Thursday, March 31, 2016

కోటంరెడ్డి ఆదర్శం

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతాలను అడ్డగోలుగా పెంచేసుకున్నారు.. ప్రజల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా తమకేమీ పట్టనట్లు దులిపేసుకున్నారు.. ఈ విషయంలో అన్ని పార్టీలు తమ సిద్దాంతాలు, విబేధాలు పక్కన పెట్టి దొందుకు దొందే అన్నట్లు ప్రవర్తించాయి.. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీతాల పెంపును తిరస్కరించారు.. ఎమ్మెల్యేగా తన పదవీ కాలం 60 నెలల్లో వచ్చే 60 లక్షల రూపాయల జీతాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని ప్రకటించారు.. పేద విద్యార్థుల స్కాలర్ షిప్స్,స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణానికి ఉపయోగిస్తానని తెలిపారు.. తనకు గన్ మెన్ అవసరం లేదన్నారు. ఇందుకు ఐదేళ్లకు అవసరమయ్యే ఖర్చు రూ.2 కోట్లను ప్రజలకు ఉపయోగపడే పనులకు కేటాయిస్తానని చెప్పారు కోటంరెడ్డి.. అలాగే శాసనసభలో మైకులు విరగొట్టబోనని, ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించనని స్పష్టం చేశారు..

ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కోట్లకు పడగెత్తినవారేనని, వీరికి జీతాలు పెంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు.. వైసీపీకి నేను సానుభూతిపరున్ని కూడా కాదు.. కానీ శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను.. అందరూ ప్రజాప్రతినిధులు ఇదే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.. 

బాబోయ్ హైజాకర్..

ప్రియురాలి కోసం విమానం హైజాక్.. మున్ముందు కూరలో కారం ఎక్కువేసిన భార్య అరెస్టు కోసం కూడా హైజాకులు జరుగుతాయేమో..

Tuesday, March 29, 2016

తెలుగు వారికి టీడీపీ అవ‌స‌రం తీరిందా?

తెలుగు దేశం పార్టీ.. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఇదేమి పేరని అంద‌రూ అనుకున్నారు.. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీ రామారావు స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎదురు లేని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.. అప్పటి వరకూ ఢిల్లీ పాలకులకు దక్షిణ భారతీయులంటే మద్రాసీలుగానే తెలుసు.. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వారికి జాతీయ స్థాయిలో గౌరవ స్థానం కల్పించడంలో ఎన్టీఆర్ పాత్రను కాదనలేం.. తెలుగు భాష , సంస్కృతీ సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారాయన..

1995లో రామారావును బలవంతంగా పదవీచ్యుతున్ని చేసి పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రూపు రేఖల‌ను స‌మూలంగా మార్చేశారు.. పార్టీ పేరులోనే తెలుగు ఉంది కానీ మన భాషా సంస్కృతుల పరిరక్షణకు బాబు పెద్దగా చేసిందేమీ లేదు.. తెలుగు భాష ప‌రిస్థితి దిగజారింది కచ్చితంగా చంద్రబాబు హయాలోనే.. మ‌చ్చుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు సచివాలయం దగ్గర  ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం తెలుగు తల్లి విగ్రహాన్ని క్రేన్ తో పెకిలిస్తే సగానికి విరగడం ఇందుకు పరాకాష్ట.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హడావిడిగా కొత్త విగ్రహాన్ని చేయించి సచివాలయం ఎదుట ప్రతిష్టించారు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రచారం హోరులో తెలుగు మీడియం పాఠశాలు దెబ్బతిని ఒక తరం మాతృ భాషకు దూరమైంది బాబు గారి హయాంలోనే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. చివరకు టీడీపీ వెబ్ సైట్ల్ లోనూ ఆంగ్లానికే పెద్ద పీట..
2004లో అధికారం కోల్పోయింది టీడీపీ.. 2009లో వ‌రుస‌గా రెండో ఓటమి ఎదురైంది.. 2014 వ‌చ్చే స‌రికి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ‌లో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా పొంద‌క‌పోగా, గెలిచిన ఎమ్మెల్యేలలో రెండొంతుల‌కు పైగా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు.. తెలంగాణ‌లో టీడీపీ అస్థిత్వ‌మే ప్ర‌మాదంలో ప‌డింది.. జాతీయ పార్టీగా మారాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీకి మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి ఇది..
భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను అంఛ‌నా వేయ‌డంలో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంది.. తెలుగు ఆత్మ‌గౌర‌వ స్థానాన్ని తెలంగాణ ఆత్మాభిమాన‌వాదం అధిగ‌మించింది ఈ విష‌యాన్ని తెలుగుదేశం ఆల‌స్యంగా గ్ర‌హించింది.. మొద‌ల స‌మైక్య‌వాదాన్ని బ‌లంగా వినిపించి చేతులు కాల్చుకున్న టీడీపీ, మారిన ప‌రిస్థితుల్లో గంద‌రగోళంలో ప‌డింది.. ఎటూ తేల్చుకోలేక రెండు క‌ళ్ల సిద్దాంతంతో తెలంగాణ‌లో బోల్తాప‌డింది.. తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్పుడు టీడీపీ కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌రిమిత‌మైన పార్టీగానే చూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఆ పార్టీకి అధ్య‌క్షునిగా ఉన్న చంద్ర‌బాబు, ఏపీకి ముఖ్య‌మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. నిజంగా టీడీపీకి రెండు రాష్ట్రాలూ స‌మాన‌మ‌ని భావించిన‌ట్ల‌యితే చంద్ర‌బాబు ఒక ప‌ద‌విని వ‌దులుకోవ‌డం మంచిద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.. అప్ప‌టి వ‌ర‌కూ తెలంగాణ‌లో ప్ర‌జ‌లు టీడీపీని అనుమానంగానే చూస్తారు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగువారి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం అని చెబుతున్న టీడీపీ చిత్త‌శుద్దిని అనుమానించ త‌ప్ప‌దు.. త‌మిళ‌నాడులో ద్ర‌విడ పార్టీల‌న్నీ త‌మ భాషా సంస్కృతుల‌ను కాపాడ‌టంలో ఏక‌తాటిపై నిలుస్తాయి.. కానీ ఈ ప‌ని తెలుగునాట టీడీపీ చేయ‌లేక‌పోయింది.. తెలుగువారు ఎక్క‌డ ఉన్నా వారి సంక్షేమ‌మే త‌మ‌కు ముఖ్య‌మ‌ని చెబుతున్నతెలుగు దేశం పార్టీ, ఏనాడైనా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి కష్టాలను పట్టించుకుందా? అక్కడి తెలుగు వారు తమ భాష, సంస్కృతుల విషయంలో అడుగడుగునా వివక్షకు గురై ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు.. వారి హక్కుల గురుంచి టీడీపీ ఏనాడైనా పోరాడిందా?
35వ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్న తెలుగుదేశం పార్టీ కాలానుగుణంగా మార‌క త‌ప్ప‌దు.. నిజంగా తెలుగు ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యం అని ఆ పార్టీ భావిస్తే ద్వంద్వ ప్ర‌మాణాలు క‌ట్టిపెట్టి చిత్త‌శుద్దిని ఆచ‌ర‌ణ‌లో చూపించాలి.. (మార్చి29న టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా)

జీతాలు పెంచేసుకున్నారు..

