Friday, February 28, 2014

టీఆర్ఎస్ లోనే కాంగ్రెస్ కలవాలి..

వందేళ్ల కాంగ్రెస్ పార్టీని భారత రాజకీయాల్లో పాతుకుపోయిన ఊడల మర్రిగా అభివర్ణిస్తారు.. నాకు మాత్రం అది దయ్యాల మర్రిగానే కనిపిస్తుంది..
సోనియాగాంధీ తెలంగాణ ఒచ్చిందని కృతజ్ఞతలు చెప్పుకుంటున్న తెరాస వర్గాలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడి ఉండాలి.. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాం అని కేసీఆర్ గతంలో ప్రకటించారు.. అప్పటి పరిస్థితులు వేరు.. తెలంగాణ డిమాండును తొమ్మిదేళ్ల పాటు పక్కన పెట్టి వేయి మంది బలిదానాలకు, అమాయకులు చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ, హఠాత్తుగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిచడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి..
అవినీతి, అసమర్ధ పాలన కారణంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతిన్నది.. అవిభక్త ఆంద్రప్రదేశ్ లోనూ వారి పాలన ప్రజలకు రోత పుట్టించింది.. ఈ క్రమంలో పార్టీ ఉనికిని కాపాడు కోవడానికి ఏ పని చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు వస్తాయో అంఛనాలు వేసుకున్న కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ గుర్తు కొచ్చింది.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి వల్ల ఇక్కడ గంపగుత్తగా సీట్లు వస్తాయనే ఆలోచనతో ఎన్నికల ముందు హడావుడిగా తెలంగాణను ఏర్పాటు చేసేసింది..
ఇప్పడు విలీనం కావాల్సిందిగా తెరాస మీద వత్తిడి పెంచుతోంది కాంగ్రెస్.. నిజానికి ఇప్పడు తెలంగాణలో కాంగ్రెస్ కన్నా తెరాసయే బలమైన శక్తి.. వంటరిగా పోరాడి ఉనికి కాపాడుకోవాలని గులాభీయులు భావిస్తున్నారు.. తెరాస ఎటూ పాటుపోలేని స్థితిని గమనించిన కాంగ్రెస్ అదిష్టానం నెమ్మదిగా ఆ పార్టీ నేతలను లాగడం మొదలు పెట్టింది.. ఆ విధంగానే ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. టీఆర్ఎస్ కూడా ఏం తక్కువ తినలేదు.. కేకేతో పాటు ఎంపీలు వివేక్, మందలను కలుపుకున్న తీరు గమనించాలి..

ఇక విలీనం, ఉనికి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కలవడ కాదు.. టీఆర్ఎస్ లోనే కాంగ్రెస్ కలిసిపోతే బెటరు.. దేశ వ్యాప్తంగా ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతో ఇంతో ఓట్లు రాలుతాయంటే అంది తెలంగాణ పుణ్యమే.. సీమాంధ్రలో ఆ పార్టీకి ఒకటి, రెండు సీట్లయినా వస్తాయా అన్నది అనుమానమే.. ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా ఇదీ వాస్తవం..

Thursday, February 27, 2014

'మా ఆఫీస్ లో ఖాళీగా ఉన్న  మానేజర్ పోస్ట్ కు మీరు దరఖాస్తు చేసుకున్నారు కదూ?.. ఏమయ్యిందో తెలుసా?..'
'ఏమయ్యుంటుంది.. ఏ గొట్టంగాడో సెలక్ట్ అయ్యుంటాడు.. అంతేనా?'
'కంగ్రాట్స్ ఆ పోస్ట్ కు మీరే సెలెక్ట్ అయ్యారు..'
'ఆ.. '
( ఖాళీగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి సంగతి మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్..)


ఎవరు నపుంసకులో తేల్చుకోండి..

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నపుంసకుడని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖర్షీద్ దారుణంగా వ్యాఖ్యలు చేశారు.. అవున్లే ఈ కాంగ్రెస్ నేతలు గొప్ప పుంసకులు.. పదేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు, పేదరికం, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాసు, ఇతర ధరల పెరుగుదలకు కారణం ఎవరు? దేశ సరిహద్దులను కాపాడలేని చవటలు ఎవరు? శతృదేశం మన సైనికుల తలలు నరికి తీసుకెళ్లుతున్నా వారితో దోస్తీకి వెంపర్లాడుతున్నపిరికి వాళ్లెవరు? దేశంలో మహిళలపై అత్యాచారాలు, సాటి దేశ ప్రజలపై దౌర్జన్యాలు జరుగుతున్నా అరకట్టలేది దద్దమ్మలు ఎవరు.. దేశానిన్ని ఈ దుస్థికి నెట్టిన మీరు పుంసకులా? తేల్చుకోండి..

ఛీ.. ఛీ.. మహిళలలను గౌరవించలేని వీరూ నాయకులేనా? ఇలాంటి వెదవలకు గట్టిగా బుద్ధి చెప్పాలి..


మహా శివరాత్రి

హిందూ మతంలో మహాశివరాత్రి పర్వదినానికి ఎంతో ప్రశాస్త్యం ఉంది.. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు మహా శివుని జన్మ  నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు ఈ పండుగ వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.


ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేసి, పూజలు చేస్తారు.. రోజంతా ఉపవాసంతో ఉంటారు.. రాత్రంతా జాగారణంతో శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు.. మరునాడు భోజనం చేస్తారు. దేశంలోని అన్ని శైవ క్షేత్రాల్లో ఈ ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుంటారు.  

Wednesday, February 26, 2014

అనకొండలున్నాయి జాగ్రత్త..

సీమాంధ్ర రాజధాని ప్రకాశం జిల్లాలోని దొనకొండే అని మీడియాలో తెగ ప్రచారం జరగిపోతోంది.. 13 జిల్లాలకు ఈ ప్రాంతం కేంద్ర స్థానంలో ఉండటంతో పాటు 56 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉండటాన్ని చూపిస్తున్నారు.. అలాగే బ్రిటిష్ కాలం కాటి ఎయిరోడ్రమ్ ఉండనే ఉంది..
దొనకొండ నిజంగా సీమాంధ్ర రాజధాని అవుతుందా? కాదా అనేది దేవుడెరుకు కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవారు ఎక్కువయ్యారు.. ఈ ప్రచారం పుణ్యమా అని అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయట.. కొందరు రియల్ ఎస్టేట్ అనకొండలు వాలిపోయాయట.. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉండటమే కాదు, వీరిలో కొందరు స్వయంగా రాజకీయ నాయకులేనట.. కారు చౌకగా భూములు కొట్టేసి, ధరను పెంచేసి అమ్మేయడం ఈ అనకొండల నైజం.. నిజంగా దొనకొండ రాజధాని కాకపోతే? ఇంకేముంది అమాయకుల నెత్తిన టోపీ..

నిజానికి రాజధాని అంటే సచివాలయం, శాసనసభ,  హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు ఉండే ప్రాంతం.. హైదరాబాద్ నగరంలో ఇవన్నీ కలిపి 100 ఎకరాల లోపే ఉన్నాయి.. ఇంకా లోతుగా చెప్పాలంటే 70 ఎకరాల లోపే.. సీమాంధ్రలో విశాలమైన భవన సముదాలతో రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే 1,000 ఎకరాల భూమి చాలా ఎక్కువ.. కానీ రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూమి కావాలనే ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు.. సీమాంధ్రలో అబివృద్ది చెందిన ఎన్నో నగరాలు ఉన్నాయి.. అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయం, శాసనసభ, హైకోర్టులను వివిధ నగరాల్లో ఏర్పాటు చేసుకుంటే అన్ని నగరాలు, ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది.. కానీ వేలాది ఎకరాలు భూమి ఒకే చోట కావాలనుకోవడం పరిపాలనకా? రియల్ ఎస్టేట్ వ్యాపారానికా నాకైతే అర్థం కావడం లేదు.. 

