Sunday, January 31, 2016

గాంధీజీని అవమానిన రాహుల్ వ్యాఖ్యలు..

రాహుల్ గాంధీ తెలిసి చేశాడో, తెలియక చేశాడో కానీ ఈ వ్యాఖ్యలు గాంధేయవాదులు, నిజమైన కాంగ్రెస్ వాదులు ఇంకా మన దేశంలో బతికి ఉంటే వారికి మనస్థాపం కలిగించి ఉండాలి.. రోహిత్ వేములను ఏకంగా మహాత్మాగాంధీతో పాల్చాడు రాహుల్..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విద్యార్థి అనుమానాస్పద మృతికి అసలు కారణాలు ఇంకా తెలిసి రాలేదు.. అతని కులం విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండానే దళిత రంగు పులిమేశారు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే యూనివర్సిటీలో 9 మంది దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని రాహుల్, రోహిత్ వ్యవహారంలో ఇప్పటికి రెండు సార్లు ఈ యూనివర్సిటీకి వచ్చాడు.. రోహిత్ జన్మదిన వేడుకలకు ఆయన కుటుంబం పిలిస్తే వచ్చానని చెబుతున్నాడు.. శవాలపై పేలాలు ఏరుకోవడానికి, క్షుద్ర రాజకీయాలకు ఇంత కన్నా మంచి సందర్భం ఏముంటుంది ఆయనకు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఏర్పడిన విద్యార్థి సంఘం ముంబై మారణకాండకు బాధ్యుడైన యాకుబ్ మెమన్ ఉరి శిక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం ప్రస్తుత వివాదానికి మూల కారణం.. తాజాగా తమిళనాడులో మరో అరాచక మూక రోహిత్ వేములకు మద్దతు అంటూ జాతీయ పతాకాన్ని తగులబెట్టింది.. మహనీయుల పేర్లు పెట్టుకొని కుల సంఘాల ముసుగులో దేశ విద్రోహక కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులకు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గు పడాల్సిన అవసరం ఉంది.. దేశ ప్రజలకు ప్రాతస్మరణీయులైన అంబేద్కర్, గాంధీజీ పేర్లను విద్రోహ కార్యకలాపాల కోసం వాడుకుంటున్న వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.. ఇలాంటి వ్యక్తులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..

జాగో బంధూ.. దేశ్ బచావో..

కొంత కాలంగా మన దేశంలో జాతి వ్యతిరేక శక్తులు ఎలా రెచ్చిపోతున్నాయో చూడండి.. కొన్ని సంస్థలు మహనీయులకు కులం, మతం, ప్రాంతం ముసుగు వేసుకొని బాహటంగా దేశ ద్రోహ కార్యాకలాపాలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాట ఈ విష సంస్కృతి వెర్రి తలలు వేస్తోంది. ద్రవిడ వాదం ముసుగులో దేశ ద్రోహులు చెలరేగిపోతున్నారు... ఈ విష ప్రభావంతో ఓ కుర్రాడు జాతీయ పతాకానికే నిప్పు పెట్టాడు.. మార్క్స్, పెరియార్, అంబేద్కర్ వారికి ఇదే బోధించారా?
మరోవైపు మతం ముసుగులో ఉగ్రవాద శక్తులు దేశ భద్రతను సవాలు చేస్తున్న వేళ, గణతంత్ర దినోత్సవం నాడు దేశంలోని పలువురు ముస్లింలు ఇలాంటి శక్తులను వ్యతిరేకిస్తూ సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.. మతాన్ని దేశభక్తితో ముడిపెట్టడాన్ని వారు సవాలు చేశారు..


Friday, January 29, 2016

ఆలయంలో____ చేస్తారట..

మొన్న బీఫ్ ఫెస్టివల్ అంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు. ఎవరి తిండి వాడిష్టం అని సరిపెట్టుకున్నాం..
నిన్న ముంబై నరహంతకుడు యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా ప్రదర్శన జరిపారు.  భావ ప్రకటనా స్వేచ్ఛ సమర్థించారు మేతావులు..
ఇవాళ ఏకంగా దైవ సన్నిధిలో శృంగారమట.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?.. ఇదే వాదం అనుకోవాలి?

మహనీయుల పేర్లతో సంఘాలు పెట్టుకొని మన మతం, సంస్కృతి, దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని ఇలాగే వదిలేద్దామా?.. మహనీయులు బోధించింది ఏమిటి? వీరు చేస్తున్నది ఏమిటి?.. 

Thursday, January 28, 2016

మన కోడి కూస్తేనే తెల్లారినట్లా..

 Facebook ఖాతా మూసుకొని భారతీయులకు, సమాజానికి ఎంతో మేలు చేసిన మార్కండేయ ఖట్టూ గారికి అభినందనలు మీ అపారమైన మేధస్సును మేం భరించలేకపోయాం.. ఎప్పుడు ఏ సంచలన ప్రకటన చేస్తారో అని భయపడి చచ్చేవాళ్లం. అందుకే తిట్లూ, శాపనార్ధాలతో దీవించేవాళ్లం.. మీ నిర్ణయం కారణంగా ఇకపై మీరు, మేము ఎంతో ప్రశాంతంగా ఉంటాం..
మీ కోడి కూయకున్నా లోకానికి తెల్లారుతుంది కట్టూ జీ.. ఎటొచ్చి మీరొక్కరే తెలివైన వారని భావించు కోవడమే మాకు నచ్చనిది.. అందరి మనోభావాలు, అభిప్రాయాలు గౌరవించడం నేర్చుకోండి.. 

Tuesday, January 26, 2016

రుణం తీర్చుకునే అవకాశం..

చిన్నప్పుడు ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న శ్రీ సరస్వతి విద్యా మందిరం (కందికల్ గేట్, హైదరాబాద్)లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అదృష్టం కలిగింది.. ఈ సందర్భంగా నేను, నా తమ్ముడు శాంతి దేవ్ మిత్ర, మరో సోదరుడు విక్రమ్ రెడ్డి, బావమరిది విశ్వనాథ్ రెడ్డి మా పాఠశాలలో ప్రారంభమైన డిజిటల్ తరగతులకు ఉడతా భక్తిగా మా వంతు సాయం అందించాం.. ఇందుకు అవసరమైన పరికరాలను ప్రధానం చేశాం.. మేమంతా ఇక్కడి పూర్వ విద్యార్థులమే.. ఈ సందర్భంగా జరిగిన సత్కారం ఆనందంతో పాటు కాస్త ఇబ్బందిగానే అనిపించింది.. విద్యా బుద్దులు చేర్చిన పాఠశాల రుణం కొంత మేర తీర్చుకున్నాననే తృప్తి కలిగింది.. చేయాల్సింది ఇంకా ఉంది.. భవిష్యత్తులో మరింత సాయం అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.. 









గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


పురస్కారానికి ఈయన అర్హుడేనా?

మహాసాధ్వి, పాండవ పత్ని ద్రౌపదిని అవమానిస్తూ నవల రాసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పద్మభూషన్ పురస్కారానికి అర్హుడేనా?

Monday, January 25, 2016

యాకుబ్ ను శిక్షించొద్దా..

యాకుబ్ మెమన్ ఉరి శిక్షను వ్యతిరేకించే హక్కు హెచ్.సీ.యూ. విద్యార్థులకు ఉందట.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి వాక్రుచ్చారు.. మరి ముంబై వాసులపై మొమన్ సోదరుల మారణకాండకు మీరు మద్దతు ఇస్తున్నట్లే కదా?.. ఇలాంటి దేశ ద్రోహికి ఉరి తీయడం తప్పు అని రెడ్డి గారు  పరోక్షంగా అంగీకరించారన్నమాట.. సిగ్గుండాలి ఇలాంటి కూతలు కూయడానికి.. అఫ్జల్ గురు, కసబ్ లాంటి ఉగ్రవాదులకు ఉరి శిక్షలు పడ్డా కాపాడుతూ, జైళ్లలో ఇంటి అల్లుళ్లలా చూసుకుంటూ బిర్యానీలు తినిపించిన కాంగ్రెస్ నాయకుల నుండి ఇంత కన్నా మంచి ప్రకటనలను ఏం ఆశించగలం? అందుకే ఉగ్రవాదుల తరపున వకాల్తా పుచ్చుకునే మిమ్మల్ని దేశ ప్రజలు వీరిని చిత్తుగా ఓడించారు.. 

Sunday, January 24, 2016

సావన్ ప్రాణాలకు విలువ లేదా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం బాధాకరమైన ఘటనే.. అతని సామాజిక వర్గ నేపథ్యం తెలుసుకోకుండానే శవ రాజకీయాలు చేశారు. ఏకంగా కేంద్ర మంత్రులపై అట్రాసిటీస్ కేసు పెట్టి రాజీనామాకు డిమాండ్ చేశాయి.. ఇదే సమయంలో పుణేలో చెత్త ఏరుకునే పేద కుర్రాడు సావన్ రాథోడ్ ను కొందరు ముష్కరులు అతని మతం ఏమిటో అడిగి మరీ తెలుసుకొని పెట్రోలు పోసి తగుల బెట్టారు.. రోహిత్ వేముల వార్తను తొలి పేజీలో ప్రచురించిన పత్రికలు, సావన్ రాథోడ్ వార్తను లోపలి పేజీల్లోకి తోసేసాయి.. చనిపోయిన ఇద్దరూ కుర్రాళ్లే.. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఒకరు హత్యకు గురయ్యారు.. మరి రోహిత్ వేముల ఉదయంతాన్ని రాజకీయానికి వాడుకున్న రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అసదుద్దీన్ ఓవైసీ. సీతారామ్ ఏచూరి, జగన్ తదితర నాయకులు సావన్ రాథోడ్ ను ఎందుకు మరిచిపోయారు.. సావన్ మతానికి, కులానికి ఓటు బ్యాంకు లేకపోవడమే కారణమా?.. ప్రతి ఒకరూ రాజకీయ రాబందులను నిలదీయాల్సిన అవసరం ఉంది..

బోసు బాబుపై నెహ్రూ కుట్రకు ఆధారం ఇదిగో..


జవహర్ లాల్ నెహ్రూ మొదటి నుండి సుభాష్ చంద్రబోసుపై కుట్రపూరితంగా వ్యవహరించాడు అని ఈ పత్రం బయటపెడుతోంది.. దేశ విముక్తి కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిషర్లతో పోరాడుతున్న బోసు బాబుపై నెహ్రూ నాటి బ్రిటిష్ ప్రధానికి రాసిన లేఖ ఇది..

Saturday, January 23, 2016

నేతాజీ స్పూర్తిని నింపుకుందాం..

జననం తప్ప మరణం తెలియని వీరుడు.. సివల్ సర్వీసెస్ వదులుకొని దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని అంకితం చేశారు.. కాంగ్రెస్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.. గాంధీ నెహ్రూ ముఠా రాజకీయాలకు తాళలేక కాంగ్రెస్ పార్టీని వీడారు.. విదేశాలకు వెళ్లి ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించారు..  జై హింద్ అంటూ బానిస సంకెళ్ల నుండి భారత దేశాన్నివిముక్తి చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు.. దురదృష్టవశాత్తు ఆయన అదృశ్యం నేటికీ మిస్టరీగా మారింది.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు.. ఆ మహనీయున్ని స్మరించుకుందాం.. ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగుదాం. 

Friday, January 22, 2016

హెచ్ సీ యూ లో రాబందుల స్వైర విహారం

ఇంకా వస్తూనే ఉన్నారు.. ఎన్ని రోజులు ఈ శవ రాజకీయాలు?.. విద్యార్థుల మధ్య కుల, మత వైషమ్యాలు కొనసాగాలని కోరుకుంటున్నారా?.. వచ్చిన వారు మరింత రెచ్చగొట్టడం తప్ప, సామరస్య వాతావరణం ఏర్పడటానికి ప్రయత్నించడం లేదు ఎందుకు?.. మీ రాజకీయ పబ్బం కోసం విద్యార్థులు బలికావాల్సిందేనా?.. 
ఓ రాజకీయ అరాచక రాబందులారా చాలు ఇక నాటకాలు..

