Saturday, December 29, 2012

చనిపోయింది ఆమె కాదు.. మానవత్వం

అమానత్.. దామిని.. నిర్భయ.. ఆమె అసలు పేరు తెలియదు.. మానవ మృగాలకు భారిన పడి నరక యాతన అనుభవించి చివరకు తనువు చాలించింది.. ఆమెపై జరిగిన దారుణ అత్యాచారానికి దేశమంతా చలించింది.. మూడు రోజుల పాటు ఢిల్లీ నగరమే స్థంభించిపోయింది.. తమ వృత్తి జీవితాలు తప్ప, ఇతర విషయాలేవీ పట్టని యువతీ, యువకులు ఆమెకు న్యాయం చేయమంటూ, రేపిస్టులను ఉరి తీయమంటూ రోడ్ల మీదకు వచ్చారు.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ సామాజిక సమస్యపై వచ్చిన అతి పెద్ద ఉద్యమం ఇది.. దేశ నాయకత్వం కలవరపడింది..
చని పోయింది అమానత్(?) అని ఎవరన్నారు.. ఆమె చనిపోలేదు.. చనిపోయింది మానవత్వం.. అమానత్ భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మనందరి దృక్పథంలో మార్పు రావాలి.. తప్పు రేపిస్టులదే అనడం సరికాదు.. ఆడ పిల్లలను అంగడి సరుకులా చూపిస్తున్న ఈ సమాజమే అతి పెద్ద దోషి.. తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలని, పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు చేయాలని తల్లి దండ్రులు కోరుకుంటారు.. కానీ వారికి నైతిక విలువలు నేర్పించాలనే ఆలోచన మాత్రం కలగడం లేదు.. మన ఇంటి నుండి మార్పు వచ్చినప్పుడే సమాజం కూడా మారుతుంది..
రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలని మనమంతా కోరుకోవడంలో తప్పులేదు.. వారికి కఠినమైన శిక్షలు పడాల్సిందే.. కానీ ఉరి వేస్తారనే భయం కూడా లేకుండా భరి తెగించే శాడిస్టు వెధవలను ఎలా గుర్తించడం?..  ఈ రోజు అమానత్ కు జరిగిన అన్యాయం రేపు మన దగ్గరి వారి విషయంలో కూడా జరగవచ్చనే కనువిప్పు కలగాలి..
చివరగా నాదో విన్నపం.. మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మీరంతా సిద్దం అవుతూ ఉండొచ్చు.. దేశమంతా కదలిపోయిన ఈ విశాద సమయంలో వేడుకలు అవసరమా?.. అమానత్ కు నివాళిగా మనం నూతన సంవత్సర వేడుకలను త్యాగం చేసి శ్రద్ధాంజలి ఘటిద్దాం..
 

No comments:

Post a Comment