Wednesday, January 20, 2016

రాజకీయ రాబందులతో జర భద్రం

శవాలు కనిపిస్తే రాబందులు వాలిపోతాయి.. పేలాలు ఏరుకునేందుకు, చితి మంటలతో చలి కాచుకునేందుకు అందరూ సిద్దమయ్యారు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే.. ఇక్కడ జరిగింది ఏమిటి? పరిస్థితిని చక్కదిద్దాలంటే చేపట్టాల్సిన చర్యలు ఏమిటి అనే బాధ్యత ఎవరికీ లేకుండా పోయింది.. వేముల రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆయన సూసైడ్ లెటర్లో పేర్కొన్న అంశాలు ఏమిటి? ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అనే అంశాలపై విచారణ జరగాల్సిందే.. విచారణలో అన్ని అంశాలు బటయకు వస్తాయి..
రాజకీయ నాయకులు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి కులాల కుంపట్లు రాజేస్తున్నారు.. సమాజంలో చీలికలకు తమ వంతు ఆజ్యం పోస్తున్నారు.. ఒక యూనివర్సిటీలో జరిగిన వ్యవహారాన్ని జాతీయ స్థాయి ఆందోళన స్థాయికి తీసుకెళ్లారు సరే.. మరి అక్కడ ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణాలపై ఆత్మ విమర్శ చేసుకున్నారా?.. విశ్వ విద్యాలయాలను క్షుద్ర రాజకీయాల కోసం వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నామని గ్రహించారా? ఇవాళ హెచ్.సీ.యూ.. రేపు మిగతా వర్సిటీలకు ఈ దుస్థితి రావాలనే మీ లక్ష్యమా?
ముంబై మారణ హోమంలో వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడైన కుట్రదారుల్లో ఒకరైన యాకుబ్ మెమన్ అనే దేశ ద్రోహిని ఉరి తీస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన జరగడం ఏమిటి?.. ఈ ప్రదర్శనకు, కులాల వ్యవహారలకు, బాబా సాహెబ్ ఆదర్శాలకు పొంతన ఉందా అసలు.. చినికి చినికి గాలి వానగా మారి తోటితో పోయేది గొడ్డలితో నరికినట్లయింది వ్యవహారం..

రోహిత్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటి?.. ప్రేరేపించింది ఎవరు?.. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా?.. ఇవన్నీ బయటకు రావాలి.. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనలు జరగకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆంక్షలు విధించాలి.. విద్యాలయాలు కుల, రాజకీయ ఆధిపత్య కేంద్రాలుగా మారకుండా చర్యలు తీసుకోవాలి.. 

No comments:

Post a Comment