ఆమె అసలు పేరు తెలియదు.. మానవ మృగాలకు భారిన పడి నరక యాతన అనుభవించి చివరకు తనువు చాలించింది.. ఆమెపై జరిగిన దారుణ అత్యాచారానికి దేశమంతా చలించింది.. మూడు రోజుల పాటు ఢిల్లీ నగరమే స్థంభించిపోయింది.. తమ వృత్తి జీవితాలు తప్ప, ఇతర విషయాలేవీ పట్టని యువతీ, యువకులు ఆమెకు న్యాయం చేయమంటూ, రేపిస్టులను ఉరి తీయమంటూ రోడ్ల మీదకు వచ్చారు.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ సామాజిక సమస్యపై వచ్చిన అతి పెద్ద ఉద్యమం ఇది.. దేశ నాయకత్వం కలవరపడింది..
చని పోయింది అమానత్(?) అని ఎవరన్నారు.. ఆమె చనిపోలేదు.. చనిపోయింది మానవత్వం.. అమానత్ భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మనందరి దృక్పథంలో మార్పు రావాలి.. తప్పు రేపిస్టులదే అనడం సరికాదు.. ఆడ పిల్లలను అంగడి సరుకులా చూపిస్తున్న ఈ సమాజమే అతి పెద్ద దోషి.. తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలని, పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు చేయాలని తల్లి దండ్రులు కోరుకుంటారు.. కానీ వారికి నైతిక విలువలు నేర్పించాలనే ఆలోచన మాత్రం కలగడం లేదు.. మన ఇంటి నుండి మార్పు వచ్చినప్పుడే సమాజం కూడా మారుతుంది..
రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలని మనమంతా కోరుకోవడంలో తప్పులేదు.. వారికి కఠినమైన శిక్షలు పడాల్సిందే.. కానీ ఉరి వేస్తారనే భయం కూడా లేకుండా భరి తెగించే శాడిస్టు వెధవలను ఎలా గుర్తించడం?..  ఈ రోజు అమానత్ కు జరిగిన అన్యాయం రేపు మన దగ్గరి వారి విషయంలో కూడా జరగవచ్చనే కనువిప్పు కలగాలి..
చివరగా నాదో విన్నపం.. మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మీరంతా సిద్దం అవుతూ ఉండొచ్చు.. దేశమంతా కదలిపోయిన ఈ విశాద సమయంలో వేడుకలు అవసరమా?.. అమానత్ కు నివాళిగా మనం నూతన సంవత్సర వేడుకలను త్యాగం చేసి శ్రద్ధాంజలి ఘటిద్దాం..
 

Friday, December 28, 2012

అఖిలపక్షం ఓ ప్రహసనం..

తెలంగాణ విషయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిల పక్ష సమావేశం చూసిన తర్వాత ఇంత ప్రహసనమా? అనిపించింది.. పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఢిల్లీ పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం సాధించింది ఏమిటి? ఆ అభిప్రాయాలేవో లేఖల రూపంలో తెప్పించుకుంటే చాలదా? లేదా షిండే గారు హైదరాబాద్ వచ్చి ఇక్కడే సచివాలయంలో సమావేశం జరిపితే సరిపోయేది కదా?
ఢిల్లీ అఖిల పక్షం వల్ల కొత్తగా ప్రయోజనం ఏదీ కనిపించనే లేదు.. పాపం వివిధ పార్టీల నాయకులంతా షిండే గారి కార్యాలయంలో ఇచ్చిన స్వీట్, సమోసా, ఛాయ్ కోసం శీతాకాలంలో వణుకుతూ ఢిల్లీ దాకా వెళ్లడం తప్ప.. వారి ఫ్లయిట్ ఖర్చులూ దండగే..
కాగా నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ద్వారా షిండే సాబ్ ఇరుక్కు పోయారు.. నిజంగా  ఆయన తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపగలరా? తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తిరస్కరిస్తారా? తెలంగాణ ఇస్తే హైదరాబాద్ తో కలిపా? లేక హైదరాబాద్ లేకుండానా? మరి రాయలసీమ సంగతి ఏమిటి? రాయల తెలంగాణ సాధ్యమేనా? హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందా? లేక ఉమ్మడి రాజధానిగానా?. దశాబ్దాలుగా తేలని అంశాన్ని నెల రోజుల్లోగా షిండే సాబ్ ఎలా పరిష్కరిస్తారు?.. కేంద్రం ఈ పాటికే ఓ నిర్ణయానికి వస్తే వెంటనే ప్రకటించ వచ్చు కదా? నెల రోజుల సమయం ఎందుకు?