 
మొత్తానికి మన 'ప్రజాసేవకులు' ప్రజలతో సంబంధం లేకుండా తమ తమ జీతాలు తాము పెంచేసుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేతనాలు Rs 95,000 నుండి ఏకంగా Rs 2,50,000లకు చేరాయి.. నిజానికి వారికి ఇప్పుడున్న జీతాలే ఎక్కువ.. ఇంకా చెప్పాలంటే ఇవి కూడా తగాల్సిందే..
ప్రజలు వీరిని తమ ప్రతినిధులుగా చట్ట సభలకు పంపింది తమ సమస్యలను పరిష్కరించడానికి.. ఇది ఉద్యోగం కాదు.. వీరు తీసుకోవాల్సింది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమే..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారా అన్న విషయాన్ని నేను చర్చించ దలచుకోలేదు.. అది ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి.. వారిని ఎన్నుకున్న ప్రజలు నిర్ణయించాలి..
మన ప్రజా ప్రతినిధులకు చట్ట బద్దంగా వచ్చే జీత భత్యాలకు తోడుగా 'చాలా' మందికి 'ఆమ్యామ్యాలు' ఉంటాయన్నది బహిరంగ రహస్యం.. జీతాలు భారీగా పెంచినందున వాటిని వదులుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది..
మన సమాజంలో ఎంతోమంది శ్రామికులు, కర్షకులు, చిరుద్యోగులు చాలీ చాలని జీతాలు, సంపాదనతో బతుకు బండి ఈడుస్తున్నారు.. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేని రోజు ఏనాడైనా ఉందా?.. వారి సంక్షేమం గురుంచి ఉపన్యాసాలు తప్ప చేసిందేమిటి?..
ఆలోచించండి.. ఆత్మ విమర్శ చేసుకోండి.. ఆ తర్వాతే జీతాలు పెంచుకోండి.. (క్రాంతి దేవ్ మిత్ర)

పాపం అభిమానులు..

మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ వారిద్ద‌రి అభిమానులు కొట్టుకున్నారు.. అందులో ఒక‌డు చ‌చ్చాడు..
స‌ద‌రు హీరో సోద‌రులు మాత్రం బాగానే ఉన్నారు..పాపం అభిమానులు..
(వార్త‌: బ‌ళ్లారిలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. ఒక‌రి మృతి)

Saturday, March 26, 2016

వందేమాతరం..

వందేమాతరం..
బంకించంద్ర చ‌టోపాధ్యాయ రాసిన ఆనంద మ‌ఠంలోని వందేమాత‌ర గీతం స్వాతంత్ర్యోద్యమ‌ స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉర్రూత‌లూగించింది.. వందేమాత‌రం అంటే తెలుగులో 'త‌ల్లీ నీకు వంద‌నం' అని అర్థం..  ఉర్దూలో 'మాద్రె వ‌త‌న్' అంటారు.. భార‌త మాత స్వ‌రూపం రూపుదిద్దుకున్న‌ది ఈ గీతం నుండే.. దేశాన్ని మాతృ-పితృ రూపంలో ఆరాధించడం మ‌న దేశంలోనే కాదు.. ప్ర‌తి దేశంలోనూ ఈ ఆచారం ఉంది..
భార‌త్ మాతాకీ జై నినాదం.. వందేమాత‌ర గీతాలు మ‌న దేశ ప్ర‌జ‌ల్లో జాతీయ భావాన్ని పెంపొందించాయి.. కానీ ఇది త‌ప్పు అని  ఇప్ప‌డు  కొంద‌రు మేతావులు రాగాలు తీస్తున్నారు..  ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ఒక‌డుగు ముందుకు వేసి ఇది  ఇస్లాంకి విరుద్ద‌మ‌ని వాదిస్తాడు.. ఈ సంద‌ర్భంగా ఞ‌క విష‌యాన్ని గుర్తుంచుకోవాలి..
1997లో స్వాతంత్ర్య స్వ‌ర్ణోత్స‌వాలు జ‌రుపుకుంటున్న వేళ ఏ.ఆర్ ర‌హ‌మాన్ స్వ‌ర ప‌ర‌చిన వందేమాత‌రం ఆల్బం ఆసేతు హిమాచ‌లం దేశ ప్ర‌జ‌లంద‌రినీ ఉర్రూత లూగించింది.. అందులో ఆయ‌న 'మా తుఝే స‌లాం'.. అంటూ ఎంతో ఉధ్వేగంగా భార‌త‌మాత‌ను కీర్తించారు.. ఇందుకు ఈ ఓవైసీల‌తో స‌హా ముస్లిం ప్ర‌ముఖులెవ‌రూ ఎవ‌రూ అభ్యంతం వ్య‌క్తం చేయ‌లేదు.. మ‌రి ఆనాడు లేని అభ్యంత‌రాలు, అస‌హ‌నాలు ఇప్పుడు కొత్త‌గా ఎందుకు వ‌స్తున్నాయి.. దేశ ప్ర‌జ‌లంతా ఈ కుట్ర‌ల‌ను గ్ర‌హించాలి.. దేశాన్ని మ‌రోమారు కుల‌, మ‌తాల పేరిట చీల్చాల‌ని  చూస్తున్న ద్రోహుల‌కు చెక్ పెట్టాలి.. గ‌ర్వంగా ఆల‌పించండి వందే మాత‌రం.. మా తుఝే స‌లాం.. భార‌త మాతాకీ జై..

anti national అని టైప్ చేస్తే..

