Friday, August 29, 2014

గణపతి ఉత్సవాల వెనుక..

వినాయక చవితి వచ్చిందంటే ఊరంతటికీ పండగే.. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసుకొని గణనాధుడికి పూజలు, భజనలు చేస్తుంటారు.. సామూహిక వినాయక చవితి ఉత్సవాలు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయో తెలుసా?..
లోకమాన్య బాలగంగాధర తిలక్ స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా 1893లో సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభించారు.. 1857 మొదటి స్వాతంత్ర్య సమరం తర్వాత బ్రిటిష్ వారు దేశంలో రాజకీయ సభలు, సమావేశాలను నిషేధించారు.. అయితే మత పరమైన వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవు.. ఈ నేపథ్యంలో గణపతి పూజలు ఇంటికే పరిమితం చేయకుండా సామూహికంగా జరుపుకుంటే ప్రజల్లో ఐక్యత, జాతీయ భావం పెరుగుతుందని తిలక్ భావించారు.. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా అంతర్లీనంగా దేశభక్తిని ప్రభోదించారు.. మొదట మహారాష్ట్రలో ప్రారంభమైన సామూహిక వినాయక చవితి వేడుకలు దేశమంతా విస్తరించాయి..
అయితే మన చరిత్రను గమనిస్తే గణపతి సామూహిక పూజలకు శతాబ్దాల చరిత్ర ఉంది.. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు పెద్ద ఎత్తున గణపతి ఆలయాలను నిర్మించారు.. ఈ ఆలయాల్లో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేవారని తెలుస్తోంది.. అలాగే చత్రపతి శివాజీ సైతం గణేష్ చతుర్ధి వేడుకలను నిర్వహించారు.. మహారాష్ట్రంలో గణపతి ఆరాధన ఎక్కువగా కనిపించడానికి మరో కారణం ఉంది.. బ్రిటిష్ వారికి ముందుగా ఆధునిక కాలంలో మహారాష్ట్రను పాలించిన పీష్వాల ఇలవేలుపు వినాయకుడు.. ఈ కాలంలో వినాయక పూజలు, భక్తి చాలా వరకూ విస్తరించింది.. 

ప్రాచీన కాలం నుండి సామూహిక వినాయక ఆరాధన ఉన్నా ఆధునిక కాలంలో ఒక ఉన్నత ఆశయం కోసం దానికి విస్తృత రూపం ఇచ్చిన ఘనత తిలక్ మహాశయునిదే..

ఛాయ్ వాలాతో లడ్డూ వాలా..


తెలుగు లెస్సే..

ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1999/2002-12 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 6 వేల భాషల్లో ఇప్పటికే 3 వేలు కాలగర్భంలో కలిసిపోయాయి.. భారత దేశంలో 2025 సంవత్సరం నాటికి కేవలం 5 భాషలే మిగులుతాయట.. అవి హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మళయాళలం.. ఇందులో తెలుగు లేదు.. ఈ నివేదిక మతలబు ఏమిటో తెలియకున్నా మన కళ్ల ముందు జరుగుతున్న పరిణామాలు తెలుగు భాషకు హాని కలిగిస్తున్నవే.. శ్రీకష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ అది లెస్సే అవుతోంది..
తెలుగు భాష, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, అధికార భాష అంటూ మొన్నటి దాకా జబ్బలు చర్చుకున్నాం.. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏనాడు తెలుగును అధికార భాషగా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాం.. ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏదో జరిగిపోతుందని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది..
ఏ కారణం అయితేనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించడానికే ఆసక్తి చూప్తిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు మీడియం విద్యార్థులు 27 శాతం(?) మాత్రమే ఉన్నారట.. ఈ విషయంలో మనం ఎవరినీ తప్పుపట్టి లాభం లేదు.. తిలా పాపం తలా పిడికెడు.. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెక్కన పెడితే కనీసం మన ఇళ్లలోనైనా తెలుగు భాషను బతికించుకుందాం.. ఇందు కోసం టీవీ, వార్తా పత్రికలను నమ్ముకోవడం మరింత ప్రమాదం.. అందులో కనిపించేదంతా ఖూనీకోరు తెలుగు మాత్రమే.. పిల్లలకు మంచి తెలుగు సాహిత్యం చదవడం అలవాటు చేద్దాం..
తెలుగువారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే పరిమితం కాదు.. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల్లో సైతం అధిక సంఖ్యలో ఉన్నారు.. ఆయా రాష్ట్రాల్లో భాషా చైతన్యం కారణంగా తెలుగువారు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు.. చాలా ప్రాంతాల్లో దాదాపు తెలుగు రాయడం, చదవడం మరచిపోయారు.. మరో తరం పోతే తెలుగు మాట్లాడమే మరచిపోతారు.. పొరుగు రాష్ట్రాలు తమ భాషను  రక్షించేకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి.. మన దగ్గర తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, ప్రెస్ అకాడమీ, అధికార భాషా సంఘాలు ఉన్నా అవి అజాగళస్థనాలుగా మారిపోయాయి..

వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామమూర్తి పంతులు జయంతి నేడు.. ప్రతి ఏటా ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. కనీసం ఈ రోజైనా మన మాతృభాష తెలుగు గురుంచి ఆలోచద్దాం..

 

జై గణేష్..


Wednesday, August 27, 2014

25 ఆగస్టు, 2007న ఏం జరిగిందంటే..


 ఆగస్టు 25, 2007..