ఇక్కడే ఉంది అసలు లాజిక్కు.. తెలంగాణ విషయంలో అనుకూలమో, వ్యతిరేకమో టి.ఆర్.ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మాత్రమే స్పష్టమైన వైఖరితో ఉన్నాయి.. కాంగ్రెస్, టీడీపీ, వై.ఎస్.ఆర్.సి.పి. మాత్రమే గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తుంటే, ఎంఐఎం తలా తోక లేని రాయల తెలంగాణ అంటోంది.. తెలంగాణకు అనుకూలమో? వ్యతిరేకమో స్పష్టంగా చెప్పేస్తే, ఎవరి సంగతి ఏమిటో ప్రజలే తేల్చుకుంటారు?.. తెలంగాణ ఇస్తే ప్రయోజనం ఎంత? నష్టం ఎంత? అనే లెక్కలేసుకుంటూ కూర్చుంటున్న రాజకీయ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి.. ఇంకా ఎంత కాలం ఇరు ప్రాంతాల ప్రజలు ఊగిసలాడుతూ ఉండాలి?

Wednesday, December 26, 2012

ఎవరి కోసం ఈ మహాసభలు?

తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే భ్రమతో దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి 57 ఏళ్లు (ఆరు దశాబ్దాలు) అయ్యింది.. ఆంధ్రప్రదేశ్ అనే పరిధి గీసుకొని ఆనందించాం.. కానీ సగం మందికి పైగా తెలుగువారు పొరుగు రాష్ట్రాల్లోనే  ఉండిపోయారు.. తెలుగు వారి పేరిట ప్రత్యేకంగా ఓ రాష్ట్రం ఏర్పడ్డా, ఈ నాటికీ తెలుగును అధికార భాషగా అమలు కావడం లేదు.. ఇందుకు తిలా పాపం తలా పడికెడు అన్నట్లు అందరిదీ తప్పే..
పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలు తమ మాతృభాషల వికాసానికి చక్కని ప్రోత్సాహం ఇస్తున్నాయి.. వారితో పోలిస్తే మనం ఎంతో వెనుక బడి ఉన్నాం.. ఆంధ్ర ప్రదేశ్లో పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరుగుతుంది.. తెలుగు వాడకం అంటే మన అధికారులకు నామోషి.. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి.. మన ప్రభుత్వం అధికార భాషా సంఘం అనే అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసింది.. ఇది వట్టిపోయిన ఆవు లాంటిదే.. నిధులు మేతలా వృధా అవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.. ప్రభుత్వ పరంగా తెలుగు భాషకు జరుగుతున్న సాయం అతి తక్కువ.. తెలుగు భాష ఈ నాటికీ తన ఉనికిని కాపాడుకుంటోంది అంటే అది వ్యక్తలు, మీడియా చేస్తున్న కృషే తప్ప, ప్రభుత్వ ప్రమేయం ఎక్కడా లేదు.. ఇక తెలుగు విశ్వ విద్యాలయం గురుంచి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది..
తెలుగువారు ప్రస్తుతం ఓ సంధి యుగంలో ఉన్నారు.. భాష పేరిట ఏర్పడిన బంధనం (ఆంధ్రప్రదేశ్) గుది బండగా మారింది.. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఒరిగంది ఏమీ లేక పోగా? పోరుగు రాష్ట్రాల్లోని సాటి తెలుగు వారు తమ భాషా సంస్కృతులకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిజానికి తెలుగు మాతృభాషగా ఉన్న వారి జనాభా 50 శాతం పైనే అయినా ద్వితీయ శ్రేణి ప్రజల్లా జీవించాల్సి వస్తోంది.. కనీసం రెండో అధికార భాషగా అయినా తెలుగును గుర్తించమని వారు ప్రాధేయపడుతున్నా.. మీకు ఆంధ్ర ప్రదేశ్ ఉందిగా అక్కడికి పొండి అని తమిళ, కన్నడ నాయకులు అవహేళన చేస్తున్నారు.. ఇలా తెలుగు భాష, సంస్కృతి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది..
ప్రపంచ తెలుగు మహా సభల పేరిట ఓ ప్రహసనం జరుగుతోంది.. ఇది ఎందు కోసమో? ఎవరి కోసమో తెలియని పరిస్థితి.. తెలుగువారి కోసం ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్లో కాకుండా తిరుపతిలో ఈ సభలు నిర్వహించడం లోని ఆంతర్యం ఏమిటో ఆ తిరుమలేషునికే తెలియాలి.. తెలంగాణ వాదులకు భయపడే రాజధాని వెలుపల ఈ సభలు జరుపుతున్నారనేది బహిరంగ రహస్యమే.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు మహా సభలు జరిగాయని చంకలు గుద్దుకోవడం తప్ప ఈ సభల వల్ల కొత్తగా కలుగుతున్న ప్రయోజనాలేవీ లేనట్లే..
తెలుగు భాషా సంస్కృతులను కాపాడాలనే సంకల్పం చేతల్లో కనిపించాలి.. కానీ ఉత్సవాల్లో కాదు.. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉత్సవాలు చేయడం అంటే, తల్లిని చంపుకొని తద్దినం పెట్టు కోవడం కాదా?