Thursday, January 21, 2016

ఇతర విద్యార్థులవి ప్రాణాలు కాదా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రయివేటు, కార్పోరేట్ కాలేజీల్లో నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నాయకులెవరూ అటువైపు చూడరు.. ఏ మీఢియా పెద్దగా వాటిని పట్టించుకోదు.. దాదాపు ప్రతి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. ఏదో తూతూ మంత్రంగా స్పందిస్తారు.. విద్యార్థులు సూసైడ్ నోట్లు చాలా క్లియర్ గా ఉన్నా పట్టించుకోరు.. యాజమాన్యాలు, పోలీసులు కుమ్మక్మై కేసులను తొక్కి పెడతారు.. ప్రభుత్వాలు కూడా చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తాయి..
మరి హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీలో జరుగుతున్నది ఏమిటి?.. వేముల రోహిత్ ఏ కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాడో తన సూసైడ్ నోట్లో సరిగ్గా చెప్పలేదు.. అతను ఏ కులస్తుడో స్పష్టత లేదు.. కానీ దళిత విద్యార్థి చనిపోయాడంటూ కులం రంగు పులిమారు.. మీడియా, కుల-ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టేశాయి..
అందరు విద్యార్థుల ఆత్మహత్యలను ఒకే కోణంలో ఎందుకు చూడరు.. హెచ్.సీ,యూ. విద్యార్థుల ప్రాణాలకు ఒక విలువ, మిగతా కాలేజీల విద్యార్థులకు మరో విలువ ఉంటుందా? రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, సీతారామ్ ఏచూరీ, జగన్ తదితరులు ఎందుకు శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఈ యూనివర్సిటీలో గతంలో ఓ విద్యార్థిపై దాడి చేసినప్పుడు వీళ్లంతా ఎక్కడ దాక్కున్నారు.. దెబ్బలు తిన్న ఏబీవీపీ విద్యార్థి దురదృష్టవశాత్తు మరణించి ఉంటే వీళ్లు ఇలాగే పరామర్శలు, నిరసన ప్రదర్శనలు చేసేవారా?
ముంబై మారణకారణకు కారకుడైన దేశద్రోహి మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపిన వారిని వ్యతిరేకించడం సుశీల్ కుమార్ తప్పా? అతనిపై దాడులు జరగడం ఒప్పా? యూనివర్సిటీల్లో జరుగుతున్న విద్రోహ రాజకీయాలను కేంద్ర మంత్రి దత్తాత్రేయ హెచ్.ఆర్.డీ.మంత్రికి ఫిర్యాదు చేయడం తప్పా? అందుకోసం ఆయనపై అట్రాసిటీ కేసు పెడతారా?

ప్రాణం విలువ ఎవరికైనా ఒకటే.. కులాన్ని, మతాన్ని బట్టి విలువ కట్టడం సమంజసం కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల విషయంలో కూడా దర్యాప్తు జరపండి..

Wednesday, January 20, 2016

రాజకీయ రాబందులతో జర భద్రం

శవాలు కనిపిస్తే రాబందులు వాలిపోతాయి.. పేలాలు ఏరుకునేందుకు, చితి మంటలతో చలి కాచుకునేందుకు అందరూ సిద్దమయ్యారు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే.. ఇక్కడ జరిగింది ఏమిటి? పరిస్థితిని చక్కదిద్దాలంటే చేపట్టాల్సిన చర్యలు ఏమిటి అనే బాధ్యత ఎవరికీ లేకుండా పోయింది.. వేముల రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆయన సూసైడ్ లెటర్లో పేర్కొన్న అంశాలు ఏమిటి? ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అనే అంశాలపై విచారణ జరగాల్సిందే.. విచారణలో అన్ని అంశాలు బటయకు వస్తాయి..
రాజకీయ నాయకులు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి కులాల కుంపట్లు రాజేస్తున్నారు.. సమాజంలో చీలికలకు తమ వంతు ఆజ్యం పోస్తున్నారు.. ఒక యూనివర్సిటీలో జరిగిన వ్యవహారాన్ని జాతీయ స్థాయి ఆందోళన స్థాయికి తీసుకెళ్లారు సరే.. మరి అక్కడ ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణాలపై ఆత్మ విమర్శ చేసుకున్నారా?.. విశ్వ విద్యాలయాలను క్షుద్ర రాజకీయాల కోసం వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నామని గ్రహించారా? ఇవాళ హెచ్.సీ.యూ.. రేపు మిగతా వర్సిటీలకు ఈ దుస్థితి రావాలనే మీ లక్ష్యమా?
ముంబై మారణ హోమంలో వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడైన కుట్రదారుల్లో ఒకరైన యాకుబ్ మెమన్ అనే దేశ ద్రోహిని ఉరి తీస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన జరగడం ఏమిటి?.. ఈ ప్రదర్శనకు, కులాల వ్యవహారలకు, బాబా సాహెబ్ ఆదర్శాలకు పొంతన ఉందా అసలు.. చినికి చినికి గాలి వానగా మారి తోటితో పోయేది గొడ్డలితో నరికినట్లయింది వ్యవహారం..

రోహిత్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటి?.. ప్రేరేపించింది ఎవరు?.. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా?.. ఇవన్నీ బయటకు రావాలి.. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనలు జరగకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆంక్షలు విధించాలి.. విద్యాలయాలు కుల, రాజకీయ ఆధిపత్య కేంద్రాలుగా మారకుండా చర్యలు తీసుకోవాలి.. 

Tuesday, January 19, 2016

విద్యాలయాల్లో విష బీజాలు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఎవరికైనా బాధ కలిగించేదే.. ఎన్నో ఆకాంక్షలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం యూనివర్సిటీలో చేరిన ఈ విద్యార్థి అర్ధనంతంతరంగా తనువు చాలించడానికి దారితీసిన పరిణాలమాలపై ఆలోచించాలి.. యూనివర్సిటీ అన్న తర్వాత విద్యార్థి సంఘాలు, వాటి ఆధిపత్య పోరు సహజం.. కానీ కొంత కాలంలో విద్యార్థి సంఘాల పేరిట జరుగుతున్న కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి..
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల రహిత, సమసమాజ నిర్మాణం కోసం కలలు కన్నారు.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను ప్రతిపాదించారు.. బాబాసాహెబ్ కలలుకన్న ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలైంది.. ఈ శిక్షకు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ASA ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన జరిగింది..
ఈ ప్రదర్శనను వ్యతిరేకిస్తూ ABVP నాయకుడు సుశీల్ కుమార్ ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టాడు.. ఇందుకు ఆగ్రహించిన కొందరు విద్యార్థులు అతనిపై దాడి చేశారు.. పోలీసులకు, యూనివర్సిరటీ అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ఈ అంశాన్ని అక్కడి విద్యార్థులు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు.. మంత్రిత్వ శాఖ హెచ్.సీ.యూ. వైస్ ఛాన్సలర్ ను ఈ ఘటనపై ఆరా తీసింది.. దీంతో ప్రదర్శనకు కారకులైన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు..
దురదృష్టవశాత్తు క్రమశిక్షణా చర్యలకు గురైన విద్యార్థుల్లో ఒకరైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఒక లేఖ కూడా రాశాడు.. యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై ఆయన ఎంతో వ్యధకు గురయ్యాడని ఆ లేఖ చెబుతోంది.. ఈ ఘటనల పరిణామక్రమంపై దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.. దీనిపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంది..

దేశంలోని ప్రధాన యూనివర్సిటీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. మహనీయుల పేర్లతో సంఘాలను ఏర్పాటు చేసుకొని జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సమంజసమేనా? వీరి వెనుక ఎవరున్నారు అనే అంశాలపై కూడా దర్యాప్తు జరగాలి.. 

