Tuesday, November 10, 2015

దీపం జ్యోతి పరబ్రహ్మం..

దీపారాధన మన సంస్కృతిలోని విశిష్ట సాంప్రదాయం.. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వత మోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..అంటూ ప్రార్ధిస్తాం.. ప్రతి రోజూ భగవంతుని ముందు దీపం వెలిగిస్తాం.. మరి దీపావళి నాడు వెలిగించే దీపాల ప్రత్యేకత ఏమిటి?..
చీకటి దారిద్రం, అజ్ఞానానికి.. వెలుగు సందప, జ్ఞానానికి చిహ్నం.. అంధకారంలోంచి వెలుగులోకి ప్రదేశించడానికి నిదర్శనంగా దీపావళిని జరుపుకుంటాం.. దీపం త్రిమూర్తి స్వరూపం.. ఎరుపు బ్రహ్మను, నీలం విష్ణువును, తెలుపు శివున్ని సూచిస్తుంది.. మూడు వత్తుల దీపం ముల్లోకాల్లోని అంధకారాన్ని పారద్రోలి మన ఇంటిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది..
దీపావళికి పౌరాణిక, చారిత్రిక విశిష్టత కూడా ఉంది.. లోక కంఠకుడైన నరకాసురున్ని శ్రీకృష్ణ పరమాత్ముడు సహరించిన సందర్భంగా ప్రజలంతా దీపాలు వెలిగించారు.. అలా దీపావళి జరుపుకోవడం ప్రారంభించారు. అంతకు ముందు త్రేతాయుగంలో రావణున్ని వధించిన శ్రీరామ చంద్రుడు సీతా సమేతుడై అయోధ్యలోకి ప్రవేశించింది ఇదే రోజున.. అయోధ్య వాసులంతా దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.. పాండవులు దీపావళి రోజునే అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని హస్తినాపురంలోకి ప్రవేశించారు.. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపింది కూడా ఇదే రోజున..
ఇక చరిత్రలో గమనిస్తే విక్రమాధిత్యుడు సింహాసనం అధిష్టించింది దీపావళి నాడే.. అలాగే తొలి తెలుగు రాజు శాలివాహనుడు విక్రమార్కున్ని ఓడించి సింహాసం అధిష్టించింది కూడా దీపావళి రోజునే.. జైనులు, సిక్కులకు కూడా దీపావళి పవిత్రమైన రోజు..

దీపావళి ఐదు రోజుల పండుగ.. లక్ష్మీదేవికి పూజలు, నోములు చేస్తాం.. ఈరోజున భక్తి శ్రద్దలు, నియమనిష్టలతో పూజలు  చేస్తే లక్ష్మీ దేవి సిరిసంపదలు ప్రసాదిస్తుంది.. దీపావళి రోజున టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇన్ని విశిష్టతలు ఉన్న దీపావళిని మనమంతా ఆనందంగా జరుపుకుందాం.. మీ క్రాంతి దేవ్ మిత్ర.

No comments:

Post a Comment