Monday, December 31, 2012

My Calendar for 2013..

Sunday, December 30, 2012

ఇతర కీచకుల సంగతి ఏమిటి?

ఢిల్లీలో ఓ యువతి సామూహిక అత్యాచారం, ఆమె మరణానికి యావద్దేశం చలించిపోయాంది.. అమానత్ కు జరిగిన అన్యాయంపై యువత తిరగబడింది.. అత్యాచారం చేసిన వారికి ఉరి తీయాలంటూ ఆక్రోశించింది.. ఆమెకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది కాదనలేం.. అమానత్ పోతూ పోతూ మన ముందు ఎన్నో ప్రశ్నలను వదిలి వెళ్లింది..
దేశంలో గతంలో ఇంతకన్నా దారుణ అత్యాచార సంఘటనలు జరగలేదా? వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎన్నో భయంకరమైన సామూహిక అత్యాచార సంఘటనలు, హత్యలు జరిగాయి.. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డవారిలో కేవలం నేరగాళ్లు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, ఉన్నతాధికారులు.. వారి సంతానంపై కూడా ఎన్నో కేసులు నమోదయ్యాయి.. పలుకుబడి ఉన్న వారు ఎలాంటి శిక్షలు పడకుండా తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు..
అమానత్ అత్యాచార సంఘటన తర్వాత ఇంత పెద్ద ఆందోళన జరిగినా, రేపిస్టులు ఎలాంటి భయం లేకుండా తమ పని తాము కానించారు.. పలు చోట్ల అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. దేశ రాజధానిలో జరిగిన సంఘటన  కాబట్టి అమానత్ కు జరిగిన అన్యాయం అతి పెద్దదిగా కనిపించి ఉండవచ్చు.. కానీ అమానత్ విషయంలో స్పందించిన వారు మిగతా వారి విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది..

పంచ కట్టులోనే తెలుగుదనం..

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు తమ సాంప్రదాయ వస్త్ర ధారణలో చక్కగా కనిపిస్తారు.. కానీ ఆంధ్ర ప్రదేశ్ నాయకులే ప్యాంటు, షర్టు లేదా ఉత్తరాది లాల్చీ, పైజామా ధరిస్తారు.. పంచ కట్టుకోవడానికి ఎందుకంత నామోషి?.. పీవీ, ఎన్టీఆర్, వైఎస్, వెంకయ్య సాంప్రదాయ వస్త్ర ధారణలో ఎంత చక్కగా ఉంటారో గమనించారా?.. తెలుగు మహా సభల పుణ్యమా అని మన సీఎం కిరణ్ గారు మోహమాటానికి ఉత్తరీయం లేని పంచ కట్టారు.. సంతోషం.. చంద్రబాబు తన కొడుకు లోకేష్ పెళ్లి నాడు చక్కని పంచ కట్టులో కనిపించడం చాలా దగ్గరగా చూసాను.. కిరణ్, బాబు ప్రతి రోజు పంచ ధరిస్తే ఎవరు వద్దంటారు? తెలుగు సంస్కృతి, సంప్రదాయాల రక్షణ ఈ ఇద్దరు నేతల నుండే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను..

