Thursday, August 24, 2017

అందర్నీ చిత్తు చేస్తున్న స్పిన్నర్..

ఆఫీసు నుంచి వస్తుంటే షాపింగ్ చేస్తున్న మిత్రుడొకరు కనిపించాడు.. వెంట ఉన్న అతని కొడుకు చేతిలో విచిత్రమైన వస్తువు కనిపించింది.. ఇదేమిటని ఆ బుజ్జోన్ని అడితే ‘ఫిడ్జెట్ స్పిన్నర్’ అని చెప్పాడు.. ఎందుకు ఇదని ప్రశ్నించాను.. బొటన వేలు, చూపుడు వేలు మధ్య పెట్టి తిప్పుతూ వివరించాడు.. ‘ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళన, చికాకు తగ్గుతుంది’.. మనసు బాగోలేనప్పుడు తాను కూడా స్పిన్నర్ తీసుకొని తిప్పుతూ కూర్చుంటానని చెప్పాడు నా మిత్రుడు..
‘ఎందుకు అలా తిప్పుతావు?.. పొద్దున్నే యోగా, ప్రాణాయామం, వ్యాయామం చేస్తే ఆ ఒత్తిడి, ఆందోళన, చికాకు ఉండవు కదా?..’ అంటూ అతనికి క్లాస్ పీకాను.. అతను నవ్వేసి వెళ్లిపోయాడు..
ఇక నేను ఇంటికి వెళ్లాను.. మా చిన్నోడి చేతితో వస్తువు చూసి అవాక్కయ్యాను.. వేళ్ల మధ్య స్పిన్నర్ పట్టుకొని తిప్పుతున్నాడు.. హత విధి.. నాకు ఎక్కడ లేని ఒత్తిడి, ఆందోళన, చికాకు వచ్చేశాయి..

Monday, August 14, 2017

జగద్గురు శ్రీకృష్ణుడు

యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం..
ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో..
శ్రావణమాసంలో అష్టమి నాడు జన్మించాడు కృష్ణుడు. పుట్టింది అంత:పురం పట్టు పరుపులపై కాదు. చెరసాల కటిక నేలమీద.. దేవకికి జన్మించి గోకులంలో యశోద ఒడి చేరాడు. బాల్యంలో గోపాలకునిగా చిలిపి పనులతో పాటు రాక్షస, దుష్ట సంహారం చేస్తూ శిష్ట జనులకు అండగా నిలిచాడు. ధర్మ రక్షణ కోసం పాండవులకు మద్దతిచ్చాడు.
మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారధిగా ఉండి కర్తవ్య బోధ చేశాడు కృష్ణుడు. ఈ సందర్భంగా వినిపించిందే భగవద్గీత.. ప్రపంచంలో తొలి వ్యక్తిత్వ వికాస గ్రంథమిది. వేదాలు, ఉపనిషత్తుల సారాంశం అంతా ఇందులో నిక్షిప్తమైంది.
శ్రీకృష్ణుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్న దైవజ్ఞుడు, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అపార ప్రజ్ఞాపాఠవాలతో భగవంతునిగా గుర్తింపు పొందాడు. గీతాజ్ఞానం అందించి ఈ జగానికే తొలి గురువయ్యాడు. అందుకే మనం కృష్ణం వందే జగద్గురుమ్ అని కొలుస్తున్నాం.. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఆ దేవదేవున్ని మనసారా భక్తితో కొలుద్దాం.. జై శ్రీకృష్ణ.. జైజై కృష్ణ.. 

