Wednesday, August 27, 2014

25 ఆగస్టు, 2007న ఏం జరిగిందంటే..


 ఆగస్టు 25, 2007..

అన్ని తేదీల్లాగే ఈ తేదీ ఓ సాధారణ దినంగా గడిచిపోవాల్సింది.. కానీ చరిత్రలో నిలిచిపోయిందా దినం.. నేను కూడా జీవితంలో ఎన్నడూ మరచిపోలేని రోజు.. ఎందుకంటే ఆ రోజు మృత్యువును జయించాను.. అదీ మూడు ప్రాంతాల్లో..
ఆ సాయంకాలం ఎప్పటిలాగే ఆఫీసు నుండి ఇంటికి బయలు దేరే సమయానికి ఓ చిరకాల మిత్రుడు ఎదురయ్యాడు.. అలా మాట్లాడుతూ వెళదామని బైక్ స్టార్ట్ చేశాను.. వెనక కూర్చున్నాడతను.. సచివాలయం ముందు లుంబినీ పార్క్ దగ్గరకు వచ్చాం.. ఈ పార్కులో లేజర్ షో బాగుంటుందట కదా? అని ప్రశ్నించాడు నా మిత్రుడు.. అవును చూస్తావా? అని అడిగాను.. వద్దులే త్వరగా ఊరెల్లాలి అన్నాడు.. సరేలే అని బండిని ముందుకు పోనిచ్చాను..
కోఠి పేరు వినగానే నాకు గుర్తుకు వచ్చేది గోకుల్ ఛాట్.. కొన్నేళ్లుగా నేను ఇష్టపడే దహీ కట్లెట్ తిన్నాం ఇద్దరం.. ఆ తర్వాత బైక్ స్టార్ట్ చేశాను.. ఉమెన్స్ కాలేజీ సిగ్నల్ దాటాక వెనకాల దూరంగా ఏదో పేలిన శబ్దం వినిపించింది.. ఏమయ్యుంటుంది?.. ఎక్కడో టపాకాయ పేలి ఉంటుంది అన్నాడా మిత్రుడు.. దీపావళి రోజులు కూడా కాదు కదా అనుకున్ను మనసులో..
ఛాదర్ ఘాట్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వచ్చాం.. నా మిత్రుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న అంగడిలో పూలు కొన్నాడు.. అక్కడే కొంత మంది గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు.. అని చెప్పుకుంటున్నారు.. ఆశ్చర్యంతో నేను నా మీడియా మిత్రులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించాను.. అప్పటికే మొబైల్ నెట్ వర్క్స్ అన్నీ జామ్ అయ్యాయి.. ఫోన్ కలవడం లేదు.. నా మిత్రున్ని దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లో బస్సెక్కించి ఇంటికి వచ్చాను..
హడావుడిగా టీవీ ఆన్ చేస్తే భయంకరమైన దృశ్యాలు, వార్తలు, స్క్రోలింగ్స్.. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో బాంబులు పేలాయని.. పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారని ఆ వార్తల సారాంశం.. కొద్ది సేపటికే మరో ఫ్లాష్.. దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఓ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారట.. ఈ మూడు ప్రాంతాలను నేను రెండు గంట వ్యవధిలోనే టచ్ చేస్తూ వచ్చాను అని గుర్తుకు వచ్చింది.. అప్పుడే ఫోన్ మోగింది.. బస్సులో ఊరెళుతున్న మిత్రుడు ఫోన్ చేశాడు..  బస్సులో అంతా అనుకుంటున్నారు.. ఇది నిజమేనా అని అదుర్దాగా అడిగాడు.. అవును మనం మృత్యువును జయించాం అని ఫోన్ పెట్టేశాను..
ఉగ్రవాద భూతం మరోసారి నాతో దోబూచులాడింది.. 21 ఫిబ్రవరి, 2013న.. ఆ రోజు సాయంత్రం దిల్ సుఖ్ నగర్ కోణార్క్ ధియేటర్ కార్నర్లో ఓ మిత్రునితో టీ తాగాను.. ఆ తర్వాత నా అభిమాన నటుడు కమల్ హాసన్ చిత్రం విశ్వరూపం చూసేందుకు రాజధాని ధియేటర్ కు వెళ్లాను.. సినిమాలో కమల్ హాసన్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాడు.. తుపాకులు, బాంబుల మోత మోగుతోంది.. కాసేపటికి జనం హడావుడిగా థియేటర్ నుండి జారుకుంటున్నారు.. అప్పుడే ఓ కొలీగ్ ఆఫీసు నుండి ఫోన్ చేశాడు.. దిల్ సుఖ్ నగర్లో బాంబు పేలాయట కదా? ఓ ధియేటర్ దగ్గర అని వాకబు చేశాడు.. నేను హడావుడిగా రోడ్డు మీదకు వచ్చాను.. జనం పరుగెత్తుతున్నారు.. నేను కొద్ది సేపటి క్రితం ఛాయ్ తాగిన ప్రాంతంలోనే బాంబు పేలింది.. ఎన్నో ప్రాణాలు పోయాయి..
ఈ ఘటనలు నా జీవితంలో యాదృచ్చికంగా జరిగినవే కావచ్చు.. కానీ సామాన్యుడి ప్రాణానికి గ్యారంటీ లేని రోజులు వచ్చాయి.. ఉగ్రవాదులు ఎక్కడో ఉండరు.. మనం ఛాట్ తినే రోడ్డు పక్కనో, ఛాయ్ తాగే చోటో పొంచి ఉండొచ్చు.. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టూ అనుమానంగా సంచరించే వారు కనిపించినా, గుర్తు తెలియని వస్తువులు కనిపించినా మొహమాట పడకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయండి.. మీ ప్రాణాలే కాదు.. ఇతరుల ప్రాణాలూ కాపాడండి..

గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుడు ఘటనలు జరిగి నేటికి ఏడేళ్లు పూర్తవుతోంది.. ఆనాటి దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం భగవంతున్ని ప్రార్థిస్తూ..

No comments:

Post a Comment