Saturday, December 29, 2012

చనిపోయింది ఆమె కాదు.. మానవత్వం

అమానత్.. దామిని.. నిర్భయ.. ఆమె అసలు పేరు తెలియదు.. మానవ మృగాలకు భారిన పడి నరక యాతన అనుభవించి చివరకు తనువు చాలించింది.. ఆమెపై జరిగిన దారుణ అత్యాచారానికి దేశమంతా చలించింది.. మూడు రోజుల పాటు ఢిల్లీ నగరమే స్థంభించిపోయింది.. తమ వృత్తి జీవితాలు తప్ప, ఇతర విషయాలేవీ పట్టని యువతీ, యువకులు ఆమెకు న్యాయం చేయమంటూ, రేపిస్టులను ఉరి తీయమంటూ రోడ్ల మీదకు వచ్చారు.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ సామాజిక సమస్యపై వచ్చిన అతి పెద్ద ఉద్యమం ఇది.. దేశ నాయకత్వం కలవరపడింది..
చని పోయింది అమానత్(?) అని ఎవరన్నారు.. ఆమె చనిపోలేదు.. చనిపోయింది మానవత్వం.. అమానత్ భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మనందరి దృక్పథంలో మార్పు రావాలి.. తప్పు రేపిస్టులదే అనడం సరికాదు.. ఆడ పిల్లలను అంగడి సరుకులా చూపిస్తున్న ఈ సమాజమే అతి పెద్ద దోషి.. తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలని, పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు చేయాలని తల్లి దండ్రులు కోరుకుంటారు.. కానీ వారికి నైతిక విలువలు నేర్పించాలనే ఆలోచన మాత్రం కలగడం లేదు.. మన ఇంటి నుండి మార్పు వచ్చినప్పుడే సమాజం కూడా మారుతుంది..
రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలని మనమంతా కోరుకోవడంలో తప్పులేదు.. వారికి కఠినమైన శిక్షలు పడాల్సిందే.. కానీ ఉరి వేస్తారనే భయం కూడా లేకుండా భరి తెగించే శాడిస్టు వెధవలను ఎలా గుర్తించడం?..  ఈ రోజు అమానత్ కు జరిగిన అన్యాయం రేపు మన దగ్గరి వారి విషయంలో కూడా జరగవచ్చనే కనువిప్పు కలగాలి..
చివరగా నాదో విన్నపం.. మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మీరంతా సిద్దం అవుతూ ఉండొచ్చు.. దేశమంతా కదలిపోయిన ఈ విశాద సమయంలో వేడుకలు అవసరమా?.. అమానత్ కు నివాళిగా మనం నూతన సంవత్సర వేడుకలను త్యాగం చేసి శ్రద్ధాంజలి ఘటిద్దాం..
 

Friday, December 28, 2012

అఖిలపక్షం ఓ ప్రహసనం..

తెలంగాణ విషయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిల పక్ష సమావేశం చూసిన తర్వాత ఇంత ప్రహసనమా? అనిపించింది.. పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఢిల్లీ పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం సాధించింది ఏమిటి? ఆ అభిప్రాయాలేవో లేఖల రూపంలో తెప్పించుకుంటే చాలదా? లేదా షిండే గారు హైదరాబాద్ వచ్చి ఇక్కడే సచివాలయంలో సమావేశం జరిపితే సరిపోయేది కదా?
ఢిల్లీ అఖిల పక్షం వల్ల కొత్తగా ప్రయోజనం ఏదీ కనిపించనే లేదు.. పాపం వివిధ పార్టీల నాయకులంతా షిండే గారి కార్యాలయంలో ఇచ్చిన స్వీట్, సమోసా, ఛాయ్ కోసం శీతాకాలంలో వణుకుతూ ఢిల్లీ దాకా వెళ్లడం తప్ప.. వారి ఫ్లయిట్ ఖర్చులూ దండగే..
కాగా నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ద్వారా షిండే సాబ్ ఇరుక్కు పోయారు.. నిజంగా  ఆయన తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపగలరా? తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తిరస్కరిస్తారా? తెలంగాణ ఇస్తే హైదరాబాద్ తో కలిపా? లేక హైదరాబాద్ లేకుండానా? మరి రాయలసీమ సంగతి ఏమిటి? రాయల తెలంగాణ సాధ్యమేనా? హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందా? లేక ఉమ్మడి రాజధానిగానా?. దశాబ్దాలుగా తేలని అంశాన్ని నెల రోజుల్లోగా షిండే సాబ్ ఎలా పరిష్కరిస్తారు?.. కేంద్రం ఈ పాటికే ఓ నిర్ణయానికి వస్తే వెంటనే ప్రకటించ వచ్చు కదా? నెల రోజుల సమయం ఎందుకు?


ఇక్కడే ఉంది అసలు లాజిక్కు.. తెలంగాణ విషయంలో అనుకూలమో, వ్యతిరేకమో టి.ఆర్.ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మాత్రమే స్పష్టమైన వైఖరితో ఉన్నాయి.. కాంగ్రెస్, టీడీపీ, వై.ఎస్.ఆర్.సి.పి. మాత్రమే గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తుంటే, ఎంఐఎం తలా తోక లేని రాయల తెలంగాణ అంటోంది.. తెలంగాణకు అనుకూలమో? వ్యతిరేకమో స్పష్టంగా చెప్పేస్తే, ఎవరి సంగతి ఏమిటో ప్రజలే తేల్చుకుంటారు?.. తెలంగాణ ఇస్తే ప్రయోజనం ఎంత? నష్టం ఎంత? అనే లెక్కలేసుకుంటూ కూర్చుంటున్న రాజకీయ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి.. ఇంకా ఎంత కాలం ఇరు ప్రాంతాల ప్రజలు ఊగిసలాడుతూ ఉండాలి?