గురుద్వార్ దర్శన్ ఆహ్వానం

ప్రపంచంలో అత్యంత సనాతన ధర్మం మన హైందవం.. మన దేశంపై విదేశీ శక్తులు ఎన్నిసార్లు దాడి చేసినా, శతాబ్దాల పాటు పాలించినా ఏమీ చేయలేకపోయారు. అది సనాతన ధర్మానికి ఉన్న విశిష్టత కారణంగానే సాధ్యమైంది. భారతీయ సాంస్కృతిక వైభవంలో హైందవంతో పాటు సిక్కు, జైన, బౌద్ధ సాంప్రదాయాలు ఉన్నాయి.. వీటిని మనం సోదర మతాలుగా గౌరవిస్తున్నాం.
మొఘలుల కాలంలో హైందవ ధర్మాన్ని రక్షించేందుకు సిక్కు సాంప్రదాయం ఆవిర్భవించింది. హిందువులను రక్షించేందుకు, మాన ప్రాణాలను కాపాడేందుకు సమర్ధవంతంగా పోరాడారు. తెలంగాణలో రజాకార్లకు ఎదురొడ్డిన ఘన చరిత్ర కూడా వీరికి ఉంది. సిక్కుల త్యాగాల కారణంగానే మన దేశం ఈ రోజున సురక్షింతంగా ఉంది. భారత సైన్యంలో కీలకపాత్ర పోశిస్తూ దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్న సిక్కులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.
సిక్కుల పవిత్ర గ్రంధం గురుగ్రంధ్ సాహిబ్ లో రామ, కృష్ణ, హరి లాంటి హైందవ దేవుళ్ల స్మరణను మనం చూడవచ్చు.. సమాజంలో వివిధ వృత్తుల్లో కీలకపాత్ర పోశిస్తున్న సిక్కు సోదరులతో మనం సామరస్య, స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించాలి.
హిందువుల పండుగలు వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల సందర్భంగా సిక్కు మిత్రులు వీధుల్లో ఆహారం, నీళ్లను అందిస్తూ మనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కానీ వారి పండుగలు వచ్చినప్పుడు మనం ఇలాంటి మైత్రిని అందించలేకపోతున్నాం.. మనం ఇలా వారిని నిర్లక్ష్యం చేయడం తగునా? వారిని మనం ఎందుకు కలుపుకొనిపోలేకపోతున్నాం?
ఈరోజు విదేశీ మతాలు మరోసారి మన దేశం మీద పెత్తనం చేస్తూ సనాతన ధర్మానికి విఘాతం కలిగించేందుకు అన్ని రకాలుగా కుట్రలు పన్నుతున్నాయి. వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు మనం సాటి భారతీయ మతస్తులను సామరస్యంగా కలుపుకోవాల్సిన అవసరం ఉంది.
వీటికి సమాధానమే గురుద్వార్ దర్శన్ కార్యక్రమం.. We Can Change సోషల్ మీడియా మిత్ర బృందం ఆగస్టు 13 ( ఆదివారం) నాడు వనస్థలిపురం గురుద్వార్ ను సందర్శించింది. అక్కడి సిక్కు మిత్రులతో మాట్లాడి, వారి పూజా, సంకీర్తన్ లలో పాల్గొన్నాం.. ఇది చాలా చిన్న కార్యక్రమం కావచ్చు.. కానీ మున్ముందు ఇలాంటి సద్భావనా కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు నాది ఇది.. ఈ కార్యక్రమానికి స్పూర్తి ఏసీపీ గిరిధర్ గారు.. గురుద్వార్ దర్శన్లో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు మీ అందరి సహకారాలు అందించాల్సిగా కోరుతున్నాం.. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం..

Monday, August 7, 2017

రక్షాబంధన్ సందేశం ఇదే..

మానవ జీవితం సమాజంతో ముడిపడి ఉంటుంది.. సమాజ హితంలోనే మన హితం ఉంది.. ప్రతి ఒక్కరు తన కుటుంబం గురుంచి మాత్రమే కాకుండా సమాజం, దేశం కోసం కూడా ఆలోచించాలి.. మన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలోనో మన భద్రత ఉంది.. ఈ విషయంలో మనమంతా ఒకరికొకరం తోడుగా కంకణ బద్ధులం కావాలి.. రక్షాబంధన్ ఇచ్చే సందేశం ఇదే..
నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. మనమంతా సమాజానికి, ధర్మానికి, దేశానికి రక్ష..
అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు..

స్నేహానికి దినం ఎందుకు?

*స్నేహం ఇవాళ పుట్టిందా?.. నిన్న లేదా?.. రేపు ఉండదా?.. అసలు స్నేహానికి దినం ఏమిటి?..*
స్నేహం అంటే ఒక్క రోజులో పుట్టి చచ్చేదేనా?..
స్నేహానికి హద్దులు, పద్దులూ లేవు.. స్నేహానికి సరిహద్దులూ, ఎల్లలూ లేవు.. స్నేహం నిత్యం, ప్రతి క్షణం.. స్నేహం స్వచ్ఛమైనది, విలువైనది.. ఏదీ ఆశించనిదే స్నేహం.. ఆపదలో ఉంటే ఆదుకునేది స్నేహం.. అవసరమైతే ప్రాణం ఇచ్చేది స్నేహమే.. జీవితంలో స్నేహాన్ని మించిన ఆస్తి, సంపదలు లేవు.. ప్రేమ, ఆత్మీయత, ఆనందం, త్యాగం కలబోస్తేనే స్నేహం..
ఇలాంటి పవిత్ర పదానికి ఒక దినమా.. స్నేహాన్ని ఒక్క రోజులో పాటించి వదిలేయడానికి ఇదేమన్నా జన్మదినమా, వర్ధంతా?.. ఈ రోజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పుకొని, మళ్లీ వచ్చే ఏడాది వరకూ కోల్డ్ స్టోరేజీ పెట్టేద్దామా స్నేహాన్ని..
మనకీ దినాల సంస్కృతి ఎందుకు?.. ప్రతి అంశానికి తేదీ నిర్ణయించి వేడుక జరుపుకోవాల్సి అవసరం మనకేమిటి? కొద్ది సంవత్సరాల క్రితం వరకూ గ్రీటింగు కార్డులు, గిఫ్టులు అమ్ముకోడానికి ఈ దినాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు ఈ దినాల వ్యాపారం విస్తరించింది.. పత్రికల వారు ప్రకటనలు, మొబైల్ కంపెనీలు ఎస్సెమ్మెస్, టీవీ ఛానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్, కొత్తగా ఆన్ లైన్ వ్యాపారులు గిఫ్ట్ వ్యాపారం కోసం ఈ దినాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.. ఒకప్పుడు రక్షాబంధన్ నాడు రాఖీ కట్టేవారు.. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ బాండ్స్ అట..
మనకు ఒక్క రోజుతో ముగిసే స్నేహాలు, వద్దు.. సంవత్సరంలో 365 రోజులూ ఉంటే స్నేహాలు కావాలి.. జీవితాంతం తోడుండే స్నేహితులు కావాలి.. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం.. -క్రాంతి దేవ్ మిత్ర