Monday, January 18, 2016

రామారావు గారికి శ్రద్ధాంజలి

సౌమ్యులు, గురుతుల్యులు, మేధావి వి.రామారావు గారు ఇక లేరనే వార్త విచాకరం.. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన రామారావు గారు జనసంఘ్ (బీజేపీ) ద్వారా రాజకీయ జీవితాన్నిప్రారంభించారు.. హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుండి నాలుగు సార్లు శాసనమండలికి ఎన్నికైన అరుదైన ఘనత వీరిది.. శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనెట్ సభ్యునిగా సేవలు అందించారు.. రామారావు గారు సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా సని చేశారు..

రామారావు గారిని అనేక సందర్భాల్లో నేను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు.. పలు అంశాలపై అపారమైన పరిజ్ఞానం ఉన్న వారితో ఎంత సేపు మాట్లాడినా కాలం తెలియదు.. హోదాలు, వయసులతో సంబంధం లేకుండా అందరితో కలుపుకోరుగా ఉండే రామారావు రాజకీయాలు విలువలను ఆచరణలో చూపించారు.. వారికి నా శ్రద్ధాంజలి.. ఓం శాంతి..

Sunday, January 17, 2016

వీరిని ఏమందాం?

ఊస‌ర‌వెల్లి సైతం సిగ్గు ప‌డుతోంది రంగులు మార్చే ఈ నాయ‌కుల‌ను చూసి.. సిద్ధాంతాలు లేవు, విధేయ‌త‌లు లేవు.. నీతి, నిజాయితీల‌కు వీరి డిక్ష‌న‌రీలో అర్థం లేదు.. మంచి నీళ్లు తాగినంత ఈజీగా కండువాలు మార్చేస్తున్నారు.. వీరికి తెలిందల్లా అవ‌కాశ‌వాదం మాత్ర‌మే.. ప‌ద‌వుల కోసం ఎంత‌కైనా బ‌రి తెగిస్తారు..
ఒక పార్టీ అని కాదు.. అన్ని పార్టీల‌లో ఇదే తంతు.. అధికారంలో ఎవ‌రు ఉన్నాసిగ్గులేకుండా వారి చంక‌నాకుతారు.. ఎన్నిక‌ల ముందు పార్టీ మారి టికెట్ తెచ్చుకునే జంప్ జిలానీలు కొంద‌రు.. ఒక పార్టీ నుండి గెలిచాక విధేయ‌త‌కు నీళ్ల‌ర్పించి అధికార పార్టీలో ఫిరాయించే వారు మ‌రి కొంద‌రు.. న‌మ్మిన కార్య‌క‌ర్త‌ల‌కు, ఓట‌ర్ల‌కు నిర్ల‌జ్జ‌గా వెన్నుపోటు పొడుస్తారు..
ఈ ధోర‌ణి కొత్త‌గా వ‌చ్చిందేమీ కాదు.. గ‌తంలో జ‌రిగిందే, ఇప్పుడూ కొన‌సాగుతోంది.. బెల్లం చుట్టూ ఈగ‌లు మూగ‌డం స‌హ‌జం.. అభివృద్ది కోస‌మే అధికార పార్టీలో ఫిరాయించామ‌ని సిగ్గు లేకుండా ఇకిలిస్తారు.. వీరు కోరుకునేది ప్ర‌జ‌ల అభివృద్ధా? త‌మ ఖ‌జానా వృద్ధా?..
తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వద్దాం.. మా ప్రాంతంలో ఓ స్థానిక నాయ‌కుడు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతూ భారీగా పోస్ట‌ర్లు అతికించాడు.. సంక్రాంతి శుభాకాంక్ష‌లు కూడా చెబుతూ ఇదే ప‌ని చేశాడు.. తేడా ఏమిటంటే అత‌ని మెడ‌లో కండువా మారింది.. పోస్ట‌ర్ రంగు కూడా మారిపోయింది.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈ వ్య‌క్తి, పార్టీ ఫిరాయించి త‌న భార్య‌కు టికెట్ తెచ్చుకున్నాడు.. నాకు తెలిసిన మ‌రో నాయ‌కుడు గ‌తంలో ఓ పార్టీ టికెట్‌పై కౌన్సిల‌ర్‌గా గెలిచాడు.. జీహెచ్ఎంసీ ఏర్ప‌డ్డాక మ‌రో పార్టీలో చేరి ఆ టికెట్‌పై కార్పోరేట‌ర్‌గా విజ‌యం సాధించాడు.. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పి ఇంకో పార్టీలోకి ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నాడు..

ఈ నాయ‌కుల‌ను ఏమ‌నాలి?.. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు.. ఊసరవెల్లి ప్రకృతి ధర్మంలో భాగంగా తన మనుడగ కోసం రంగులు మారుస్తుంది.. మరి వీరు.. క‌డుపు నింపుకోవ‌డం కోసం బజారున ప‌డే వారిపై జాలి ప‌డొచ్చు.. కానీ అన్నీ ఉండి బ‌రి తెగించేవారిని ఏమ‌నాలి?  ఇలాంటి వారికి ఓట‌ర్లే త‌గిన బుద్ది చెప్పాలి..

Saturday, January 16, 2016

పండుగలకు రంగులేల?

సంక్రాంతి మనది కాదు ఆంధ్రోళ్ల పండుగ.. మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడో తెలంగాణాయన.. పొంగల్ కాదు సంక్రాంతి అనండి అని హుకుం జారీ చేశాడో తెలుగోడు..
సంక్రాంతి పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం.. దేశ విదేశాల్లో భారతీయులంతా సంక్రాంతి, పొంగల్, మకర సంక్రమణ, మాఘె సంక్రాంతి, ఉజవర్ తిరునల్, ఉత్తరాయణ్, మాఘి, శిశుర్ సైన్క్రాత్ తదితర పేర్లతో ఈ పండుగ జరుపుకుంటారు.. పేర్లు, సాంప్రదాయాలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ పండుగ..
మన తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం.. ఈ వేడుకల్లో స్థానిక ఆచార వ్యవహారాల ప్రకారం కాస్త భిన్నత్వం కనిపిస్తుంది.. కోస్తాంధ్రలో పాడి పంటలు విస్తారంగా ఉన్న కారణంగా కాస్త జోరెక్కువ.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, రాయలసీమలో కూడా సంక్రాంతి జరుపుకుంటాం.. మరి ఈ పండుగ ఆంధ్రావాళ్లకే ప్రత్యేకం ఎప్పుడైందో? సంక్రాంతి ఆంధ్రా పండుగ అయితే తెలంగాణ పత్రికలకు ఆ రోజున సెలవు ఎందుకు ఇచ్చినట్లో?..
తమిళనాడులో తెలుగు భాషను అణచివేస్తున్నందున పొంగల్ వద్దు సంక్రాంతి అని పిలుద్దాం అంటారు కొందరు కొత్త భాషా ప్రేమికులు.. ఇంత కాలంగా సంక్రాంతిని ఇంగ్లీషులో పొంగల్ అంటారనే భ్రమలో హ్యాపీ పొంగల్ అని చెప్పుకున్న వారికి, అది తమిళ్ పండుగ అని తెలిసి వచ్చినందుకు సంతోషం.. కానీ మనం తెలుగు భాష సంరక్షణకు సరైన ప్రాధాన్యం ఇస్తున్నామా అనే ఆత్మ విమర్శ ఎందుకు చేసుకోము? భాషా సంస్కృతుల సంరక్షణ విషయంలో తమిళులను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు?

