Wednesday, February 5, 2014

కపట నాటకాలు కట్టిపెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ కు చేరిన వేళ ప్రధాన రాజకీయ పార్టీల కపట నాటకాలు, రెండు నాలుకల ధోరణులు స్పష్టంగా బయటపడుతున్నాయి.. వీరి గురవింద నీతిని గమనించండి..
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు స్పష్టంగా అంగీకారం తెలిపినా, అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తూ తిరుగుబాటు బావుటా ఎగుర వేయడంలోని ఆంతర్యం ఏమిటి? ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వెనుక ఉండి ఆయన్ని ఎగదోస్తోందా? అది నిజం కాదనుకుంటే, పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న సీఎంను, ఇతర సీమాంధ్ర నాయకులను కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు?..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమన్యాయం అంటున్నారు? కానీ సమన్యాయం ఎలా చేయాలో ఎక్కడా చెప్పలేదు.. మరోవైపు ఢిల్లీలో టీడీపీ సీమాంధ్ర నాయకులు బాహటంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే కానీ బాహటంగా తెలంగాణ కోసం వీధుల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువ? దీన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి?.. రెండు కళ్ల సిద్దాంతం పోయి మూడు నాలుకల సిద్దాంతం వచ్చేసిందా?..
ఇక వైఎస్సార్సీపీ మంచికో, చెడుకో సమైక్యాంధ్ర విధానానికే కట్టుబడి ఉంది.. సమైక్యాంధ్ర ఉద్యమ చాంపియన్ గా నలిచి ఆ ప్రాంతంలో పట్టు సాధించాలనే తపనతో తెలంగాణ ప్రజలకు దూరమైపోయింది.. కేవలం ఒక ప్రాంతంలో అధికారం సాధించడమే పరమావధిగా తెలంగాణను వ్యతిరేకిస్తోందని స్పష్టమైపోయింది..
అన్ని పార్టీలు, నాయకత్వాలు ప్రాంతాల వారిగా చీలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు నెగ్గాలంటే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకారం అవసరం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఏమి మాట్లాడినా గుడ్డుపై ఈకలు పీకడానికి సిద్ధంగా ఉన్న మీడియా, ఇతర పార్టీల నేతలు అదిగో బీజేపీ మాట తప్పుతోంది అంటూ వక్రీకరించేస్తున్నారు..  కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ ఈ విషయంలో మరింత స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించకపోతే ఆ పార్టీకి నష్టం అపారంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..

తెలంగాణ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు బట్టకాల్చి ఎదుటువారిపై వేసి తాము భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాయనేది స్పష్టం.. ఇలాంటి ముసుగులో గుద్దులాటలు ఇకనైనా కట్టిపెట్టకపోతే ఇరు ప్రాంతాల ప్రజలే వారికి బుద్ది చెబుతారు..

No comments:

Post a Comment