Thursday, February 13, 2014

ప్రేమికులకు దినమా?..

కాలేజీలు వదిలే సమయం.. కోఠిలో సీజినల్ వ్యాపారం చేసే కుర్రాడు చాలా బిజీగా ఉన్నాడు.. నన్ను చూడగానే నమస్తే సార్ అని పలకరించాడు.. నేను అతని క్షేమ సమాచారం అడిగి ఏమి అమ్ముతున్నాడా? అని గమనించాను.. రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్స్.. ఫిక్సుడ్ రేటట.. ఏమిటివి? అని అడిగాను యధాలాపంగా.. మీకు తెల్వక పోవుడు ఏమిటి సార్?.. బదులిచ్చాడు. నాకు అర్ధమైనా ఏమి చెబుతాడా అనే ఆసక్తితో తెల్వదని చెప్పాను.. లవ్వర్స్ డే అంట సార్.. లవ్వర్లు ఇవి ఒకరికొకరు అచ్చుకుంటరంట ఇవి అంటూ నవ్వూతా చెప్పాడు.. వార్నీ లవ్వర్స్ డే సంగతి ఏమిటో గానీ వీడి గిరాకీ మాత్రం బాగుందనుకొని ముందుకు సాగాను..
అసలు ప్రేమ అంటే ఏమిటి?.. మనం భగవంతున్నిప్రేమిస్తాం.. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, తోబుట్టువులతో ప్రేమగా మెలుగుతాం..  బంధుమిత్రులను, తోటి మనుషులను ప్రేమగా పలకరిస్తాం.. చివరకు మనం పెంచుకునే పెంపుడు జంతువులను కూడా ప్రేమగా చూసుకుంటాం.. ఇదంతా ప్రేమే కదా?
ప్రేమ అంటే కేవలం యువతీ యువకుల మధ్య సాగే వ్యవహారమేనా?.. ఆకర్షణ,శృంగారాసక్తి మాత్రమే ప్రేమనా?.. మరి ఇదంతా జంతువులకూ ఉంటుంది కదా? ఈ విధమైన అభిప్రాయాలు నేటి సమాజంలో ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.. పాశ్చాత్య పోకడలు, ఆధునిక సాహిత్యం, సినిమాలు, మీడియా ప్రేమకు అర్ధాన్ని మార్చేశాయి.. ఒకే కోణంలో ప్రేమను చూపిస్తున్నాయి..
ప్రేమికులు రోజు పేరుతో ఒక దినం పెట్టుకోడం.. ఫిబ్రవరి 14న సినిమా థియేటర్లు, పార్కులు, పబ్బులెమ్మట తిరిగేయడం.. చిలిపి చేష్టలు చేస్తూ, ఏ భజరంగ్ దళ్ వాడో చూస్తే పట్టుకొని ఎక్కడ పెళ్లి చేస్తాడోనని భయం, భయంగా మెదలడం ఎందుకు? ప్రేమ ఒక్కరోజుతో పుట్టి, ఆ రోజుతోనే చచ్చి పోదు కదా? ప్రేమ ఒక్క రోజులో పుట్టి, ఒక్క రోజులోనే అంతరిస్తుందా? అలాంటప్పుడు ఎందుకీ అర్థం పర్థం లేని ప్రేమికుల రోజు.. నిజానికి మన దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోవడం మెట్రో నగరాలకే పరిమితంగా ఉండేది.. కానీ మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది.. గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు అమ్ముకునేవారికి వ్యాపార లాభాలు, మీడియాకు ప్రకటనలు, టీఆర్పీ రేటింగ్ల ఆదాయానికి మాత్రమే పనికి వచ్చే దినమిది..
నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా ఎన్నుకోవడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ ప్రేమ పేరిట తాత్కాలిక ఆకర్షణలకులోనై మీ జీవితాలను పాడు చేసుకోకండి అని మాత్రమే సూచిస్తున్నాను.. జీవితాంతం తోడుండే భాగస్వామిని కోరుకోండి.. ప్యాంటూ, షర్టూ మార్చేసినట్లు మీ భాగస్వాములను విడాకుల పేరిట తరిమేసి కొత్త వారికోసం అన్వేషించే దౌర్భాగ్యం అవసరమా? నేను ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన జంటలను వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను..
ప్రేమ అనేది తాత్కాలికం కారాదనేది నా భావన.. ప్రేమకు విస్తృతమైన అర్ధం ఉంది.. ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్య నూతనం.. ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయగలమా? 
చరిత్ర పుటలు తిరగేస్తే తిరగేస్తే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సూటిగా సమాధానం ఉండదు.. వాలెంటైన్స్ డే మత పరమైన వేడుకే తప్ప ప్రేమికులకు సంబంధించింది కాదు.. ఓ మత ప్రచారకుడు ప్రేమతత్వాన్ని ప్రచారం చేయడం.. అతన్ని చక్రవర్తి బంధించి ఉరి తీయడం.. ఈ లోగా ఆ ప్రచారకుడు జైలరు కూతురుకు ప్రేమ లేఖ రాయడం (కూతురు వయసులో ఉన్న యువతిపై ఆ మత ప్రచారకునికి ప్రేమ ఏమిటో?)..


వాలెంటైన్స్ డే రోజులన గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొని పార్కులు, గట్లెమ్మట తిగినంత మాత్రాన ప్రేమ బలపడుతుందా? ఈ ఒక్క రోజు ప్రేమించుకుంటే చాలా? ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి కాని దానికో దినం పెడితే ఎలా? నిజానికి దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. ఎవరైనా నా భావాలతో ఏకీభవిస్తే సంతోషం.. ఏకీభవించకున్నా నేనేమీ బాధపడను.. నేను ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment