Tuesday, March 29, 2016

తెలుగు వారికి టీడీపీ అవ‌స‌రం తీరిందా?

తెలుగు దేశం పార్టీ.. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఇదేమి పేరని అంద‌రూ అనుకున్నారు.. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీ రామారావు స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎదురు లేని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.. అప్పటి వరకూ ఢిల్లీ పాలకులకు దక్షిణ భారతీయులంటే మద్రాసీలుగానే తెలుసు.. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వారికి జాతీయ స్థాయిలో గౌరవ స్థానం కల్పించడంలో ఎన్టీఆర్ పాత్రను కాదనలేం.. తెలుగు భాష , సంస్కృతీ సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారాయన..

1995లో రామారావును బలవంతంగా పదవీచ్యుతున్ని చేసి పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రూపు రేఖల‌ను స‌మూలంగా మార్చేశారు.. పార్టీ పేరులోనే తెలుగు ఉంది కానీ మన భాషా సంస్కృతుల పరిరక్షణకు బాబు పెద్దగా చేసిందేమీ లేదు.. తెలుగు భాష ప‌రిస్థితి దిగజారింది కచ్చితంగా చంద్రబాబు హయాలోనే.. మ‌చ్చుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు సచివాలయం దగ్గర  ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం తెలుగు తల్లి విగ్రహాన్ని క్రేన్ తో పెకిలిస్తే సగానికి విరగడం ఇందుకు పరాకాష్ట.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హడావిడిగా కొత్త విగ్రహాన్ని చేయించి సచివాలయం ఎదుట ప్రతిష్టించారు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రచారం హోరులో తెలుగు మీడియం పాఠశాలు దెబ్బతిని ఒక తరం మాతృ భాషకు దూరమైంది బాబు గారి హయాంలోనే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. చివరకు టీడీపీ వెబ్ సైట్ల్ లోనూ ఆంగ్లానికే పెద్ద పీట..
2004లో అధికారం కోల్పోయింది టీడీపీ.. 2009లో వ‌రుస‌గా రెండో ఓటమి ఎదురైంది.. 2014 వ‌చ్చే స‌రికి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ‌లో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా పొంద‌క‌పోగా, గెలిచిన ఎమ్మెల్యేలలో రెండొంతుల‌కు పైగా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు.. తెలంగాణ‌లో టీడీపీ అస్థిత్వ‌మే ప్ర‌మాదంలో ప‌డింది.. జాతీయ పార్టీగా మారాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీకి మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి ఇది..
భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను అంఛ‌నా వేయ‌డంలో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంది.. తెలుగు ఆత్మ‌గౌర‌వ స్థానాన్ని తెలంగాణ ఆత్మాభిమాన‌వాదం అధిగ‌మించింది ఈ విష‌యాన్ని తెలుగుదేశం ఆల‌స్యంగా గ్ర‌హించింది.. మొద‌ల స‌మైక్య‌వాదాన్ని బ‌లంగా వినిపించి చేతులు కాల్చుకున్న టీడీపీ, మారిన ప‌రిస్థితుల్లో గంద‌రగోళంలో ప‌డింది.. ఎటూ తేల్చుకోలేక రెండు క‌ళ్ల సిద్దాంతంతో తెలంగాణ‌లో బోల్తాప‌డింది.. తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్పుడు టీడీపీ కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌రిమిత‌మైన పార్టీగానే చూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఆ పార్టీకి అధ్య‌క్షునిగా ఉన్న చంద్ర‌బాబు, ఏపీకి ముఖ్య‌మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. నిజంగా టీడీపీకి రెండు రాష్ట్రాలూ స‌మాన‌మ‌ని భావించిన‌ట్ల‌యితే చంద్ర‌బాబు ఒక ప‌ద‌విని వ‌దులుకోవ‌డం మంచిద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.. అప్ప‌టి వ‌ర‌కూ తెలంగాణ‌లో ప్ర‌జ‌లు టీడీపీని అనుమానంగానే చూస్తారు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగువారి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం అని చెబుతున్న టీడీపీ చిత్త‌శుద్దిని అనుమానించ త‌ప్ప‌దు.. త‌మిళ‌నాడులో ద్ర‌విడ పార్టీల‌న్నీ త‌మ భాషా సంస్కృతుల‌ను కాపాడ‌టంలో ఏక‌తాటిపై నిలుస్తాయి.. కానీ ఈ ప‌ని తెలుగునాట టీడీపీ చేయ‌లేక‌పోయింది.. తెలుగువారు ఎక్క‌డ ఉన్నా వారి సంక్షేమ‌మే త‌మ‌కు ముఖ్య‌మ‌ని చెబుతున్నతెలుగు దేశం పార్టీ, ఏనాడైనా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి కష్టాలను పట్టించుకుందా? అక్కడి తెలుగు వారు తమ భాష, సంస్కృతుల విషయంలో అడుగడుగునా వివక్షకు గురై ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు.. వారి హక్కుల గురుంచి టీడీపీ ఏనాడైనా పోరాడిందా?
35వ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్న తెలుగుదేశం పార్టీ కాలానుగుణంగా మార‌క త‌ప్ప‌దు.. నిజంగా తెలుగు ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యం అని ఆ పార్టీ భావిస్తే ద్వంద్వ ప్ర‌మాణాలు క‌ట్టిపెట్టి చిత్త‌శుద్దిని ఆచ‌ర‌ణ‌లో చూపించాలి.. (మార్చి29న టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా)

No comments:

Post a Comment