Sunday, December 23, 2012

వ్యవస్థపై శివమెత్తిన యువ జనం

ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే చారిత్రిక ఘట్టం.. యువ జనం శివమెత్తారు.. చీమల దండులా తరలి వచ్చి దేశ అత్యున్నత పరిపాలనా సౌధాన్నే ముట్టడించారు.. బస్సులో యువతిపై అత్యాచారం చేసిన కీచకులను సత్వరం ఉరి తీయమంటున్నారు.. అత్యాచార నిరోధక చట్టాన్ని కఠిన తరం చేసి తమకు రక్ష కల్పించమంటున్నారు.. జల ఫిరంగులు, లాఠీలు, బాష్పవాయువులకు కూడా భయపడకుండా ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నిస్తున్నారు..

రాష్ట్రపతి భవన్ లాంటి కీలక ప్రాంతాలను ముట్టడించిన వేలాది మంది యువజనానికి యూపీఏ సర్కారు సమాధానం చెప్పలేకపోతోంది.. ఇదంతా చూసి ప్రతిపక్షం చంకలు గుద్దుకొని ఆనందిస్తోందా?.. ఇది కేవలం ప్రభుత్వం పైన తిరుగుబాటని భావిస్తే మూర్ఖత్వమే అవుతుంది.. విద్యార్థులు, యువజనం రాజకీయ వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు.. వారు నాయకులను నమ్మడం లేదు.. ఇవాళ కాంగ్రెస్, యూపీఏలు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు బీజేపీ, ఎన్డీఏలకూ లేదా సోకాల్డ్ థర్డ్ ఫ్రంటుకూ తప్పకపోవచ్చు..

ఇంత కాలం ప్రశ్నించే వారు లేక పాలకులు, నాయకులు తామేది చేసినా చెల్లుబాటవుతుందని విర్రవీగారు.. ఎన్నికల్లో మందు, నోట్లు పడేస్తే జనం ఓటేయక చస్తారా? అనే భావన రాజకీయ నాయకులది.. కులం, మతం, వర్గం, రిజర్వేషన్, ఉచిత కరెంటు, రూపాయి బియ్యం, నగదు బదిలీ లాంటి తాయిలాలు ఆశ చూసి ఓట్లు రాబట్ట వచ్చనే రాజకీయ నాయకుల పన్నాగాలకు ఇక కాలం చెల్లింది.. తరం మారింది.. కొత్త యువతరం వచ్చింది.. ఇంకా పాత పద్దతుల్లోనే వ్యవహరిస్తామని పాలకులు చెబితే చెల్లదు.. నిల దీసే వారు వచ్చేశారు.. అవసరమైతే తిరగబడతారు.. నాయకుల కలరు పట్టుకొని చెంపలు వాయిస్తారు..


Friday, December 21, 2012

ఆత్మ విమర్శ చేసుకుందాం..