వీరిని మరచిపోయారా నాయనా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని నిరంతరం తపించి, తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్.. వారు రగిల్చిన ఉద్యమ స్పూర్తి మహత్తర శక్తిగా ఎదిగి ఈనాడు స్వరాష్ట్రం సాక్షాత్కరిస్తోంది.. వీరిలో ఒకరు రాజకీయ మార్గంలోనే ఉద్యమం కొనసాగాలని సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చి అమలు చేశారు.. మరొకరు ఉద్యమ పార్టీకి తన ఇంటినే ఇచ్చి ప్రభుత్వ ఆగ్రహాన్ని చవి చూశారు.. 
తెలంగాణ ఉద్యమ ఫలాలను తమ సొంతానికి, వారసులకు ఇవ్వకుండా నిజమైన త్యాగాలు చేసింది బాపూజీ, జయశంకర్ మాత్రమే.. తమ జీవిత కాలంలోనే స్వరాష్ట్రం ఏర్పడుతుందని కలలుగన్నారు వారు.. కానీ కొద్ది సంవత్సరాల క్రితమే వారు మన ముందు లేకుండా పోయారు.. దురదృష్టవశాత్తు ఈనాడు వీరిని తలచుకునే వారే కరువయ్యారు.. కొందరు నాయకులు వీరి విగ్రహాలకు పూల దండలు వేస్తూ, వారి త్యాగ ఫలాలను తాము, తమ కుటుంబాలు అనుభవించేలా జాగ్రత్తపడుతున్నారు.. మిగతా సోకాల్డ్ తెలంగాణ వాదులు వీరిని పూర్తిగా మరచిపోయారు.. పత్రికా ప్రకటనలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లలో కూడా వీరి చిత్రాలు కనిపించకుండా జాగ్రతపడుతూ.. తమ సొంత పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. వీరిన చూసి నేను సిగ్గుపడుతున్నాను.. ఛీ ఛీ..

Tuesday, February 25, 2014

మహేందర్ రెడ్డి జర్క్..

మల్కాజిగిరి నుండి తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారని ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్ రెడ్డి.. ఆయన పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని చెప్పాడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న వేళ ప్రజలంతా టీడీపీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు..

కట్ చేస్తే రెండో రోజునే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్త.. తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొనేందుకు మహేందర్ రెడ్డి, మరో టీడీపీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం తమ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ ప్రకటించారు.. తెలంగాణ విషయంలో టీడీపీ తీసుకున్న ద్వంద్వ వైఖరి ఆ పార్టీ నేతలను ఎంత ఇరకాటంలో పెట్టిందో చూశారా?.. మహేందర్ రెడ్డి టీడీపీ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షునిగా పని చేశారు.. అలాంటి నాయకుడే టీడీపీ పట్ల నమ్మకం కోల్పోయాడంటే సాధారణ కార్యకర్తల భయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..
 

Friday, February 21, 2014

తెలుగు లెస్స..

సోదరులారా, మిత్రులారా..
కాసేపు తెలంగాణ, సీమాంధ్ర గొడవను పక్కన పెట్టండి.. మనకు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి చాలా సమయం ఉంది.. ముందు ఈ విషయం మీద దృష్టి పెట్టండి..
ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. (నవ్వొచ్చిందా?) ఏం చేస్తాం ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని మరచిపోయి ఉండొచ్చు.. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా తెలుగు మన మాతృభాష.. మనం మాట్లాడుకుంటున్నది, చదువుకుంటున్నది, తిట్టుకుంటున్నది, నిత్య వ్యవహారాలు సాగిస్తున్నది ఈ భాషలోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి..
ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగానే తెలుగు వారున్నారు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది కోట్ల మంది తెలుగువారు ఉంటే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, భారత్ లోని వివిధ ప్రాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా మిగతా వారు నివసిస్తున్నారు.. మనుగడ కోసం మనం ఏ భాషలో వ్యవహారాలు సాగిస్తున్నా వారసత్వంగా వస్తున్న మన భాష, సంప్రదాయాలను కాపాడుకోవడంలోనే మన అస్థిత్వం ఉంటుందనే వాస్తవాన్ని మరచిపోకండి..
భారత దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని గొప్పగా చెప్పుకుంటాం.. కానీ తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకునే ప్రయత్నం ఏనాడూ సవ్యంగా జరగలేదు.. అసలు అధికార భాషగా తెలుగును పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపాన కూడా పోలేదు.. ఈ నాటికీ ప్రభుత్వ వ్యవహారాలు ఆంగ్లంలోనే సాగుతున్నాయి.. ఇందుకు మనను మనమే నిందించుకోవాలి.. ఈ విషయంలో ఇతర దక్షిణాధి రాష్ట్రాలను చూసి బుద్ది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది..
తెలుగు భాష ఇంకా మనుగడలో ఉందంటే మనలో ఉన్న భాషాభిమానమే అంతో ఇంతో కారణం... ఇందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమీ లేదు.. తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అపోహను సృష్టించారు.. ఇప్పడు ఉద్యోగాలు చేస్తున్న వారిలో అత్యధికులు తెలుగు మీడియంలోనే చదువుకున్నవారే కాదా? తెలుగు భాషను పని గట్టుకొని హత్య చేస్తున్నది మన పాలకులే.. తెలుగు మీడియంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అదనపు అర్హతగా నిర్ణయిస్తే ఈ పరిస్థితి ఉండేదా? తెలుగు మీడియం పాఠశాలలను క్రమంగా కనుమరుగు అవుతున్నాయి.. ప్రభుత్వం సైతం ఇంగ్లీషు మీడియం పాఠశాలలనే ప్రోత్సహిస్తోంది..
మనుగడ, ఉపాధి అవకాశాల కోసం మనం ఏ భాషలో వ్యవహారాలు సాగించినా తప్పులేదు.. కానీ తెలుగుతో తెలుగు వారి మధ్య తెలుగులోనే వ్యవహారాలు సాగిద్దాం.. మన ఇంట్లో, బంధు మిత్రులతో తెలుగులోనే మాట్లాడదాం.. ఫేస్ బుక్ లాంటి సామాజిక మీడియాల్లో తెలుగు భాషను ప్రోత్సహిద్దాం.. తెలుగును కాపాడుకోవడమే కాదు, మరింతగా వ్యాప్తి చేయడం కూడా అవసరం..

తెలంగాణ, సీమాంధ్రలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు భాష ఉనికికి వచ్చే నష్టం ఏమీ లేదు.. రెండు రాష్ట్రాల్లో భాషా, సంస్కృతులను రక్షించుకునే ప్రయత్నాలు చేయాలి.. అవసరమైతే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉండాలి..

Thursday, February 20, 2014

రాజ్యసభ ఆమోదం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యసభ ఆమోద ముద్ర కూడా పడింది.. ఇక రాష్ట్రపతి ఉత్తర్వుతో భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవిస్తోంది.. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడబోతోంది.. ఈ విజయం కచ్చితంగా అమర వీరులకే దక్కుతుంది.. స్వయంపాలన, స్వావలంభణ, ఆత్మగౌరవం కోసం సాగిన ఈ పోరాటం ఎన్నో పాఠాలను నేర్పించింది.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు, సహాయ సహకారాలు కొనసాగినప్పుడే అభివృద్ధి పథంలో కలిసి ముందుకు సాగుతాం.. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా మనం ముందు భారతీయులం అనే విషయం మరచిపోరాదు.. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు అని గర్విద్దాం.. ఇలాంటి కీలయ సమయంలో ఉభయ ప్రాంతాల మధ్య సామరస్యం చాలా అవసరం.. రాజకీయ నాయకుల రెచ్చగొట్టే వైఖరి కారణంగానే సమస్యలు వస్తున్నాయి.. ఇలాంటి నాయకులకు ముందు గట్టిగా బుద్ది చెబుదాం..


హంతకులను క్షమించారు.. పీవీపై కక్ష పెంచుకున్నారు..