Wednesday, December 26, 2012

ఎవరి కోసం ఈ మహాసభలు?

తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే భ్రమతో దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి 57 ఏళ్లు (ఆరు దశాబ్దాలు) అయ్యింది.. ఆంధ్రప్రదేశ్ అనే పరిధి గీసుకొని ఆనందించాం.. కానీ సగం మందికి పైగా తెలుగువారు పొరుగు రాష్ట్రాల్లోనే  ఉండిపోయారు.. తెలుగు వారి పేరిట ప్రత్యేకంగా ఓ రాష్ట్రం ఏర్పడ్డా, ఈ నాటికీ తెలుగును అధికార భాషగా అమలు కావడం లేదు.. ఇందుకు తిలా పాపం తలా పడికెడు అన్నట్లు అందరిదీ తప్పే..
పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలు తమ మాతృభాషల వికాసానికి చక్కని ప్రోత్సాహం ఇస్తున్నాయి.. వారితో పోలిస్తే మనం ఎంతో వెనుక బడి ఉన్నాం.. ఆంధ్ర ప్రదేశ్లో పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరుగుతుంది.. తెలుగు వాడకం అంటే మన అధికారులకు నామోషి.. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి.. మన ప్రభుత్వం అధికార భాషా సంఘం అనే అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసింది.. ఇది వట్టిపోయిన ఆవు లాంటిదే.. నిధులు మేతలా వృధా అవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.. ప్రభుత్వ పరంగా తెలుగు భాషకు జరుగుతున్న సాయం అతి తక్కువ.. తెలుగు భాష ఈ నాటికీ తన ఉనికిని కాపాడుకుంటోంది అంటే అది వ్యక్తలు, మీడియా చేస్తున్న కృషే తప్ప, ప్రభుత్వ ప్రమేయం ఎక్కడా లేదు.. ఇక తెలుగు విశ్వ విద్యాలయం గురుంచి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది..
తెలుగువారు ప్రస్తుతం ఓ సంధి యుగంలో ఉన్నారు.. భాష పేరిట ఏర్పడిన బంధనం (ఆంధ్రప్రదేశ్) గుది బండగా మారింది.. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఒరిగంది ఏమీ లేక పోగా? పోరుగు రాష్ట్రాల్లోని సాటి తెలుగు వారు తమ భాషా సంస్కృతులకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిజానికి తెలుగు మాతృభాషగా ఉన్న వారి జనాభా 50 శాతం పైనే అయినా ద్వితీయ శ్రేణి ప్రజల్లా జీవించాల్సి వస్తోంది.. కనీసం రెండో అధికార భాషగా అయినా తెలుగును గుర్తించమని వారు ప్రాధేయపడుతున్నా.. మీకు ఆంధ్ర ప్రదేశ్ ఉందిగా అక్కడికి పొండి అని తమిళ, కన్నడ నాయకులు అవహేళన చేస్తున్నారు.. ఇలా తెలుగు భాష, సంస్కృతి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది..
ప్రపంచ తెలుగు మహా సభల పేరిట ఓ ప్రహసనం జరుగుతోంది.. ఇది ఎందు కోసమో? ఎవరి కోసమో తెలియని పరిస్థితి.. తెలుగువారి కోసం ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్లో కాకుండా తిరుపతిలో ఈ సభలు నిర్వహించడం లోని ఆంతర్యం ఏమిటో ఆ తిరుమలేషునికే తెలియాలి.. తెలంగాణ వాదులకు భయపడే రాజధాని వెలుపల ఈ సభలు జరుపుతున్నారనేది బహిరంగ రహస్యమే.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు మహా సభలు జరిగాయని చంకలు గుద్దుకోవడం తప్ప ఈ సభల వల్ల కొత్తగా కలుగుతున్న ప్రయోజనాలేవీ లేనట్లే..
తెలుగు భాషా సంస్కృతులను కాపాడాలనే సంకల్పం చేతల్లో కనిపించాలి.. కానీ ఉత్సవాల్లో కాదు.. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉత్సవాలు చేయడం అంటే, తల్లిని చంపుకొని తద్దినం పెట్టు కోవడం కాదా?

