Sunday, August 3, 2014

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ?..

దోస్తు మేరా దోస్త్.. స్నేహమేనా జీవితం..’ ‘ఇద్దరు చంద్రులు కలిశారు.. అంటూ ఈ దృశ్యానికి మన మీడియా మిత్రులు బాణీలు కట్టేస్తున్నారు.. నిజానికి ఈ సీన్ కోసం రెండు నెలలుగా గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నారంటే నమ్మండి.. వెటకారం మరీ ఎక్కువైందని ఎవరైనా మీడియా మిత్రులు నొచ్చుకుంటే అందులో నా తప్పేమీ లేదు.. నిజం నిప్పులాంటి కదా?.. మీరు చూస్తున్న ఈ దృశ్యంలో ఏ మాత్రం నిజాయితీ లేదు.. ఇద్దరివీ తెచ్చి పెట్టుకున్న బలవంతపు నవ్వులే..
రెండు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఒకే రాజధాని.. ఒకే తడక చాటు సచివాలయం..ఇద్దరి నివాసాలు దగ్గర్లోనే ఉంటాయి.. అంతే కాదు ఇద్దరి క్యాంప్ ఆఫీసులు దగ్గర్లోనే ఉంటాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడే రెండు నెలలు గడచింది.. కానీ ఈ రెండేళ్లలో ఏనాడూ మొహాలు చూసుకోలేదు ఈ మాజీ దోస్తులు..
కలవడానికి ఎన్నో సందర్భాలు వచ్చాయి.. ఒకరి ప్రమాణ స్వీకారానికి మరొకరు హాజరు కాకుండా తప్పించుకు తిరిగారు.. గవర్నర్ సాంప్రదాయంగా ఇచ్చిన ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా కలుస్తారుని మీడియా మిత్రులు చకోర పక్షుల్లా ఎదురు చూశారు.. కానీ ఇద్దరిలో ఒక సీఎం మాత్రమే వచ్చాడు.. రెండో ఆయన మొహం చాటేశాడు.. ఏ కార్యక్రమంలోనూ ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు.. కానీ ఇప్పడు రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో రాజ్యాంగ హోదాలో ఇద్దరూ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలకక తప్పలేదు.. మొత్తానికి ఇలా బుక్కైపోయారు.. ఎన్నాళ్లు తప్పించుకుంటారు.. బలవంతపు నవ్వులతో పలకరించుకొని చేతులు కలిపారు పాపం..
నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం చంద్రబాబు ఓ మెట్టు దిగి వస్తున్నా కేసీఆర్ యే మేనా జహా.. తెర కామ్ క్యా హై యహా..అంటూ మొండిగానే ఉంటున్నారు.. కానీ బాబు గారికి తప్పదు కదా ఎంతైనా అద్దె ఇళ్లు.. కొత్త ఇళ్లు కట్టుకునే దాకైనా ఓనరు గారితో జాగ్రత్తగా ఉండాలి కదా?..
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ఎడ్డం అంటే తెడ్డం అంటూ దోబూచులాడుతుంటే, దెబ్బతినేది తెలుగువారి ప్రయోజనాలే.. భౌగోళికంగా, పాలనా పరంగా విడిపోయామే తప్ప, భాషా సాంస్కృతికంగా ఉన్న సంబంధాలను ఎవరు చెరిపేయగలరు? మనకు సమస్యలు ఎన్నో ఉన్నాయి.. అవి స్థానికత, ఫీజు రీ యంబర్స్ మెంట్, విద్యుత్, నదీ జలాల పంపిణీ తదితరాలతో ముగిసిపోదు.. మున్ముందు ఇంకా ఎన్నో  దృశ్యాలు చూడబోతున్నాం.. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఇలాంటి దోబూచులాటలు పనికి రావు.. మీ కోసం కాకపోయినా ప్రజల కోసమైనా ఈ బలవంతపు నవ్వులు పులుముకొని అయినా తరచూ కలుసుకోండి.. కరచాలనాలు చేసుకోండి అవసరమైతే వాటేసుకోండి..

జై తెలంగాణ.. జై ఆంధ్రప్రదేశ్.. జై హింద్..

No comments:

Post a Comment