Friday, August 29, 2014

గణపతి ఉత్సవాల వెనుక..

వినాయక చవితి వచ్చిందంటే ఊరంతటికీ పండగే.. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసుకొని గణనాధుడికి పూజలు, భజనలు చేస్తుంటారు.. సామూహిక వినాయక చవితి ఉత్సవాలు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయో తెలుసా?..
లోకమాన్య బాలగంగాధర తిలక్ స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా 1893లో సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభించారు.. 1857 మొదటి స్వాతంత్ర్య సమరం తర్వాత బ్రిటిష్ వారు దేశంలో రాజకీయ సభలు, సమావేశాలను నిషేధించారు.. అయితే మత పరమైన వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవు.. ఈ నేపథ్యంలో గణపతి పూజలు ఇంటికే పరిమితం చేయకుండా సామూహికంగా జరుపుకుంటే ప్రజల్లో ఐక్యత, జాతీయ భావం పెరుగుతుందని తిలక్ భావించారు.. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా అంతర్లీనంగా దేశభక్తిని ప్రభోదించారు.. మొదట మహారాష్ట్రలో ప్రారంభమైన సామూహిక వినాయక చవితి వేడుకలు దేశమంతా విస్తరించాయి..
అయితే మన చరిత్రను గమనిస్తే గణపతి సామూహిక పూజలకు శతాబ్దాల చరిత్ర ఉంది.. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు పెద్ద ఎత్తున గణపతి ఆలయాలను నిర్మించారు.. ఈ ఆలయాల్లో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేవారని తెలుస్తోంది.. అలాగే చత్రపతి శివాజీ సైతం గణేష్ చతుర్ధి వేడుకలను నిర్వహించారు.. మహారాష్ట్రంలో గణపతి ఆరాధన ఎక్కువగా కనిపించడానికి మరో కారణం ఉంది.. బ్రిటిష్ వారికి ముందుగా ఆధునిక కాలంలో మహారాష్ట్రను పాలించిన పీష్వాల ఇలవేలుపు వినాయకుడు.. ఈ కాలంలో వినాయక పూజలు, భక్తి చాలా వరకూ విస్తరించింది.. 

ప్రాచీన కాలం నుండి సామూహిక వినాయక ఆరాధన ఉన్నా ఆధునిక కాలంలో ఒక ఉన్నత ఆశయం కోసం దానికి విస్తృత రూపం ఇచ్చిన ఘనత తిలక్ మహాశయునిదే..

No comments:

Post a Comment