Tuesday, November 24, 2015

అసహనం ఉందట.. దేశం విడిచిపోతారట..

భారత్ లో అసహనం పెరిగిపోతోందట.. అందుకే దేశం విడిచిపోదామని తన భార్య కిరణ్ రావు ప్రతిపాదించిందని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వాపోయాడు.. నిజంగా ఈ దేశ ప్రజల్లో అసహనమే ఉంటే వీరి సినిమాలు ఇంత స్వేచ్ఛగా ఎలా ఆడుతున్నాయి.. ఈ సినిమాలను చూస్తున్నది ఎవరు? మన దేశ ప్రజలు కాదా? తమ సినిమాలకు కోట్లాది మంది భారతీయుల ఆదరణను సొమ్ము చేసుకొని, కోటాను కోట్లు రూపాయల ధనం ఆర్జించడం వాస్తవం కాదా?.. మరి అమీర్ ఖాన్ కుటుంబానికి అసహనం ఎక్కడ కనిపించింది?.. అసహనానికి సంబంధించిన ఉదాహరణ ఇవ్వకుండా, దుష్ప్రచారానికి దిగడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం దేశ ద్రోహం కాదా?.. ఇంతకీ వీరు భారత్ ను విడిచి ఏ దేశానికి పోతారు?.. ఆ దేశాలు భద్రమైనవేనా?.. వీరి భద్రతకు అక్కడ పూచీ ఎవరు?.. అసలు సామాన్య ప్రజలకు ఎక్కడా కనిపించని అసహనం ఈ సెలబ్రిటీలకే ఎందుకు కనిపిస్తోంది.. ఇందులో ఏమైనా కుట్ర ఉందా?.. రాజకీయ ప్రేరితమా?.. ఆలోచించండి..

Saturday, November 21, 2015

వారసత్వ రాజకీయమా వర్ధిల్లు..

ఇద్దరూ ఇద్దదే.. చదువుల్లో, ఆటల్లో అత్తెసరు.. ఓ రాష్ట్రానికి మంత్రులైపోయారు.. వారి అర్హత లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు కావడమే.. వారసత్వ రాజకీయమా వర్ధిల్లు..
తేజస్వీ యాదవ్(26) అర్హత తొమ్మిదో తరగతి ఫెయిల్.. ఇంక ఒల్ల, క్రికెట్ ఆడతా అంటే పెద్దాయన వాకే అనేశాడు.. బ్యాట్ పట్టిన చిన్నబ్బాయికి అదీ చేతగాలేదు.. అక్కడా రాణించలేదు.. వీడు రాజకీయాలకే సరి అనుకున్నారు అయ్యగారు.. ఎమ్మెల్యేగా గెలిపించి, ఏకంగా బిహార్ ఉప ముఖ్యమంత్రిని చేశారు.. ఇక పెద్దబ్బాయిగారి సంగతి కొద్దాం.. తేజ్ ప్రతాప్ యాదవ్ (28) ఇంటర్మీడియట్ లోనే డుంకీ కొట్టేశాడు.. ఎమ్మెల్యే అయి నితిష్ క్యాబినెట్లో మంత్రిగా చేరాడు.. ఇతని ప్రమాణ స్వీకారం మరో తమాషా.. గవర్నర్ గారు అపేక్షిత్(ఆకాంక్ష) అని చదివిస్తే ఉపేక్షిత్(నిర్లక్ష్యం) అని ఉచ్చరించాడు..(ఇక ఆయన ప్రజలకు చేయబోయేది అదే కాదా..) తబ్(అప్పుడు) అనమంటే జబ్(ఎప్పుడు) అన్నాడు.. అందుకే నేమో లాలూ గారికి పెద్దబ్బాయి గారి మీద అంత నమ్మకం లేక చిన్నబ్బాయికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పించాడు..

బహారీలు వద్దు బిహారీలనే ఎన్నుకోండి అంటూ నితిష్ కుమార్ గారు ఎన్నికల్లో స్లోగన్ ఇచ్చారు.. బిహారీలు మరోలా అర్థం చేసుకొని బాణం పార్టీకన్నా లాంతరు పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు.. కట్ చేస్తే.. రిమోట్ కంట్రోల్ లాలూ చేతికి వచ్చింది.. ఇక ఆయన ఆడిందే ఆట పాటిందే పాట.. బిహారీయా.. ఆప్ లోగ్ హార్ గయే భయ్యా.. 

