Monday, August 4, 2014

యుద్ద స్మారకం దుస్థితి

మీరు ఎప్పుడైనా చాదర్ ఘాట్ వెళ్లితే మూసీ నది ఒడ్డున సాయిబాబా ఆలయం ముందు పిచ్చి మొక్కలతో కంపు కొట్టే దుర్గంధంలో ఉన్న ఓ స్మారక స్థూపాన్ని చూడొచ్చు.. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?..
ఇటీవలే మొదటి ప్రపంచ యుధ్ధ శత వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.. జులై 28, 1914లో ప్రారంభమైన ఈ యుధ్ధం నాలుగేళ్లకు పైగా సాగి 11 నవంబర్ 1918లో ముగిసింది.. మరి దీనితో మనకేమిటి సంబంధం అనుకుంటున్నారా?..


ఆనాటి యుద్ధ రంగంలో హైదరాబాద్ సైన్యానికి చెందిన రెండు రెజిమెంట్లు గ్రేట్ బ్రిటన్ తరపున పాల్గొన్నాయి.. బ్రిటిష్ వారి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యుద్ధంలో వారికి ఆర్ధికంగా కూడా అండగా నిలిచాడు.. ఈ సేవలకు ఎంతగానో మెచ్చుకున్న బ్రిటన్ రాజు యుద్ధానంతరం నిజాం ప్రభువు బిరుదును హిజ్ హైనస్నుండి హిజ్ హెగ్జాల్టెడ్ హైనస్స్థాయికి పెంచాడు.. మొదటి ప్రపంచ యుద్ధంలో హైదరాబాద్ సైనికులు ఎందరో అమరులుయ్యారు.. వారికి నివాళిగా చాదర్ ఘాట్ ప్రాంతంలో War Memorial Monument నిర్మించారు..
అంతటి చారిత్రిక ప్రాధాన్యత గల ఈ స్మారక స్థూపం ప్రస్తుతం మల మూత్రాల కంపులో పిచ్చి మొక్కల మధ్య ధీనంగా కనిపిస్తోంది.. దాని చూట్టూ ఉన్న రెయిలింగ్ పైన స్థానికులు బట్టలు ఆరేస్తారు.. పాపం వారికి దాని ప్రాధాన్యత తెలియదు కదా.. ఈ స్థాపం నిర్మించిన స్థలాన్ని విక్టరీ గ్రౌండ్ అని పెలిచేవారు.. కాల క్రమంలో ప్రభుత్వం అక్కడ చక్కని ప్లే గ్రౌండ్ నిర్మించింది.. (అది మాత్రం శుభ్రంగా ఉంటుంది లెండి)

మొదటి ప్రపంచ యుద్ధ శత వార్షికోత్సవం సందర్భంగా అందులో పాల్గొన్న దేశాలన్ని ఆనాటి గాయాలకు గుర్తు చేసుకొని, యుద్దంలో అమరులైనవారికి నివాళులు అర్పిస్తున్నాయి.. కానీ ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఈ విషయం పట్టినట్లు లేదు.. అందుకే ఈ స్మారక స్థూపాన్ని మరచిపోయాయి.. జర దీని మీద నజర్ పెట్టుండి సార్లూ.. గిది కూడా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి సంబంధించిన వ్యవహారమే..

1 comment: