Monday, January 11, 2016

శాస్త్రీజీ మరి కొంత కాలం ఉంటే..

ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో భాద్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఆయన పని చేసింది తక్కువ కాలమే అయినా పాకిస్తాన్ తో యుద్దంలో విజయం, హరిత విప్లవం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.. నీతి, నిజాయితీ, పారదర్శక వ్యక్తిత్వంతో అందరి మన్నలను అందుకున్నారు..
లాల్ బహద్దూర్ శాస్త్రి తాష్కెంట్ లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో సమావేశమై, ఒప్పందంపై సంతకం చేసిన రాత్రే అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు.. ఈ ఘటనపై ఆనాడు సరైన విచారణ జరగకపోవడం అనేక సందేహాలకు తావిచ్చింది..
శాస్త్రీజీ మరి కొంత కాలం ప్రధాన మంత్రిగా కొనసాగి ఉంటే మన దేశ రాజకీయాలు మరో విధంగా ఉండేవి.. ముఖ్యంగా సోకాల్డ్ గాంధీ నెహ్రూ వంశ పారంపర్య పాలన వచ్చేది కాదు.. లాల్ బహద్దూర్ శాస్త్రి క్యాబినెట్లో నెహ్రూ తనయ ఇందిరాగాంధీ సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.. ఆమెకు మరింత మంచి పోర్ట్ ఫోలియో ఇచ్చే వారేమో.. ఇందిర పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పైలట్ గా పని చేసి రిటైర్ అయ్యేవారు.. ఫోటోగ్రఫీపై మంచి పట్టున్న రాజీవ్ మంచి ఛాయా చిత్రాలను సృష్టించేవారు.. దుందుడుకు స్వభావం గల ఇందిర మరో తనయుడు సంజయ్ గాంధీ విఫల పారిశ్రామికవేత్తగా మిగిలి, రాజకీయాల్లోకి వచ్చేవారేమో..

శాస్త్రీజీ అకాల మరణం తర్వాత ప్రధాని పదవికి కాంగ్రెస్ అగ్రనాయకులంతా ప్రయత్నించారు.. రాజీ మార్గంగా విధిలేని పరిస్థితుల్లో ఇందిరా గాంధీకి ఈ పదవి ఇచ్చారు.. కానీ ఆమె వారందరికీ ఏకు మేకై కూర్చున్నారు.. పార్టీని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని, తన తనయులను కూడా రాజకీయాల్లోకి తెచ్చి వంశ పారంపర్య పాలనకు పునాదులు వేశారు.. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.. (రామచంద్ర గుహ గతానునగతం ఆధారంగా)

No comments:

Post a Comment