Thursday, November 19, 2015

ఇదండీ కిస్ ఆఫ్ లవ్ మతలబు..

వీళ్లు కిస్ ఆఫ్ అవ్ అనే ఉద్యమకారులట.. అంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ పేరిట బరితెగించి తిరిగే వారికి అండగా నిలిచే ఉద్యమం.. వాస్తవానికి నిజమైన ప్రేమికులు ఇలాంటి పనులు చేయరు.. కేరళలో అనైతిక కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నైతిక వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఊర కుక్కల్లా ప్రవర్తించిన వారిని పట్టుకొని కొట్టారు.. దీంతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తారా అంటూ కిస్ ఆఫ్ లవ్ పేరిట ఉద్యమం లేవదీశారు రాహుల్,  రేష్మీ.. బహిరంగంగా ముద్దులు పెట్టుకొని, మీడియా ముందు ఫోజులు ఇచ్చి ఏమి చేసుకుంటారో చేసుకోండి.. అంటూ సవాలు విసిరారు.. వీరిని ఆదర్శంగా తీసుకొని దేశంలోని మరి కొందరు తిక్కోళ్లు కిస్ ఆప్ అవ్ అంటూ ఊళ్ల మీద పడ్డారు.. వీరికి మన సోకాల్డ్ గాళ్లుమద్దతు ఇచ్చారు..
..కట్ చేస్తే..

తాజాగా కేరళ పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో ఈ జంటతో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు.. వీరు ఆన్ లైన్లో ఈ తతంగం నడిపిస్తున్నారట.. ఇప్పుడు అర్థమైందా కిస్ ఆఫ్ లవ్ మతలబు ఏమిటో..

Wednesday, November 18, 2015

ధర్మరక్షణే శ్వాసగా తుది వరకూ జీవించిన భరతమాత ముద్దు పుత్రుడు అశోక్ సింఘాల్.. సింఘాల్జీకి ఘన నివాళి అర్పిద్దాం..


మితిమీరిన అయ్యర్ అసహనం..


ప్రధాని నరేంద్ర మోదీని పదవిలో నుండి తొలగిస్తేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయట.. పాకిస్తాన్ టీవీ ఛానల్ దునియాలో కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వాక్రుచ్చాడిలా.. అదెలా సాధ్యం అని ఆ ఛానెల్ ప్రతినిధి అడిగితే, అయితే భారత్, పాక్ సంబంధాలు మెరుగయ్యేందుకు నాలుగేళ్లు ఆగాల్సిందే అంటాడీయన.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన భారత ప్రధాని మీద, అందునా పాక్ ఛానల్లో అసహనం ప్రదర్శించిన ఇతని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.. గతంలో నరేంద్ర మోదీ చాయ్ అమ్ముకొని బతకాలని ఈసడించిందీ ఈ పెద్ద మనిషే.. చాయ్ వాలా ప్రధాని అయితే తప్పా అని ప్రశ్నించిన మోదీ, అంత పని చేసే సరికి అయ్యరోరు ఇంతకాలం మొహం ఎక్కడ దాచుకున్నాడో?..  

Sunday, November 15, 2015

ఈ పాపం ఎవరిది?

ప్రపంచంలో భద్రమైన చోటంటూ ఉందా?.. సురక్షితం అనుకున్న ప్రాంతాలే ఇప్పుడు టార్గెట్ అయిపోతున్నాయి..  పారిస్ నగరంలో ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడటం ప్రపంచాన్ని మరోసారి భయపడిపోయింది.. ముంబైతో పాటు ఎన్నో ఉగ్రదాడులను చూసిన మనకు ఇవి కొత్తగా కనిపించకపోవచ్చు.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న సోకాల్డ్ అగ్ర దేశాలన్నీ ఇప్పుడు ఉగ్ర భూతాలను చూసి జడుసుకుంటున్నాయి.. మరి ఇవన్నీ వారు పోషించిన పాములే కదా?.. అందుకే అంటారు మన పెద్దలు, చేసుకున్న వారికి చేసుకున్నంత అని..
రెండు ప్రపంచ యుద్దాల తర్వాత వలసవాద దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.. కానీ అగ్రరాజ్యాలుగా అవిర్భవించిన అమెరికా, సోవియట్ యూనియన్ల చుట్టూ ప్రపంచ దేశాలు చేరిపోయాయి.. నడుమ అలీన విధానమంటూ హడావిడి చేసిన మన నెహ్రూ మహానుభావుడు, మధ్యలోనే జెండా ఏత్తేసి బలవంతంగా మన దేశాన్ని సోవియట్ శిబిరంలో దించాడు.. దీంతో మన దాయాది పాకిస్తాన్ అమెరికా పంచన చేరింది.. ఈ రెండు అగ్ర దేశాలు తమ ప్రాభల్యం, ప్రయోజనాల కోసం మధ్యప్రాచ్య దేశాల్లో చిచ్చు పెట్టాయి.. కాలక్రమంలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా కేంద్రంగా ఏకదృవ ప్రచంచం ఏర్పడింది.. ఒకప్పడు అమెరికా మిత్ర దేశాలు రగిల్చిన ఆ చిచ్చు ఫలితమే ఈ ఉగ్ర భూతాలు..