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తులో నాటి ప్రధాని పీవీ నరసింహారావు జాప్యం చేస్తున్నా సోనియా గాందీ కోపం పెంచుకున్నారు.. పీవీ కావాలనే ఈ కేసును తొక్కి పెడుతున్నారని కోటరీ చెప్పిన చాడీలు విని ఆయనపై అనుమానాలు పెంచుకున్నారు సోనియా.. ఈ కక్షతోనే తదుపరి ఎన్నికల్లో పీవీ నరసింహారావుకు పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు.. పీవీ మరణించాక ఆయన పార్ధివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించకుండా రోడ్డుపై నుండే పంపేశారు.. ఢిల్లీలో ఘాట్ నిర్మించాల్సి వస్తుందో అనే భయంతో ఢిల్లీలో అంత్యక్రియలకు కూడా ఒప్పుకోలేదు.. చివరకు హైదరాబాద్తో పీవీ శవం సగమైనా కాలకుండా వదిలేయడం విమర్శలకు దారి తీసింది.. నెక్లెస్ రోడ్డుపై పీవీ ఘాట్ ఈనాటికీ పూర్తి కాలేదు.. ఇప్పడు అసలు విషయానికి వద్దాం..
రాజీవ్ హత్య కేసులో నేరగాళ్లకు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చింది.. వీరు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుకుంటూ పెట్టుకున్నపిటిషన్ ను కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టింది.. ఈ భారీ జాప్యం కారణంగానే హంతకుల పిటిషన్ ప్రకారం నిర్ణయం తీసుకోలే తప్పలేదని సుప్రీం కోర్టు చేతులెత్తేసింది.. ఈ హంతకులకు ఉరి శిక్ష రద్దు చేయాలని కొన్ని తమిళ అతివాద సంస్థలు, రాజకీయ పార్టీలు  చేస్తున్న డిమాండుకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల యావలో పడి ఇంత కాలంగా కావాలనే క్షమాభిక్ష పిటిషన్ ను పట్టించుకోలేదనేది వాస్తవం.. గత పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వాన్ని శాసిస్తున్నది ఎవరు? స్వయంగా రాజీవ్ గాంధీ సతీమణి అయిన సోనియా గాంధీ కాదా? ఇక్కడ మనం ఎవరిని నిందించాలి?.. సోనియానా?.. పీవీనా?
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష విషయంలో సోనియా, ఆమె కుటుంబ సభ్యులు సానుకూలంగా ఉన్నారనే వార్తలు విన్నాం.. ఇది మానవతా దృక్ఫధంతో తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.. కానీ రాజకీయాల కోసం ఈ కేసును వాడుకోవడమే బాధాకరం.. ఆనాడు రాజీవ్ హత్య కేసులో దర్యాప్తును జాప్యం చేశారని పీవీని నిందించిన సోనియా, హంతకులకు ఉరి శిక్ష పడ్డ తర్వాత తాను చేసిన పనేమిటో ఆత్మ విమర్ష చేసుకోవాల్సిన అవసరం లేదా? తమిళనాడులో ఎల్టీటీఈకి, ప్రభాకరన్ కు సహకరించిందనే సాకుతో ఆనాడు డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి  పాలన పెట్టారు.. కానీ తర్వాత కాలంలో అదే డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది.. తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈపై సానుభూతి విషయంలో డీఎంకే వైఖరి ఆనాటికి, ఈనాటికీ ఏమాత్రం మారలేదు..

సోనియా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం తన భర్త హంతకులు, వారి సానుభూతిపరుల విషయంలో ఇంతగా రాజీ పడినప్పడు ఈ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని పీవీ నరసింహారావుపై ఎందుకు కక్ష కట్టినట్లు? ఎందుకు బలి పశువును చేసినట్లు?.. సోనియమ్మ ఎలాగూ వివరణ ఇచ్చుకోలేదు.. కానీ కనీసం కాంగ్రెస్ నాయకులైనా సమాధానం చెప్పుకోగలరా?

Wednesday, February 19, 2014

ఖేల్ ఖతం.. ఇక రెస్టే బెస్టు..

స్టార్ బ్యాట్ మెన్ లాస్ట్ బాల్ అయినా సిక్సర్ కొట్టి ఆదుకుంటాడనుకున్న వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయి.. నాటకం ఆఖరి ఘట్టం చేరినా కీలక నటుడు స్టేజీ ఎక్కకపోవడంతో ప్రేక్షకులు గగ్గోలు పెట్టేశారట.. మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అస్త్ర సన్యాసాధ్యాయం ఎంత రక్తి కట్టిందో చూశారు కాదా?..
జరుగుతున్నదేమిటో అందరికీ తెలుగు.. జరగబోయేది కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.. కానీ చూస్కోండి ఇరగదీస్తానన్నాడు.. చివరికేమయ్యింది.. అంతా అయిపోయాక చేతుతెత్తేశాడు..
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఏమిటో రాజకీయ ఓనమాలు తెలియని చిన్న పిల్లలు సైతం స్పష్టంగా గమనించారు.. కానీ ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ ఏ ధైర్యంతో అడ్డుకుంటానని సవాలు విసిరారో తెలియదు.. సీఎంను అధిష్టానం పూచిక పుల్లలాగే తీసి పారేసింది.. ఇప్పుడు పార్టీని తిడుతూ రాజీనామా చేస్తే మాత్రం ఏం లాభం?
తెలంగాణ అనివార్యం అని తెలిసిపోయినప్పడు, సీమాంధ్ర ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విభజన గాయాలకు కొంత ఉపశమనం ఉండేది.. కానీ ఏదో చేస్తాను, ఇరగదీసి అడ్డుకుంటానంటూ నమ్ముకున్న అనుయాయులను చివరి దాకా మభ్యపెట్టడం ఒక్క కిరణ్ కుమార్ రెడ్డికే చెల్లింది,, మొండి తనం ఎన్ని అనర్ధాలకు కారణం అయిందో ఇప్పటికైనా తెలిసే ఉండాలి..
కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకునే నాయకుడు అందుకు అనుగుణంగా వూహాత్మకంగా వ్యవహరించాలి.. కానీ రాజీనామా చేస్తేస్తున్నాను.. పార్టీ పెడుతున్నానహో.. అంటూ అందరి చెవులు కొరికేశారు నల్లారి వారు.. తీరా ముహూర్తం దగ్గరపడి వెనుతిరిగి చూస్తే అప్పటి దాకా వెంట నడిచిన వారు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది..

ఖేల్ ఖతం.. ఇక రెస్టే బెస్టు..

Tuesday, February 18, 2014

మరో మైలు రాయి అదిగమించాం..

నిజంగా ఇది చారిత్రక దినం.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర సాధనలో మరో ప్రధాన మైలు రాయి దాటాం.. బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించడంతో కీలక ఘట్టం పూర్తయింది..
ఎన్ని పోరాటాలు.. ఎన్ని త్యాగాలు.. ఎన్నిఆత్మ బలిదానాలు.. ఎన్ని అవమానాలు ఎదురైనా సహించాం.. ఇది ప్రజా విజయం.. ఆరు దశాబ్దాల ఆకాంక్ష ఇది.. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సజీవంగా ఉన్నందునే ఉద్యమం ఎప్పటికప్పడు కొత్త ఊపిరి పొందుతూ, రగులుతూనే ఉంది..
మన పోరాటం మన కోసమే.. ఎవరిపైనా మనకు శత్రుత్వం వద్దు.. చరిత్ర గతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రాజ్యాలు పుట్టాయి.. కాలగర్భంలో కలిశాయి.. సరిహద్దులూ మారుతూ వచ్చాయి..
మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు, కుతుబ్ షాషీలు, అసఫ్ జాహీలు, బ్రిటిష్ వారు పాలించిన నేల ఇది.. శతాబ్దాలుగా కలుస్తున్నాం, విడిపోతున్నాం.. నిన్నటి హైదరాబాద్, ఆంధ్ర అయినా, నేటి ఆంధ్రప్రదేశ్ అయినా ఇతే.. రానున్న తెలంగాణ కూడా అంతే నిజం..
ఇప్పటి వరకూ కలిసి ఉన్న మనం అనివార్యతల వల్లే విడిపోతున్నా.. విభజన పరిపాలన సౌలభ్యం కోసమే.. మన సరిహద్దులకే దీన్ని పరిమితం చేద్దాం.. స్నేహాలకు, బంధుత్వాలకు విభజన ఉండదు.. బంధు మిత్రుల మధ్య ఉన్నట్లే ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు, తీర్థయాత్రలు, విహార యాత్రలు యధావిధిగా ఉంటాయి.. రాజకీయ నాయకుల మాయలో పడి మనం వీధి పోరాటాలకు దిగి శత్రుత్వాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు..
రాష్ట్ర విభజన ప్రాంతాలకు అతీతంగా బాధను కలిగించడం సహజం.. అపోహలు పెంచుకుంటూ, నిత్యం సంఘర్షించుకోవడం కన్నా విడిపోడమే మంచిది.. కొన్ని చేదు ఘటనలు, చారిత్రక సత్యాలు జీర్ణించుకోక తప్పదు..

తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా మనం ఈ దేశ ప్రజలమే.. భారత మాతకు జై పలుకుదాం..

Saturday, February 15, 2014

అరాచక పాలన ముగిసింది..

తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట.. ఇలాంటి కోతికి కొబ్బరి కాయ దొరికితే ఎలా ఉంటుంది.. కేజ్రీవాల్ చేసిన పని అలాగే ఉంది..
అరవింద్ కేజ్రీవాల్ గొప్ప త్యాగ పురుషుడని భజన చేస్తున్న వారు తమ భ్రమలు వీడి వాస్తవ దృక్పదంతో ఆలోచించండి.. అందరూ అవినీతి పరులని, చేతగాని వారని బురద చల్లేస్తూ తానొక్కడినే పోటుగాన్నని విర్రవీగిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా వెలగబెట్టింది ఏమిటి? ఎప్పుడూ టీవీ స్టూడియో డిబేట్లు, లైవ్ షోల్లో కనిపిస్తూ హడావుడి చేయడం తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టింది ఎప్పుడూ.. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా ఉండేలా చూసుకుంటూ మీడియా ప్రచార యావతోనే ఆయన పాలనా కాలం సరిపోయింది..

తాను అరాచవాదినని కేజ్రీవాలే ఒప్పుకున్నాడు.. ఆయన చేసిన పనులూ అలాగే ఉన్నాయి.. మనం ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు అది సాధించే వరకూ అప్రమత్తంగా ఉండాలి.. రాత్రికి రాత్రే గమ్యాన్ని చేరాలనుకోవడం కొన్ని సందర్భాల్లో అసాధ్యం.. జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావడానికి కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం ఎలా ఉందో గమనించండి.. ఈ బిల్లు తీసుకురావడానికి తనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ను కానీ, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీని కానీ సంప్రదించలేదు.. పైగా లెఫ్టినెంట్ గవర్నర్, రాజ్యాంగ వ్యవస్థను కూడా ఖాతరు చేయలేదు.. నిజానికి ఢిల్లీ అసెంబ్లీ తిరస్కరించింది లోక్ పాల్ బిల్లును కాదు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా దొడ్డి దారిలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీరునే మెజారిటీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు.. వాస్తవాలను పక్కన పెట్టి తానేదో మంచి చేస్తుంటే వారు అడ్డు పడ్డారని సాకు చూపించి రాజీనామా చేయడం కేజ్రీవాల్ కే చెల్లింది..
అవినీతిపై పోరాటం అంటే మీరు అవినీతి పరులని ఎదుటి వారిపై బురద చల్లడం కాదు.. నిర్దుష్టమైన ఆధారాలతో వారి అవినీతి పరులుగా నిరూపించే ప్రయత్నం చేయాలి.. మాజీ సీఎం షీలా దీక్షిత్ విషయంలో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాను.. అయితే కేజ్రీవాల్ అవినీతి పరులను, నీతి మంతులను ఒకే గాటాన కట్టి నిందలు వేయడం దారుణం.. తమపై అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు చూపించాలని ఆ నాయకలు సవాలు చేస్తే ఇంత వరకూ స్పందించలేదు..
కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎంగా ఉన్నానని మరచిపోయి పోలీసులకు వ్యతిరేకంగా రోడెక్కి ధర్నా చేసినప్పుడే ఆయన అసహాయ స్థితి, అజ్ఞానం బయటపడిపోయింది.. సీఎంగా ఉండి ధర్నాలు చేయొద్దని రాజ్యాంగంలో లేదని దబాయించారు.. మరి సీఎంలు ధర్నాలు చేయొచ్చని ఉందా అని ప్రశ్నిస్తే సమాధానం కరువు.. కేజ్రీవాల్ క్యాబినెట్లో వివాదాస్పద మంత్రుల గురుంచి చెప్పాలంటే సమయాన్ని వృధా చేసుకోవమే తప్ప ఫలితం ఉండదు.. నేను గతంలోనే  ప్రస్థావించినందున వాటి జోలికి పోవడంలేదు.
అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఐఆర్ఎస్ ఉద్యోగి.. తన శాఖలో అవినీతిని సరిదిద్దడం చేతగాక, దేశాన్ని ఉద్దరిస్తానంటూ రాజీనామా చేశారు.. కేజ్రీవాల్తో పాటు, ఆయన సతీమణి సర్వీసంతా ఎలాంటి బదిలీలు లేకుండా ఢిల్లీలో గడిచి పోయింది.. అందుకు మంచి పైరవీలే చేయించుకున్నారంటారు.. ఇది మాత్రం నీతివంతమైన పనే కదూ?..
ఒక  ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే అవకాశం ఉన్నప్పడు, చట్ట విరుద్దమైన అడ్డదారిలో వెళతానంటూ హడావుడి చేసి చతికిల పడ్డ కేజ్రీవాల్.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రత్యర్ధులపై దాడినే అస్త్రంగా ఎంచుకున్నాడు.. మొత్తానికి ఢిల్లీ ప్రజలకు అరాచక పాలన వదిలినందుకు సంతోషించాల్సిందే..

Friday, February 14, 2014

భారత ప్రజాస్వామ్యంపై మచ్చ.

ప్రేమించ లేదనే కోపంలో అమ్మాయిపై యాసిడ్ పోసిన వారిని చూశాం.. ఇప్పుడు తమకు ఇష్టం లేని బిల్లు పెడుతున్నారనే అక్కసుతో తోటి ఎంపీలపై పెప్పర్ గ్యాస్ స్ప్రే చేసిన వారిని చూడాల్సి వచ్చింది..
తెలంగాణ రాష్ట్రం కోరుకోవడమే తప్పని ఎవరైనా భావించే వారు, ప్రేమించక పోవడం ఆ అమ్మాయి చేసిన తప్పది వాదించగలరా?
ఎవరు ఎలా వాదించినా ప్రపంచంలో అతి పెద్దదైన భారత ప్రజాస్వామ్యం పరువుపోయింది.. తమకు నచ్చని ఎజెండా పార్లమెంట్ చేపట్టినంత మాత్రాన గుండాల్లా కొట్టుకోవాలా? ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించాలా? ఆ పనేది బయటే చేసేయొచ్చుగా.. బిల్లును అడ్డుకునే ఎంపీలు, వారిని ఎదుర్కొనేందుకు వచ్చిన ఎంపీలు సృష్టించిన సీను చెత్త కుప్ప దగ్గర కుక్కల కాట్లాటను తలపించింది..
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాలరాసే ప్రయత్నమే ప్రజాస్వామ్యమా? తెలంగాణ బిల్లులో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే పార్లమెంట్ లో ఎండగట్టవచ్చు.. తాము కోరుకునేవి సాధించుకునే ప్రయత్నం చేయవచ్చు.. అసలు రాష్ట్ర విభజనే వద్దనుకుంటే వాకౌట్ చేయవచ్చు.. లేదా రాజీనామా చేయవచ్చు.. కానీ సభను అడ్డుకుంటాం.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే సహించం.. ఎంతకైనా తెగిస్తాం అని బెదిరించడం సమంజసమా?
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ చట్ట సభల ప్రతినిధులమనే ఇంగితం అయినా లేకుండా రౌడీయిజం ప్రదర్శించడం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ నగ్న స్వరూపం స్పష్టంగా బయటపడిపోయింది.. సొంత పార్టీ మంత్రులపై, ఎంపీలపై పట్టులేదని చేతులెత్తేసింది.. సీమాంధ్ర ఎంపీలను కట్టడి చేసేందుకు తెలంగాణ ఎంపీలను, ఇతర రాష్ట్రాల ఎంపీలను ఉసిగొల్పడాన్ని ఏవిధంగా సమర్థించగలం?

ఎంపీలూ పెప్పర్ స్ప్రే వాడొచ్చు..

ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచార ఘటన తర్వాత పెప్పర్ స్ప్రే ప్రచారంలోకి వచ్చింది.. బలత్కారానికి ప్రయత్నించే మృగాళ్లను ఎదిరించేందుకు మిరియాల ఘాటుతో తయారైన ఈ ద్రావకం బాటిల్ ప్రతి యువతి దగ్గర తప్పనిసరిగా ఉండాలని పోలీసులు, మహిళా సంఘాలు అవగాహన కల్పించాయి..
ఈ అవగాహన ఎంత మందికి యువతులకు వంటబట్టిందో తెలియదు కానీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు వెంటనే పెప్పర్ స్ప్రే కొనేసి తన దుస్తుల్లో దాచుకున్నారు.. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకొనేందుకు విజయవంతంగా ఉపయోగించి ఆత్మరక్షణ చేసుకున్నారట..
లగడపాటి ఏమి చేసినా సంచలనమే.. నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు.. నాలుగున్నరేళ్ల క్రితం కేసీఆర్ మాదిరి తానూ ఆమరణ దీక్ష చేస్తానంటూ విజయవాడలో కూర్చున్నారు.. కొద్ది రోజుల తర్వాత పోలీసులు షరా మామూలే తరహాలో అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు.. అయితే తనను కేసీఆర్ కు చికిత్స చేసిన హైదరాబాద్ లోని నిమ్స్ కు పంపాలని కోరగా పోలీసులు తిరస్కరించారు.. దీంతో లగడపాటి రాత్రికి రాత్రి కస్టడీ నుండి ఉడాయించారు.. ఆయన గమ్యం ఏమిటో తెలిసిన మీడియా నిమ్స్ దగ్గర కాపు కాసింది.. ఆటో లోంచి దిగిన మన ఘనాపాటి ఒక్కసారిగా నిమ్స్ లోకి లగెత్తి ఒక బెడ్డు మీదకు దూకేసి పడకేశారు.. ఇన్ని రోజులు తిండి తినకుండా మాడిన మనోడికి ఇంత శక్తి ఎక్కడిది అంటూ ఆశ్చర్యపోయిన వారి అనుమానాలను మరుసటి రోజే పటాపంచలు చేశారు రాజ్ గోపాల్.. తన దీక్ష ఉత్తిత్తిదే అని, ఫ్లూయిడ్లు తీసుకొని ఎన్నాళ్లైనా ఇలాంటి దీక్షలు చేయొచ్చని చాటి చెప్పారు.. ఈ వివరణతో లగడపాటి దీక్షకు మద్దతు ఇచ్చిన వారంతా అవాక్కయ్యారు..

ఐదేళ్ల నాటి నిమ్స్ సీను కట్ చేస్తే ఇప్పడు అంతకు మించిన పబ్లిసిటీ పెప్పర్ స్ప్రేఎపిసోడ్తో వచ్చింది.. ఈ రెండు ఉదంతాలకు నాకు కొన్ని పోలికలు కనిపించాయి.. అది మాత్రం ఇప్పడే చెప్పను.. కానీ తప్పని సరిగా దృశ్యీకరిస్తాను.. మీరే చూస్తారు కదా?..

Thursday, February 13, 2014

ప్రేమికులకు దినమా?..

కాలేజీలు వదిలే సమయం.. కోఠిలో సీజినల్ వ్యాపారం చేసే కుర్రాడు చాలా బిజీగా ఉన్నాడు.. నన్ను చూడగానే నమస్తే సార్ అని పలకరించాడు.. నేను అతని క్షేమ సమాచారం అడిగి ఏమి అమ్ముతున్నాడా? అని గమనించాను.. రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్స్.. ఫిక్సుడ్ రేటట.. ఏమిటివి? అని అడిగాను యధాలాపంగా.. మీకు తెల్వక పోవుడు ఏమిటి సార్?.. బదులిచ్చాడు. నాకు అర్ధమైనా ఏమి చెబుతాడా అనే ఆసక్తితో తెల్వదని చెప్పాను.. లవ్వర్స్ డే అంట సార్.. లవ్వర్లు ఇవి ఒకరికొకరు అచ్చుకుంటరంట ఇవి అంటూ నవ్వూతా చెప్పాడు.. వార్నీ లవ్వర్స్ డే సంగతి ఏమిటో గానీ వీడి గిరాకీ మాత్రం బాగుందనుకొని ముందుకు సాగాను..
అసలు ప్రేమ అంటే ఏమిటి?.. మనం భగవంతున్నిప్రేమిస్తాం.. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, తోబుట్టువులతో ప్రేమగా మెలుగుతాం..  బంధుమిత్రులను, తోటి మనుషులను ప్రేమగా పలకరిస్తాం.. చివరకు మనం పెంచుకునే పెంపుడు జంతువులను కూడా ప్రేమగా చూసుకుంటాం.. ఇదంతా ప్రేమే కదా?
ప్రేమ అంటే కేవలం యువతీ యువకుల మధ్య సాగే వ్యవహారమేనా?.. ఆకర్షణ,శృంగారాసక్తి మాత్రమే ప్రేమనా?.. మరి ఇదంతా జంతువులకూ ఉంటుంది కదా? ఈ విధమైన అభిప్రాయాలు నేటి సమాజంలో ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.. పాశ్చాత్య పోకడలు, ఆధునిక సాహిత్యం, సినిమాలు, మీడియా ప్రేమకు అర్ధాన్ని మార్చేశాయి.. ఒకే కోణంలో ప్రేమను చూపిస్తున్నాయి..
ప్రేమికులు రోజు పేరుతో ఒక దినం పెట్టుకోడం.. ఫిబ్రవరి 14న సినిమా థియేటర్లు, పార్కులు, పబ్బులెమ్మట తిరిగేయడం.. చిలిపి చేష్టలు చేస్తూ, ఏ భజరంగ్ దళ్ వాడో చూస్తే పట్టుకొని ఎక్కడ పెళ్లి చేస్తాడోనని భయం, భయంగా మెదలడం ఎందుకు? ప్రేమ ఒక్కరోజుతో పుట్టి, ఆ రోజుతోనే చచ్చి పోదు కదా? ప్రేమ ఒక్క రోజులో పుట్టి, ఒక్క రోజులోనే అంతరిస్తుందా? అలాంటప్పుడు ఎందుకీ అర్థం పర్థం లేని ప్రేమికుల రోజు.. నిజానికి మన దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోవడం మెట్రో నగరాలకే పరిమితంగా ఉండేది.. కానీ మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది.. గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు అమ్ముకునేవారికి వ్యాపార లాభాలు, మీడియాకు ప్రకటనలు, టీఆర్పీ రేటింగ్ల ఆదాయానికి మాత్రమే పనికి వచ్చే దినమిది..
నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా ఎన్నుకోవడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ ప్రేమ పేరిట తాత్కాలిక ఆకర్షణలకులోనై మీ జీవితాలను పాడు చేసుకోకండి అని మాత్రమే సూచిస్తున్నాను.. జీవితాంతం తోడుండే భాగస్వామిని కోరుకోండి.. ప్యాంటూ, షర్టూ మార్చేసినట్లు మీ భాగస్వాములను విడాకుల పేరిట తరిమేసి కొత్త వారికోసం అన్వేషించే దౌర్భాగ్యం అవసరమా? నేను ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన జంటలను వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను..
ప్రేమ అనేది తాత్కాలికం కారాదనేది నా భావన.. ప్రేమకు విస్తృతమైన అర్ధం ఉంది.. ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్య నూతనం.. ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయగలమా? 
చరిత్ర పుటలు తిరగేస్తే తిరగేస్తే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సూటిగా సమాధానం ఉండదు.. వాలెంటైన్స్ డే మత పరమైన వేడుకే తప్ప ప్రేమికులకు సంబంధించింది కాదు.. ఓ మత ప్రచారకుడు ప్రేమతత్వాన్ని ప్రచారం చేయడం.. అతన్ని చక్రవర్తి బంధించి ఉరి తీయడం.. ఈ లోగా ఆ ప్రచారకుడు జైలరు కూతురుకు ప్రేమ లేఖ రాయడం (కూతురు వయసులో ఉన్న యువతిపై ఆ మత ప్రచారకునికి ప్రేమ ఏమిటో?)..


