Friday, February 21, 2014

తెలుగు లెస్స..

సోదరులారా, మిత్రులారా..
కాసేపు తెలంగాణ, సీమాంధ్ర గొడవను పక్కన పెట్టండి.. మనకు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి చాలా సమయం ఉంది.. ముందు ఈ విషయం మీద దృష్టి పెట్టండి..
ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. (నవ్వొచ్చిందా?) ఏం చేస్తాం ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని మరచిపోయి ఉండొచ్చు.. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా తెలుగు మన మాతృభాష.. మనం మాట్లాడుకుంటున్నది, చదువుకుంటున్నది, తిట్టుకుంటున్నది, నిత్య వ్యవహారాలు సాగిస్తున్నది ఈ భాషలోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి..
ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగానే తెలుగు వారున్నారు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది కోట్ల మంది తెలుగువారు ఉంటే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, భారత్ లోని వివిధ ప్రాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా మిగతా వారు నివసిస్తున్నారు.. మనుగడ కోసం మనం ఏ భాషలో వ్యవహారాలు సాగిస్తున్నా వారసత్వంగా వస్తున్న మన భాష, సంప్రదాయాలను కాపాడుకోవడంలోనే మన అస్థిత్వం ఉంటుందనే వాస్తవాన్ని మరచిపోకండి..
భారత దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని గొప్పగా చెప్పుకుంటాం.. కానీ తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకునే ప్రయత్నం ఏనాడూ సవ్యంగా జరగలేదు.. అసలు అధికార భాషగా తెలుగును పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపాన కూడా పోలేదు.. ఈ నాటికీ ప్రభుత్వ వ్యవహారాలు ఆంగ్లంలోనే సాగుతున్నాయి.. ఇందుకు మనను మనమే నిందించుకోవాలి.. ఈ విషయంలో ఇతర దక్షిణాధి రాష్ట్రాలను చూసి బుద్ది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది..
తెలుగు భాష ఇంకా మనుగడలో ఉందంటే మనలో ఉన్న భాషాభిమానమే అంతో ఇంతో కారణం... ఇందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమీ లేదు.. తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అపోహను సృష్టించారు.. ఇప్పడు ఉద్యోగాలు చేస్తున్న వారిలో అత్యధికులు తెలుగు మీడియంలోనే చదువుకున్నవారే కాదా? తెలుగు భాషను పని గట్టుకొని హత్య చేస్తున్నది మన పాలకులే.. తెలుగు మీడియంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అదనపు అర్హతగా నిర్ణయిస్తే ఈ పరిస్థితి ఉండేదా? తెలుగు మీడియం పాఠశాలలను క్రమంగా కనుమరుగు అవుతున్నాయి.. ప్రభుత్వం సైతం ఇంగ్లీషు మీడియం పాఠశాలలనే ప్రోత్సహిస్తోంది..
మనుగడ, ఉపాధి అవకాశాల కోసం మనం ఏ భాషలో వ్యవహారాలు సాగించినా తప్పులేదు.. కానీ తెలుగుతో తెలుగు వారి మధ్య తెలుగులోనే వ్యవహారాలు సాగిద్దాం.. మన ఇంట్లో, బంధు మిత్రులతో తెలుగులోనే మాట్లాడదాం.. ఫేస్ బుక్ లాంటి సామాజిక మీడియాల్లో తెలుగు భాషను ప్రోత్సహిద్దాం.. తెలుగును కాపాడుకోవడమే కాదు, మరింతగా వ్యాప్తి చేయడం కూడా అవసరం..

తెలంగాణ, సీమాంధ్రలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు భాష ఉనికికి వచ్చే నష్టం ఏమీ లేదు.. రెండు రాష్ట్రాల్లో భాషా, సంస్కృతులను రక్షించుకునే ప్రయత్నాలు చేయాలి.. అవసరమైతే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉండాలి..

No comments:

Post a Comment