తన దాకా వస్తే కాని తెలియదన్నట్లు, ట్విన్ టవర్లపై దాడి తర్వాత ఉగ్రవాదంపై యుద్దం అంటూ చెలరేగిపోయింది అమెరికా.. వారి స్థావరాలపై దాడులకు దిగింది.. చల్లా చెదురైన ఈ మూకలే ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడ్డాయి.. చంపిన కొద్దీ పుట్టుకొస్తున్నాయీ పాములు.. నిన్న అల్ ఖైదా, ఇవాళ ఐఎస్ఐఎస్.. రేపు మరో సంస్థ ఏదైనా రావచ్చు.. మన దేశం విషయానికి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు ఉగ్రవాదులకు వరంగా మారాయి.. సమస్యను మతం కోణంలో చూస్తూ, టాడా, పోటా వంటి కఠిన చట్టాలను నీరు గారుస్తున్నాం.. మన దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్ కు సాయం చేస్తున్నది ఎవరు?.. సోవియట్ శిబిరాన్ని వదిలి, అమెరికా పంచన చేరితే సమస్య పరిష్కారం కాదు.. మన దేశం స్వతంత్ర శక్తిగా ఎదగాలి.. హనుమంతునిలా మన శక్తిని మనం గుర్తించక పోవడమే అసలు సమస్య.. ఆలోచించండి..

Saturday, November 14, 2015

నవంబర్ 14నే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?

నవంబర్ 14వ తేదీని చాలా మంది అంతర్జాతీయ బాలల దినోత్సవం అని భ్రమ పడుతున్నారు.. వాస్తవం ఏమిటంటే నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకునే సాంప్రదాయం మన దేశంలో మాత్రమే ఉంది.. బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కో తేదీన జరుపుకుంటారు. ప్రపంచంలోని 47 దేశాలు జూన్ 1, 24 దేశాలు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాయి.. జూన్ 1వ తేదీన బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తారు.. ఐతే ఐక్య రాజ్య సమితి నవంబర్ 20వ తేదీని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది.. అమెరికాలో మాత్రం జూన్ రెండో ఆదివారం ఈ ఉత్సవం జరుపుకుంటుంది.. 

Thursday, November 12, 2015

కెంపెగౌడ జోలికి వెళ్లి భంగపడ్డ కర్నాడ్

హిరియ కెంపెగౌడ (క్రీ.శ.1510-1569) యలహంకనాడు పాలకుడు.. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్య సామంతునిగా పని చేశారు. కెంపెగౌడ 1537సం.లో బెంగళూరు నగర నిర్మాణానికి పునాది వేశారు. విద్యావంతుడైన, సమర్ధపాలకుడిగా పేరు తెచ్చుకున్న కెంపెగౌడ అంటే కన్నడ ప్రజలు ఎంతో అభిమానిస్తారు.. బెంగళూరు విమానాశ్రయానికి ఆయన పేరే ఉంది.. కెంపెగౌడ పేరు తొలగించి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ కర్నాడ్ సూచిస్తున్నారు.. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారిగా ఆయనపై మండి పడ్డారు.. కొందరైతే బెదిరించారు.. ఆందోళనకు గురైన గిరీష్ కర్నాడ్, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకోక తప్పలేదు.. చేతుల కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే..

సీఎం సిద్దూకి ఏమైంది?

