Tuesday, January 10, 2012

అన్నాకు తత్వం బోధ పడింది..


అవినీతికి వ్యతిరేకంగా, లోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించిన అన్నా హజారే ఒక్కసారిగా వెనుదిరిగారు.. ఈ పదం తప్పయితే ఆత్మ విమర్ష చేసుకున్నారు అందాం.. అన్నా లక్ష్యం మంచిదే.. కోట్లాది మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యపై పోరాటంలో ఆయన చిత్తశుద్దిని శంకించలేం.. కానీ ఎంచుకున్న దారే గందరగోళం.. చేగువేరా అంటే తెలియని యువతీ యువకులు కూడా ఇదేదో వెరైటీగా ఉందని ఆయన బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్న రోజులు ఇవి.. ఇంకా సమాజాన్ని అర్థం చేసుకునే వయస్సు, అనుభవం లేని యువతరం సైతం మై అన్నా, అయాం అన్నా అని రాసి ఉన్న టోపీలు, టీషర్టులు ధరించి వీధుల్లోకి వచ్చారు.. ఇదంతా చూసి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు సైతం అవినీతి వ్యతిరేక ఉద్యమం ముసుగేసుకున్నారు. ఢిల్లీ దీక్ష ఘన విజయం మైకంలో ఆవేశ పూరితంగా ముందుకెళ్లిన అన్నా బృందం తాము గొంగట్లో వెంటుకలేరుతున్నామనే విషయాన్ని మరిచిపోయారు.. అందుకే ముంబయ్ దీక్ష స్పందన చూసి నీరసించిపోయారు.. మీడియా అనవసరపు ఆర్భాటం, సోషల్ నెటిజనుల హడావుడి అన్నాబృందాన్ని మునగ చెట్టెక్కించింది.. మన భారతీయులకు ఆరంభ శూరత్వం ఎక్కవ..  ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ ఆగడాలు చూసి ఇంటికి పంపిన ఓటర్లే మూడేళ్లలోనే అంతా మరిచిపోయి ఆమెకు పట్టంగట్టారు.. సమాచార సాంకేతిక విప్లవం వచ్చాక మన భారతీయులు మరింత స్పీడైపోయారు.. నిన్నటి విషయాన్ని నేడు మరిచి పోతున్నారు.. మార్కెట్లో కొత్త కారో, ఫ్యాషనో రాగానే ఎగబడే జనం, నాలుగు రోజుల తర్వాత మళ్లీ మరింత కొత్త రకం కోసం ఎదురు చూస్తారు.. అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారన్నట్లు అన్నా బృందానికి ఇప్పటికైనా తత్వం బోధపడి ఉండాలి.. వేయి యోజనాల దూర ప్రయానాన్ని ఓ అడుగుతోనే ప్రారంభించాలి.. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం విఫలమైన తర్వాత 90 ఏళ్లకు గానీ బ్రిటిషర్లను తరిమేయలేకపోయాం.. అయితే ఈ స్పీడు యుగంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ విజయానికి అంత ఆలస్యం ఉండకపోవచ్చు.. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని గీతాచార్యుడు శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పారు.

No comments:

Post a Comment