Tuesday, March 15, 2016

రెండు రాష్ట్రాలు.. తెలుగు బడ్జెట్..

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తమ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. మూడు రోజుల తర్వాత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా తమ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించారు.. ఈ రెండు బడ్జెట్లలో అంకెలు, కేటాయింపుల కన్నా ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా గమనించాను..
యనమల తన ఇంగ్లీషు భాషలో, ఈటెల తెలుగు భాషలో బడ్జెట్లను ప్రవేశ పెట్టారు.. రెండూ తెలుగు రాష్ట్రాలే.. కానీ ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పూర్తిగా తెలుగువారే సభ్యులుగా ఉన్నా, రామకృష్ణుడు ఇంగ్లీషును ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి?.. తెలంగాణ అసెంబ్లీలో కొందరు తెలుగు రాని మైనారిటీల సభ్యులు ఉన్నా, ఈటెల తెలుగు భాషలోనే ఎందుకు బడ్జెట్ ప్రసంగం చేశారు.. ఇద్దరు ఆర్థిక మంత్రులు చదువుకున్నవారే.. ఇంగ్లీషు, తెలుగు భాషలు వచ్చినవారే.. కానీ ఒకరు మాతృభాషపై తృణీకారం, మరొకరు మమకారం చూపించడం ఏమిటి?
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని ఆనాటి పెద్దలు భావించారు.. తెలుగును అధికార భాషగా ప్రకటించినా ఏనాడు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో తెలుగు వారి ఐక్యతకు భాషా సంస్కృతులకు తీరని నష్టం వాటిల్లుతుందని కొందరు మహానుభావులు నిట్టూర్పులు వినిపించారు.. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అందుకు విరుద్దంగా కనిపిస్తోంది..
ఇక్కడ నేను టీఆర్ఎస్ పట్ల అభిమానం, టీడీపీ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నానని ఎవరైనా భావిస్తే నేనేమీ చేయలేను.. నిజానికి నేను ఈ రెండు పార్టీలకూ వ్యతిరేకిని.. నేను జాతీయవాదిని.. తెలుగు జాతీయ భాష, అంతర్జాతీయ భాషగా ఎదగాలని కోరుకుంటున్న పచ్చి స్వార్ధపరున్ని..

No comments:

Post a Comment