మొన్న గోమాంసం తినాలనిపిస్తుందని ప్రకటించాడు.. నిన్న టిప్పు సుల్తాన్ జయంతి అంటాడు.. ఏమైంది సిద్దూకు?..  సిద్ద రామయ్యకు ఏది తినాలనిస్తే అది తినొచ్చు.. ఎముకల గూడు మెడలో వేసుకొని తిరగొచ్చు.. టప్పుసుల్తాన్ ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు.. కానీ మతాల మధ్య చిచ్చుపెట్టడం.. ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు?.. బాధ్యత గల పదవిలో ఉండి అసహనంగా ప్రవర్తిస్తున్న కర్ణాటక సీఎంను కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు భరిస్తోంది?.. సిద్దూను ఇలాగే వెనకేసుకొస్తే, కన్నడ ప్రజలు మరోసారి ఆ పార్టీకి బుద్ది చెప్పుతారు..

Tuesday, November 10, 2015

దీపం జ్యోతి పరబ్రహ్మం..

దీపారాధన మన సంస్కృతిలోని విశిష్ట సాంప్రదాయం.. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వత మోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..అంటూ ప్రార్ధిస్తాం.. ప్రతి రోజూ భగవంతుని ముందు దీపం వెలిగిస్తాం.. మరి దీపావళి నాడు వెలిగించే దీపాల ప్రత్యేకత ఏమిటి?..
చీకటి దారిద్రం, అజ్ఞానానికి.. వెలుగు సందప, జ్ఞానానికి చిహ్నం.. అంధకారంలోంచి వెలుగులోకి ప్రదేశించడానికి నిదర్శనంగా దీపావళిని జరుపుకుంటాం.. దీపం త్రిమూర్తి స్వరూపం.. ఎరుపు బ్రహ్మను, నీలం విష్ణువును, తెలుపు శివున్ని సూచిస్తుంది.. మూడు వత్తుల దీపం ముల్లోకాల్లోని అంధకారాన్ని పారద్రోలి మన ఇంటిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది..
దీపావళికి పౌరాణిక, చారిత్రిక విశిష్టత కూడా ఉంది.. లోక కంఠకుడైన నరకాసురున్ని శ్రీకృష్ణ పరమాత్ముడు సహరించిన సందర్భంగా ప్రజలంతా దీపాలు వెలిగించారు.. అలా దీపావళి జరుపుకోవడం ప్రారంభించారు. అంతకు ముందు త్రేతాయుగంలో రావణున్ని వధించిన శ్రీరామ చంద్రుడు సీతా సమేతుడై అయోధ్యలోకి ప్రవేశించింది ఇదే రోజున.. అయోధ్య వాసులంతా దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.. పాండవులు దీపావళి రోజునే అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని హస్తినాపురంలోకి ప్రవేశించారు.. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపింది కూడా ఇదే రోజున..
ఇక చరిత్రలో గమనిస్తే విక్రమాధిత్యుడు సింహాసనం అధిష్టించింది దీపావళి నాడే.. అలాగే తొలి తెలుగు రాజు శాలివాహనుడు విక్రమార్కున్ని ఓడించి సింహాసం అధిష్టించింది కూడా దీపావళి రోజునే.. జైనులు, సిక్కులకు కూడా దీపావళి పవిత్రమైన రోజు..

దీపావళి ఐదు రోజుల పండుగ.. లక్ష్మీదేవికి పూజలు, నోములు చేస్తాం.. ఈరోజున భక్తి శ్రద్దలు, నియమనిష్టలతో పూజలు  చేస్తే లక్ష్మీ దేవి సిరిసంపదలు ప్రసాదిస్తుంది.. దీపావళి రోజున టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇన్ని విశిష్టతలు ఉన్న దీపావళిని మనమంతా ఆనందంగా జరుపుకుందాం.. మీ క్రాంతి దేవ్ మిత్ర.

జాగ్రత్తలు పాటించండి.. ఆనందంగా దీపావళి జరుపుకోండి..

దీపావళి పండుగ నాడు టపాకాయలు కాలుస్తున్నారా?.. సంతోషం.. అయితే ఈ క్రింది సూచనలు పాటించండి.. 