వాలెంటైన్స్ డే రోజులన గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొని పార్కులు, గట్లెమ్మట తిగినంత మాత్రాన ప్రేమ బలపడుతుందా? ఈ ఒక్క రోజు ప్రేమించుకుంటే చాలా? ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి కాని దానికో దినం పెడితే ఎలా? నిజానికి దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. ఎవరైనా నా భావాలతో ఏకీభవిస్తే సంతోషం.. ఏకీభవించకున్నా నేనేమీ బాధపడను.. నేను ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను..

Wednesday, February 12, 2014


రాజీనామాకు ముహూర్తం ఎందుకు?.. విడుదల తేది నిర్ణయానికి ఇదేమన్నా రజనీకాంత్ సినిమానా?

Sunday, February 9, 2014

పోలవరం ప్రాజెక్టు ఎలా చూసినా ముప్పే..

రాష్ట్ర విభజన నేపధ్యంలో భద్రాచలం-పోలవరం భవిష్యత్తు కీలకంగా మారింది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు వీలుగా భద్రాచలం పట్టణం మినహా మిగతా ముంపు గ్రామాలను సీమాంధ్రకు బదిలీ చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అయితే ఎంత దాచినా దాగని బహిరంగ నిజాలను మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం..
పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే లాభాల సంగతి దేవుడెరుగు.. కానీ అనర్ధాలే అధికంగా కనిపిస్తున్నాయి.. గోదావరితో పాటు ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, తాలిపేరు ఉప నదులకు ఎప్పడు వరదలు వచ్చినా భద్రచలం పట్టణంలోకి నీరు వచ్చేస్తోంది.. రామాలయం ముందున్న ప్రాంగణమంతా వరద నీటిలో ఉంటోంది.. భద్రాచలం దగ్గర మొదటి వరద ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు, మూడో హెచ్చరిక 53 అడుగులు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 150 అడుగు.. ప్రాజెక్టు ఒక మోస్తారు నిండితే భద్రాచలం దగ్గర గోదావరిలో నీరు 43 అడుగుల మేర ఉంటుంది.. అంటే భద్రాచలం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరినట్లే.. ఏ మాత్రం వాన వచ్చినా భద్రాచలం మునిగిపోవడం ఖాయం.. ఏడాది క్రితం ఈ ప్రాంతాన్ని నేను స్వయంగా పరిశీలించాను (చిత్రాలు చూడండి)
పోలవరం ప్రాజెక్టులను నిర్మిస్తే మునిగిపోయే గ్రామాలు 350కి పైగానే ఉన్నా ప్రభుత్వం వ్యూహాత్మకంగా 278 గ్రామాలు మాత్రమే మునుగుతాయని నమ్మబలుకుతోంది.. ఇందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 205 గ్రామాలు ఉన్నాయి. మిగతావి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్నాయి,, అంటే ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలకు మాత్రమే నష్ట పరిహారం వస్తుంది.. మిగతా జనావాసాల భవిష్యత్తును భద్రాది రాముడికే అప్పగించేశారు.. పోలవరం నిర్మాణం వల్ల ఎక్కువు నష్టపోతున్నది గిరిజనులే.. ప్రఖ్యాత పర్యాట ప్రాంతమైన పాపికొండలతో సహా గిరిజనుల ఆవాసాలు, వారి సంస్కృతి, సాంప్రదాయాలు గోదారిలో కలిపితోయే ప్రమాదం ఏర్పడింది..
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంస్థలు పోరుబాట పట్టాయి.. అటు పోలవరం ప్రాజెక్టును ఒడిషా, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.. పోలవరం సాకును చూపి కొన్న విచిన్నకర శక్తులు గిరిజనులను తమవైపు ఆకర్శిస్తున్నాయి.. ఈ పరిణామం మరింత ఆందోళనను కలిగిస్తోంది.. లక్షలాది ఎకరాల అడవులను మింగేస్తున్న ఈ ప్రాజెక్టు పర్యావరణ సమతౌల్యానికి కూడా ముప్పే.. అడవుల్లోని జీవరాసుల పరిస్థితిని కూడా ఆలోచించండి..
పోలవరం ప్రాజెక్టువల్ల ఉపయోగాలు కనిపిస్తుండవచ్చు.. కానీ మన కళ్ల ముందే కఠిన వాస్తవాలు కనిపిస్తుంటే అసలు ఈ ప్రాజెక్టు అవసరమా అనిపిస్తోంది.. కొందరికి మేలు చేయడం, కోసం మరి కొందరి జీవితాలను పణంగా పెట్టడం అవసరమా? ప్రభుత్వ పరిహారం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే, రాష్ట్రంలోని ఎన్నో ప్రాజెక్టుల నిర్వాసితులు దిక్కులేని వారైపోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.. ఈ అత్తెసరు పరిహారాలపై పోలవరం నిర్వాసితులు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు..

భద్రాచలం డివిజన్ తెలంగాణలో ఉండాలా? సీమాంధ్రలో కలపాలా? లేక భద్రాచలం పట్టణాన్ని తెలంగాణలోనే ఉంచేసి, పోలవరం ముంపు గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలిపితే పోలా? అనే చర్చలు అనవసరం. పోలవరం ప్రాజెక్టు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలంతో పాటు, పర్యాటక ప్రాంతం పాపికొండలు, గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో అసలీ ప్రాజెక్టునే అటకెక్కిస్తే పోలా? పోలవరం స్థానంలో మరో ప్రత్యామ్నాయం చూసి గోదావరి మిగులు జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది..




Saturday, February 8, 2014

జనరిక్ మందులనే వాడండి.. ఖర్చు తగ్గించుకోండి..

రోగాన్ని తగ్గించే మందు ఒకటే.. కానీ ఒక్కో డాక్టర్ ఒక్కో పేరు రాస్తాడు.. మీరు కొంటున్న మందు సరైనదే అయినా ఎక్కువ ధర చెల్లిస్తున్నారనే విషయం తెలుసా?
వాస్తవానికి మీరు కొంటున్న మందు అంతకన్నా చౌకగా మార్కెట్లో దొరుకుతుంది.. కానీ మనం డాక్టర్ రాసిచ్చిన మందును అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాం.. ఎందుకంటే డాక్టర్ మందు అసలు పేరు (శాస్త్రీయ నామం) రాయకుండా బ్రాండ్ పేరు మాత్రమే రాస్తున్నాడు.. డాక్టర్ రాసిన బ్రాండ్ (మందు) కొంటే అతనికి సదరు మందు కంపెనీ కమిషన్ ఇస్తుంది.. కానీ వినియోగదారుల జేబులకు మాత్రం చిల్లు పడుతుంది.. విదేశాల్లో డాక్టర్లు తమ రోగులకు మందు అసలు పేరు మాత్రమే రాసి ఇవ్వాలి.. బ్రాండ్ పేరు రాస్తే ఆ డాక్టర్ కి చట్టప్రకారం శిక్షపడుతుంది.. కానీ మన దేశాల్లో చట్టాల కారణంగా ఔషధ వినియోగదారులు దారుణంగా మోసపోతున్నారు..
ఈ మోసాలను ఎదుర్కోవడం మన చేతిలోనే ఉంది.. అదెలా అంటారా?.. మనం జనరిక్ మందులు మాత్రమే వాడాలి.. అంటే బ్రాండెడ్ కాకుండా అసలు పేరుతో ఉన్న మందులే కొనాలి.. బ్రాండెడ్ మందుల కన్నా జనరిక్ మందులు చాలా చౌకగా దొరుకుతాయి.. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న మందులకన్నా జనరిక్ మెడిసిన్ 30 నుండి 80 శాతం తక్కువ ధరకే అందుబాలులో ఉన్నాయి.. ఉదాహరణకు ఒక షుగర్ పేషంట్ బ్రాండెడ్ మందులకు నెలకు 700 రూపాయలు వెచ్చించాల్సి వస్తే అతనికి జనరిక్ మందు కేవలం 200 రూపాయలకే లభిస్తుంది.. అలాగే షుగర్తో పాటు బీపీ ఉన్న పేషంట్ నెలకు 3,000 రూపాయల బదులు 1,200లకే జనరిక్ మందులు కొనుక్కోవచ్చు..
ఇంత చౌక ధరకు దొరికే మందులు అసలు పని చేస్తాయా? అని అనుమానిస్తున్నారా?.. ఆ అనుమానమే వద్దు ఎందుకంటే ప్రముఖ కంపెనీలన్నీ బ్రాండెడ్ మందులతో పాటు జనరిక్ మందులను కూడా తయారు చేస్తున్నాయి.. అంతా బాగానే ఉంది అసలు ఈ జరిక్ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందని అడుకుతున్నారా?..

