Thursday, February 20, 2014

హంతకులను క్షమించారు.. పీవీపై కక్ష పెంచుకున్నారు..

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తులో నాటి ప్రధాని పీవీ నరసింహారావు జాప్యం చేస్తున్నా సోనియా గాందీ కోపం పెంచుకున్నారు.. పీవీ కావాలనే ఈ కేసును తొక్కి పెడుతున్నారని కోటరీ చెప్పిన చాడీలు విని ఆయనపై అనుమానాలు పెంచుకున్నారు సోనియా.. ఈ కక్షతోనే తదుపరి ఎన్నికల్లో పీవీ నరసింహారావుకు పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు.. పీవీ మరణించాక ఆయన పార్ధివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించకుండా రోడ్డుపై నుండే పంపేశారు.. ఢిల్లీలో ఘాట్ నిర్మించాల్సి వస్తుందో అనే భయంతో ఢిల్లీలో అంత్యక్రియలకు కూడా ఒప్పుకోలేదు.. చివరకు హైదరాబాద్తో పీవీ శవం సగమైనా కాలకుండా వదిలేయడం విమర్శలకు దారి తీసింది.. నెక్లెస్ రోడ్డుపై పీవీ ఘాట్ ఈనాటికీ పూర్తి కాలేదు.. ఇప్పడు అసలు విషయానికి వద్దాం..
రాజీవ్ హత్య కేసులో నేరగాళ్లకు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చింది.. వీరు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుకుంటూ పెట్టుకున్నపిటిషన్ ను కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టింది.. ఈ భారీ జాప్యం కారణంగానే హంతకుల పిటిషన్ ప్రకారం నిర్ణయం తీసుకోలే తప్పలేదని సుప్రీం కోర్టు చేతులెత్తేసింది.. ఈ హంతకులకు ఉరి శిక్ష రద్దు చేయాలని కొన్ని తమిళ అతివాద సంస్థలు, రాజకీయ పార్టీలు  చేస్తున్న డిమాండుకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల యావలో పడి ఇంత కాలంగా కావాలనే క్షమాభిక్ష పిటిషన్ ను పట్టించుకోలేదనేది వాస్తవం.. గత పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వాన్ని శాసిస్తున్నది ఎవరు? స్వయంగా రాజీవ్ గాంధీ సతీమణి అయిన సోనియా గాంధీ కాదా? ఇక్కడ మనం ఎవరిని నిందించాలి?.. సోనియానా?.. పీవీనా?
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష విషయంలో సోనియా, ఆమె కుటుంబ సభ్యులు సానుకూలంగా ఉన్నారనే వార్తలు విన్నాం.. ఇది మానవతా దృక్ఫధంతో తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.. కానీ రాజకీయాల కోసం ఈ కేసును వాడుకోవడమే బాధాకరం.. ఆనాడు రాజీవ్ హత్య కేసులో దర్యాప్తును జాప్యం చేశారని పీవీని నిందించిన సోనియా, హంతకులకు ఉరి శిక్ష పడ్డ తర్వాత తాను చేసిన పనేమిటో ఆత్మ విమర్ష చేసుకోవాల్సిన అవసరం లేదా? తమిళనాడులో ఎల్టీటీఈకి, ప్రభాకరన్ కు సహకరించిందనే సాకుతో ఆనాడు డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి  పాలన పెట్టారు.. కానీ తర్వాత కాలంలో అదే డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది.. తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈపై సానుభూతి విషయంలో డీఎంకే వైఖరి ఆనాటికి, ఈనాటికీ ఏమాత్రం మారలేదు..

సోనియా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం తన భర్త హంతకులు, వారి సానుభూతిపరుల విషయంలో ఇంతగా రాజీ పడినప్పడు ఈ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని పీవీ నరసింహారావుపై ఎందుకు కక్ష కట్టినట్లు? ఎందుకు బలి పశువును చేసినట్లు?.. సోనియమ్మ ఎలాగూ వివరణ ఇచ్చుకోలేదు.. కానీ కనీసం కాంగ్రెస్ నాయకులైనా సమాధానం చెప్పుకోగలరా?

No comments:

Post a Comment