Tuesday, February 18, 2014

మరో మైలు రాయి అదిగమించాం..

నిజంగా ఇది చారిత్రక దినం.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర సాధనలో మరో ప్రధాన మైలు రాయి దాటాం.. బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించడంతో కీలక ఘట్టం పూర్తయింది..
ఎన్ని పోరాటాలు.. ఎన్ని త్యాగాలు.. ఎన్నిఆత్మ బలిదానాలు.. ఎన్ని అవమానాలు ఎదురైనా సహించాం.. ఇది ప్రజా విజయం.. ఆరు దశాబ్దాల ఆకాంక్ష ఇది.. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సజీవంగా ఉన్నందునే ఉద్యమం ఎప్పటికప్పడు కొత్త ఊపిరి పొందుతూ, రగులుతూనే ఉంది..
మన పోరాటం మన కోసమే.. ఎవరిపైనా మనకు శత్రుత్వం వద్దు.. చరిత్ర గతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రాజ్యాలు పుట్టాయి.. కాలగర్భంలో కలిశాయి.. సరిహద్దులూ మారుతూ వచ్చాయి..
మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు, కుతుబ్ షాషీలు, అసఫ్ జాహీలు, బ్రిటిష్ వారు పాలించిన నేల ఇది.. శతాబ్దాలుగా కలుస్తున్నాం, విడిపోతున్నాం.. నిన్నటి హైదరాబాద్, ఆంధ్ర అయినా, నేటి ఆంధ్రప్రదేశ్ అయినా ఇతే.. రానున్న తెలంగాణ కూడా అంతే నిజం..
ఇప్పటి వరకూ కలిసి ఉన్న మనం అనివార్యతల వల్లే విడిపోతున్నా.. విభజన పరిపాలన సౌలభ్యం కోసమే.. మన సరిహద్దులకే దీన్ని పరిమితం చేద్దాం.. స్నేహాలకు, బంధుత్వాలకు విభజన ఉండదు.. బంధు మిత్రుల మధ్య ఉన్నట్లే ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు, తీర్థయాత్రలు, విహార యాత్రలు యధావిధిగా ఉంటాయి.. రాజకీయ నాయకుల మాయలో పడి మనం వీధి పోరాటాలకు దిగి శత్రుత్వాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు..
రాష్ట్ర విభజన ప్రాంతాలకు అతీతంగా బాధను కలిగించడం సహజం.. అపోహలు పెంచుకుంటూ, నిత్యం సంఘర్షించుకోవడం కన్నా విడిపోడమే మంచిది.. కొన్ని చేదు ఘటనలు, చారిత్రక సత్యాలు జీర్ణించుకోక తప్పదు..

తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా మనం ఈ దేశ ప్రజలమే.. భారత మాతకు జై పలుకుదాం..

No comments:

Post a Comment