టపాకాయలు కాల్చేటప్పుడు వీలైనంత దూరం ఉండండి.. అంటించిన వెంటనే దూరంగా జరగండి..
అగర్ బత్తీకి బదులు పొడువైన వెదురు బత్తీని మాత్రమే టపాకాయలు కాల్చేందుకు ఉపయోగించండి..
చిచ్చుబుడ్లు, భూచక్రాలతో, రాకెట్లతో సహా ఇతర బాంబులు ఏమీ చేతిలో పట్టుకొని కాల్చకండి..
టపాకాయలు అందించేటప్పుడు వాటిపై మొహాన్ని పెట్టడండి.. వాటి రవ్వలు కళ్లలో పడితే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది.. చేతిలో బాంబు వెలిగించి పడేసే ప్రయత్నం కూడా ప్రమాదకరమే..
ఒకటికన్నా ఎక్కువ టపాసులు ఒకేసారి కాల్చే ప్రయత్నం చేయకండి.. వత్తి సరిగ్గా తెరిచి అంటించండి. పేలని టపాసులను వదిలేయండి.. మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దు..
ఐదేళ్లలోపు పిల్లలను టపాకాయలకు దూరంగా ఉంచండి.. పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు దగ్గర ఉండి ఓ కంట కనిపెట్టండి..
టపాకాయలు కాల్చేప్పుడు వదులైన దుస్తులు ధరించకండి.. అంటుకునే ప్రమాదం ఉంది.. 
ఇళ్లలో టపాకాయలు అసలు కాల్చవద్దు. అలాగే వీధుల్లో వాహనాలపై వెళ్లు వారికి టపాకాయలు కాల్చి ఇబ్బంది కలిగించకండి.. వీలైనంత వరకై మైదానాల్లో టపాకాయలు కాల్చండి..
అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా బకెట్లలో నీరు అందుబాటులో పెట్టుకొండి.. అలాగే బర్నాల్ లాంటి ప్రథమ చికిత్స సామాగ్రిని దగ్గర పెట్టుకోండి..
పెద్ద శబ్దాలు వచ్చే బాంబులతో చిన్నారులు, వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడతారు.. వీలైనంత వరకూ ధ్వని, వాయు కాలుష్యం లేకుండా చూసుకోండి.. 
లక్ష్మీ దేవితో సహా దేవతా చిత్రాలు ఉన్న టపాసులను కొనుగోలు చేయకండి, కాల్చకండి.. మతపరమైన మనోభావాలను గౌరవించండి..
నాణ్యమైన టపాసులు మాత్రమే కొనుగోలు చేయండి.. 

వీలైనంత వరకూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటే చాలు.. టపాకాయలు కొని, కాల్చి డబ్బులు వృధా చేసే బదులు, ఆ సొమ్మును అనాధల సంరక్షణ, పేదల విద్య, వైద్యం తదితర సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఉత్తమం..
దీపావళిని భద్రంగా జరుపుకోండి.. ఆనందంగా ఉండండి.. దీపావళి శుభాకాంక్షలతో.. మీ క్రాంతిదేవ్ మిత్ర

Monday, November 9, 2015

శుభాలనిచ్చే ధన త్రయోదశి

ధన త్రయోదశి.. దీపావళికి ముందుగా వస్తుంది.. ఉత్తర భారతంలో ధన్ తెరాస్ పేరుతో ప్రసిద్ది.. ఈ రోజున  బంగారం కొనడం సాంప్రదాయం.. బంగారు వ్యాపారుల పుణ్యమా అని దక్షిణాదికీ ఈ పండుగ వచ్చింది.. వ్యాపారులు  రోజున బంగారం కొనడం శుభం అంటూ తెగ ప్రచారం చేస్తుంటారు.. కానీ కచ్చితంగా కొనాల్సిన అవసరం ఏమీ లేదు.. అప్పులు చేసి బంగారం కొనాల్సిన అవసరం అసలే లేదు.. లక్ష్మీ దేవికి చక్కగా మొక్కుకుంటే చాలు, ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి.. అందరికీ ధన్ తెరాస్ శుభాకాంక్షలు..

ఎవరికీ అనుకూలం కాని బీహారీ తీర్పు..