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా..అంటే ఎక్కడ స్త్రీలు పూజలనందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.. మన పురాణాలు చెబుతున్న సత్యమిది.. పురాతన కాలం నుండి మహిళలకు మన దేశంలో ప్రముఖ స్థానం ఉండేది.. (దురదృష్ట వశాత్తు మధ్య యుగం నుండి క్షీణ దశ ప్రారంభమైంది..) స్త్రీని శక్తి స్వరూపిణిగా, దేవతగా, తల్లిగా గౌరవించడం మన సాంప్రదాయం.. మన దేశాన్ని భారత మాత చెబుకుంటాం.. అంటే దేశాన్ని తల్లి రూపంలో కొలుస్తున్నాం..
మన దేశంలో మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది.. దేశాన్ని పాలించే పార్టీ అధినేత్రి మహిళే.. ప్రతిపక్ష నాయకురాలు, లోక్ సభ స్పీకర్ కూడా మహిళలే.. కొన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు మహిళలే.. గతంలో ప్రధాని, రాష్ట్రపతి పదవులును కూడా మహిళలు అలంకరించారు.. కొన్ని ప్రాంతీయ పార్టీల అధినేత్రులూ మహిళలే.. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు గణనీయ ప్రగతి సాధిస్తున్నారు.. చెప్పుకునేందుకు ఇదంతా బాగానే ఉంది.. మేడిపండులా చూడటానికి అంతా బాగానే ఉంది.. కానీ జరుగుతున్న వాస్తవం ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి బస్సులో అత్యాచారానికి గురవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.. దేశాన్ని పాలించే పార్టీ నాయకురాలు, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఈ సంఘటన జరగడం సిగ్గు చేటు.. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు అంత సురక్షితం కాదని లెక్కలు చెబుతున్నాయి.. ఢిల్లీలో గత ఏడాది కాలంలో మహిళలపై అత్యాచారాలు 17% పెరిగాయి.. గత ఏడాది డిసెంబర్ 15 నాటికి 564 కేసులు నమోదైతే, ఈ ఏడాది ఈ తేదీ నాటికి 661కి చేరాయి.. 2009లో 459, 2010లో 489 కేసులు నమోదయ్యాయి.. ఈ సంఖ్య చస్తూనే తెలుస్తోంది ఢిల్లీ పరిస్థితి ఏమిటి అనేది..
అత్యాచారాలు చేసే వారికి ఉరి శిక్ష వేయాలని, అంగచ్ఛేదన చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే.. కానీ ఈ శిక్షలతో అత్యాచారాలు ఆగుతాయా? సమాజంలో పరివర్తన లేకుండా ఇలాంటి నేరాలు అరికట్ట గలమా? ఒక్కసారి ఆలోచించండి.. సినిమాలు, టీవీలు, వ్యాపార సంస్కృతి మహిళల స్థానాన్ని ఎంత దిగజారుస్తున్నాయో ఆలోచించారా? ఒకవైపు మహిళలు స్వావలంభనతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు వారిని భోగ వస్తువుల్లా చూపడం వాస్తవం కాదా?.. మనం గొంగట్లో వెంట్రుకలు ఏరడం లేదా?.. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలూ, కపట నాటకాలూ?.. ఆలోచించండి.. ఆత్మవిమర్శ చేసుకోండి.. మనం మారుదాం.. సమాజాన్నీ మారుద్దాం..

(ఈ వ్యాసానికి మంచి చిత్రాన్ని జత చేద్దామని గూగుల్ సెర్చ్ లో indian women అని టైప్ చేసి చూస్తే తల తిరిగినంత పనైంది..)

Thursday, December 20, 2012

మోడీ లాంటి నేతలు కావాలి


ఊహించినట్లే గుజరాత్లో మళ్లీ నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది.. గుజరాత్ ప్రజలు వరుసగా మూడోసారి భాజపాకు పట్టం కట్టారంటే అది మోడీ చలవే.. గతంలో కన్నా రెండు సీట్లు తగ్గినా అది మోడీపై వ్యతిరేకతతో కాదు.. బీజేపీ నుండి చీలిన జీపీపీ వల్ల కొంత నష్టం జరిగింది.. బీజేపీ, జీపీపీలకు పడ్డ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ అడ్రస్ కచ్చితంగా గల్లంతైనట్లే.. దురదృష్టవశాత్తు ఈ విజయాన్ని సోకాల్డ్ మేధావులు జీర్ణించుకోలేక పోతున్నారు.. 2002 నాటి సంఘటనలు పదే పదే ప్రస్థావిస్తున్నారు.. ఈ సంఘటన తర్వాత మూడు ఎన్నికలు జరిగి, ఆ మూడు సార్లు మోడీ విజయాలు సాధించడం వారికెందుకో రుచించలేదు.. అది గుజరాత్ ప్రజలను కించపడరచడం తప్ప మరొకటి కాదు.. గుజరాత్లో జరిగిన అభివృద్దిని ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరించి మళ్లీ మోడికే ఓటేస్తే వీరికి ఎందుకు కడుపు మంటో అర్థం కాదు.. నిజానికి మోడీ గత రెండు ఎన్నికల్లో అభివృద్ధినే ఎజెండాగా ఎంచుకున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే గుజరాత్లో వ్యవసాయం కానీ, సహజ వనరులు కానీ తక్కువే.. అయినా అక్కడ అద్భుతమైన ప్రగతి కనిపిస్తుందంటే సుపరిపాలన వల్లే.. సుపరిపాలన అందించిన ఘనత నరేంద్ర మోడీదే.. మోడీని విమర్శించే వారు నిర్మాణాత్మంగా మాట్లాడితే బాగుంటుంది.. కానీ గుడ్డు మీద ఈకలు పీకితే జనం నవ్వుకుంటారు.. నరేంద్ర మోడీ భావి భారత ప్రధాని అవుతారా లేదా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం కానీ, మోడీ లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రానికి కావాలి.. మన దేశానికి కూడా ఇలాంటి నాయకులు కచ్చితంగా అవసరం..