Tuesday, August 5, 2014

ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కేనా?

గోల్కొండ కోట మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. దాదాపు ఎనిమిది శతాబ్దాల చరిత్ర గల ఈ కోట ఉన్నప్రాంతం సహస్ర కాల చరిత్ర ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి..
1143వ సంవత్సరంలో ఓ గొల్లకాపరికి ఈ కొండమీద జగాంబ దేవతా విగ్రహం కనిపిండంతో కాకతీయుల దృష్టిలో పడింది. ఇక్కడో మట్టికోటను నిర్మించారు.. మొదట్లో గొల్లకొండ అని పిలిచేవారు.. క్రమంగా గోల్కొండగా ప్రాచుర్యంలోకి వచ్చింది.. కాకతీయులు, ముసునూరి నాయకుల ఆధీనంలో ఉన్న 1323లో ముస్లిం సుల్తానుల వశమైంది.. ముసునూరి నాయకులు గోల్కొండ కోటను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. కానీ ఎక్కువ కాలం నిలవలేదు.. 1371లో శాశ్వతంగా హిందూ పాలకులకు దూరమైపోయింది.
1507లో కుతుబ్ షాహీ పాలకుల ఆధీనంలోకి వచ్చిన కోట మట్టి కోట నుండి శత్రు దుర్భేధ్య రాతి కట్టడంగా మారింది.. 5 కిలోమీటర్ల విస్తీర్ణంతో 87 బురుజులు, నాలుగు ప్రధాన సింహ ద్వారాలు, అనేక రాజ మందిరాలతో కోటను విస్తరించారు.. కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ ఒక వెలుగు వెలిగింది.. ఈ కోట కేంద్రంగా గోల్కొండ సామ్రాజ్యం విస్తరించింది.. కాల క్రమంలో కోటలో జనాభా పెరిగి, సరైన సదుపాయాలు లేక వ్యాధులు ప్రభలాయి.. ఈ నేపథ్యంలో కోట వెలుపల మహా నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా మూసీనది ఆవల హైదరాబాద్ నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడికి దిగారు.. అంతటితో ఈ కోట ప్రాభవం అంతరించింది..
కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణంలో సహా ప్రస్తుత ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు దాదాపుగా గోల్కొండ సామ్రాజ్య పరిధిలో ఉండేవి.. తెలుగు భాషా సాంప్రదాయాలు ఒక రూపాన్ని సంతరించుకున్నది ఈ కాలంలోనే.. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రానని గోల్కొండ సామ్రాజ్యంలోనే గనుల్లోనే వెలికి తీశారు.. తానీషా కాలంలో అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉండటం, భక్తరామదాసు కోటలో బందీగా ఉండటం, రామలక్ష్మణులు కప్పకం కట్టి విడిపించడం తెలిసిందే.. దాదాపు వెయ్యేళ్లుగా గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయ కేంద్రంగా బోనాలు కొనసాగుతున్నాయి..
నిజాం పాలనపై పోరాటం సాగించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి గోలకొండ పత్రికను స్థాపించడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేయడం తెలిసిందే.. తెలంగాణంలో అసలు కవులే లేరు అని ఓ కువిమర్శకుడు చేసి వ్యాఖ్యకు సమాధానంగా కవుల సంచిక తేవడం తెలిసిందే..

గోల్కొండ కోట ప్రపంచంలోని గొప్ప కట్టడాలకు మాత్రం తీసిపోదు.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.. దేశ విదేశాల నుండి పర్యాటకులు ఈ కోటను చూసేందుకు వస్తుంటారు.. దురదృష్టవశాత్తు గత పాలకులు గోల్కొండకు ప్రపంచ చారిత్రిక వారసత్వ సంపద గుర్తింపు తేవడంలో విఫలం అయ్యారు.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం గోల్కొండ కేంద్రంగా స్వాతంత్ర్య దిన వేడుకలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగినదే.. తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చే ప్రయత్నం సీరియస్ గా చేయాలని కోరుకుంటున్నాను.. 

No comments:

Post a Comment