Friday, December 21, 2012

ఆత్మ విమర్శ చేసుకుందాం..

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా..అంటే ఎక్కడ స్త్రీలు పూజలనందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.. మన పురాణాలు చెబుతున్న సత్యమిది.. పురాతన కాలం నుండి మహిళలకు మన దేశంలో ప్రముఖ స్థానం ఉండేది.. (దురదృష్ట వశాత్తు మధ్య యుగం నుండి క్షీణ దశ ప్రారంభమైంది..) స్త్రీని శక్తి స్వరూపిణిగా, దేవతగా, తల్లిగా గౌరవించడం మన సాంప్రదాయం.. మన దేశాన్ని భారత మాత చెబుకుంటాం.. అంటే దేశాన్ని తల్లి రూపంలో కొలుస్తున్నాం..
మన దేశంలో మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది.. దేశాన్ని పాలించే పార్టీ అధినేత్రి మహిళే.. ప్రతిపక్ష నాయకురాలు, లోక్ సభ స్పీకర్ కూడా మహిళలే.. కొన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు మహిళలే.. గతంలో ప్రధాని, రాష్ట్రపతి పదవులును కూడా మహిళలు అలంకరించారు.. కొన్ని ప్రాంతీయ పార్టీల అధినేత్రులూ మహిళలే.. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు గణనీయ ప్రగతి సాధిస్తున్నారు.. చెప్పుకునేందుకు ఇదంతా బాగానే ఉంది.. మేడిపండులా చూడటానికి అంతా బాగానే ఉంది.. కానీ జరుగుతున్న వాస్తవం ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి బస్సులో అత్యాచారానికి గురవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.. దేశాన్ని పాలించే పార్టీ నాయకురాలు, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఈ సంఘటన జరగడం సిగ్గు చేటు.. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు అంత సురక్షితం కాదని లెక్కలు చెబుతున్నాయి.. ఢిల్లీలో గత ఏడాది కాలంలో మహిళలపై అత్యాచారాలు 17% పెరిగాయి.. గత ఏడాది డిసెంబర్ 15 నాటికి 564 కేసులు నమోదైతే, ఈ ఏడాది ఈ తేదీ నాటికి 661కి చేరాయి.. 2009లో 459, 2010లో 489 కేసులు నమోదయ్యాయి.. ఈ సంఖ్య చస్తూనే తెలుస్తోంది ఢిల్లీ పరిస్థితి ఏమిటి అనేది..
అత్యాచారాలు చేసే వారికి ఉరి శిక్ష వేయాలని, అంగచ్ఛేదన చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే.. కానీ ఈ శిక్షలతో అత్యాచారాలు ఆగుతాయా? సమాజంలో పరివర్తన లేకుండా ఇలాంటి నేరాలు అరికట్ట గలమా? ఒక్కసారి ఆలోచించండి.. సినిమాలు, టీవీలు, వ్యాపార సంస్కృతి మహిళల స్థానాన్ని ఎంత దిగజారుస్తున్నాయో ఆలోచించారా? ఒకవైపు మహిళలు స్వావలంభనతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు వారిని భోగ వస్తువుల్లా చూపడం వాస్తవం కాదా?.. మనం గొంగట్లో వెంట్రుకలు ఏరడం లేదా?.. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలూ, కపట నాటకాలూ?.. ఆలోచించండి.. ఆత్మవిమర్శ చేసుకోండి.. మనం మారుదాం.. సమాజాన్నీ మారుద్దాం..

(ఈ వ్యాసానికి మంచి చిత్రాన్ని జత చేద్దామని గూగుల్ సెర్చ్ లో indian women అని టైప్ చేసి చూస్తే తల తిరిగినంత పనైంది..)

No comments:

Post a Comment