బిహారీ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా విలక్షణం.. నితిష్ కుమార్ సమర్ధ నాయకత్వంపై వారు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతున్నా, అక్కడ కుల, మత ఓట్ల సమీకరణే ప్రధానంగా కనిపిస్తోంది.. మహాకూటమిలోని నితిష్ కుమార్ పార్టీ జేడీయూకు గతంలో కన్నా ఓట్ల శాతం, సీట్ల శాతం తగ్గడమే ఇందుకు ఉదాహరణ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గణనీయంగా సీట్లను సాధించినా, ఓట్ల శాతం తగ్గింది.. అలాగే బీజీపీకి సీట్లు తగ్గినా ఓట్ల శాతం పెరిగింది.. కింగ్ మేకర్ లాలూ వల్ల నితిష్ కష్టాలు ఎదుర్కోక తప్పేట్లు లేదు..
బీజేపీకి స్థానికంగా సమర్ధ నాయకత్వం లేకపోవడం శాపంగా మారింది.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి.. మరోవైపు బీజీపీలో శతృఘ్న సిన్హా లాంటి నాయకులు సైందవ పాత్ర పోశించి పార్టీకి నష్టం కలిగించారు. దీనికి తోడు బీజేపీ నేతల అతి వాగాడంబరం కూడా ఇబ్బంది కలిగించింది.. బిహారీలు ఢిల్లీ ఓటర్ల తరహాలోనే కేంద్రంలో మోదీ, స్థానికంగా నితిష్ ఉండాలని భావించారు..
కాంగ్రెస్ పార్టీ గతంలోకన్నా మెరుగ్గా రెండంకెల సీట్లు సాధించినా, అది మహాకూటమి దయాదాక్షిణ్యాల వల్లే.. దీనివల్ల ఆ పార్టీకి బిహార్లో దక్కే దీర్ఘకాల లాభం ఏదీ లేదు.. ఇక ఎంఐఎం ఎన్ని పగల్బాలు పలికినా ఓటర్ల ఆదరణ పొందలేదు.. ఎంఐఎం సఫలం అయ్యుంటే ఆలాభం బీజేపీకే సీట్లు రూపంలో దక్కేది..
సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ బల్ల గుద్ది చెబుతున్నట్లుగా జాతీయ రాజకీయాల ప్రభావం బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఏ మాత్రం కనిపించలేదు..

Thursday, November 5, 2015

ఏమిటీ అసహనం?..

దేశంలో అసహనం పెరిగిపోతోందా?.. ఇదెప్పటి నుండి?.. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుండే ఈ అసహనం మొదలైందా?.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అసహనం లేదా?.. అసహన ఘటనలన్నీ బీజేపీలో జరిగాయా?. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అంతా సవ్యంగా ఉందా?.. ఇంతకీ నరేంద్ర మోదీపై వీరికి ఎందుకు అంత అసహనం?.. ఇప్పుడు యాగీ చేస్తున్నా వారంతా కాంగ్రెస్ హయాంలో ఎందుకు నోరు మెదపలేదు?.. అప్పుడు గాఢ నిద్రలో ఉండి ఇప్పుడే నిద్ర లేచారా?.. సోకాల్డ్ మేధావులంతా తమ పురస్కారాలను ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు?.. అవార్డులు మాత్రమే ఇచ్చేసి దాని వెంట వచ్చిన నగదు మాత్రం ఎందుకు దాచుకుంటున్నారు?.. ఇంతకీ వీరంతా ఎవరు?.. అవార్డులు ఎలా వచ్చాయి?.. వీరి భావజాలం ఏమిటి?.. ఎవరు ప్రేరేపిస్తున్నారు?.. వీరికి ఎందుకింత పబ్లిసిటీ కల్పిస్తున్నారు?.. అసహన ప్రచారం వెనుక కుట్ర కోణం ఉందా?..

ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరగాలి.. ఈ అసహన దుమారం వెనుక అసలు వాస్తవాలు ఏమిటో నిగ్గు తేలాల్సిందే.. 

Sunday, November 1, 2015

తెగులు సోకిన తెలుగు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినమైన నవంబర్ 1వ తేదీ ప్రాధాన్యత కోల్పోయింది.. అన్నదమ్ములైన తెలంగాణ, ఆంథ్రప్రదేశ్ లు వేరు కుంపట్లు పెట్టుకున్నందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ అభ్యంతరాలు లేవు.. కానీ మన కన్న తల్లి అయిన తెలుగును అనాధగా మార్చేస్తున్నాం.. 01.11.2002నాడు ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసమిది.. నాటికి, నేటికి తెలుగు భాష దుస్థితి ఏమాత్రం మారకపోగా మరింత దిగజారింది..