Monday, August 7, 2017

స్నేహానికి దినం ఎందుకు?

*స్నేహం ఇవాళ పుట్టిందా?.. నిన్న లేదా?.. రేపు ఉండదా?.. అసలు స్నేహానికి దినం ఏమిటి?..*
స్నేహం అంటే ఒక్క రోజులో పుట్టి చచ్చేదేనా?..
స్నేహానికి హద్దులు, పద్దులూ లేవు.. స్నేహానికి సరిహద్దులూ, ఎల్లలూ లేవు.. స్నేహం నిత్యం, ప్రతి క్షణం.. స్నేహం స్వచ్ఛమైనది, విలువైనది.. ఏదీ ఆశించనిదే స్నేహం.. ఆపదలో ఉంటే ఆదుకునేది స్నేహం.. అవసరమైతే ప్రాణం ఇచ్చేది స్నేహమే.. జీవితంలో స్నేహాన్ని మించిన ఆస్తి, సంపదలు లేవు.. ప్రేమ, ఆత్మీయత, ఆనందం, త్యాగం కలబోస్తేనే స్నేహం..
ఇలాంటి పవిత్ర పదానికి ఒక దినమా.. స్నేహాన్ని ఒక్క రోజులో పాటించి వదిలేయడానికి ఇదేమన్నా జన్మదినమా, వర్ధంతా?.. ఈ రోజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పుకొని, మళ్లీ వచ్చే ఏడాది వరకూ కోల్డ్ స్టోరేజీ పెట్టేద్దామా స్నేహాన్ని..
మనకీ దినాల సంస్కృతి ఎందుకు?.. ప్రతి అంశానికి తేదీ నిర్ణయించి వేడుక జరుపుకోవాల్సి అవసరం మనకేమిటి? కొద్ది సంవత్సరాల క్రితం వరకూ గ్రీటింగు కార్డులు, గిఫ్టులు అమ్ముకోడానికి ఈ దినాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు ఈ దినాల వ్యాపారం విస్తరించింది.. పత్రికల వారు ప్రకటనలు, మొబైల్ కంపెనీలు ఎస్సెమ్మెస్, టీవీ ఛానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్, కొత్తగా ఆన్ లైన్ వ్యాపారులు గిఫ్ట్ వ్యాపారం కోసం ఈ దినాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.. ఒకప్పుడు రక్షాబంధన్ నాడు రాఖీ కట్టేవారు.. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ బాండ్స్ అట..
మనకు ఒక్క రోజుతో ముగిసే స్నేహాలు, వద్దు.. సంవత్సరంలో 365 రోజులూ ఉంటే స్నేహాలు కావాలి.. జీవితాంతం తోడుండే స్నేహితులు కావాలి.. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం.. -క్రాంతి దేవ్ మిత్ర

No comments:

Post a Comment