అన్ని తేదీల్లాగే ఈ తేదీ ఓ సాధారణ దినంగా గడిచిపోవాల్సింది.. కానీ చరిత్రలో నిలిచిపోయిందా దినం.. నేను కూడా జీవితంలో ఎన్నడూ మరచిపోలేని రోజు.. ఎందుకంటే ఆ రోజు మృత్యువును జయించాను.. అదీ మూడు ప్రాంతాల్లో..
ఆ సాయంకాలం ఎప్పటిలాగే ఆఫీసు నుండి ఇంటికి బయలు దేరే సమయానికి ఓ చిరకాల మిత్రుడు ఎదురయ్యాడు.. అలా మాట్లాడుతూ వెళదామని బైక్ స్టార్ట్ చేశాను.. వెనక కూర్చున్నాడతను.. సచివాలయం ముందు లుంబినీ పార్క్ దగ్గరకు వచ్చాం.. ఈ పార్కులో లేజర్ షో బాగుంటుందట కదా? అని ప్రశ్నించాడు నా మిత్రుడు.. అవును చూస్తావా? అని అడిగాను.. వద్దులే త్వరగా ఊరెల్లాలి అన్నాడు.. సరేలే అని బండిని ముందుకు పోనిచ్చాను..
కోఠి పేరు వినగానే నాకు గుర్తుకు వచ్చేది గోకుల్ ఛాట్.. కొన్నేళ్లుగా నేను ఇష్టపడే దహీ కట్లెట్ తిన్నాం ఇద్దరం.. ఆ తర్వాత బైక్ స్టార్ట్ చేశాను.. ఉమెన్స్ కాలేజీ సిగ్నల్ దాటాక వెనకాల దూరంగా ఏదో పేలిన శబ్దం వినిపించింది.. ఏమయ్యుంటుంది?.. ఎక్కడో టపాకాయ పేలి ఉంటుంది అన్నాడా మిత్రుడు.. దీపావళి రోజులు కూడా కాదు కదా అనుకున్ను మనసులో..
ఛాదర్ ఘాట్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వచ్చాం.. నా మిత్రుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న అంగడిలో పూలు కొన్నాడు.. అక్కడే కొంత మంది గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు.. అని చెప్పుకుంటున్నారు.. ఆశ్చర్యంతో నేను నా మీడియా మిత్రులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించాను.. అప్పటికే మొబైల్ నెట్ వర్క్స్ అన్నీ జామ్ అయ్యాయి.. ఫోన్ కలవడం లేదు.. నా మిత్రున్ని దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లో బస్సెక్కించి ఇంటికి వచ్చాను..
హడావుడిగా టీవీ ఆన్ చేస్తే భయంకరమైన దృశ్యాలు, వార్తలు, స్క్రోలింగ్స్.. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో బాంబులు పేలాయని.. పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారని ఆ వార్తల సారాంశం.. కొద్ది సేపటికే మరో ఫ్లాష్.. దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఓ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారట.. ఈ మూడు ప్రాంతాలను నేను రెండు గంట వ్యవధిలోనే టచ్ చేస్తూ వచ్చాను అని గుర్తుకు వచ్చింది.. అప్పుడే ఫోన్ మోగింది.. బస్సులో ఊరెళుతున్న మిత్రుడు ఫోన్ చేశాడు..  బస్సులో అంతా అనుకుంటున్నారు.. ఇది నిజమేనా అని అదుర్దాగా అడిగాడు.. అవును మనం మృత్యువును జయించాం అని ఫోన్ పెట్టేశాను..
ఉగ్రవాద భూతం మరోసారి నాతో దోబూచులాడింది.. 21 ఫిబ్రవరి, 2013న.. ఆ రోజు సాయంత్రం దిల్ సుఖ్ నగర్ కోణార్క్ ధియేటర్ కార్నర్లో ఓ మిత్రునితో టీ తాగాను.. ఆ తర్వాత నా అభిమాన నటుడు కమల్ హాసన్ చిత్రం విశ్వరూపం చూసేందుకు రాజధాని ధియేటర్ కు వెళ్లాను.. సినిమాలో కమల్ హాసన్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాడు.. తుపాకులు, బాంబుల మోత మోగుతోంది.. కాసేపటికి జనం హడావుడిగా థియేటర్ నుండి జారుకుంటున్నారు.. అప్పుడే ఓ కొలీగ్ ఆఫీసు నుండి ఫోన్ చేశాడు.. దిల్ సుఖ్ నగర్లో బాంబు పేలాయట కదా? ఓ ధియేటర్ దగ్గర అని వాకబు చేశాడు.. నేను హడావుడిగా రోడ్డు మీదకు వచ్చాను.. జనం పరుగెత్తుతున్నారు.. నేను కొద్ది సేపటి క్రితం ఛాయ్ తాగిన ప్రాంతంలోనే బాంబు పేలింది.. ఎన్నో ప్రాణాలు పోయాయి..
ఈ ఘటనలు నా జీవితంలో యాదృచ్చికంగా జరిగినవే కావచ్చు.. కానీ సామాన్యుడి ప్రాణానికి గ్యారంటీ లేని రోజులు వచ్చాయి.. ఉగ్రవాదులు ఎక్కడో ఉండరు.. మనం ఛాట్ తినే రోడ్డు పక్కనో, ఛాయ్ తాగే చోటో పొంచి ఉండొచ్చు.. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టూ అనుమానంగా సంచరించే వారు కనిపించినా, గుర్తు తెలియని వస్తువులు కనిపించినా మొహమాట పడకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయండి.. మీ ప్రాణాలే కాదు.. ఇతరుల ప్రాణాలూ కాపాడండి..

గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుడు ఘటనలు జరిగి నేటికి ఏడేళ్లు పూర్తవుతోంది.. ఆనాటి దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం భగవంతున్ని ప్రార్థిస్తూ..

Sunday, August 24, 2014

మన చర్మం మొద్దుబారిందా?

ఢిల్లీలో బస్సులో ఓ యువతిపై సామూహిక పైశాచిక అత్యాచారం దేశాన్ని కదిలించింది.. వారాల తరబడి మీడియా లైవ్ వార్తలు ఇచ్చింది.. యువజనం రోడ్ల మీదకు వచ్చారు.. ప్రభుత్వం వణికిపోయింది..
ముంబైలోని ఓ శిథిల మిట్లులో ఓ మహిళా జర్నలిస్టులపై దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు.. రోజుల తరబడి మీడియాలో చర్చలు జరిగాయి..
బెంగళూరు ఏకంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు నిలయంగా మారిపోయింది.. అక్కడి ప్రజలు, మీడియా గగ్గోలు పెట్టేసింది..
హైదరాబాద్ లో దయ్యానీ స్నేక్ బ్యాచ్ అత్యాచార పర్వం వెలుగులోకి వచ్చింది.. విజయవాడలో కొందరు యువకులు అమ్మాయిలను బెదిరించి అశ్లీల దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు.. ఈ రెండు ఘటనల్లో నిందితులు పట్టుబడ్డారు.. కానీ ఎక్కడా చర్చలేదు.. మీడియా మమ అంటూ వార్తలు ఇచ్చేసి మూగనోముపట్టింది..

మన తెలుగు సమాజం చర్మం అంతగా మొద్దు బారిందా?.. ఎక్కడ ఉంది లోపం? 

విజన్ సింగపూర్..

నిన్నటి దాకా ఒక ముఖ్యమంత్రి సింగపూర్ కలలు కన్నారు.. గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ను ఏకంగా సింగపూర్ చేస్తానన్నారు.. సింగపూర్ ను తలదన్నే రాజధానిని కడతానన్నారు..
ఇప్పుడు మరో ముఖ్యమంత్రి ఏకంగా సింగపూర్ వెళ్లారు.. అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేస్తున్నారు.. హైదరాబాద్, తెలంగాణలను సింగపూర్లా తీర్చి దిద్దుతామంటున్నారు..
ఇధ్దరి కలలను తప్పు పట్టలేం.. వారి ఆశలూ మంచివే.. కానీ ఆచరణ ఎలా?..
అసాధ్యమేం కాదు.. కష్టపడాలి.. ప్రభుత్వంలో వేగం పెరగాలి.. యంత్రాంగంలో, ప్రజల్లో వర్క్ కల్చర్ పెరగాలి..
తధాస్తు..
అయితే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సింగపూర్ నమూనా వద్దు.. సింగపూర్ సింగపూరే.. మనం మనమే.. మనదైన ముద్రతో పోటీ పడదాం.. అభివృద్ధి పథంలో దూసుకుపోదాం..

Tuesday, August 19, 2014

రాజధాని నగరం నీది..నాది..