భారత్ వికాస్ పరిషత్ ఛారిటబుల్ ట్రస్టు అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లోని 9 చోట్ల జనరిక్ మెడికల్ షాపులను నిర్వహిస్తోంది.. ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవా ధృక్పథంతో ఈ జనరిక్ మెడిసిన్ షాపులను నిర్వహిస్తోంది.. ఇంతటి మహత్తర సేవా కార్యాక్రమం అమలు చేస్తున్న భారత్ వికాస్ పరిషత్ ను అభినందిద్దాం.. ఈ కృషిలో మనం కూడా భాగస్వాములం అవుదాం.. జనరిక్ మెడిసిన్ మాత్రమే వాడుదాం.. ఖర్చును తగ్గించుకుందాం..

Friday, February 7, 2014

ఇదేం విష ప్రచారం?..

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అనే సామెత వినే ఉంటారు..
బీజేపీ తెలంగాణకు మద్దతు ఉపసంహరించుకుందట.. మోకాలొడ్డుతుందట.. పార్లమెంటులో బిల్లును అడ్డుకునే కుట్ర పన్నిందట.. చంద్రబాబు ఆ పార్టీని ప్రభావితం చేసిండట.. వెంకయ్య చక్రం తిప్పుతుండట.. ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందట.. ఇందులో నిజం కన్నా అటలే ఎక్కవగా కనిపిస్తున్నాయి..
కొందరు వ్యక్తులు, అందునా మీడియా పర్సన్స్ పని గట్టుకొని చేస్తున్న ప్రచారం ఇది.. ఇలాంటి వార్తలు విని తెలంగాణా వాదులు ఆందోళనకు గురవుతున్నారు. బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు.. ఇక్కడో విషయాన్ని గమనించాలి.. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ ఏమైనా ప్రకటించిందా?.. అసలు ఇంత వరకూ బిల్లే రూపొందలేదు.. చర్చే జరగలేదు.. అప్పుడే ఈ అనుమానాలు ఎందుకు?..
ప్రతి పార్టీకీ వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి.. దీని ప్రకారమే బీజేపీ ముందుకు పోతోంది.. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ ఇవ్వకుంటే తామే ఇస్తామని బీజేపీ నేతలు సష్టంగా చెబుతుంటే, గ్రుడ్డు మీద ఈకలు పీకే ఈ దుష్ప్రచారం ఎందుకు? వారు వ్యూహాత్మకంగా మాట్లాడే మాటలకు పట్టుకొని అదిగో బీజేపీ మోసం చేస్తోంది అంటూ మొత్తుకుంటున్నారు.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీడీపీలో ఇంతగా డ్రామాలాడుతుంటే వదిలేసి, బీజేపీని టార్గెట్ చేయడంలోనే కుట్ర కనిపిస్తోంది.. వీరి కుట్రలో తెలిసో, తెలియకో ఇతర మిత్రులు కూడా భాగస్వాములు అవుతున్నారు..
తెలంగాణ ఇవ్వడంతో పాటు సీమాంధ్ర ప్రాంతానికీ న్యాయం చేయాలని కోరడమే, బీజేపీ పాపమా? ఒక అఖిల భారత, జాతీయ పార్టీగా అన్ని ప్రాంతాల గురుంచి మాట్లాడటంలో తప్పేమన్నా ఉందా? సీమాంధ్ర బీజేపీ నాయకులు మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారు.. అయితే తమ ప్రాంతానికి అన్యాయం చేయొద్దని, ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతున్నారు.. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముందు?

బీజేపీ మీద దుష్ప్రచారం చేస్తున్న మహానుభావులు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మద్దతు ప్రకటించినవారు కాదు, వారు ఏనాడూ బీజేపీతో కలిసి వచ్చిన వారు కాదు.. తెలంగాణను కోరే శక్తులు, పార్టీ మధ్య ఐక్యత కోసం ప్రయత్నించిన పాపాన పోలేదు.. ఇప్పడు తెలంగాణ సాకారమౌతున్న కీలక సమయంలో మాత్రం బురద జల్లుతున్నారు.. ఇందులోని కుట్ర కోణాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.. 

Thursday, February 6, 2014

కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు నందమూరి తారక రామారావు.. ఆత్మగౌరవ నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశారని చరిత్ర చెబుతోంది.. మరి అన్నగారి (సోకాల్ఢ్) తమ్ముళ్లు ఢిల్లీ వీధుల్లో ఏం చేశారో చూడండి..

Wednesday, February 5, 2014

కపట నాటకాలు కట్టిపెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ కు చేరిన వేళ ప్రధాన రాజకీయ పార్టీల కపట నాటకాలు, రెండు నాలుకల ధోరణులు స్పష్టంగా బయటపడుతున్నాయి.. వీరి గురవింద నీతిని గమనించండి..
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు స్పష్టంగా అంగీకారం తెలిపినా, అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తూ తిరుగుబాటు బావుటా ఎగుర వేయడంలోని ఆంతర్యం ఏమిటి? ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వెనుక ఉండి ఆయన్ని ఎగదోస్తోందా? అది నిజం కాదనుకుంటే, పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న సీఎంను, ఇతర సీమాంధ్ర నాయకులను కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు?..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమన్యాయం అంటున్నారు? కానీ సమన్యాయం ఎలా చేయాలో ఎక్కడా చెప్పలేదు.. మరోవైపు ఢిల్లీలో టీడీపీ సీమాంధ్ర నాయకులు బాహటంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే కానీ బాహటంగా తెలంగాణ కోసం వీధుల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువ? దీన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి?.. రెండు కళ్ల సిద్దాంతం పోయి మూడు నాలుకల సిద్దాంతం వచ్చేసిందా?..
ఇక వైఎస్సార్సీపీ మంచికో, చెడుకో సమైక్యాంధ్ర విధానానికే కట్టుబడి ఉంది.. సమైక్యాంధ్ర ఉద్యమ చాంపియన్ గా నలిచి ఆ ప్రాంతంలో పట్టు సాధించాలనే తపనతో తెలంగాణ ప్రజలకు దూరమైపోయింది.. కేవలం ఒక ప్రాంతంలో అధికారం సాధించడమే పరమావధిగా తెలంగాణను వ్యతిరేకిస్తోందని స్పష్టమైపోయింది..
అన్ని పార్టీలు, నాయకత్వాలు ప్రాంతాల వారిగా చీలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు నెగ్గాలంటే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకారం అవసరం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఏమి మాట్లాడినా గుడ్డుపై ఈకలు పీకడానికి సిద్ధంగా ఉన్న మీడియా, ఇతర పార్టీల నేతలు అదిగో బీజేపీ మాట తప్పుతోంది అంటూ వక్రీకరించేస్తున్నారు..  కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ ఈ విషయంలో మరింత స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించకపోతే ఆ పార్టీకి నష్టం అపారంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..

తెలంగాణ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు బట్టకాల్చి ఎదుటువారిపై వేసి తాము భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాయనేది స్పష్టం.. ఇలాంటి ముసుగులో గుద్దులాటలు ఇకనైనా కట్టిపెట్టకపోతే ఇరు ప్రాంతాల ప్రజలే వారికి బుద్ది చెబుతారు..

Tuesday, February 4, 2014

హ్యాట్సాప్ సత్య..

ఒక భారతీయుడు, అందునా తెలుగువాడు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో కావడం మనందరికీ గర్వించదగిన విషయం..
సత్య నాదెళ్ల పూర్తి పేరు.. నాదెళ్ల సత్యనారాయణ. వయసు 47 సం. సత్య నాదెళ్ల తండ్రి బీ.ఎన్.యుగంధర్ ఐఏఎస్ అధికారి.. హైదరాబాద్ లో పుట్టిన సత్య స్వస్థలం గుంటూరు.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.. అనంతరం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ చేశారు.. అక్కడే స్థిరపడ్డారు..
1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల సన్ మైక్రోసిస్టమ్ ప్రాజెక్టుకు సేవలందించారు. ప్రస్తుతం సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు.. ఇప్పుడు బిల్ గేట్స్ తన సీఈవో బాధ్యతలను సత్య నాదెళ్లకు అందించారు..