జాతి వ్యతిరేక కార్యకలాపాలతో ఢిల్లీలోని JNU ప్రతిష్ట ఎంతలా దిగజారిందో చూడండి.. google mapsకి వెళ్లి anti national అని టైప్ చేస్తే ఏం చూపిస్తుందో చెక్ చేయండి.. చాలా బాధ పడాల్సిన విషయం..

Thursday, March 24, 2016

ఇక క్యాష్ చేసుకోండి నాయనా..


అవకాశాలను అందిపుచ్చుకొని క్యాష్ చేసుకోవడం రాజకీయులకు అలవాటే కదా.. ఇందు కోసం కులం, మతం, భాష, ప్రాంతం, విద్వేషం, కొత్తగా అసహనం కార్డులు కూడా వాడుకుంటారు.. అవసరమైతే శవాలపై పేలాలు కూడా ఏరుకొనడానికి కూడా సిద్దమే..

దేశ రాజకీయాల్లో దారి తప్పిన కొన్ని పార్టీలకు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆరాధ్య దైవాలుగా మారిపోయారు.. వారి జపంతో తరించిపోతూ ఓటు బ్యాంకు వేటలో పడ్డారు.. వారి కోసమే అనుకుంటాం ఓ బ్యాంకు కొత్త కార్డులు విడుదల చేసింది.. యాదృశ్చికమే కావచ్చు.. కార్డులపై పేరు చూసి నవ్వుకోండి అంతే.. 

Wednesday, March 23, 2016

బలిదాన దినోత్సవం.. స్వాతంత్ర్య వీరులకు వందనాలు

బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కలిగించడానికి తమ ప్రాణాలనే పణంగా పెట్టారు ఆ విప్లవ వీరులు.. బానిస సంకెళ్ల నుండి దేశమాతకు స్వేచ్ఛను ప్రసాదించడానికి ఉరితాళ్లను ముద్దాడారు.. వీరి త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు.. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల స్పూర్తిని నిరంతరం కొనసాగిద్దాం.. వారి త్యాగ ఫలితాలైన భారత దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకుందాం.. దేశ ద్రోహులను తరిమి కొడదాం..

హోలీ ఆయీరే..


Tuesday, March 22, 2016

ఈళ్లని ఎర్రగడ్డ పంపాల్సిందే..


కాంగ్రెస్ నాయకులకు అసహనంతో పిచ్చి పట్టినట్లుంది.. వారికి దేశభక్తులకు, దేశద్రోహులకు తేడా తెలియడం లేదు.. JNU విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చాడు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. దేశ స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్.. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకు మద్దతు తెలిపిన నీచుడు కన్నయ్య.. ఇద్దరికీ ఎక్కడైనా పోలిక ఉందా?..
వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలు దేశ ప్రజలను విడదీస్తాయట.. మరో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ.. కాంగ్రెస్ పార్టీని నకిలీ గాంధీలు నడిపిస్తున్నారు కాబట్టి సరిపోయింది.. మహాత్మా గాంధీ బతికే ఉంటే ఈ మాటలకు ఆయన గుండె పగిలేది.. అరె మనిషే కాని తివారీ నీవు ఈ దేశంలో ఉండే అర్హత ఉందా?..
దేశద్రోహ నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నయ్యను తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు రాహుల్ గాంధీ.. భాజపాపై పోరాటానికి ఇతగాడి మద్దతు తీసుకుంటాడట పప్పూ.. కాంబినేషన్ అదిరింది కదూ.. తాత సంపాదించిన సొమ్మును మనవడు విచ్చల విడిగా ఖర్చు చేసినట్లు, మత పెద్దలు తెచ్చిన స్వాతంత్ర్యాన్ని దేశ ద్రోహులకు తాకట్టు పెట్టడం అంటే ఇదే..

ఈ నాయకులను ఇలాగే వదిలేస్తే ప్రమాదమే.. మన ఎర్రగడ్డకు తీసుకువచ్చి చికిత్స చేయాల్సిందే..

హోలీతో లింక్ ఎందుకు?


ఇవాళ అంతర్జాతీయ జల సంరక్షణ దినోత్సవం.. రేపు హోలీ మహోత్సవం.. నీటిని పొదుపు చేయాలని పిలుపునిస్తున్నారు.. మంచిదే కదా?.. అదే సమయంలో హోలీ పేరుతో నీటిని వృధా చేయొద్దంటున్నారు కొందరు మేతావులు.. అక్కడే నాకు మండుతోంది.. పిల్లలు, పెద్దలు ఆనందంగా జరుపుకునే హోలీకి, నీటి పొదుపుకు లింక్ పెట్టడం ఎందుకు?
అందుకే నేను పిలుపు నిస్తున్నాను.. నీటిని పొదుపు చేయండి.. హోలీ జరుపుకోండి అని..

