Friday, December 28, 2012

అఖిలపక్షం ఓ ప్రహసనం..

తెలంగాణ విషయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిల పక్ష సమావేశం చూసిన తర్వాత ఇంత ప్రహసనమా? అనిపించింది.. పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఢిల్లీ పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం సాధించింది ఏమిటి? ఆ అభిప్రాయాలేవో లేఖల రూపంలో తెప్పించుకుంటే చాలదా? లేదా షిండే గారు హైదరాబాద్ వచ్చి ఇక్కడే సచివాలయంలో సమావేశం జరిపితే సరిపోయేది కదా?
ఢిల్లీ అఖిల పక్షం వల్ల కొత్తగా ప్రయోజనం ఏదీ కనిపించనే లేదు.. పాపం వివిధ పార్టీల నాయకులంతా షిండే గారి కార్యాలయంలో ఇచ్చిన స్వీట్, సమోసా, ఛాయ్ కోసం శీతాకాలంలో వణుకుతూ ఢిల్లీ దాకా వెళ్లడం తప్ప.. వారి ఫ్లయిట్ ఖర్చులూ దండగే..
కాగా నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ద్వారా షిండే సాబ్ ఇరుక్కు పోయారు.. నిజంగా  ఆయన తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపగలరా? తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తిరస్కరిస్తారా? తెలంగాణ ఇస్తే హైదరాబాద్ తో కలిపా? లేక హైదరాబాద్ లేకుండానా? మరి రాయలసీమ సంగతి ఏమిటి? రాయల తెలంగాణ సాధ్యమేనా? హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందా? లేక ఉమ్మడి రాజధానిగానా?. దశాబ్దాలుగా తేలని అంశాన్ని నెల రోజుల్లోగా షిండే సాబ్ ఎలా పరిష్కరిస్తారు?.. కేంద్రం ఈ పాటికే ఓ నిర్ణయానికి వస్తే వెంటనే ప్రకటించ వచ్చు కదా? నెల రోజుల సమయం ఎందుకు?


ఇక్కడే ఉంది అసలు లాజిక్కు.. తెలంగాణ విషయంలో అనుకూలమో, వ్యతిరేకమో టి.ఆర్.ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మాత్రమే స్పష్టమైన వైఖరితో ఉన్నాయి.. కాంగ్రెస్, టీడీపీ, వై.ఎస్.ఆర్.సి.పి. మాత్రమే గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తుంటే, ఎంఐఎం తలా తోక లేని రాయల తెలంగాణ అంటోంది.. తెలంగాణకు అనుకూలమో? వ్యతిరేకమో స్పష్టంగా చెప్పేస్తే, ఎవరి సంగతి ఏమిటో ప్రజలే తేల్చుకుంటారు?.. తెలంగాణ ఇస్తే ప్రయోజనం ఎంత? నష్టం ఎంత? అనే లెక్కలేసుకుంటూ కూర్చుంటున్న రాజకీయ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి.. ఇంకా ఎంత కాలం ఇరు ప్రాంతాల ప్రజలు ఊగిసలాడుతూ ఉండాలి?

No comments:

Post a Comment