పండుగలకు ప్రాంతీయ రంగులద్దుకుంటూ పోతే భిన్నత్వంలో ఏకత్వ భావనకు, దేశ సమైక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది.. ఇలాంటి కుట్రలను మనమంతా వ్యతిరేకిద్దాం..

Friday, January 15, 2016

సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు తేవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

Thursday, January 14, 2016

జంతు ప్రేమికులారా ఎందకీ ద్వంద్వ వైఖరి?

జంతు ప్రేమికులమంటూ ఆర్భాటాలు చేసే వారు ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారు?.. కొన్ని మతాల వారి సాంప్రదాయాలపై మాత్రమే వారు ఎందుకు గురి పెడుతున్నారు? తమిళనాడులో పొంగల్ పర్వదినం సందర్భంగా నిర్వహించే జల్లి కట్టు వేడుకలను పని గట్టుకొని నిషేధింపజేశారు.. కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేస్తే ఈ సోకాల్డ్ జంతు ప్రేమికులు సుప్రీం కోర్టు గడప ఎక్కి స్టే తెచ్చారు.. ఈ అత్యుత్సాహపరులకు విచ్చలవిడిగా సాగుతున్న గోహత్య, ఇతర జంతువుల వధ కనిపించదా.. దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించే విషయంలో వీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు.. ఇంతకీ ఈ సోకాల్డ్ గాళ్లు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు?

భోగి మంటలు.. భోగ భాగ్యాలు..


సంక్రాంతి ముందు రోజు వచ్చేదే భోగి పండుగ.. భోగి పండుగ తెల్లవారు ఝామునే మంటలు వేస్తారు.. అసలు భోగి మంటలు ఎందుకు వేయాలి? భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం తప్పు కదా?
సంక్రాంతి ముందు రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి రావడాన్ని స్వాగతిస్తూ భోగి జరుపుకుంటారు.. దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి ఇస్తూ ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ వేస్తారు భోగి మంటలు.. ‘భగ’ అనే పదం నుండి ‘భోగి’ అనే మాట పుట్టిందని చెబుతారు.. పంట కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్థాలను మంటల్లో వేయాలి సంక్రాంతి రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది.. చలిని వదిలించుకొని, చైతన్యం తెచ్చుకోవడానికి భోగి మంటలు వేయడం ఆచారంగా వచ్చింది..
భోగి మంటల్లో ఒకప్పుడు తాటాకులు, పాత సామాను, కర్రలు వేసేవారు.. కానీ ఇప్పుడు టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులు సైతం వేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు.. పర్యావరణానికి చాలా చేటు చేస్తోంది.. ఆవు పేడతో చేసిన పిడకలు, మామిడి, రావి, మేడి కర్రలను ఇతర ఔషధ మొక్కలను భోగి మంటల్లో వేస్తే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు.. పైగా ఈ మంటలతో వచ్చే వాయువులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.. అందరికీ భోగి శుభాకాంక్షలు..

Tuesday, January 12, 2016

భారత దేశాన్ని మేల్కొల్పిన ఆధ్యాత్మిక గురువు

భారత దేశం అంటే పాములు, కోతులు ఆడించే దేశం.. పాశ్యాత్యుల దృష్టిలో ఆంగ్లేయులు సృష్టించిన దురభిప్రాయం ఇది.. ఒకనాడు ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన భారతదేశం, గత చరిత్రను మరచి బానిసత్వ పాలనలో మగ్గుతున్న రోజులు విని.. ఇలాంటి సమయంలో చికాగోలో వినిపించింది వివేక వాణి..
హిందూమత ఔన్నత్యాన్ని, భారత దేశ సాంస్కృతిక-చారిత్రిక వారసత్వం, వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారు స్వామి వివేకానంద.. నిద్రిస్తున్న భారత జాతిని మేల్కొల్పారు.. దేశ యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారు స్వామీజీ.. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాలే.. కానీ భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు వివేకానంద.. స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండిమేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండిఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి.. లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం,బలహీనతే మరణం.. ఇనుప కండరాలుఉక్కు నరాలువజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి.. 
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులుజవ సంపన్నులుఆత్మ విశ్వాసులరుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలుఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు..
మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలంశక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
తమ సర్వస్వాన్ని త్యాగం చేసిదేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగంఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తిఆపై శక్తి మనకే ఉంది..

(నేడు స్వామి వివేకానంద జయంతి)

Monday, January 11, 2016

శాస్త్రీజీ మరి కొంత కాలం ఉంటే..

ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో భాద్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఆయన పని చేసింది తక్కువ కాలమే అయినా పాకిస్తాన్ తో యుద్దంలో విజయం, హరిత విప్లవం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.. నీతి, నిజాయితీ, పారదర్శక వ్యక్తిత్వంతో అందరి మన్నలను అందుకున్నారు..
లాల్ బహద్దూర్ శాస్త్రి తాష్కెంట్ లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో సమావేశమై, ఒప్పందంపై సంతకం చేసిన రాత్రే అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు.. ఈ ఘటనపై ఆనాడు సరైన విచారణ జరగకపోవడం అనేక సందేహాలకు తావిచ్చింది..
శాస్త్రీజీ మరి కొంత కాలం ప్రధాన మంత్రిగా కొనసాగి ఉంటే మన దేశ రాజకీయాలు మరో విధంగా ఉండేవి.. ముఖ్యంగా సోకాల్డ్ గాంధీ నెహ్రూ వంశ పారంపర్య పాలన వచ్చేది కాదు.. లాల్ బహద్దూర్ శాస్త్రి క్యాబినెట్లో నెహ్రూ తనయ ఇందిరాగాంధీ సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.. ఆమెకు మరింత మంచి పోర్ట్ ఫోలియో ఇచ్చే వారేమో.. ఇందిర పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పైలట్ గా పని చేసి రిటైర్ అయ్యేవారు.. ఫోటోగ్రఫీపై మంచి పట్టున్న రాజీవ్ మంచి ఛాయా చిత్రాలను సృష్టించేవారు.. దుందుడుకు స్వభావం గల ఇందిర మరో తనయుడు సంజయ్ గాంధీ విఫల పారిశ్రామికవేత్తగా మిగిలి, రాజకీయాల్లోకి వచ్చేవారేమో..

