Saturday, January 16, 2016

పండుగలకు రంగులేల?

సంక్రాంతి మనది కాదు ఆంధ్రోళ్ల పండుగ.. మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడో తెలంగాణాయన.. పొంగల్ కాదు సంక్రాంతి అనండి అని హుకుం జారీ చేశాడో తెలుగోడు..
సంక్రాంతి పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం.. దేశ విదేశాల్లో భారతీయులంతా సంక్రాంతి, పొంగల్, మకర సంక్రమణ, మాఘె సంక్రాంతి, ఉజవర్ తిరునల్, ఉత్తరాయణ్, మాఘి, శిశుర్ సైన్క్రాత్ తదితర పేర్లతో ఈ పండుగ జరుపుకుంటారు.. పేర్లు, సాంప్రదాయాలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ పండుగ..
మన తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం.. ఈ వేడుకల్లో స్థానిక ఆచార వ్యవహారాల ప్రకారం కాస్త భిన్నత్వం కనిపిస్తుంది.. కోస్తాంధ్రలో పాడి పంటలు విస్తారంగా ఉన్న కారణంగా కాస్త జోరెక్కువ.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, రాయలసీమలో కూడా సంక్రాంతి జరుపుకుంటాం.. మరి ఈ పండుగ ఆంధ్రావాళ్లకే ప్రత్యేకం ఎప్పుడైందో? సంక్రాంతి ఆంధ్రా పండుగ అయితే తెలంగాణ పత్రికలకు ఆ రోజున సెలవు ఎందుకు ఇచ్చినట్లో?..
తమిళనాడులో తెలుగు భాషను అణచివేస్తున్నందున పొంగల్ వద్దు సంక్రాంతి అని పిలుద్దాం అంటారు కొందరు కొత్త భాషా ప్రేమికులు.. ఇంత కాలంగా సంక్రాంతిని ఇంగ్లీషులో పొంగల్ అంటారనే భ్రమలో హ్యాపీ పొంగల్ అని చెప్పుకున్న వారికి, అది తమిళ్ పండుగ అని తెలిసి వచ్చినందుకు సంతోషం.. కానీ మనం తెలుగు భాష సంరక్షణకు సరైన ప్రాధాన్యం ఇస్తున్నామా అనే ఆత్మ విమర్శ ఎందుకు చేసుకోము? భాషా సంస్కృతుల సంరక్షణ విషయంలో తమిళులను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు?

పండుగలకు ప్రాంతీయ రంగులద్దుకుంటూ పోతే భిన్నత్వంలో ఏకత్వ భావనకు, దేశ సమైక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది.. ఇలాంటి కుట్రలను మనమంతా వ్యతిరేకిద్దాం..

No comments:

Post a Comment