జీతం నెలకు రూ. 3,50,000 మాత్రమే

తెలంగాణా శాస‌న‌స‌భ, శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌ ప్రస్తుతం నెలకు  రూ. 95,000 మాత్రమే ఉందట.. ఇది చాలక పోవడంతో వారు పేదరికంలో కొట్టు మిట్టాడుతూ, అర్ధాకలితో జీవిస్తున్నారట.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వసతుల కమిటీ సమావేశమై జీతాన్ని కనీసం నెలకు  రూ.3,50,000 కు పెంచాలని నిర్ణయించింది.. అంతే కాదు ఇంటి అద్దె భత్యం కింద నెల‌కు  రూ.50,000, పీఏ జీతం కోసం  రూ.25,000 ఇస్తారు.. ఇది మాత్ర‌మే కాకుండా కొత్త వాహ‌నం కొనుక్కోడానికి  రూ.40,00,000
ఇంత‌టితో ఆగిపోలేదు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలకు పింఛ‌న్ కింద స్లాబుల వారిగా  రూ. 50 వేల నుండి 65 వేల వ‌ర‌కూ చెల్లించాల‌ట‌..  స‌భ‌లో ఏ అంశంపై కూడా స‌యోధ్య కుద‌ర‌క, వాదులాడుకునే  స‌భ్యులకు త‌మ జీతాల పెంపు విష‌యంలో పార్టీల‌కు అతీతంగా ఏకాభిప్రాయం కుదిరింది.. అవును వారికేం పోయేదుంది.. అప్ప‌నంగా తినేది ప్ర‌జ‌లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించే సొమ్మే క‌దా..
జనం మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ది త‌మ‌కు సేవ చేయ‌డానికి.. అందుకు తీసుకోవాల్సింది గౌర‌వ వేత‌నాలు మాత్ర‌మే.. ప్ర‌జా సేవ కోసం భారీగా వేత‌నాలు పుచ్చుకోవ‌డానికి వీరి మ‌న‌సు ఎలా ఒప్పుకుంటుంది?.. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టిన సొమ్మును తిరిగి రాబ‌ట్టుకునేందుకు ఇదే త‌గిన మార్గం అని గౌర‌వ స‌భ్యులు భావిస్తున్నారా?.. అంద‌రు నాయ‌కులు అవినీతి ప‌రుల‌ని నేను అన‌డం లేదు.. కానీ మీలో ఎంత మంది ఆమ్యామ్యాలు పుచ్చుకోకుండా ప్ర‌జాసేవ చేస్తున్నారో ఆత్మ విమ‌ర్శ చేసుకోండి.. నా దృష్టిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ప్ర‌స్తుతం చెల్లిస్తున్న జీత భ‌త్యాలే చాలా ఎక్కువ‌, వీలైతే ఇవి కూడా త‌గ్గించాల్సిందే..
ప్ర‌భుత్వ ఉద్యోగుల సంగ‌తి ప‌క్క‌న పెడితే మ‌న రాష్ట్రంలో ఎంతో మంది క‌నీస వేత‌నాల‌కు నోచుకోకుండా బ‌తుకులీడుస్తున్నారు.. ముందు  వీరి జీవన ప్ర‌మాణాలు పెంచే  మార్గం ఆలోచించండి..  కార్మికులు, క‌ర్ష‌కుల ప‌రిస్థితి ఇంకా ఘోరం.. ముందు వీరి బ‌తుకుతెరువు, జీతాల ప‌రిస్థితి ఏమిటో చూడండి.. అంద‌రూ సుభిక్షంగా ఉంటే ఎంత భారీగా జీత భ‌త్యాలు పుచ్చుకున్నా మిమ్మ‌ల్ని ఏమన‌రు.. మీ స్వార్థం కోసం వారి ఉసురు పోసుకోడం అవ‌స‌రమా?.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విష‌యంలో ఆలోచించాలి..
40,00,000 వ‌డ్డీలేని రుణం ఇస్తారు.. ఇది అమ‌లు జ‌రిగితే భార‌త దేశంలో అత్య‌ధిక జీత భ‌త్యాలు పొందుతున్న రికార్డు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మ‌ల్సీల‌కు  ద‌క్కుతుంది.. 

Tuesday, March 15, 2016

రెండు రాష్ట్రాలు.. తెలుగు బడ్జెట్..

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తమ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. మూడు రోజుల తర్వాత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా తమ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించారు.. ఈ రెండు బడ్జెట్లలో అంకెలు, కేటాయింపుల కన్నా ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా గమనించాను..
యనమల తన ఇంగ్లీషు భాషలో, ఈటెల తెలుగు భాషలో బడ్జెట్లను ప్రవేశ పెట్టారు.. రెండూ తెలుగు రాష్ట్రాలే.. కానీ ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పూర్తిగా తెలుగువారే సభ్యులుగా ఉన్నా, రామకృష్ణుడు ఇంగ్లీషును ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి?.. తెలంగాణ అసెంబ్లీలో కొందరు తెలుగు రాని మైనారిటీల సభ్యులు ఉన్నా, ఈటెల తెలుగు భాషలోనే ఎందుకు బడ్జెట్ ప్రసంగం చేశారు.. ఇద్దరు ఆర్థిక మంత్రులు చదువుకున్నవారే.. ఇంగ్లీషు, తెలుగు భాషలు వచ్చినవారే.. కానీ ఒకరు మాతృభాషపై తృణీకారం, మరొకరు మమకారం చూపించడం ఏమిటి?
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని ఆనాటి పెద్దలు భావించారు.. తెలుగును అధికార భాషగా ప్రకటించినా ఏనాడు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో తెలుగు వారి ఐక్యతకు భాషా సంస్కృతులకు తీరని నష్టం వాటిల్లుతుందని కొందరు మహానుభావులు నిట్టూర్పులు వినిపించారు.. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అందుకు విరుద్దంగా కనిపిస్తోంది..
ఇక్కడ నేను టీఆర్ఎస్ పట్ల అభిమానం, టీడీపీ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నానని ఎవరైనా భావిస్తే నేనేమీ చేయలేను.. నిజానికి నేను ఈ రెండు పార్టీలకూ వ్యతిరేకిని.. నేను జాతీయవాదిని.. తెలుగు జాతీయ భాష, అంతర్జాతీయ భాషగా ఎదగాలని కోరుకుంటున్న పచ్చి స్వార్ధపరున్ని..

లోపిస్తున్న దేశ భక్తి భావన..

జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి.. లంకా విజయం తర్వాత ఇక్కడే ఉండిపోదామని లక్ష్మణుడు ప్రతిపాదించడంతో, శ్రీరాముడు తమ్మునికి చెప్పిన మాట ఇది.. కన్న తల్లి,, ఆ తల్లిని కన్న నేల స్వర్గంకన్నా గొప్పది అని అర్థం..
తమ దేశాన్ని మాతృ లేదా పితృ భావనతో చూడటం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న సాంప్రదాయం.. దేశాన్ని తల్లిగా భావించడం, భారత మాతగా ఆరాధించడాన్ని ఎలా తప్పు పట్టగలం?.. విదేశీ పాలకులు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో వందేమాతరం.. భారత మాతాజీ జై..’  నినాదాలు దేశ ప్రజలను ఐక్యం చేశాయి..
ఈ రోజున కొన్ని శక్తులు ఈ దేశం ఒకటి కాదనే వాదన ప్రారంభించాయి.. భారత దేశ అస్థిత్వాన్నే నిరాకరిస్తున్నాయి.. దేశ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఈ కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
పీక మీద కత్తి పెట్టినా భారతమాతాకీ జై అననని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేయడంలో ఆశ్చర్యం ఏముంది.. దేశంపై ప్రేమ మనసులో ఉండాలి.. ఆ ప్రేమ ఉన్నవారు ఎలాగైనా వ్యక్తం చేస్తారు..
బ్రిటిష్ వారు వెళ్లి పోయిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యతిరేకించాడు.. అతనికి అండగా నిలిచిన వారు రజాకార్లు.. రజాకార్ల పార్టీయే ఎంఐఎం.. ఢిల్లీలో ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికాడు వారి నాయకుడు కాసిం రజ్వీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రజ్వీ జైలుపాలై, విడుదలయ్యాక పాకిస్తాన్ పారిపోయాడు.. ఇంతటి ఘన వారసత్వ చరిత్ర ఉన్న ఎంఐఎం పార్టీవారు భారత్ మాతాజీ జై అంటే ఆశ్యర్యపోవాలి.. నిరాకరిస్తే ఆశ్యర్యపోవాల్సిన అవసరం ఏమిటి?..