శాస్త్రీజీ అకాల మరణం తర్వాత ప్రధాని పదవికి కాంగ్రెస్ అగ్రనాయకులంతా ప్రయత్నించారు.. రాజీ మార్గంగా విధిలేని పరిస్థితుల్లో ఇందిరా గాంధీకి ఈ పదవి ఇచ్చారు.. కానీ ఆమె వారందరికీ ఏకు మేకై కూర్చున్నారు.. పార్టీని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని, తన తనయులను కూడా రాజకీయాల్లోకి తెచ్చి వంశ పారంపర్య పాలనకు పునాదులు వేశారు.. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.. (రామచంద్ర గుహ గతానునగతం ఆధారంగా)

ఈ నినాదం ఉన్నంత వరకూ గుర్తుండిపోతారు..

జై జవాన్.. జై కిసాన్.. ఈ నినాదం వినగానే మహోన్నత వ్యక్తి గుర్తుకు వస్తారు.. లాల్ బహద్దూర్ శాస్త్రి.. భారత ప్రధానిగా పని చేసింది ఏడాదిన్నర కాలమే అయినా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు శాస్త్రీజీ..
చైనా చేతిలో మన దేశం ఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణించారు.. తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా తర్వాత పూర్తి సమయ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఇంతలో పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. మన సైన్యం ఆ దేశాన్ని చిత్తుగా ఓడించింది..
నెహ్రూ పారిశ్రామికీకరణ పేరుతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో దేశంలో ఆహారధాన్యాలకు తీవ్ర కరువు వచ్చి పడింది.. ఈ దశలో హరిత విప్లవానికి నాంది పలికారు శాస్త్రీజీ.. ఈ సమయంలోనే పుట్టకు వచ్చింది జై జవాన్.. జై కిసాన్.. నినాదం. ఆసేతు హిమాచలం ఈ నినాదం మార్మోగింది..
దురదృష్టవశాత్తు హరిత విప్లవ ఫలితాలు చూడక ముందే శాస్త్రీజీ మనకు దూరమయ్యారు.. తాష్కెంట్ లో భారత్, పాకిస్తాన్ల మధ్య చర్చల అనంతరం అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు లాల్ బహద్దూర్ శాస్త్రి..

నీతి, నిజాయితీ, నిరాడంబరతకు ప్రతి రూపమైన శాస్త్రీజీ వర్ధంతి నేడు..(11 జనవరి 1966) ఆ మహనీయున్ని తలచుకోవడం మన విధి..

సైన్యం కూడా విసిగిపోయిందా?

2012 భారత సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించిందని అప్పటి కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఇప్పుడు చెబుతున్నాడు.. భారత సైన్యం ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గపు పనులు చేయదు.. ఒక వేళ ఈ వార్త నిజమే అయినా ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?.. ఆనాటి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంపై సైన్యం కూడా విసిగిపోయిందని తివారీయే స్వయంగా ఒప్పకున్నట్లే కదా..

Saturday, January 9, 2016

సెక్యులర్ యోగా అట..

ఏమిటి కామ్రేడ్ ఇది?.. మీరు యోగా చేయడం ఏమిటి?.. యోగా గురుంచి మీరు అన్నది ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్న పనేంటి?
ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినప్పుడు కుక్కలు కూడా ఈ విన్యాసాలు చేస్తాయని ఈసడించారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. దీన్ని హిందుత్వ ఎజెండాగా అభివర్ణించారాయన.. మరి ఇప్పుడు కేరళలో ఆయన పార్టీ చేస్తున్నది ఏమిటో సెలవివ్వాలి ఏచూరి వారు..

కేరళలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన వామపక్షులు, దీన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు.. సెక్యులర్ యోగా పేరుతో వింత విన్యాసాలు మొదలు పెట్టారు.. ఇందుకు కారణం కేరళలో అసెంబ్లీ ఎన్నికలే.. 

Thursday, January 7, 2016

మేతావుల మూగ నోము..

ఎక్క‌డో ఏదో జ‌రిగింద‌ని అవార్డులు వాప‌స్ చేసిన మేతావులారా ఎక్క‌డ దాక్కున్నారు?.. మీ నోళ్లు మూగ‌బోయాయా?.. మీ క‌లాల్లో ఇంకు అయిపోయిందా?.. 
ప‌ఠాన్ కోట్ లో తీవ్ర‌వాదుల‌పై వీరోచితంగా పోరాడి అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళ్ల‌ర్పించేందుకు మ‌న‌సొప్ప‌డం లేదా?.. వీరికి జోహార్ల‌ర్పిస్తే మీ సిక్యుల‌ర్ ప్రాతివ‌త్యానికి భ‌గం క‌లుగుతుంద‌నే భ‌య‌మా?
అవునులే అన్నీ వాప‌స్ ఇచ్చేశారు.. ఇంకేమున్నాయని మీ ద‌గ్గ‌ర?.. న‌డి బ‌జారులో న‌గ్న‌ప్ర‌ద‌ర్శ‌న త‌ప్ప‌..

Wednesday, January 6, 2016

సరి బేసి కష్టాలు

పూర్వం ఢిల్లీ పాలకుడు తుగ్లక్ అస్థవ్యస్థ విధానాలతో ప్రజలను అగచాట్లకు గురి చేశాడు.. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి తరలించాడు.. అక్కడ ఇబ్బంది అవుతోందని మళ్లీ ఢిల్లీకి మార్చాడు.. ఈ రెండు ప్రయాణ సమయాల్లో పలువురు ప్రభుత్వ సిబ్బంది  దారిలోనే వ్యయ ప్రయాసల కారణంగా ప్రాణాలు విడిచారు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.. ఇలాంటి విధానాలతో అతడు చరిత్రలో పిచ్చి తుగ్లక్ అనే పేరు తెచ్చుకున్నారు..
ట్రాఫిక్, కాలుష్యం భారతీయ నగరాలకు ఇబ్బందికరంగా మారింది.. దేశ రాజధాని ఢిల్లీలో ఇది మరీ తీవ్రంగా ఉంది.. కాలుష్య కారక వాహనాల నియంత్రణ, రోడ్లు, ప్రజా రవాణా విస్తరణ ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు.. ఇవన్నీ వదిలేసి సరి-బేసి వాహనాల విధానాన్ని ఎంచుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం.. జనవరి ఒకటో తేదీ నుండి ఇది అమల్లోకి రావడంతో ప్రజలకు నరకం ప్రారంభమైంది.. ఆఫీసులకు, దైనందిన విధులకు వెళ్లే ప్రజలకు రోజు విడిచి రోజు వాహనాలు దొరకడం కష్టమైపోయింది.. మెట్రోరైళ్లు, బస్సులు తగినన్ని లేవు..
మరోవైపు కేజ్రీవాల్, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు పబ్లిసిటీ జిమ్మిక్కులు చేస్తున్నారు.. ఒకవైపు సైకిళ్లు, వాహనాల షేరింగ్ అంటూ మీడియాకు ఫోజులు ఇస్తూనే తమ సౌకర్యం కోసం అధనపు వాహనాలకు రహస్యంగా కొనుగోలు చేశారు..

