Sunday, January 15, 2012

మన సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకుందాం..

ఆధునిక సమాజంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురై, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వలస పోతున్నాం.. మన కట్టూ, బొట్టూ చెదిరిపోతున్నాయి.. కనీసం పండుగలనైనా కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటే ఎంత బాగుంటుంది.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని చీకట్ల పాలెంలో ఓ కుటుంబం సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే విస్తరిలో భోజనం చేయడం ఎంత బాగుందో చూడండి..

Wednesday, January 11, 2012

ఇదేం ఫ్యాక్షన్ సంస్కృతి?


వందల కొద్ది జీపులు, సుమోలు, క్వాలీస్ బండ్లు రోడ్ల మీద రయ్యిన దూసుకుపోవడం.. ఆ వాహనాల్లో ఆయుధాలు ధరించిన వ్యక్తులు కిటికీల్లోంచి సగం శరీరాలు బయటకు పెట్టి ఆహాకారాలు చేయడం.. సవాళ్లు విసరడం లాంటి దృశ్యాలను సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాల్లో చూసే ఉంటాం.. మళ్లీ దృశ్యాలను చూసే అవకాశం టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు కల్పించాయి. ఇటీవల ఈ రెండు పార్టీల అధినేతలు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తలపెట్టిన కార్యక్రమాలకు తరలి వెళ్లిన తీరు ఇలాగే ఉంది.. తెలంగాణా వాదుల నిరసనలు, అడ్డగింపుల నుండి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు సైన్యాలను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. సాధారణంగా నిరసనకారులకు అధికార పార్టీ భయపడాలి.. కానీ రెండు ప్రధాన ప్రతిపక్షాల నేతలు ఇంతగా భయపడే రీతిలో ప్రయివేటు రక్షణ కల్నించుకోవాల్సి అవసరం మొచ్చింది? తెలంగాణపై దాగుడు మూతలు ఆడకుండా స్పష్టమైన వైఖరి అవలంభిస్తే ఈ కష్టాలు ఉండేవా? తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు సభలు, దీక్షలు చేపట్టే స్వేచ్చనే ప్రశ్నించడం నా ఉద్ధేశ్యం కాదు..

Tuesday, January 10, 2012

అన్నాకు తత్వం బోధ పడింది..


అవినీతికి వ్యతిరేకంగా, లోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించిన అన్నా హజారే ఒక్కసారిగా వెనుదిరిగారు.. ఈ పదం తప్పయితే ఆత్మ విమర్ష చేసుకున్నారు అందాం.. అన్నా లక్ష్యం మంచిదే.. కోట్లాది మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యపై పోరాటంలో ఆయన చిత్తశుద్దిని శంకించలేం.. కానీ ఎంచుకున్న దారే గందరగోళం.. చేగువేరా అంటే తెలియని యువతీ యువకులు కూడా ఇదేదో వెరైటీగా ఉందని ఆయన బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్న రోజులు ఇవి.. ఇంకా సమాజాన్ని అర్థం చేసుకునే వయస్సు, అనుభవం లేని యువతరం సైతం మై అన్నా, అయాం అన్నా అని రాసి ఉన్న టోపీలు, టీషర్టులు ధరించి వీధుల్లోకి వచ్చారు.. ఇదంతా చూసి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు సైతం అవినీతి వ్యతిరేక ఉద్యమం ముసుగేసుకున్నారు. ఢిల్లీ దీక్ష ఘన విజయం మైకంలో ఆవేశ పూరితంగా ముందుకెళ్లిన అన్నా బృందం తాము గొంగట్లో వెంటుకలేరుతున్నామనే విషయాన్ని మరిచిపోయారు.. అందుకే ముంబయ్ దీక్ష స్పందన చూసి నీరసించిపోయారు.. మీడియా అనవసరపు ఆర్భాటం, సోషల్ నెటిజనుల హడావుడి అన్నాబృందాన్ని మునగ చెట్టెక్కించింది.. మన భారతీయులకు ఆరంభ శూరత్వం ఎక్కవ..  ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ ఆగడాలు చూసి ఇంటికి పంపిన ఓటర్లే మూడేళ్లలోనే అంతా మరిచిపోయి ఆమెకు పట్టంగట్టారు.. సమాచార సాంకేతిక విప్లవం వచ్చాక మన భారతీయులు మరింత స్పీడైపోయారు.. నిన్నటి విషయాన్ని నేడు మరిచి పోతున్నారు.. మార్కెట్లో కొత్త కారో, ఫ్యాషనో రాగానే ఎగబడే జనం, నాలుగు రోజుల తర్వాత మళ్లీ మరింత కొత్త రకం కోసం ఎదురు చూస్తారు.. అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారన్నట్లు అన్నా బృందానికి ఇప్పటికైనా తత్వం బోధపడి ఉండాలి.. వేయి యోజనాల దూర ప్రయానాన్ని ఓ అడుగుతోనే ప్రారంభించాలి.. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం విఫలమైన తర్వాత 90 ఏళ్లకు గానీ బ్రిటిషర్లను తరిమేయలేకపోయాం.. అయితే ఈ స్పీడు యుగంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ విజయానికి అంత ఆలస్యం ఉండకపోవచ్చు.. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని గీతాచార్యుడు శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పారు.