Sunday, December 23, 2012

వ్యవస్థపై శివమెత్తిన యువ జనం

ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే చారిత్రిక ఘట్టం.. యువ జనం శివమెత్తారు.. చీమల దండులా తరలి వచ్చి దేశ అత్యున్నత పరిపాలనా సౌధాన్నే ముట్టడించారు.. బస్సులో యువతిపై అత్యాచారం చేసిన కీచకులను సత్వరం ఉరి తీయమంటున్నారు.. అత్యాచార నిరోధక చట్టాన్ని కఠిన తరం చేసి తమకు రక్ష కల్పించమంటున్నారు.. జల ఫిరంగులు, లాఠీలు, బాష్పవాయువులకు కూడా భయపడకుండా ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నిస్తున్నారు..

రాష్ట్రపతి భవన్ లాంటి కీలక ప్రాంతాలను ముట్టడించిన వేలాది మంది యువజనానికి యూపీఏ సర్కారు సమాధానం చెప్పలేకపోతోంది.. ఇదంతా చూసి ప్రతిపక్షం చంకలు గుద్దుకొని ఆనందిస్తోందా?.. ఇది కేవలం ప్రభుత్వం పైన తిరుగుబాటని భావిస్తే మూర్ఖత్వమే అవుతుంది.. విద్యార్థులు, యువజనం రాజకీయ వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు.. వారు నాయకులను నమ్మడం లేదు.. ఇవాళ కాంగ్రెస్, యూపీఏలు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు బీజేపీ, ఎన్డీఏలకూ లేదా సోకాల్డ్ థర్డ్ ఫ్రంటుకూ తప్పకపోవచ్చు..

ఇంత కాలం ప్రశ్నించే వారు లేక పాలకులు, నాయకులు తామేది చేసినా చెల్లుబాటవుతుందని విర్రవీగారు.. ఎన్నికల్లో మందు, నోట్లు పడేస్తే జనం ఓటేయక చస్తారా? అనే భావన రాజకీయ నాయకులది.. కులం, మతం, వర్గం, రిజర్వేషన్, ఉచిత కరెంటు, రూపాయి బియ్యం, నగదు బదిలీ లాంటి తాయిలాలు ఆశ చూసి ఓట్లు రాబట్ట వచ్చనే రాజకీయ నాయకుల పన్నాగాలకు ఇక కాలం చెల్లింది.. తరం మారింది.. కొత్త యువతరం వచ్చింది.. ఇంకా పాత పద్దతుల్లోనే వ్యవహరిస్తామని పాలకులు చెబితే చెల్లదు.. నిల దీసే వారు వచ్చేశారు.. అవసరమైతే తిరగబడతారు.. నాయకుల కలరు పట్టుకొని చెంపలు వాయిస్తారు..


Friday, December 21, 2012

ఆత్మ విమర్శ చేసుకుందాం..