కేజ్రీ ప్రభుత్వ సరి బేసి విధానంపై జోకులు పేలుతున్నాయి.. సరి నెంబర్ కారుగల వరుడికి బేసి నెంబర్ కారు గల వధువు కావాలట.. ఇంటిలో ఇద్దరి వాహనాలు బేసి నెంబర్ కావడంతో ఓ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుందట.. సరి నెంబర్ రోజు నాడు కడుపు నొప్పి వచ్చిన ఓ వ్యక్తి డాక్టర్ దగ్గరకు బయలు దేరగా, పోలీసులు ఆయన సరి నెంబర్ వాహనాన్ని సీజ్ చేశారట..   దేవుడా మా హైదరాబాద్ సిటీకి ఈ కష్టాలు రాకూడదు..

Tuesday, January 5, 2016

దేశ భద్రతపై కాంగ్రెస్ విచిత్ర వైఖరి

ప్రపంచాన్ని కుదిపేస్తున్నసమస్య ఉగ్రవాదం.. భారత దేశానికి అతిపెద్ద ముప్పు ఇది.. ఉగ్రవాదుల దుశ్చర్యతో అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయి.. మన దేశ అస్థిత్వాన్ని సవాలు చేస్తున్నఉగ్రవాదంపై పోరు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం ఏకతాటిపై నిలవాల్సిన సమయం ఇది.. ఇలాంటి వేళ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే కాంగ్రెస్ పార్టీ, మరోసారి తన నీఛ వైఖరిని చాటుకుంటోంది..
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల దాడిని తిప్పి కొట్టడం కోసం జరిగిన పోరులో 7గురు జవానులు అమరులయ్యారు.. వారి త్యాగాలకు దేశ ప్రజలు జోహార్లరిపిస్తున్నారు.. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కామెంట్లు వారి మనస్థత్వానికి అద్దం పడుతున్నాయి.. 
కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వంపై కోపం ఉంటే ఉండొచ్చు కానీ దేశ నిఘా, రక్షణ విభాగాలను నైతిక సామర్ధ్యాన్ని అగౌరవ పరిచే హక్కు ఎవరు ఇచ్చారు? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే ఈ రోజున ఉగ్రవాదం  వెర్రి తలలు వేస్తోంది.. మెజారిటీ ప్రజలను మనోభావాలతో ఆడుకున్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పరాజయాన్ని మూట కట్టుకుంది.. ఈ విషయాన్ని ఆంటోనీ, దిగ్విజయ్, చిదంబరం లాంటి నాయకులే ఒప్పుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకోకుండా దేశ ప్రజలచే మరోసారి ఛీ కొట్టించుకుంటోంది..
గత ఏడాది అరేబియా సముద్ర తీరంలో పోరుబందర్ రేవు సమీపంలో పాకిస్తానీ బోటు పేల్చివేత విషయంలోనూ ఆ పార్టీ ఇలాగే నీచంగా మాట్లాడింది.. ఆ బోటుతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ వాదించగా, వారికి వంత పాడే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు ఇచ్చారు..
ముంబై 26/11 మారణ కాండ సంఘటనలో పాకిస్తానీ పౌరుడు కసబ్ పట్టుబడిన తర్వాత, విచారణలో ఆ దేశ ప్రమేయం స్పష్టంగా బయటపడింది. ఆ ఘటన తర్వాత సోనియా, రాహుల్ సమక్షంలో నాటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కాషాయ ఉగ్రవాదం అంటూ అవాకులు చెవాకులు పేలి నాలిక కరచుకున్న సంగతి తెలిసిందే.. కసబ్ తో పాటు, పార్లమెంట్ పై దాడి కేసు నేరగాడు అఫ్జల్ గురులకు ఉరిశిక్ష పడినా చాలా కాలం పాటు శిక్షను అమలు చేయకుండా ఇంటి అల్లుళ్లలా చూసుకున్న ఘనతను మూట గట్టుకుంది కాంగ్రెస్.. చివరకు విమర్షలకు జడిసి శిక్ష అమలు చేయక తప్పలేదు.. ఢిల్లీ బాట్లా హౌస్ దాడి ఘటనలో ఉగ్రవాదులు మరణిస్తే సోనియా గాంధీ కన్నీరు కార్చారని స్వయంగా ఆ పార్టీ నేత సాల్మాన్ ఖుర్షీదే వెల్లడించారు.
పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.. ఇందుకు అన్ని రకాల ఎత్తుగడలు అవలంభిస్తోంది.. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవకున్నా, వెన్నపోటు పొడిచే ప్రయత్నాలు చేయకుంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇంతకు మించి ఆశించలేం కదా..

Monday, January 4, 2016

పాకిస్తాన్ దుష్టబుద్ది..

పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం, ప్రభుత్వం మేడి పండు లాంటివని మరోసారి స్పష్టమైపోయింది.. అక్కడ ప్రధానమంత్రి పదవి కేవలం అలంకార ప్రాయం.. పాకిస్తాన్ను నియంత్రించేది సైన్యం, ఐఎస్ఐ మాత్రమే.. తమ దేశ పాలకులు భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు.. ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ సాగినప్పుడల్లా సైన్యం, ఐఎస్ఐ బరితెగించి సామరస్య వాతావరణాన్ని చెడగొడతాయి.. పఠాన్ కోట్ ఘటన ఇందుకు తాజా ఉదాహరణ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్లో ఆకస్మిక పర్యటన జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఇంతలో పాకిస్తాన్ నుండి ఉగ్రవాద మూకలు సరిహద్దులోని భారత వైమానిక స్థావరంపై దాడికి తెగించడం ద్వారా ఉనికిని చాటుకున్నారు.. 
భారత్తో వేయేళ్ల యుద్దానికైనా తాము సిద్దమని పాకిస్తాన్ సైనిక పాలకులు గతంలోనే ప్రకటించారు.. భారత్పై నిరంతర విషయం కక్కడంలోనే ఆ దేశ సైన్యం. ఐఎస్ఐల మనుగడ ఆధారపడి ఉంది.. 
ఉగ్రవాదం, కాశ్మీర్ అంశాలపై ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మారుతోంది.. ఈ దశలో పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో ఓ వైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు ఆ దేశ సైన్యం నడ్డి విరిచే విషయంలో భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన సామరస్యాన్ని వారు అసమర్ధతగా భావించి మరింత రెచ్చిపోతూనే ఉంటారు.. మన విదేశాంగ విధానానికి అసలు సవాల్ ఇదే..

