Sunday, February 9, 2014

పోలవరం ప్రాజెక్టు ఎలా చూసినా ముప్పే..

రాష్ట్ర విభజన నేపధ్యంలో భద్రాచలం-పోలవరం భవిష్యత్తు కీలకంగా మారింది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు వీలుగా భద్రాచలం పట్టణం మినహా మిగతా ముంపు గ్రామాలను సీమాంధ్రకు బదిలీ చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అయితే ఎంత దాచినా దాగని బహిరంగ నిజాలను మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం..
పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే లాభాల సంగతి దేవుడెరుగు.. కానీ అనర్ధాలే అధికంగా కనిపిస్తున్నాయి.. గోదావరితో పాటు ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, తాలిపేరు ఉప నదులకు ఎప్పడు వరదలు వచ్చినా భద్రచలం పట్టణంలోకి నీరు వచ్చేస్తోంది.. రామాలయం ముందున్న ప్రాంగణమంతా వరద నీటిలో ఉంటోంది.. భద్రాచలం దగ్గర మొదటి వరద ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు, మూడో హెచ్చరిక 53 అడుగులు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 150 అడుగు.. ప్రాజెక్టు ఒక మోస్తారు నిండితే భద్రాచలం దగ్గర గోదావరిలో నీరు 43 అడుగుల మేర ఉంటుంది.. అంటే భద్రాచలం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరినట్లే.. ఏ మాత్రం వాన వచ్చినా భద్రాచలం మునిగిపోవడం ఖాయం.. ఏడాది క్రితం ఈ ప్రాంతాన్ని నేను స్వయంగా పరిశీలించాను (చిత్రాలు చూడండి)
పోలవరం ప్రాజెక్టులను నిర్మిస్తే మునిగిపోయే గ్రామాలు 350కి పైగానే ఉన్నా ప్రభుత్వం వ్యూహాత్మకంగా 278 గ్రామాలు మాత్రమే మునుగుతాయని నమ్మబలుకుతోంది.. ఇందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 205 గ్రామాలు ఉన్నాయి. మిగతావి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్నాయి,, అంటే ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలకు మాత్రమే నష్ట పరిహారం వస్తుంది.. మిగతా జనావాసాల భవిష్యత్తును భద్రాది రాముడికే అప్పగించేశారు.. పోలవరం నిర్మాణం వల్ల ఎక్కువు నష్టపోతున్నది గిరిజనులే.. ప్రఖ్యాత పర్యాట ప్రాంతమైన పాపికొండలతో సహా గిరిజనుల ఆవాసాలు, వారి సంస్కృతి, సాంప్రదాయాలు గోదారిలో కలిపితోయే ప్రమాదం ఏర్పడింది..
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంస్థలు పోరుబాట పట్టాయి.. అటు పోలవరం ప్రాజెక్టును ఒడిషా, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.. పోలవరం సాకును చూపి కొన్న విచిన్నకర శక్తులు గిరిజనులను తమవైపు ఆకర్శిస్తున్నాయి.. ఈ పరిణామం మరింత ఆందోళనను కలిగిస్తోంది.. లక్షలాది ఎకరాల అడవులను మింగేస్తున్న ఈ ప్రాజెక్టు పర్యావరణ సమతౌల్యానికి కూడా ముప్పే.. అడవుల్లోని జీవరాసుల పరిస్థితిని కూడా ఆలోచించండి..
పోలవరం ప్రాజెక్టువల్ల ఉపయోగాలు కనిపిస్తుండవచ్చు.. కానీ మన కళ్ల ముందే కఠిన వాస్తవాలు కనిపిస్తుంటే అసలు ఈ ప్రాజెక్టు అవసరమా అనిపిస్తోంది.. కొందరికి మేలు చేయడం, కోసం మరి కొందరి జీవితాలను పణంగా పెట్టడం అవసరమా? ప్రభుత్వ పరిహారం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే, రాష్ట్రంలోని ఎన్నో ప్రాజెక్టుల నిర్వాసితులు దిక్కులేని వారైపోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.. ఈ అత్తెసరు పరిహారాలపై పోలవరం నిర్వాసితులు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు..

భద్రాచలం డివిజన్ తెలంగాణలో ఉండాలా? సీమాంధ్రలో కలపాలా? లేక భద్రాచలం పట్టణాన్ని తెలంగాణలోనే ఉంచేసి, పోలవరం ముంపు గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలిపితే పోలా? అనే చర్చలు అనవసరం. పోలవరం ప్రాజెక్టు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలంతో పాటు, పర్యాటక ప్రాంతం పాపికొండలు, గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో అసలీ ప్రాజెక్టునే అటకెక్కిస్తే పోలా? పోలవరం స్థానంలో మరో ప్రత్యామ్నాయం చూసి గోదావరి మిగులు జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది..




No comments:

Post a Comment