Thursday, August 14, 2014

జాతీయ గీతం వెనుక..

జన గణ మన అధినాయక జయహే.. గీతం వినగానే ఒక్కసారిగా దేశ భక్తి ఉప్పొంగుతుంది.. 52 సెకన్ల జనగణమణ గీతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో గుర్తించింది..
విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగోర్ రాసిన ఈ గీతం తొలిసారిగా 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో ఆలపించారు.. స్వాతంత్ర్యం వచ్చాక మన రాజ్యాంగ సభ దీన్ని జాతీయ గీతంగా స్వీకరించింది.. ఈ గీతానికి స్వయంగా ఠాగోర్ సంగీత బాణీ కట్టారు.. ప్రస్తుతం మనం పాడుతున్న తీరిలో ఈ గీతం రూపొందింది ఎక్కడో తెలుసా? 1919లో మదనపల్లె వచ్చిన ఠాగోర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసి బహిరంగంగా ఆలపింపజేశారు.. వాస్తవానికి జనగణమన గీతం మొదట బెంగాళీలో రాసినది.. దీన్ని దేశమంతటా పాడుకునే విధంగా సంస్కృతీకరించారు.. నిజానికి జనగణమన గీతం మొత్తం ఐదు చరణాల్లో ఉంటుంది.. కానీ మనం ఒక చరణం మాత్రమే ఆలపిస్తున్నాం..
జనగణమన గీతంపై ఆది నుండి వివాదాలు ఉన్నాయి.. రవీంద్రనాథ్ ఠాగోర్ బ్రిటిష్ చక్రవర్తిని అధినాయకునిగా, భారత భాగ్య విధాతగా పొగుడుతూ ఈ గీతం రాశారంటారు.. కానీ ఠాగోర్ ఈ గీతాన్ని స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా జాతీయ సభల వేదికలపైనే ఆలపించారు.. జనగణమన గీతంలో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లు కనిపించవు.. కొన్ని పేర్లు ఇప్పుడు వాడుకలో లేవు.. అయితే ఈ గీతం 1911 నాటి భారత భూభాగాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారని గుర్తుంచుకోవాలి..  కాలానుగుణంగా జాతీయ గీతాన్ని మార్చాలనే డిమాండ్ ఉన్నా, చారిత్రిక ప్రాధాన్యత దృష్ట్యా ఇలాగే కొనసాగిచడం బాగుంటుందని భావించారు..
వాస్తవానికి భారత జాతీయ గీతంగా అప్పటికే వందే మాతరం ప్రసిద్ధికెక్కింది.. బంకించంద్ర చటర్జీ రాసిన నవలలోని ఈ గీతం బెంగాల్ విభజన సమయంలో స్వాతంత్ర్య సమర పోరాటాన్ని మలుపుతిప్పింది.. దేశ ప్రజలకు స్పూర్తినిచ్చి, ఎందరో యోధులను తయారు చేసిన గీతం అది.. దురదృష్టవశాత్తు వందేమాతరంలో హిందూ దేవతల పేర్లు ఉన్నాయనే సాకుతో సోకాల్డ్ సెక్యులరిస్టులు అడ్డుకున్నారు..

అయితే జనగణమనతో పాటు మూడో వంతుకు కుదించిన వందేమాతరానికి కూడా జాతీయ గీత హోదా లభించింది.. ఈ రెండు గీతాలు కూడా బెంగాల్ ప్రాంతం నుండి రావడం మరో విశేషం.. జనగణమన, వందేమాతరం గీతాలు రెండు కూడా మనకు స్పూర్తిని ఇచ్చేవే.. 

No comments:

Post a Comment