సమగ్ర కుటుంబ సర్వే పుణ్యమా అంటూ హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. రోడ్లపై జన సంచారం, వాహనాల రొద కరువైంది.. రాత్రింబవళ్ళు రద్దీగా ఉండే ఛాదర్ ఘాట్ వంతెన బోసిపోయింది..
ఓ తాగుబోతు హాయిగా పడకేశాడు.. ఛాదర్ ఘాట్ వంతెన ఫుట్ పాత్ తలగడగా, రోడ్డే పాన్పుగా మార్చుకున్నాడు.. 
వాడిని కదిలించాను.. రోడ్డుపై ఎందుకు పడుకున్నవని అడిగాను..
ఖాళీగా ఉందని పడుకున్నాడట.. రాత్రి తాగి ఇంటికి పొతే భార్య లోనికి రానివ్వలేదట పాపం..
ఇవాళ సర్వే కదా ఇంట్లో లేకపోతే ఎట్లా అని ప్రశ్నించా?.. అయితే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు..
వీడి ఖర్మ అనుకొని బైక్ స్టార్ట్ చేశాను.. 
అన్నట్లు వాడి పేరు అడిగితే, దేవదాసు అనిచెప్పాడు.. నిజమో, కాదో తెలియదు..

పాకిస్తాన్ కు గుణపాఠం తప్పదు..

శత్రువును సామ దాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకోవాలంటారు.. పాకిస్తాన్ పుట్టిందే భారత దేశ వ్యతిరేకతతో.. నిరంతరం విషం చిమ్మనిదే దానికి మనుగడ లేదు.. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది పాకిస్తాన్..ఎవడైనా పాక్ పాలకుడు సద్భుద్ధితో భారత్ కు స్నేహ హస్తం అందిస్తే ఐఎస్ఐ, సైన్యం ఊరుకోదు..
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం వేడుకకు పాకిస్తాన్ సహా సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు నరేంద్ర మోదీ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు సందేశాన్ని ఇచ్చారు.. పాకిస్తాన్ ఎప్పటిలాగే గుంటనక్క లా ప్రవర్తించింది.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చాడు.. నరేంద్ర మోదీతో కరచాలనం చేశాడు.. ఆ తర్వాత జరిగిన భేటీలో పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలు మారాలని స్పష్టంగా నవాజ్ కు చెప్పారు మోదీ..
కుక్క తోక వంకర అంటారు.. అందుకే పాకిస్తాన్ తన పద్దతులు మార్చుకోవడం లేదు.. సరిహద్దుల్లో యధావిధిగా కాల్పులు జరుపుతూనే ఉంది.. ఇటీవల కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికనే ఇచ్చారు.. తాజాగా భారత్ లోని పాకిస్తాన్ హై కమిషనర్ కాశ్మీర్ వేర్పాటు వాద ఉగ్రవాదులను పిలిపించుకొని మాట్లాడారు.. దీంతో ఈ నెల 25 తేదీన ఇస్లామాబాద్లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసుకుంది భారత్..
అటల్జీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా నవాజ్ షరీఫ్, పాక్ సైన్యం ఇలాగే తమ దుష్టబుద్దిని ప్రదర్శించాయి.. బస్సుయాత్ర సందేశాన్ని నీరుగార్చి కార్గిల్ కయ్యానికి దిగాయి.. వెంటేనే తేరుకున్న భారత్ గట్టి బుద్ది చెప్పింది.. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నది నరేంద్ర మోదీ..
పాకిస్తాన్ బుద్ది మారేందుకు అన్ని అవకాశాలు ఇచ్చారు మోదీ.. మరికొన్ని అవకాశాలు ఇస్తారేమో?.. దారికి రాకపోతే మాత్రం కఠినంగా వ్యవహరించి ఆ దేశానికి గుణపాఠం చెప్పడం ఖాయం..

'సర్వే'జనా సుఖినో భవంతు..

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. దీనిపై వివాదాలు ఎన్నో ఉన్నా, ఒక ప్రయోగంగా మిగిలిపోనుంది.. ఒకే రోజు రాష్ట్రమంతా సర్వే అంటే ఆశామాషీ కాదు.. ఈ సర్వే ఉద్దేశ్యాలు ఏమిటి అనే విషయం పక్కన పెడితే, ఇతర రాష్ట్రాలు దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు సక్రమంగా అందేలా చూడటమే సర్వే ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది.. ఇదే నిజమైతే సర్వేను స్వాగతించాల్సిందే.. తెలంగాణేతరులను గుర్తించి ఏరివేయడమే సర్వే లక్ష్యమని ప్రచారం జరుగుతోంది.. కానీ సర్వేలోని ప్రశ్నావళి నమూనాలో ఎంతకాలంగా తెలంగాణలో ఉంటున్నారు? 1956 ముందు నుండే ఉంటున్నారా? ఆధారాలు ఏమిటి? అనే ప్రశ్నలైతే లేవు.. బ్యాంకు ఖాతా తదితర వివరాలు ఇష్టముంటేనే ఇవ్వాలంటున్నారు.. ప్రభుత్వానికి దురుద్దేశ్యాలు లేనప్పుడు సర్వేను స్వాగతించాల్సిందేనని నా అభిప్రాయం..

Monday, August 18, 2014


ఇరాక్ లో హిందూ సాంప్రదాయం..

ఈ పేయింటింగ్ భారత దేశంలో వేసిందని భావిస్తున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.. ఉత్తర ఇరాక్ లోని లాలేశ్ లోని యాజిది ఆలయం గోడపై వేసిని హిందూ క్యాలండర్ చిత్రం ఇది.. యాజిదీలు కుర్దిష్ భాష మాట్లాడే అల్పసంఖ్యాక ప్రజలు.. మెలెక్ తవ్వాస్ అనే సాంప్రదయాన్ని అనుసరించే యాజిదీలు తమ మూలాలు హిందుత్వానికి దగ్గరగా ఉంటాయని చెబుతుంటారు.. ప్రస్తుతం వారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటున్నారు..(ధ హిందూ పత్రిక సౌజన్యంతో) By: క్రాంతి దేవ్ మిత్ర

Sunday, August 17, 2014

చంద్రులిద్దూ కలిశారు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య తొలిసారిగా సహృద్భావ వాతావరణంలో చర్చలు ముగిసాయి.. పరస్పరం సమన్వయంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.. ఈ పని రెండు నెలల క్రితం ప్రారంభం అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమా?..

ఇలాంటి వారినేం చేయాలి?

మనకు జన్మనిచ్చిన తల్లి ఎంత ముఖ్యమో.. మన జన్మించిన భూమి కూడా అంతే.. భూమిని తల్లిగా పూజిస్తాం.. భూమాత అంటాం.. అలాగే మన జన్మభూమి కూడా..
ప్రతి దేశస్తుడు తాను పుట్టిన దేశాన్ని, మాతృభూమిగా, పితృభూమిగా ఆరాధిస్తాడు.. భారతీయులమంతా మన దేశాన్ని భారత మాతగా పిలుచుకుంటాం.. ఆరాధిస్తాం.. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడతాం.. దేశభక్తి కులం, మతం, ప్రాంతం, భాష అడ్డు రాదు.. మన దేశ చిత్రపటాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించి తీరాల్సిందే.. ఈ దేశంలో పుట్టి,, ఇక్కడి తిండి తిటూ, గాలి పీలుస్తూ, ఇక్కడే పెరుగుతున్నందుకు దేశానికి ఎంతో రుణపడి ఉండాలి.. ఈ దేశాన్ని అగౌరవపరిస్తే, మన మతృమూర్తిని అగౌరవ పరచుకున్నట్లే..