Sunday, January 3, 2016

అవును నిరంతర విద్యుత్తే..

నిరంతర విద్యుత్తు - తెలంగాణ యావత్తు అనే నినాదం చూసి ఏమో అనుకున్నా.. నిజమే కరెంటు ఎక్కువైందేమో గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పోరేషన్ వారు పట్ట పగలు కూడా వీధి దీపాలు వెలిగిస్తున్నారు..
(ఖైరాతాబాద్ జంక్షన్ లో తీసిన ఫోటో)

Saturday, January 2, 2016

పుల్లారెడ్డి క్యాలండర్.. మధుర సాంప్రదాయం

ఇదొక క్యాలండర్ కథ మాత్రమే కాదు.. కొనసాగుతున్న తీయని సాంప్రదాయం..
సంవత్సరం మారగానే మా ఇంట్లో గోడపై క్యాలండర్ మార్చేస్తాం.. కానీ దానిపై కనిపించే పేరు మాత్రం మారదు.. జి.పుల్లారెడ్డి.. నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను మా నాన్నగారు తెచ్చే ఈ మిఠాయిలను, క్యాలండర్ని..
పుల్లారెడ్డి గారి పేరు వినగానే స్వీట్లతో పాటు మహోన్నత వ్యక్తిత్వం కళ్ల ముందు కదలాడుతుంది.. నీతి నిజాయితీలను పాటించిన నేతి మిఠాయిల వ్యాపారిగా, ధార్మిక నాయకునిగా, సామాజిక కార్యకర్తగా, విద్యాసంస్థల వ్యవస్థాపకునిగా ప్రసిద్ధులు గుణంపల్లి పుల్లారెడ్డి..
ఈ రోజున మనకు ఎన్నో నేతి మిఠాయిల షాపులు కనిపిస్తున్నాయి.. వారూ ఇలాంటి క్యాలండర్లే ఇస్తున్నారు.. కానీ అందరికీ మార్గదర్శకుడు ఒక్కడే.. జి.పుల్లారెడ్డి.. ఈ క్యాలండర్లోని ప్రతి పేజీలో దిగువన ఉండే సూక్తులను చూశారా.. ఆయన వ్యక్తిత్వానికి అవే కొలమానాలు..
కృషియే సర్వోత్కృష్ట ధ్యానము అని నమ్మిన ఇలాంటి మహావ్యక్తిని పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా కలవడం నా అదృష్టం.. వారి మిఠాయిలే కాదు వాత్సల్యాన్నీ రుచి చూశాను.. జి.పుల్లారెడ్డి గారు నేడు భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు.. కానీ ఆయనను క్యాలెండర్ రూపంలో ప్రతి రోజూ చూస్తున్నాను.. గుర్తు చేసుకుంటున్నాను..

Friday, January 1, 2016

పెరిగిన పార్లమెంట్ క్యాంటీన్ రేట్లు..

ఎంపీ: అన్యాయం.. అక్రమం.. మోదీ డౌన్ డౌన్..
విలేఖరి: ఏమైంది సార్?
ఎంపీ: ఏం తినేట్టు లేదు.. ఏం కొనేట్లు లేదు..
విలేఖరి: ఇంతకీ విషయం ఏమిటి సార్?..
ఎంపీ: ధరలు ఇంతలా పెంచేస్తారా?
విలేఖరి: ధరలు ఎప్పుడూ పెరగలేదు గనుక?.. మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి..
ఎంపీ: మొన్న గ్యాస్ సబ్సిడీ వదులుకోమన్నాడు.. ఇవాళ నోటికాడి తిండికే ఎసరు పెట్టాడు..
విలేఖరి: అవునా ఎలా?
ఎంపీ: పార్లమెంట్ క్యాంటీన్ రేట్లు పెంచుతాడా? ఎంత అన్యాయం..
విలేఖరి: ఓ.. అదా మీ బాధ.. ఇంత కాలం దేశ ప్రజల పన్నుల సొమ్ము తిన్నది చాలదా?..
జనవరి ఒకటో తేదీ నుండి పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీపై అందిస్తున్న ఆహార పదార్ధాలకు కోత పడింది.. ఇకపై ఎంపీలంతా వాస్తవంగా తయారయ్యే ధరకే ఆహార పదార్ధాలు కొనుకోలు చేసి తినక తప్పదు.. నిన్నటి దాకా ₹18కి దొరికిన శాఖాహార భోజనం ఇకపై ₹30.. మాంసాహార భోజనం ₹33 నుండి ₹60కి పెరిగింది.. కోడి మాంసం కూర ₹29 నుండి ₹40కి పెంచేశారు.. గత ఐదేళ్లుగా పార్లమెంట్ సభ్యుల తిండి కోసం ప్రభుత్వం ₹69.7 కోట్ల సబ్సిడీ భరించిందట.. మున్ముందు పార్లమెంట్ క్యాంటీన్ సబ్సిడీని మరింత ఎత్తేస్తారట..

తేదీ మారితే హడావుడి ఎందుకు?

2016 ఆగమనం అంటే నా దృష్టిలో క్యాలండర్ మార్పు మాత్రమే.. క్యాలండర్ మారినందుకు సంబరాలు అవసరమా?..  న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరుతో సొమ్ము చేసుకునేది ఎవరంటే.. పత్రికలు, టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్-ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బేకరీలు, స్వీట్ షాపులు, క్లబ్బులు, బార్లు, వైన్ షాపులు, రెస్టారెంట్లు తదితరాలు.. మనలాంటి సామాన్యులకు మాత్రం ఈ సెలబ్రేషన్ జేబుకు చిల్లు మాత్రమే..  రీజన్ ఏదైతేనేం సెలబ్రేట్ చేసుకోడానికి అంటారా?.. అయితే మీ డబ్బును ఇలా విందులు, వినోదాలకు తగలబెట్టే బదులు సామాజిక సేవకు ఉపయోగించండి.. అందువల్ల మీకు పుణ్యం పురుషార్థం కూడా..