Monday, March 14, 2016

శ్రీకాంత్ తో మధుప్రియ రాజీ..


మధుప్రియ బాగుంది.. శ్రీకాంత్ బాగానే ఉన్నాడు.. బకరా అయింది తల్లిదండ్రులు.. మీడియాకు రేటింగ్.. ప్రేక్షకులకు వినోదం..

భారత ప్రజలకు పాక్ క్రికెటర్ల ప్రశంసలు


సూడుండ్రి ఆఫ్రిదీ, మాలిక్‌.. మీరేమో ఇండియా మీద ప్రేమ అంటున్న‌రు.. మా మేతావులు, పెక్యుల‌రిస్టులు, జె.ఎన్‌.యూ. పోర‌గాండ్లేమో మీ దేశం మీద ప్రేమ ఒల‌బోస్తున్న‌రు.. జ‌ర మీరే ఆళ్ల‌కు చెప్పుండ్రి..

పూర్వ విద్యార్థుల సమావేశం


నేను ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న శ్రీ సరస్వతి విద్యా మందిర్ (కందికల్ గేట్, హైదరాబాద్) పూర్వ విద్యార్థుల సమావేశంలో అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది..

Sunday, March 13, 2016

ట్రంపు నుండి దేవుడే అమెరికాను రక్షించాలి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ టికెట్ ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యాలు భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.. ఆ దేశ అభివృద్ధిలో భారతీయుల పాత్ర విస్మరించలేనిది.. ఎన్నో రంగాల్లో మనవాళ్లు కీలక శక్తిగా మారడం ట్రంప్ లాంటి వారికి మింగుడు పడటం లేదు.. ఈయన వైఖరికి రిపబ్లికన్ పార్టీ అభిమానులు కూడా గందరగోళంలో పడ్డారు.. ఆ పార్టీలో ట్రంప్ అనుకూల-వ్యతిరేకవర్గాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నాయి.. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ అధ్యక్షుడైతే దేశ భవిష్యత్తు ఏమిటి అని మెజారిటీ అమెరికన్లలో ఆందోళన మొదలైంది.. ముస్లింలతో పాటు హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రకటనపై భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.. తాజాగా షికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ దగ్గర ట్రంప్ తలపెట్టిన బహిరంగ సభలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.. ట్రంప్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న వారిపై ఆయన అభిమానులు చేయి చేసుకున్నారు.. కొందరు భారతీయ జర్నలిస్టులపై దాడి జరిగింది.. అసహనం చిచ్చు రగులుకున్న అమెరికాను ఆ దేవుడే రక్షించుగాక..

మధుప్రియ ప్రేమ పెళ్లి కష్టాలు..

పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అనలేదు.. వారు అనుభవంతో చెప్పిన మాటలను పెడ చెవిన పెడితే ఎదురయ్యేవి కష్టాలే.. తెలిసీ తెలియని వయసులో మనం చూసిందే లోకం అనుకోవడం భ్రమ.. పెద్దలు తమ అనుభవాల నుండి జీవిత సత్యాలను బోధిస్తారు.. పిన్నవయస్కులు వారు ఎందుకు చెబుతున్నారో కాస్త ఆలోచించి తమ జీవితం గురుంచి నిర్ణయాలు తీసుకోవాలి..
ఆడ పిల్లనమ్మా.. అనే పాటతో తమ 13వ ఏటే పాపులర్ అయ్యింది మధుప్రియ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.. మైనారిటీ తీరగానే ఓ యువకునితో ప్రేమలో పడింది.. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది.. వారు ఎంతవారించినా ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోలేపోయింది మధుప్రియ.. అప్పట్లో టీవీ లైవ్ ఇంటర్వూలలో చూసిన వారికి ఆ యువకుడిలో ఏదో తేడా ఉందనిపించింది.. కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా.. అందుకే మధుప్రియ గ్రహించలేకపోయింది..
ఆలస్యం అయినా పర్వాలేదు.. మధుప్రియ తన భర్త అసలు స్వరూపం గ్రహించింది.. ప్రేమించండి.. కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి.. అని చెబుతోంది.. వాస్తవం గ్రహించినందుకు సంతోషమే.. మధుప్రియకు ఇంకా చాలా జీవితం ఉంది.. ముందు ఆమె ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలి.. ఆ తర్వాత పెళ్లి, జీవితంపై దృష్టి సారించాలి..

పెద్దల మాట చద్దిమూట అని ఎందుకు అన్నారో అర్థం అయింది కదా..

Friday, March 11, 2016

కుచ్చు టోపీ పెట్టి పారిపోయిన మల్లయ్య

తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన జి.బాలన్ అనే ఇండియన్ బ్యాంకు నుండి లోన్ తీసుకున్నాడు.. సకాలంలో తిరిగి చెల్లించలేదంటూ బ్యాంకర్లు, పోలీసులు అతనిపై దాడి చేసి కొట్టారు.. బాలన్ ట్రాక్టర్ పట్టుకెళ్లారు.. ఇంతకీ బాలన్ బ్యాంకుకు బాకీ పడింది ఎంతో తెలుసా? కేవలం ₹ 1.3 లక్ష మాత్రమే..
విజయ్ మాల్యా అనే విలాస పురుషుడు మద్యం, విమానయానం వ్యాపారాల పేరిట పదుల సంఖ్యలో బ్యాంకుల నుండి ₹ 9 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు.. విచ్ఛల విడిగా ఖర్చుచేసి తన దగ్గరేముంది బూడిద అంటూ చేతులెత్తేశాడు.. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే లోపు దేశం వదిలి పారిపోయాడు..
మన దేశంలో రైతులకు, చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సవాలక్ష కండిషన్లు పెట్టి తిప్పుకుంటాయి.. సకాలంలో చెల్లించకపోతే బందిపోట్లలా ఇళ్ల మీద పడి దోచుకుంటాయి.. కానీ జనం పొమ్ము విలాసాలకు ఖర్చుచేసే ఇలాంటి పెద్ద మనుషులకు మాత్రం వెంటపడీ మరీ లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు..

