Friday, August 29, 2014

తెలుగు లెస్సే..

ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1999/2002-12 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 6 వేల భాషల్లో ఇప్పటికే 3 వేలు కాలగర్భంలో కలిసిపోయాయి.. భారత దేశంలో 2025 సంవత్సరం నాటికి కేవలం 5 భాషలే మిగులుతాయట.. అవి హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మళయాళలం.. ఇందులో తెలుగు లేదు.. ఈ నివేదిక మతలబు ఏమిటో తెలియకున్నా మన కళ్ల ముందు జరుగుతున్న పరిణామాలు తెలుగు భాషకు హాని కలిగిస్తున్నవే.. శ్రీకష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ అది లెస్సే అవుతోంది..
తెలుగు భాష, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, అధికార భాష అంటూ మొన్నటి దాకా జబ్బలు చర్చుకున్నాం.. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏనాడు తెలుగును అధికార భాషగా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాం.. ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏదో జరిగిపోతుందని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది..
ఏ కారణం అయితేనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించడానికే ఆసక్తి చూప్తిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు మీడియం విద్యార్థులు 27 శాతం(?) మాత్రమే ఉన్నారట.. ఈ విషయంలో మనం ఎవరినీ తప్పుపట్టి లాభం లేదు.. తిలా పాపం తలా పిడికెడు.. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెక్కన పెడితే కనీసం మన ఇళ్లలోనైనా తెలుగు భాషను బతికించుకుందాం.. ఇందు కోసం టీవీ, వార్తా పత్రికలను నమ్ముకోవడం మరింత ప్రమాదం.. అందులో కనిపించేదంతా ఖూనీకోరు తెలుగు మాత్రమే.. పిల్లలకు మంచి తెలుగు సాహిత్యం చదవడం అలవాటు చేద్దాం..
తెలుగువారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే పరిమితం కాదు.. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల్లో సైతం అధిక సంఖ్యలో ఉన్నారు.. ఆయా రాష్ట్రాల్లో భాషా చైతన్యం కారణంగా తెలుగువారు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు.. చాలా ప్రాంతాల్లో దాదాపు తెలుగు రాయడం, చదవడం మరచిపోయారు.. మరో తరం పోతే తెలుగు మాట్లాడమే మరచిపోతారు.. పొరుగు రాష్ట్రాలు తమ భాషను  రక్షించేకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి.. మన దగ్గర తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, ప్రెస్ అకాడమీ, అధికార భాషా సంఘాలు ఉన్నా అవి అజాగళస్థనాలుగా మారిపోయాయి..

వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామమూర్తి పంతులు జయంతి నేడు.. ప్రతి ఏటా ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. కనీసం ఈ రోజైనా మన మాతృభాష తెలుగు గురుంచి ఆలోచద్దాం..

 

No comments:

Post a Comment