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా..అంటే ఎక్కడ స్త్రీలు పూజలనందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.. మన పురాణాలు చెబుతున్న సత్యమిది.. పురాతన కాలం నుండి మహిళలకు మన దేశంలో ప్రముఖ స్థానం ఉండేది.. (దురదృష్ట వశాత్తు మధ్య యుగం నుండి క్షీణ దశ ప్రారంభమైంది..) స్త్రీని శక్తి స్వరూపిణిగా, దేవతగా, తల్లిగా గౌరవించడం మన సాంప్రదాయం.. మన దేశాన్ని భారత మాత చెబుకుంటాం.. అంటే దేశాన్ని తల్లి రూపంలో కొలుస్తున్నాం..
మన దేశంలో మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది.. దేశాన్ని పాలించే పార్టీ అధినేత్రి మహిళే.. ప్రతిపక్ష నాయకురాలు, లోక్ సభ స్పీకర్ కూడా మహిళలే.. కొన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు మహిళలే.. గతంలో ప్రధాని, రాష్ట్రపతి పదవులును కూడా మహిళలు అలంకరించారు.. కొన్ని ప్రాంతీయ పార్టీల అధినేత్రులూ మహిళలే.. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు గణనీయ ప్రగతి సాధిస్తున్నారు.. చెప్పుకునేందుకు ఇదంతా బాగానే ఉంది.. మేడిపండులా చూడటానికి అంతా బాగానే ఉంది.. కానీ జరుగుతున్న వాస్తవం ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి బస్సులో అత్యాచారానికి గురవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.. దేశాన్ని పాలించే పార్టీ నాయకురాలు, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఈ సంఘటన జరగడం సిగ్గు చేటు.. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు అంత సురక్షితం కాదని లెక్కలు చెబుతున్నాయి.. ఢిల్లీలో గత ఏడాది కాలంలో మహిళలపై అత్యాచారాలు 17% పెరిగాయి.. గత ఏడాది డిసెంబర్ 15 నాటికి 564 కేసులు నమోదైతే, ఈ ఏడాది ఈ తేదీ నాటికి 661కి చేరాయి.. 2009లో 459, 2010లో 489 కేసులు నమోదయ్యాయి.. ఈ సంఖ్య చస్తూనే తెలుస్తోంది ఢిల్లీ పరిస్థితి ఏమిటి అనేది..
అత్యాచారాలు చేసే వారికి ఉరి శిక్ష వేయాలని, అంగచ్ఛేదన చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే.. కానీ ఈ శిక్షలతో అత్యాచారాలు ఆగుతాయా? సమాజంలో పరివర్తన లేకుండా ఇలాంటి నేరాలు అరికట్ట గలమా? ఒక్కసారి ఆలోచించండి.. సినిమాలు, టీవీలు, వ్యాపార సంస్కృతి మహిళల స్థానాన్ని ఎంత దిగజారుస్తున్నాయో ఆలోచించారా? ఒకవైపు మహిళలు స్వావలంభనతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు వారిని భోగ వస్తువుల్లా చూపడం వాస్తవం కాదా?.. మనం గొంగట్లో వెంట్రుకలు ఏరడం లేదా?.. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలూ, కపట నాటకాలూ?.. ఆలోచించండి.. ఆత్మవిమర్శ చేసుకోండి.. మనం మారుదాం.. సమాజాన్నీ మారుద్దాం..

(ఈ వ్యాసానికి మంచి చిత్రాన్ని జత చేద్దామని గూగుల్ సెర్చ్ లో indian women అని టైప్ చేసి చూస్తే తల తిరిగినంత పనైంది..)

Thursday, December 20, 2012

మోడీ లాంటి నేతలు కావాలి


ఊహించినట్లే గుజరాత్లో మళ్లీ నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది.. గుజరాత్ ప్రజలు వరుసగా మూడోసారి భాజపాకు పట్టం కట్టారంటే అది మోడీ చలవే.. గతంలో కన్నా రెండు సీట్లు తగ్గినా అది మోడీపై వ్యతిరేకతతో కాదు.. బీజేపీ నుండి చీలిన జీపీపీ వల్ల కొంత నష్టం జరిగింది.. బీజేపీ, జీపీపీలకు పడ్డ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ అడ్రస్ కచ్చితంగా గల్లంతైనట్లే.. దురదృష్టవశాత్తు ఈ విజయాన్ని సోకాల్డ్ మేధావులు జీర్ణించుకోలేక పోతున్నారు.. 2002 నాటి సంఘటనలు పదే పదే ప్రస్థావిస్తున్నారు.. ఈ సంఘటన తర్వాత మూడు ఎన్నికలు జరిగి, ఆ మూడు సార్లు మోడీ విజయాలు సాధించడం వారికెందుకో రుచించలేదు.. అది గుజరాత్ ప్రజలను కించపడరచడం తప్ప మరొకటి కాదు.. గుజరాత్లో జరిగిన అభివృద్దిని ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరించి మళ్లీ మోడికే ఓటేస్తే వీరికి ఎందుకు కడుపు మంటో అర్థం కాదు.. నిజానికి మోడీ గత రెండు ఎన్నికల్లో అభివృద్ధినే ఎజెండాగా ఎంచుకున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే గుజరాత్లో వ్యవసాయం కానీ, సహజ వనరులు కానీ తక్కువే.. అయినా అక్కడ అద్భుతమైన ప్రగతి కనిపిస్తుందంటే సుపరిపాలన వల్లే.. సుపరిపాలన అందించిన ఘనత నరేంద్ర మోడీదే.. మోడీని విమర్శించే వారు నిర్మాణాత్మంగా మాట్లాడితే బాగుంటుంది.. కానీ గుడ్డు మీద ఈకలు పీకితే జనం నవ్వుకుంటారు.. నరేంద్ర మోడీ భావి భారత ప్రధాని అవుతారా లేదా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం కానీ, మోడీ లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రానికి కావాలి.. మన దేశానికి కూడా ఇలాంటి నాయకులు కచ్చితంగా అవసరం..