పాపం బ్యాంకులు.. చేసుకున్నవారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో..

Thursday, March 10, 2016

కన్నయ్య మరో లీల

ఆజాదీ.. ఆజాదీ.. అంటూ చెవి తెగిన మేకలా అరుస్తూ, హిస్టీరియా పేషంట్ మాదిరి ఊగిపోయే కన్నయ్య కుమార్ JNUలో ఘనకార్యాలు క్రమంగా బయటకు వస్తున్నాయి.. గత ఏడాది ఇతగాడు యూనివర్సిటీలో ఓ మాజీ విద్యార్థినితో అసభ్యంగా వ్యవహరించి, బెదిరించాడు.. వాస్తవానికి ఈ నేరానికి అతనిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలి.. కానీ కన్నయ్య భవిష్యత్తును (దేశద్రోహి అవతాడని ఊహించి ఉండరు) దృష్టిలో పెట్టుకొని వైస్ ఛాన్సలర్ క్షమాభిక్ష పెట్టి రూ.3,000 ఫైన్ విధించి వదిలేశారు..
కన్నయ్య లీలలు క్రమంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అతన్ని రక్షించుకోవడానికి పడరాని తంటాలు పడుతున్నారట శిష్యకోటి..

ఇంతకీ కన్నయ్య JNUలో వెలగబెడుతున్నది ఏమిటో తెలుసా? ఆఫ్రికన్ స్టడీస్ Phd.. ఈ దేశాన్ని ఇష్టపడని కన్నయ్య చివరకు ఆఫ్రికా వెళ్లిపోయి అక్కడి అడవుల్లో ఉడతలు పడతాడేమో.. ఇంతకు మించిన ఆజాదీ అతనికి ఏమి కావాలి..

మాయ రోగి ప్రగల్భాలు..

భారత దేశాన్ని ధ్వంసం చేస్తాం.. పాకిస్తాన్ జిందాబాద్.. కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలి.. అంటూ వేర్పాటు వాదులతో గొంతు కలిపి నినాదాలు చేసిన కన్నింగ్ కన్నయ్య ఇప్పుడు ఏకంగా వీర జవాన్లపై నోరు పారేసుకున్నాడు.. భారత సైన్యం కాశ్మీర్ మహిళలపై అత్యాచారాలు చేస్తోందట.. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పుతానని ఊగిపోతున్నాడీ హిస్టీరియా పేషంట్..
ఈ మాయరోగికి కాశ్మీర్ లో పాచినోళ్ల ఆజాదీ జీహాదీ గాళ్లు చేసే అకృత్యాలు తెలియవా?.. వేలాది మంది కశ్మీర్ పండిట్లపై అత్యాచారాలు చేసి, వారి ఆస్తులను దోచుకొని లోయ తరిమేసిన సంగతి తెలియదా?.. అలాంటి వేర్పాటువాదుల అంటకాగుతున్న కన్నయ్యకు మద్దతు ఇస్తున్నందు వామపక్షాలు సిగ్గుపడాలి..
దేశ సరిహద్దులను కాపాడేందుకు రాత్రింబవళ్లు కాపాలా కాస్తూ నిత్యం ఉగ్రవాదులతో తలపడుతూ ప్రాణ త్యాగాలు చేస్తున్న వీర జవాన్లపై నోరు పారేసుకున్న ఇలాంటి వాళ్లను ప్రజలు ఎలా భరిస్తున్నారు?.. అఫ్జల్ గురు జోహార్లర్పిస్తూ, వీర జవాన్లపై నిందలు వేస్తున్న కన్నింగ్ కన్నయ్య లాంటి చీడ పురుగులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలను ముందు ధ్వసం చేయాలి..

కొసమెరుపు ఏమిటంటే ఖైదీ కన్నయ్య తమకు ప్రచారం చేసి పెడతాడని వామపక్షాలు బెయిల్ ఇప్పించాయి.. అలాంటిదేమీ లేదని చెబుతున్నాడు ఈ కన్నింగ్.. అందుకే అన్నారు ఎవరు తీసిన గోతిలో వారే పడతారని..

Wednesday, March 9, 2016

తెలంగాణ ముద్దుబిడ్డ చొర‌వ‌

గోదావరి జలాల ఒప్పందంలో తెర వెనుక సూత్రధారి పాత్రను ఏ విధంగా కూడా విస్మరించలేం..  తెలంగాణకు చాలా కీలకమైన ఈ అంశంపై ఇద్దరు సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్ లను ఒప్పించడంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సైతం తనవంతు సహకారం అందించారు..  తెలంగాణకు గోదావరి జలాల అవసరం తెలిసిన ఈ ప్రాంత ముద్దుబిడ్డగా, చారిత్రక ఒప్పందానికి మహారాష్ట్ర సర్కారును ఒప్పించారు విద్యాసాగర్ రావు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉ
పకారం చేశారు.

తెలంగాణ, మహారాష్ట్రల మధ్య చారిత్రిక ఒప్పందం

గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన చారిత్రిక ఒప్పందం నిజంగా దార్శనికం. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎంతో విజ్ఞ‌త‌, ముందుచూపు ప్రదర్శించారు..  ఈ ఒప్పందం అమలైతే తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిత్యం కరువుకాటకాలతో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుంది.. సాగునీరు, తాగునీటికి కొరత ఉండదు..
నిజానికి ఈ పని ఎప్పుడో జరగాల్సింది.. కానీ గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఉభయులకూ తీరని నష్టం కలిగించాయి.. ఇచ్చి పుచ్చుకునే, సామరస్య ధోరణి ఉంటేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది..

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభ్యంతరాల కారణంగా నష్టపోతున్నది రైతాంగమే..  ఇదే తరహా ఒప్పందాలు రాజకీయాలకు అతీతంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కూడా కుదిరితే తెలుగు ప్రజలందరికీ మేలు జరుగుతుంది..

Sunday, March 6, 2016

కన్నయ్యా.. నీకొచ్చిన ఓట్లెన్ని?..