ఖమ్మం జిల్లాల్లో మతోన్మాదం తలకెక్కిన ఓ మూర్ఖపు ప్రధానోపాధ్యాయుడు వ్యవహారం ఎలా ఉందో ఈ వార్తను చూడండి.. భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అసలు ఇలాంటి వెధవలకు ఉపాధ్యాయ వృత్తిని ఇచ్చిందెవరు? అందునా ప్రధానోపాధ్యాయ ఉన్నతిని ఇచ్చిందెవరు? వారిని అనాలి ముందు.. ఇలాంటి దౌర్భాగ్య మనస్తత్వం ఉన్నవారిని ముందు ఉద్యోగం నుండి తొలగించాలి.. దేశాన్ని అగౌరవపరచినందుకు కఠినంగా శిక్షించాలి..
ఏ మతం కూడా దేశాన్ని అగౌరవపరచమని చెప్పదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..

కృష్ణం వందే జగద్గురుం..


Saturday, August 16, 2014

అయ్యా గవర్నర్ గారూ..

ఏడాదికి ఒకటో రెండో ఎట్ హోంలకు కాకుండా, ప్రతి వారం వీరిద్దరినీ రాజ్ భవన్ కు పిలవండి.. చాయ్, బిస్కెట్లతో కాకుండా మంచి భోజనం పెట్టండి.. అన్నట్లు హైదరాబాదీ బిర్యానీ, రాగి సంకటి-నాటు కోడి పులుసు మరిచిపోకండి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసం ఇలాగేనా వీరు తరచూ కలుసుకుంటారు..


స్పూర్తినిచ్చిన ప్రసంగం..

ప్రధానమంత్రిని కాదు.. ప్రధాన సేవకున్ని అని ప్రకటించారు నరేంద్ర మోదీ.. రెండు దశాబ్దాల తర్వాత బుల్లెట్ ఫ్రూప్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి, జాతినుద్దించి ప్రసంగించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు మోదీ.. ప్రసంగ పాఠంతో పని చేకుండా అనర్గళంగా సాగిన ఈ ప్రసంగం దేశ ప్రజలకు కదిలించడమే కాదు విమర్శలకు తావులేకుండా చేసింది.. పేదరికంపై యుద్దం ప్రకటించారు మన ప్రధాని.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా 125 కోట్ల మంది ప్రజలు చేయి చేయి కలిపి పని దేశం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.. మన నైపుణ్యం, ప్రతిభా పాటవాలతో స్కిల్ ఇండియాను రూపొందిద్దామన్నారు..  కాలం చెల్లిన ప్రణాళికా సంఘం అవసరం లేదని, అభివృద్ధిలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేలా సరికొత్త సంస్థను తీసుకువస్తున్నాట్లు మోదీ ప్రకటించారు.. తమ పార్టీకి పూర్తి బలం ఉన్నా మెజారిటీ, మైనారిటీతో సంబంధం లేకుండా ఏకాభిప్రాయంతో పని చేస్తామని తెలిపారాయన.. గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాలు చూశాం..  కానీ ఇంతటి స్పూర్తిదాయకమైన ప్రసంగాన్ని విన్నామా?.. 

15-08-1947 నాటి భారత్, పాకిస్తాన్ పత్రికలు


Friday, August 15, 2014

15 ఆగస్టు 1947 నాటికి..

15 ఆగస్టు 1947లో బ్రిటిష్ పాలన అంతమై భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం.. కానీ నిజానికి ఆ సమయానికి మన హైదరాబాద్ సంస్థానంతో సహా దేశంలోని 50 శాతానికి పైగా భూభాగాలు స్వాతంత్ర్య వేడుకలకు దూరంగా ఉన్నాయి..
దాదాపు మూడో వంతు భూభాగాన్ని బ్రిటిష్ వారు విడదీసి పాకిస్తాన్ కుంపటి పెట్టారు.. 1947 ప్రాంతంలో దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.. వీరికి భారత్, పాకిస్తాన్లలో ఎందులో అయినా చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చంటూ బ్రిటిష్ వారు స్వేచ్ఛ ఇచ్చారు..  ఈ సంస్థానాలలోని ప్రజలంతా భారత్లో కలవాలని బలంగా కోరుకున్నారు.. దేశంలోనే అతి పెద్ద సంస్థానమైన హైదరాబాద్లో ఆర్యసమాజీయులు, స్టేట్ కాంగ్రెస్ వారు నిజాం ఆంక్షలను ధిక్కరించి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు.. కఠిన శిక్షలకు గురయ్యారు..
ఇలాంటి తరుణంలో మన మొదటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చాక చక్యంగా పావులు కదిపి అన్ని సంస్థానాలు కూడా భారత దేశంలో విలీనం అయ్యేలా ఒప్పించారు.. కానీ  హైదరాబాద్, కాశ్మీర్, జునాఘడ్, తిరువాన్కూర్ సంస్థానాలు ఎటూ తేల్చలేదు.. పటేల్ రంగంలోకి దిగి హైదరాబాద్, జునాఘడ్, తిరువాన్కూరు సంస్థానాలను సామ, దాన, బేధ, దండోపాయాలతో దారిలోకి తెచ్చారు.. కాశ్మీర్ అంశాన్ని ప్రధాని నెహ్రూ డీల్ చేసిన కారణంగా నేటికీ ఆ సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..

ఈ రోజున మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ సమైక్యతతో ఉందంటే అది ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయి పటేల్ కారణంగానే.. ఆ మహనీయున్ని స్మరించుకోవడం మన విధి..

జై హింద్..


Thursday, August 14, 2014

జాతీయ గీతం వెనుక..