సత్య నాదెళ్ల పురోగతికి మనమంతా హ్యాట్సాప్ చెబుదాం.. తెలుగువారందరికీ ఆయన ఆదర్శప్రాయుడని నేను గర్వంగా చెప్పగలను..  
సచిన్ టెండూల్కర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ప్రధాని 3 రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారట.. మరి మేజర్ ధ్యాన్ చంద్ కు భారత రత్న ఇవ్వాలనే 3 దశాబ్దాల డిమాండ్ పై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు?

Monday, February 3, 2014

ఒక వికలాంగుడు తన ప్రమేయం లేకుండానే వీఆర్వో పరీక్ష రాసే అర్హతను కోల్పోయిన వార్త ఇది.. ఎంత బాధాకరమైన సంఘటన ఇది.. ప్రభుత్వం రమేష్ కోసం ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి..ఈ వార్తను అందరికీ Share చేసి ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో నెటిజన్లుగా మనవంతు బాధ్యతను తీసుకుందాం..

Sunday, February 2, 2014

ఆమ్ ఆద్మీలో మోడీ, రాహుల్..

అరవింద్ కేజ్రీవాల్ కొత్తగా తన పార్టీలో చేరిన ఇద్దరు సభ్యుల పేర్లు చూసి ఆందోళనకు గురై ఉండాలి..
ఆ ఇద్దరు సభ్యుల నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ..
వీరిద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీలో మెంబర్ షిప్ ఇస్తూ రసీదు కూడా జారీ చేశారు.. నరేంద్ర మోడీ (9001808371), రాహుల్ గాంధీ (9001808330).. అంతే కాదు.. బరాక్ ఓబామా, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్ పేయ్ కూడా ఆప్ సభ్యత్వం తీసుకున్నారట..
దేశ వ్యాప్తంగా కోటి మంది సభ్యులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆప్, ఇప్పటి వరకూ 98 లక్షల మందిని చేర్చుకుందని.. సభ్యత్వ నమోదు ప్రారంభించిన 12 రోజుల్లో రిపబ్లిక్ డే నాటికే 50 లక్షల మంది సభ్యులు చేరారని చెబుతోంది.. దేశ వ్యాప్తంగా తమ పార్టీకి లభిస్తున్న ఆదరణకు మురిసిపోతున్నారు ఆప్ నేతలు..
ఆన్ లైన్ల సభ్యత్వాలు ఇచ్చేస్తూ, కంప్యూటర్ జనరేటెడ్ రసీదులు ఇచ్చేస్తోంది. ఆ తర్వాత సభ్యత్వ కార్డులు ఇస్తారట.. దీని ఆసరాగా తీసుకొని కొందరు ఆకతాయిలు ఇలా ప్రముఖుల పేర్లపై సభ్యత్వాలు నమోదు చేశారే అనుకుందాం.. నిర్ధారించుంకోవాల్సిన అవసరం లేదా?.. ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, విద్రోహులు సైతం సభ్యత్వం తీసుకుంటే బాధ్యత ఎవరు వహించాలి..

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేకున్నా, ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరినట్లు ఆప్ ప్రకటించుకోవడం తెలిసిందే.. సహజంగా ఆ పార్టీ సానుభూతిపరులే ఎస్ఎంఎస్ లు పంపుతారనేది అందరికీ తెలిసిన రహస్యమే.. కొన్నేళ్ల క్రితం ఓ పార్టీ వారు సిమ్ కార్డులు విక్రయిస్తున్న విధానం ద్వారా రోడ్లపై జనాలకు సభ్యత్వాలు ఇచ్చారు.. నేనూ సరదాగా సభ్యత్వం తీసుకున్నాను.. అయితే సదరు పార్టీ ఏనాడు తమ కార్యక్రమాలు, విధానాల సమాచారాన్ని నాకు చెప్పిన పాపాన పోలేదు.. సిమ్ ఇవ్వడానికి ఇప్పడు గుర్తింపు అడుగుతున్నారు.. కానీ రాజకీయ పార్టీలు సభ్యత్వాలు ఇచ్చేందుకు అవేవీ అడగడం లేదు..


Saturday, February 1, 2014

ఈ గురవింద మాత్రమే సుద్దపూస అట..

వీరు అవినీతి పరులు, వీరిని ఓడించండి అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఓ చిట్టా విప్పారు.. మంచిదే అవినీతిపై పోరాటం చేసేవారు ఎవరైనా ప్రోత్సహించాల్సిందే.. మరి సుద్దలు వల్లిస్తున్న కేజ్రీవాల్ సంగతేంటో ఓసారి చూడండి...
అవినీతి రహిత సమాజం అంటూ గొప్పలు చెబుతున్న కేజ్రీవాల్ తో సహా ఆమ్ అద్మీ పార్టీ నేతల వ్యవహారం మొదటి నుండీ సందేహాస్పదంగానే ఉంది. వీరి అంతర్జాతీయ సంబంధాలు విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నాయి.. భారత దేశ వ్యతిరేక, విచ్చిన్నకర శక్తుల నుండి సైతం విరాళాలు దండుకున్న చరిత్ర వీరిది..
భారత్ ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్న ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ) సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ, చైనా సెక్యూరిటీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్న అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్.. కేజ్రవాల్, మనీష్ సిసోడియాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ కబీర్ కు రూ.86,61,742 రూపాయలను అందించినట్లు పత్రికల్లో వచ్చింది.. అమెరికాకే చెందని మరో సంస్థ పీఆర్ఐఏ, డచ్ ఎంబసీ, యునైటెడ్ నేషనల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ల నుండి కూడా నిధులు అందాయి.. మూడేళ్లలో నాలుగు లక్షల డాలర్ల విదేశీ నిధులు  సంస్థకు చేరాయట..  సాధారణంగా ఈ సంస్థలు సేవ ముసుగులో ఒక మతానికి ప్రచారం కోసం నిధులు ఇస్తాయనేది బహిరంగ రహస్యం.. ఆమ్ ఆద్మీ పార్టీలోని పలువురు వివాదాస్పద వ్యక్తులకు కాశ్మీర్ వేర్పాటువాద, మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం..
తమకు పాకిస్తాన్ నుండి సైతం విరాళాలు వస్తాయని కేజ్రీవాల్ ఒకసారి గొప్పలకు పోయాడని పత్రికల్లో చదవివాను.. మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న శత్రు దేశం నుండి విరాళాలు తీసుకునేందుకు సిగ్గు పడాలి.. ఇది దేశ విద్రోహక చర్యే అవుతుంది..
ఇలాంటి వారా సచ్ఛీలత గురుంచి, అవినీతి మాటలాడేది.. కేజ్రీవాల్ సుద్దపూస ఏమీ కాదు.. గురవింద తన కింది నలుపును చూసుకోకుండా ఇతరుల నలుపును చూసి వెటకారంగా నవ్వుతుందట.. మనోడి కత కూడా అట్లే ఉంది.. అవినీతి పాలన అందిస్తున్న ఘన చరిత్రను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేరు కేజ్రీ చిట్టాలో ఎందుకు లేనట్లు?.. ఆమెతో ఆయనకు ఉన్న రహస్య సంబంధాలు ఏమిటి?..  

కేజ్రీవాల్ ముసుగు వ్యవహారాలు తెలియక పలువురు ప్రవాస భారతీయులు ఈయనో పెద్ద పోటుగాడని భావించి భూరి విరాళాలు పంపారు.. ఈయన ఢిల్లీ సీఎం అయిన తర్వాత ముసుగు తొలిగిపోయి, ఆప్ మంత్రుల ఆగడాలు చూసి ఎన్నారైలు బాధ పడుతున్నారట?.. ఇప్పటి దాకా వచ్చిన నిధుల ప్రవాహం క్రమంగా తగ్గిపోయాయనే అక్కసుతోనే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలపై ఎదురు దాడులకు దిగుతున్నారట..