JNU విద్యార్థి నాయకుడు కన్నయ్య తన అద్భుత నట విన్యాసాలతో చేసిన ఉపన్యాసం విని ఆహా ఓహో అద్భుతం అంటూ పులకించిపోతున్న వారు గురవిందను గుర్తుకు తెచ్చుకోండి..
2014 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి 32% ఓట్లే వచ్చాయట.. 69% ప్రజలు వ్యతిరేకించారట.. మరి దేశ వ్యాప్తంగా లెఫ్ట్ ఫ్రంట్ కు కేవలం 4% శాతం ఓట్లే వచ్చిన విషయాన్ని ఎందుకు దాచావు కన్నయ్యా.. ఈ లెక్కన 96% మిమ్మల్ని ఛీ కొట్టారు కదా..
అంతెందుకు JNU విద్యార్థి సంఘం ఎన్నికల్లో మొత్తం 7304 ఓట్లలో కన్నయ్యకు 1029 ఓట్లతో గెలిచాడు.. అంటే 15% మాత్రమే వచ్చాయి.. ఈ లెక్కన 85% విద్యార్థులు కన్నయ్యను తిరస్కరింనట్లే కదా.. మెజారిటీ విద్యార్థుల తిరస్కారానికి గురైన ఈ 28 ఏళ్ల Phd విద్యార్థి నిర్లజ్జగా అబద్దాలు ఆడుతుంటే ఆహో ఓహో అంటూ భజనకు సిద్దమైన వామపక్ష, కాంగ్రెస్ నాయకులు సిగ్గు పడాలి.. మరోసారి గురవిందను గుర్తుకు తెచ్చుకోండి.. కన్నయ్య నటనా విన్యాసం మీకు అంతగా నచ్చితే అతన్ని హీరోగా పెట్టి సినిమా తీసి నాలుగు రాళ్లు సొమ్ము చేసుకోండి.. అంతే కానీ అతన్ని అడ్డం పెట్టుకొని దేశ ద్రోహ, జాతి వ్యతిరేక భావజాలాన్ని ప్రజలపై రుద్దకండి..

Saturday, March 5, 2016

బాధ్యతలేని హైఫై పుత్రరత్నాలు

హైదరాబాద్ మహానగరంలో కొన్ని హైఫై ప్రాంతాలున్నాయి.. రాజకీయ, వ్యాపార, సినీ, బ్యూరోక్రాట్ వర్గాలు నివసిస్తాయక్కడ.. అందరిలాగే వాళ్లూ పిల్లల్ని కంటారు.. కానీ పెరిగే పద్దతి వేరు.. ఈ వృశ్చిక సంతానం మధ్యాహ్నం తర్వాత తీరిగ్గా నిద్రలేచి ఆవలిస్తుంది.. ఏదో కాస్త తిన్నామనిపించి కాస్త విశ్రాంతి తీసుకుంటారు.. సాయంత్రానికి అలా రోడ్డున పడతారు.. మిగతా అలగా దోస్తులు తోడవుతారు.. ఖరీదైన పబ్బులు, బార్లు, రిసార్ట్స్, హోటల్స్.. మందు, విందు, పొందు, వినోదాలతో అర్ధరాత్రి దాటే వరకూ ఎంజాయ్.. ఇంకా నిషా దిగకపోతే బైకుల, కార్లతో రోడ్లపై రేసింగ్స్.. తరచూ ఎవరో ఒకరిని గుద్ది ఉసురు తీస్తారు.. పోలీసులకు బుద్ది పుడితే అప్పుడప్పుడూ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే పిటీ కేసులు పెడతారు వీరిపై.. కర్మకాలి ఈ పోరలకు రోడ్ల మీద ఆడవారు కనిపిస్తే అంతే సంగతులు..
ఈ హైఫై యువతకు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదు.. వారి తల్లిదండ్రులు అలాగే పెంచుతారు వీరిని.. చదువు సంధ్యలు అంతంతే.. ర్యాంకుల గోల వీరికి అనవసరం.. కాస్త ఖరీదైన విద్యా సంస్థల్లో సీట్లు కొంటారు.. చివరకు ఈ అడ్డ గాడిదలు తమ తండ్రుల వారసత్వాలను అందిపుచ్చుకొని సమాజంపై పడతారు.. స్కాములు, కుంభకోణాలతో లోకాన్ని ఉద్దరిస్తారు..
ఈ సోదంతా ఎందుకు రాశానంటారా?.. తాజాగా ఓ మంత్రి పుత్రరత్నం చేసిన ఘన కార్యం చూసి ఒళ్లు మండిందంతే..

Friday, March 4, 2016

ఇంకే ఆజాదీ కావాలి..

ఇండియా నుంచి స్వతంత్రం కాదు, ఇండియాలో స్వతంత్రం కావాలట కన్నయ్యకు..
రాయి ఏదైతేనేం పళ్లూడగొట్టడానికి..
ఈ దేశం నచ్చలేదేమో ఇతనికి..
 దేశం నుండే వెళ్ళిపోతే ఇంకా బెటర్ కదా..
ఇంతకన్నా స్వేచ్చా స్వాతంత్ర్యాలున్న దేశం ఎక్కడుందో చెప్పగలవా కన్నయ్యా?..

పాపం లండన్ బిచ్చగాడు..

బిచ్చ‌గాళ్లే క‌దా అని త‌క్కువగా చూడ‌కండి.. వాళ్ల‌లో కొంద‌రు మ‌న‌క‌న్నా ధ‌న‌వంతులు, కోటీశ్వ‌రులూ ఉండొచ్చు..
ఈ ఫోటోలోని వ్య‌క్తి మాథ్యూ బ్రింటెన్‌.. లండన్ న‌గ‌రంలోని న్యూక్వే బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కుంటాడు.. ఎప్ప‌టిలాగే భిక్షాట‌న పూర్త‌య్యాక త‌న ఖ‌రీదైన ఆడి స్పోర్ట్స్ కారులో ఇంటికి వెళ్లుతుండ‌గా ఎవ‌రో గ‌మ‌నించి వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టారు.. దీంతో మాథ్యూ బ‌తుకు బ‌స్టాండైంది.. బిచ్చం వేసే వాళ్లే క‌రువ‌య్యారు.. పైగా వీధి రౌడీలు మామ్మూళ్ల కోసం బెదిరించ‌డం మొద‌లు పెట్టారు.. కొంద‌రు వ్య‌క్తులు మాథ్యూ కారు అద్దం ధ్వంసం చేశారు..  ఓ శుభ ముహూర్తాన ఏకంగా ఆ కారునే దొంగ‌లెత్తుకుపోయారు..పాపం మాథ్యూ.. ఈ గోలతో త‌న‌కు ఇక ఆత్మ‌హ‌త్యే గ‌తి అని పోలీసుల‌తో వాపోయాడ‌ట‌..