జన గణ మన అధినాయక జయహే.. గీతం వినగానే ఒక్కసారిగా దేశ భక్తి ఉప్పొంగుతుంది.. 52 సెకన్ల జనగణమణ గీతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో గుర్తించింది..
విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగోర్ రాసిన ఈ గీతం తొలిసారిగా 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో ఆలపించారు.. స్వాతంత్ర్యం వచ్చాక మన రాజ్యాంగ సభ దీన్ని జాతీయ గీతంగా స్వీకరించింది.. ఈ గీతానికి స్వయంగా ఠాగోర్ సంగీత బాణీ కట్టారు.. ప్రస్తుతం మనం పాడుతున్న తీరిలో ఈ గీతం రూపొందింది ఎక్కడో తెలుసా? 1919లో మదనపల్లె వచ్చిన ఠాగోర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసి బహిరంగంగా ఆలపింపజేశారు.. వాస్తవానికి జనగణమన గీతం మొదట బెంగాళీలో రాసినది.. దీన్ని దేశమంతటా పాడుకునే విధంగా సంస్కృతీకరించారు.. నిజానికి జనగణమన గీతం మొత్తం ఐదు చరణాల్లో ఉంటుంది.. కానీ మనం ఒక చరణం మాత్రమే ఆలపిస్తున్నాం..
జనగణమన గీతంపై ఆది నుండి వివాదాలు ఉన్నాయి.. రవీంద్రనాథ్ ఠాగోర్ బ్రిటిష్ చక్రవర్తిని అధినాయకునిగా, భారత భాగ్య విధాతగా పొగుడుతూ ఈ గీతం రాశారంటారు.. కానీ ఠాగోర్ ఈ గీతాన్ని స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా జాతీయ సభల వేదికలపైనే ఆలపించారు.. జనగణమన గీతంలో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లు కనిపించవు.. కొన్ని పేర్లు ఇప్పుడు వాడుకలో లేవు.. అయితే ఈ గీతం 1911 నాటి భారత భూభాగాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారని గుర్తుంచుకోవాలి..  కాలానుగుణంగా జాతీయ గీతాన్ని మార్చాలనే డిమాండ్ ఉన్నా, చారిత్రిక ప్రాధాన్యత దృష్ట్యా ఇలాగే కొనసాగిచడం బాగుంటుందని భావించారు..
వాస్తవానికి భారత జాతీయ గీతంగా అప్పటికే వందే మాతరం ప్రసిద్ధికెక్కింది.. బంకించంద్ర చటర్జీ రాసిన నవలలోని ఈ గీతం బెంగాల్ విభజన సమయంలో స్వాతంత్ర్య సమర పోరాటాన్ని మలుపుతిప్పింది.. దేశ ప్రజలకు స్పూర్తినిచ్చి, ఎందరో యోధులను తయారు చేసిన గీతం అది.. దురదృష్టవశాత్తు వందేమాతరంలో హిందూ దేవతల పేర్లు ఉన్నాయనే సాకుతో సోకాల్డ్ సెక్యులరిస్టులు అడ్డుకున్నారు..

అయితే జనగణమనతో పాటు మూడో వంతుకు కుదించిన వందేమాతరానికి కూడా జాతీయ గీత హోదా లభించింది.. ఈ రెండు గీతాలు కూడా బెంగాల్ ప్రాంతం నుండి రావడం మరో విశేషం.. జనగణమన, వందేమాతరం గీతాలు రెండు కూడా మనకు స్పూర్తిని ఇచ్చేవే.. 

మాతృభూమి ముక్కలైన రోజు..

మరి కొద్ది గంటల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినం అంటూ ఉత్సవాలకు సిద్దమవుతున్నాం.. కానీ ఈ ఉత్సవాల వెనుక విషాదం దాగి ఉందని నేటి తరం భారతీయులకు ఎంత మందికి తెలుసు?
ఆగస్టు 15, 1947 రోజున అర్ధరాత్రి స్వతంత్ర భారత దేశం అవతరించింది.. కానీ అంతకు ముందు రోజే ఆగస్టు 14, 1947న మన దేశం ముక్కలైంది.. బ్రిటిష్ వారి కుటిల నీతి, కాంగ్రెస్ - ముస్లిం లీగ్ నేతల అధికార దాహానికి దేశం విభజించబడింది.. పాకిస్తాన్ ఆవిర్భవించింది..భరత మాత ముక్కలైంది.. లక్షలాది మంది భారతీయుల నెత్తురు చిందింది.. మాన ప్రాణాలు కోల్పోయారు.. రాత్రికి రాత్రే పరాయి దేశస్తులైపోయారు.. కోట్లాది జనం ఆస్తిపాస్తులు వదిలేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాందీశీకులై వచ్చారు..  దేశ చరిత్రలోనే అత్యంత విచారకరమైన సందర్భం ఇది..
భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు పోరాటం చేశారు.. త్యాగాలు చేశారు.. ప్రాణాలు కోల్పోయారు.. కానీ ప్రతి ఫలం ఏమిటి? దేశ విభజనతో స్వాతంత్ర్యమా?.. త్యాగాలు చేసింది ఒకరైతే, అప్పనంగా ఫలాలు అనుభవించేందుకు తయారయ్యారు కొందరు నేతలు..
రెండో ప్రపంచ యుద్దం ముగిసింది.. బ్రిటిష్ వారు విజయం సాధించినా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు.. అప్పటికే భారత దేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు పతాక స్థాయికి చేరాయి.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవ వీరుల పోరాటాలను చూసి భయపడిపోయిన లండన్ పాలకులు ఇలాంటి స్థితిలో భారత దేశాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు.. కానీ యధాతథంగా స్వాతంత్ర్యం ఇచ్చేస్తే భారత దేశం నుండి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు..  ఈ నేపథ్యంలో పురుడు పోసుకున్న కుట్ర దేశ విభజన..
బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా దొరికారు కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు.. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.. భారత దేశానికి విభజించకుండా స్వాతంత్ర్యం ఇస్తే ఒప్పుకోబోమని, ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని పట్టుబట్టాడు జిన్నా.. ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలను చెలరేగాయి.. వేలాది మంది అమాయకులను ఊచకోత కోశారు.. అదే సమయంలో కాంగ్రెస్ నాయకుల మీద వత్తిడి పెరిగింది.. అప్పటికే వీరిలో చాలా మంది వృద్ధులైపోయారు.. తమ జీవిత కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వారికి.. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీని ఫలితమే దేశ విభజన స్వాతంత్ర్యం..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆనందించాలా? విభజనకు గురైందని బాధ పడాలా?.. స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవాల్సిందే.. మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే.. కానీ అదే సమయంల్ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి.. మళ్లీ ఇలాంటి దుస్థితి మన దేశానికి రాకూడదు.. అందుకు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి.. by: క్రాంతి దేవ్ మిత్ర

(కథ ముగిసిపోలేదు.. ఇంకా ఉంది..)

Tuesday, August 12, 2014

గర్వ్ సే కహో హమ్ హిందుస్థానీ హై..

ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ జీ హిందుస్థాన్ లో ఉన్నవారు హిందువులేఅనడాన్ని కొందరు సోకాల్డ్ మేధావులు, రాజకీయ నాయకులు, జాతీయ మీడియా రాద్దంతం చేయడం విచిత్రంగా అనిపపిస్తోంది.. భాగవత్ జీ చెప్పింది వాస్తవం కాదా?.. మన దేశాన్ని ఒకప్పుడు హిందుస్థాన్ అనే పిలిచేవారు కదా? మరి భారత్ గానే ఎందుకు పరిమితమైంది?.. హిందుస్థాన్ మతతత్వం, సంకుచితత్వం ఎందుకైంది?.. ఒక్కసారి ఆలోచించండి..
ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకే పేరు ఉంటుంది.. కానీ మన దేశానికి ఇంగ్లీషులోఇండియాఅంటారు.. హిందీ, తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో భారత్ అంటున్నారు.. ఇంకాస్త వెనక్కి వెళ్లితే ‘హిందుస్థాన్ అని పిలిచేవారు.. భాష మారినంత మాత్రాన దేశం పేర్లు ఇలా మారిపోవడం ఏమిటో?.. మన పేర్లను కూడా ఒక్కో భాషలో ఒక్కో రకంగా మార్చుకుంటున్నామా?.. మరి మన రాజ్యాంగ పెద్దలు ఎందుకిలా చేశారు?.. అది తర్వాత విషయం..
స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన దేశాన్ని హిందుస్థాన్ అనే పిలుచుకునే వాళ్లం.. భారత్ అనే పేరు కూడా వాడుకలో ఉంది.. మన వివాహాది శుభ కార్యాల్లో జంబూ ద్వీపే.. భరత ఖండే.. అనే సంకల్ప మంత్రాన్ని వినే ఉంటారు.. భరతుడు, భరత ముని నుండి ఈ పేరు వచ్చిందంటారు మన పెద్దలు..
మరి హిందు పదం సంగతో?.. నిజానికి మన దేశంలో మెజారిటీ ప్రజలు అనుసరించే ధర్మం సనాతన ధర్మం.. మనకు ఎన్నో రకాల ఆరాధ్య పద్దతులు ఉన్నాయి.. ఎందరో దేవుళ్లను దేవతలను మనం పూజిస్తాం.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ ధర్మం తరతరాలుగా కొనసాగుతూ వచ్చింది.. హిందు అనే పేరు సింధు నది నుండి వచ్చింది.. పాశ్చాత్య దేశాల వైపు నుండి చూస్తే మనం సింధూ నదికి ఆవల ఉన్నవారం.. సింధును వారు ఇండస్ లేదా హిండస్ అని పిలిచేవారు .. అలా మనం ఇండియన్స్ అయ్యాం.. సింధూస్ కాస్తా హిందూస్ అయిపోయాం..
హిందుస్థాన్ అంటే అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ పదాన్నేమైనా మోహన్ భాగవత్ జీ లేదా ఆరెస్సెస్ కొత్తగా సృష్టించిందా?.. స్వాతంత్ర్యానికి ముందు నుండీ వాడుకలో ఉన్నదే కదా.. ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పాలనా కాలం నాటి దేశ చిత్ర పటాలు హిందుస్థాన్ పేరిటే ఉన్నాయి.. నేతాజీ సుభాష్ బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఇచ్చిన జై హింద్ నినాదం దేనికి సంకేతం? అది ఇప్పటికీ వాడుకలోనే ఉంది.. మన దేశంలో 136 సంవత్సరాల చరిత్ర ఉన్న ద హిందూ పత్రిక,  హిందీ-ఆంగ్ల భాషల్లో ప్రచురిస్తున్న హిందుస్థాన్ హిందుస్థాన్ టెమ్స్.. హిందుస్థాన్ మోటార్స్.. ప్రభుత్వ రంగ సంస్థలు హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్.సీ.ఎల్) హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్).. అలాగే బహుళజాతి సంస్థ హిందుస్థాన్ లీవర్ కంపెనీ.. ఇవన్నీ దేనికి ప్రతీకలు.. నేటికీ పాకిస్థాన్తో సహా మన ఇరుగు పొరుగు దేశాలు, గల్ఫ్ దేశాలు మన దేశాన్ని హిందుస్థాన్ గానే గుర్తిస్తున్నాయి.. మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసె అచ్చా.. హిందూ సితాహ్ హమారా ఆలపించలేదా? 40,50 ఏళ్ల క్రితం వరకూ కూడా మన దేశంలో చరిత్ర పుస్తకాలు హిందూ దేశ చరిత్ర పేరిట ఉండేది.. వీటిని మన ప్రభుత్వమే ముద్రించింది.. కానీ కాల క్రమంలో ఈ పుస్తకాల పేర్లు భారత దేశ చరిత్రగా మారిపోయాయి.. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వెళ్లితే హిందూ దేశ చరిత్ర  పుస్తకాలు చూడొచ్చు..  తరం మారగానే చరిత్ర మారదు.. కానీ నెహ్రూ, ఇందిరల హయాంలో చరిత్ర రచన అంతా వామపక్ష మేధావుల చేతిలో పడింది.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా వారి సైద్ధాంతిక పైత్యంతో చరిత్ర  రచనలో గందరగోళానికి తెరలేపారు.. అలా హిందుస్థాన్ అనే పదానికి  పాతరేశారు..

హిందు అనే పేరు ఒక మతానికికే పరిమితం ఎలాగైంది?.. ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘ్ చాలక్ విశాల దృక్పథంతో హిందుస్థాన్ గురుంచి మాట్లాడితే అందులోని వాస్తవ కోణాన్ని గమనించకుండా కోడి గుడ్డుపై ఈకలు పీకడం ఎందుకు?.. ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ వారు, అమెరికాలో అమెరికన్స్, చైనాలో చైనీస్, పాకిస్తాన్లో పాకీస్తానీస్ ఉన్నట్లే మన హిందుస్థాన్లో ఉండే వారంతా హిందూసే.. అందులో తప్పేముంది?.. సో.. గర్వ్ సే కహో.. హమ్ హిందుస్థానీ హై..జై హింద్..

పిట్టల దొరలొచ్చారు..

రాజ్యాలు పోయాయి.. సంస్థానాలు, గడీలూ పోయాయి..
రాజులు పోయారు.. దొరలూ పోయారు..
కానీ మన కర్మకొద్దీ పిట్టల దొరలు వచ్చారు..
మాటలు చెబుతారు.. కానీ చేతలు శూన్యం..
జర భద్రం ఈ దొరలతో.. అదే పిట్టల దొరలతో..
No more comments..

Saturday, August 9, 2014

ఇదేనా హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్?

కుందేళ్లు విచ్ఛలవిడి శృంగారానికి ప్రతీక.. వాటి జీవిత కాలంలో సగ కాలం శృంగారంలోనే గడుపుతాయి.. ప్లేబాయ్ లోగోలో కుందేలు బొమ్మ కనిపించడానికి కారణమిదే.. ఎవడైనా తెలిసో తెలియక ప్లేబాయ్ లోగో టీషర్టులు, టోపీలు ధరిస్తే కాకెందుకో చికాకు కలుగుతుంది..
హైదరాబాదులో ప్లే బాయ్ క్లబ్బట.. ప్రపంచ వ్యాప్తంగా ప్లే బ్యాయ్ క్లబ్లు ఉన్నాయి.. వాటిలో కేవలం 10 నుండి 20 శాతం మాత్రమే దుస్తులు ధరించిన అ

మ్మాయి మద్యం సరఫరా చేస్తారు.. ఆటలాడి అలరిస్తారు.. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే దేశాలేవీ ఈ క్లబ్లకు అనుమతి ఇవ్వలేదు.. భారత దేశంలో ప్రవేశించేందుకు ప్లే బాయ్ క్లబ్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.. పర్యాటక రాష్ట్రం గోవా ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది.. ఢిల్లీ, ముంబై నగరాలు సైతం తిరస్కరించాయి.. కానీ హైదరాబాద్ నగరంలో ఎలా అనుమతించారు?

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి నీఛ క్లబ్బులకు అనుమతించడం దురదృష్టకరం.. ఇదేనా హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ అంటే..

డుమ్మా రత్నకీ జై..

పిల్లలు స్కూల్ ఎగ్గొట్టాలంటే ఏం చేస్తారు?.. జ్వరమో, కడుపు నొప్పో లేక తాతగారికి బాగాలేదనో (రిస్క్ లేదు.. చాలా మంది తాతలు అప్పటికే పోయి ఉంటారు) హెడ్మాస్టర్కు లెటర్ రాస్తారు.. బెనిఫిట్ అఫ్ డౌట్ కింద ఆయన చిద్విలాసంగా నవ్వేస్తాసి సర్లే అనేస్తాడు.. రాజ్యసభ ఛైర్మన్ గారికీ అదే పరిస్థితి ఎదురై ఉంటుంది..
పాపం క్రికెట్ గాడ్ కి (కొందరికి దేవుడట) పార్లమెంట్ కు వచ్చే తీరిక లేదు.. 2012 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.. కానీ ఈ మూడేళ్లలో కేవలం మూడు సార్లు మాత్రమే పార్లమెంటుకు హాజరయ్యారు.. అందులో ఒక రోజు బహుషా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉండొచ్చు.. ఆయన కన్నా సినీ తార రేఖ నయమట.. ఆమె ఈ మూడేళ్లలో తీరిక చేసుకొని ఏడు రోజులు పార్లమెంటుకు రాగలలిగింది..
ఇంతకీ పార్లమెంట్ గైర్హాజరీకి సచిన్ టెండూల్కర్ చూపిన కారణం ఏమిటో తెలుసా? తన అన్నగారి ఆరోగ్యం బాగోలేదట.. ఇది వాస్తవమే.. కానీ తాను దగ్గర ఉండి సేవలు చేయాల్సిన అవసరం పడిందట.. చెవిలో పువ్వెట్టింగ్ కాదూ?..
ఈ మధ్యనే సచిన్ చాలా తీరిక చేసుకొని బెజవాడలో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిపోయాడు.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో ఈవెంట్లకూ హాజరైన సందర్భాలు కనిపించాయి.. కానీ పార్లమెంట్కు వచ్చే తీరిక మాత్రం దొరకదు పాపం.. (పార్లమెంట్ హాజరీకి లభించే దినసరి భత్యం కన్నా ఇతరత్రా గిట్టుబాట్లే అధికం అని గిట్టనివారు చెవులు కొరుక్కుంటున్నారు)

రాజకీయాల పట్ల ఆసక్తి లేకుండా సమాజ సేవ చేస్తున్న ప్రముఖులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే విచక్షణాధికారాన్ని మన రాజ్యాంగం  రాష్ట్రపతికి కట్టబెట్టింది.. కానీ ప్రభుత్వం సిఫార్సు చేసే వారికే సీట్లు దక్కుతాయి అది వేరే విషయం.. ఎవరైనా సెటబ్రిటీలను రాజ్యసభకు పంపే ముందు వారు ఈ పదవికి ఎంత వరకు న్యాయం చేయగలరు అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.. జనాల్లో క్రేజీ ఉన్న ప్లేయరో, నటులకో రాజ్యసభ సభ్యత్వాలు, భారత రత్నలు ఇచ్చి వారి అభిమానుల ఓట్లు రాబట్టుకోవచ్చే దుర్భుద్ది పాలకులకు ఉంటే వ్యవహారం ఇలాగే ఉంటుంది..

Thursday, August 7, 2014

పాపం పప్పూ..

పార్లమెంట్లో పప్పూ ఏం చేస్తుంటారు?.. ఆవలిస్తుంటారు.. నిద్రొస్తే బజ్జుంటారు.. అమ్మగారు క్లాస్ పీకడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు నిద్రను ఆపుకోడానికి లొల్లి చేయడం మొదలెట్టారు..
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగాయట.. బుజ్జోడు వెల్ లోకి వచ్చి గొడవ చేశాడు..అదెక్కడో చెప్పు పప్పూ? అని అధికార పక్షం నిలదీస్తే.. పాపం జవాబు లేక నీళ్లు నమిలారు పప్పూ గ్యాంగ్ బాస్..
ఇతంతా ఎందుకు కానీ.. ఎప్పుడు ఏం చేయాలో తోచని పప్పూకి ఓ పాలపీక కొనిస్తే ఈ ఐదేళ్లు కామ్ గా సీట్లోనే కాలక్షేపం చేస్తాడు కదా.. ప్చ్ పాపం పప్పూ..

Wednesday, August 6, 2014

మోదీ రక్ష..

రక్షాబంధన్ స్పెషల్.. ఉత్తర భారత దేశంలో ఈ కొత్త రాఖీలు గరం మిర్చీల్లా అమ్ముడు పోతున్నాయి.. అవే మోదీ రాఖీలు.. అక్కయ్యలూ, చెల్లెమ్మలూ ఈ రాఖీలను కొనేందుకు ఎగబడుతున్నారట.. నాలుగైదు వెరైటీల్లో తయారు చేసిన మోదీ బొమ్మ రాఖీలను 40 నుండి 50 రూపాలయ వరకూ అమ్ముతున్నారు.. స్టాక్ అయిపోతే మళ్లీ తెప్పించాల్సి వచ్చిందని ఢిల్లీకి చెందిన సీజనల్ వ్యాపారి చెబుతున్నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశానికి ఎలా రక్షకుడో.. తమ సోదరులకూ అగే రక్ష అంటున్నారు అహ్మదాబాద్ నగరానికి చెందిన ఓ యువతి.. మన హైదరాబాద్లో ఈ రాఖీలు దొరుకుతున్నాయో లేదో తెలియదు.. కానీ బేగం బజార్లో ట్రై చేసి చూడండి..

మళ్లీ సారధ్యం..

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన జి.కిషన్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు..

జయశంకర్ జయంతి

తెలంగాణ రాష్ట్రం ఆయన స్వప్నం.. ఆయన ఊపిరి.. తుది వరకూ తెలంగాణ కోసమే శ్వాసించారు.. నేడు మన మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి నిరంతరం కొనసాగుతుంది.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

బాబు టేస్ట్ మారింది..

చంద్రబాబు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక రంగ వికాసంలో భాగంగా హైదరాబాద్ బిర్యానీకి దాదాపు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.. హైదరాబాద్ బిర్యానీ రుచి చూడండంటూ సందర్భం వచ్చినప్పుడల్లా నగరానికి వచ్చే ప్రముఖులకు సూచించేవారు.. పాపం.. ఇప్పుడు కాలం మారింది కదా.. హైదరాబాద్ బిర్యానీ తెలంగాణ రాష్ట్రానిదాయే.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఫుడ్ బ్రాండ్ ఎంచుకున్నారు.. రాగిసంకటి, నాటుకోడి పులుసుకు ప్రాచుర్యం ఇస్తారట.. రాయలసీమ వాసులకు ఎంతో ఇష్టమైన ఆహారం ఇది.. హైదరాబాద్ నగరంలో సైతం క్రితుంగ, రాయలసీమ రుచులు తదితర రెస్టారెంట్లలో ఇవి బాగా సేల్ అవుతున్నాయి.. బాబు గారూ సంయుక్త ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడే రాగిసంకటి, నాటుకోడి పులుసును ప్రమోట్ చేసి ఉంటే?.. ఈపాటికి దీనికి అంతర్జాతీయ ప్రాచుర్యం దక్కేసేదే కదా?..

Tuesday, August 5, 2014

ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కేనా?