Thursday, March 3, 2016

గుర్తింపు లేని మూల రచయితలు

facebook, whatsappలలో ఒక కవితను చూశాను.. చిన్ననాటి జ్ఞాప‌కాలను తలచుకుంటూ రాసిన ఈ కవిత మనసును హత్తుకుంది.. ఎవరిదా అని చూస్తే కింద రచయిత పేరు లేదు.. వరుసగా forward అవుతోంది..  అప్పుడు నేను చాలా బాధ పడ్డాను.. రచయిత ఎవరో తెలియదు.. కానీ అందరూ తమదే అన్నట్లు share చేస్తున్నారు..
ఒక కవి లేదా రచయిత తన ఆలోచనల నుండి అద్భుతాలను సృష్టిస్తాడు.. మేధోపరంగా ఎంతో కష్టపడుతున్నా అతనికి గుర్తింపు లేకుండా పోతోంది.. అతని మేధస్సును ఇంకెవరో Copy – Paste చేస్తున్నారు.. ఎంత బాధాకరం.. సృజనాత్మకత ఒకడిది.. గుర్తింపు ఇంకెవరిదో..
మిత్రులారా.. సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు కనిపిస్తాయి.. మనకు నచ్చుతాయి.. like చేయండి.. share చేయండి.. కానీ Copy – Paste మాత్రం చేయకండి.. అలా చేయాల్సి వస్తే కనీసం Courtesy గా మూల రచయిత పేరు కచ్చితంగా ఇవ్వండి.. మూల రచయితలకు అన్యాయం చేయకండి..

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. నేనూ ఒక బాధితున్నే..

Wednesday, March 2, 2016

లైట్ తీస్కోమంటే..

2000 సంవత్సరంలో అనుకుంటా.. అవి నేను సిటీ కేబుల్ ఛానల్లో పని చేస్తున్న రోజులు..
ఓ రోజు నేను ఎడిటింగ్ రూమ్ బయట నిల్చొని ఏదో ఆలోచిస్తున్నా.. అక్కడికి వచ్చిన నా కొలీగ్ నేనేదో విచారంలో ఉన్నాననుకున్నాడు.. లైట్ తీస్కో అంటూ నా భుజం తట్టాడు.. నేను వెంటనే ఎడిటింగ్ సూట్ బయట ఉన్న బల్బ్ తీసుకొని జేబులో పెట్టుకున్నా.. నేను చేసిన పనికి ఆశ్చర్యపోయి ఏమిటిది?’ అని అడిగాడు.. లైట్ తీసుకోమన్నావు కదా.. తీసుకున్నా..’ అని చెప్పా అమాయకంగా.. నా ప్రాక్టికల్ జోక్ చూసిన వారందరికీ నవ్వాగలేదు..

కాల ప్రవాహంలో 16 ఏళ్లు గడచిపోయాయి.. ఆనాడు నేను చేసిన పని ఈనాటికీ గుర్తుకు వచ్చి నవ్వొస్తుంటుంది.. 

పోలీసులే హెల్మెట్లు అమ్మితే..

హైద‌రాబాద్‌లో హెల్మెట్ ధ‌రించ‌ని ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌ను ప‌ట్టుకొని జ‌రిమానాలు విధిస్తున్నారు పోలీసులు..  మంచిదే.. ఇక్క‌డ నాదో మ‌న‌వి..  స్పాట్ లోనే ప‌ట్టుబ‌డిన వారి ద‌గ్గ‌ర చ‌లాన్ రూపంలో వ‌సూలు చేసిన సొమ్ముకు బ‌దులుగా వారికో హెల్మెట్ ఇస్తే బాగుంటుంది క‌దా.. ట్రాఫిక్ పోలీసు విభాగం పెద్ద మొత్తంలో కంపెనీ ధ‌ర‌కు హెల్మెట్లు కొని జంక్ష‌న్ల ద‌గ్గ‌ర అమ్మ‌కానికి పెట్టాలి.. ద్విచ‌క్ర‌వాహ‌న‌దార్ల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌కు, నాణ్య‌మైన హెల్మెట్ దొర‌క‌డంతో పాటు వాటి కోసం ప్ర‌త్యేకంగా షాపుల‌కు వెళ్లే శ్ర‌మ త‌ప్పుతుంది.. 

Tuesday, March 1, 2016

సైనికులను కించపరచిన మేతావి..

భారత సైన్యంలో చేరుతున్న వారంతా దేశంపై ప్రేమ, భక్తితో కాదు.. కేవలం పేదరికం కారణంగానే చేరుతున్నారు..ఈ మాటలు అన్నది ఏ లఫూట్ గాడో అయ్యుంటే వాడు పిచ్చి ముదిరిన వోడో, లేక పనికి మాలిన భావజాలం వంట పట్టిన పెంట మేతావో అని పట్టించుకోకుండా సరిపెట్టుకోవచ్చు.. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీడియా సలహాదారు.. పేరు దినేష్ అమిన్ మట్టు..
దినేష్ మట్టు మొదటి నుండి వివాదాస్పదుడే.. ఈ ఏడాది జనవరి 16న గణతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు, మారణ హోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఐసిస్ ప్రేరిత ఉగ్రవాదులను బెంగళూరు, మంగళూరు, తంకూరు నగరాల్లో ఎన్ఐఏ అరెస్టు చేసింది.. ఈ అరెస్టులు ఒక మతంపై జరుగుతున్న దాడులని మొరిగాడీ మేతావి.. స్వామి వివేకానంద జీవితం స్పూర్తి దాయకం కాదంటూ గతంలో ఓ పత్రికలో రాశాడీ మిడిమిడి జ్ఞాని.. దేశ ప్రజల మనోభావాలను కించపరుస్తున్న ఇలాంటి మతి తప్పిన వెధవలను ఇలాగే భరించాల్సిందేనా?

ఇలాంటి అరాచకవాదులను మీడియా సలహాదారుగా నియమించుకున్నందుకు సిద్దరామయ్యపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందనుకోవడం శుద్ద దండగ.. ఎందుకంటే అధికారం కోల్పోయాక విచక్షణ కోల్పోయి, వారు చేస్తున్న పనులేమిటో దేశ ప్రజలంతా చూస్తున్నారు కదా..