గోల్కొండ కోట మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. దాదాపు ఎనిమిది శతాబ్దాల చరిత్ర గల ఈ కోట ఉన్నప్రాంతం సహస్ర కాల చరిత్ర ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి..
1143వ సంవత్సరంలో ఓ గొల్లకాపరికి ఈ కొండమీద జగాంబ దేవతా విగ్రహం కనిపిండంతో కాకతీయుల దృష్టిలో పడింది. ఇక్కడో మట్టికోటను నిర్మించారు.. మొదట్లో గొల్లకొండ అని పిలిచేవారు.. క్రమంగా గోల్కొండగా ప్రాచుర్యంలోకి వచ్చింది.. కాకతీయులు, ముసునూరి నాయకుల ఆధీనంలో ఉన్న 1323లో ముస్లిం సుల్తానుల వశమైంది.. ముసునూరి నాయకులు గోల్కొండ కోటను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. కానీ ఎక్కువ కాలం నిలవలేదు.. 1371లో శాశ్వతంగా హిందూ పాలకులకు దూరమైపోయింది.
1507లో కుతుబ్ షాహీ పాలకుల ఆధీనంలోకి వచ్చిన కోట మట్టి కోట నుండి శత్రు దుర్భేధ్య రాతి కట్టడంగా మారింది.. 5 కిలోమీటర్ల విస్తీర్ణంతో 87 బురుజులు, నాలుగు ప్రధాన సింహ ద్వారాలు, అనేక రాజ మందిరాలతో కోటను విస్తరించారు.. కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ ఒక వెలుగు వెలిగింది.. ఈ కోట కేంద్రంగా గోల్కొండ సామ్రాజ్యం విస్తరించింది.. కాల క్రమంలో కోటలో జనాభా పెరిగి, సరైన సదుపాయాలు లేక వ్యాధులు ప్రభలాయి.. ఈ నేపథ్యంలో కోట వెలుపల మహా నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా మూసీనది ఆవల హైదరాబాద్ నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడికి దిగారు.. అంతటితో ఈ కోట ప్రాభవం అంతరించింది..
కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణంలో సహా ప్రస్తుత ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు దాదాపుగా గోల్కొండ సామ్రాజ్య పరిధిలో ఉండేవి.. తెలుగు భాషా సాంప్రదాయాలు ఒక రూపాన్ని సంతరించుకున్నది ఈ కాలంలోనే.. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రానని గోల్కొండ సామ్రాజ్యంలోనే గనుల్లోనే వెలికి తీశారు.. తానీషా కాలంలో అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉండటం, భక్తరామదాసు కోటలో బందీగా ఉండటం, రామలక్ష్మణులు కప్పకం కట్టి విడిపించడం తెలిసిందే.. దాదాపు వెయ్యేళ్లుగా గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయ కేంద్రంగా బోనాలు కొనసాగుతున్నాయి..
నిజాం పాలనపై పోరాటం సాగించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి గోలకొండ పత్రికను స్థాపించడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేయడం తెలిసిందే.. తెలంగాణంలో అసలు కవులే లేరు అని ఓ కువిమర్శకుడు చేసి వ్యాఖ్యకు సమాధానంగా కవుల సంచిక తేవడం తెలిసిందే..

గోల్కొండ కోట ప్రపంచంలోని గొప్ప కట్టడాలకు మాత్రం తీసిపోదు.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.. దేశ విదేశాల నుండి పర్యాటకులు ఈ కోటను చూసేందుకు వస్తుంటారు.. దురదృష్టవశాత్తు గత పాలకులు గోల్కొండకు ప్రపంచ చారిత్రిక వారసత్వ సంపద గుర్తింపు తేవడంలో విఫలం అయ్యారు.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం గోల్కొండ కేంద్రంగా స్వాతంత్ర్య దిన వేడుకలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగినదే.. తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చే ప్రయత్నం సీరియస్ గా చేయాలని కోరుకుంటున్నాను.. 

Monday, August 4, 2014

యుద్ద స్మారకం దుస్థితి

మీరు ఎప్పుడైనా చాదర్ ఘాట్ వెళ్లితే మూసీ నది ఒడ్డున సాయిబాబా ఆలయం ముందు పిచ్చి మొక్కలతో కంపు కొట్టే దుర్గంధంలో ఉన్న ఓ స్మారక స్థూపాన్ని చూడొచ్చు.. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?..
ఇటీవలే మొదటి ప్రపంచ యుధ్ధ శత వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.. జులై 28, 1914లో ప్రారంభమైన ఈ యుధ్ధం నాలుగేళ్లకు పైగా సాగి 11 నవంబర్ 1918లో ముగిసింది.. మరి దీనితో మనకేమిటి సంబంధం అనుకుంటున్నారా?..


ఆనాటి యుద్ధ రంగంలో హైదరాబాద్ సైన్యానికి చెందిన రెండు రెజిమెంట్లు గ్రేట్ బ్రిటన్ తరపున పాల్గొన్నాయి.. బ్రిటిష్ వారి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యుద్ధంలో వారికి ఆర్ధికంగా కూడా అండగా నిలిచాడు.. ఈ సేవలకు ఎంతగానో మెచ్చుకున్న బ్రిటన్ రాజు యుద్ధానంతరం నిజాం ప్రభువు బిరుదును హిజ్ హైనస్నుండి హిజ్ హెగ్జాల్టెడ్ హైనస్స్థాయికి పెంచాడు.. మొదటి ప్రపంచ యుద్ధంలో హైదరాబాద్ సైనికులు ఎందరో అమరులుయ్యారు.. వారికి నివాళిగా చాదర్ ఘాట్ ప్రాంతంలో War Memorial Monument నిర్మించారు..
అంతటి చారిత్రిక ప్రాధాన్యత గల ఈ స్మారక స్థూపం ప్రస్తుతం మల మూత్రాల కంపులో పిచ్చి మొక్కల మధ్య ధీనంగా కనిపిస్తోంది.. దాని చూట్టూ ఉన్న రెయిలింగ్ పైన స్థానికులు బట్టలు ఆరేస్తారు.. పాపం వారికి దాని ప్రాధాన్యత తెలియదు కదా.. ఈ స్థాపం నిర్మించిన స్థలాన్ని విక్టరీ గ్రౌండ్ అని పెలిచేవారు.. కాల క్రమంలో ప్రభుత్వం అక్కడ చక్కని ప్లే గ్రౌండ్ నిర్మించింది.. (అది మాత్రం శుభ్రంగా ఉంటుంది లెండి)

మొదటి ప్రపంచ యుద్ధ శత వార్షికోత్సవం సందర్భంగా అందులో పాల్గొన్న దేశాలన్ని ఆనాటి గాయాలకు గుర్తు చేసుకొని, యుద్దంలో అమరులైనవారికి నివాళులు అర్పిస్తున్నాయి.. కానీ ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఈ విషయం పట్టినట్లు లేదు.. అందుకే ఈ స్మారక స్థూపాన్ని మరచిపోయాయి.. జర దీని మీద నజర్ పెట్టుండి సార్లూ.. గిది కూడా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి సంబంధించిన వ్యవహారమే..