Thursday, November 22, 2012

అఫ్జల్ గురుకు ఉరి ఎప్పుడు?

ముంబయిపై దాడి చేసి భారత దేశ అస్థిత్వాన్నే సవాలు చేసిన అజ్మల్ కసబ్ కు న్యాయ స్థానం విధించిన ఉరి శిక్ష అమలు చేయడానికి చాలా కాలమే పట్టింది.. అది కూడా రహస్యంగా ఉరి తీసింది మన ప్రభుత్వం.. ఎలాగైతేనేం ఈ నర హంతకుడికి ఉరి పడిందని సంతోషించి సంబరాలు చేసుకున్నారు దేశ ప్రజలు.. మరి పార్లమెంట్ పై దాడి కేసులో మరణ శిక్ష పడిన అఫ్జల్ గురుకు ఇంత వరకు శిక్ష అమలు చేసే సాహసం చేయలేక పోతోంది యు.పి.ఎ. సర్కారు.. హోం శాఖకు కొత్త మంత్రి వచ్చినందున ఫైల్ పునర్ పరిశీలనకు పంపామని కుంటి సాకులు చెబుతోంది రాష్ట్రపతి భవన్.. కసబ్ కు ఉరి వేయగానే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు చేసిన బెదిరింపులకు భయపడి పోయిందా యు.పి.ఎ. ప్రభుత్వం?.. తక్షణం అఫ్జల్ గురుకు ఉరి శిక్ష  వేయాల్సిందే.. 

Tuesday, November 13, 2012

Monday, November 5, 2012


ఆనాడు రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట.. ఈనాడు వరదల్లో ఆంధ్రదేశం మునిగితే రాష్ట్ర పాలకులు ఢిల్లీలో పట్టాభిషేకం తిలకించడానికి పోయారు.. ప్రజలు వరదల్లో అల్లాడి పోతుంటే సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రికి ఢిల్లీ కార్యక్రమమే ముఖ్యం..

స్వల్పమైన మనవ తప్పిదాలు అంతులేని విషాదాన్ని మిగులుస్తాయి..కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం ప్రభుత్వ వైఫల్యమే.. ప్రభుత్వం డబ్బా కొట్టుకొని ప్రచారం చేసుకుంటున్న 108 సర్వీసు ఎంత బేషుగ్గా పని చేస్తుందో దేశ ప్రజలందరికి తెలిసిపోయింది.. ఇంత ముఖ్యమైన సర్వీసు సకాలంలో రాకపోవడం, జాతీయ రహదారుల వారి అంబులెన్స్ లో ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా ఎర్రన్న ప్రాణాలు కోల్పోయారని అందరికి అర్థం అయిపోయినా , అంతా సవ్యం అని ప్రబుత్వం భుకాయించడంలో అర్థం లేదు.. వి.ఐ.పి.ల ప్రాణాలే కాపాడలేని ప్రభుత్వం సామాన్యులను రక్షిస్తుందని ఆశించగలమా?..

Friday, November 2, 2012

తెలుగుభాషకు చెరసాల

మీకు తెలుసా?.. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 13వ స్థానంలో ఉంది.. భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 8 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు.. అయితే అంతే సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగువారు నివసిస్తున్నారు.. తమిళనాడులో 42 శాతం ప్రజల మాతృభాష తెలుగే.. కర్ణాటకలోనూ ఘననీయంగా తెలుగువారున్నారు.. చెన్నయ్, బెంగళూరు నగరాల్లో 30 నుండి 40 శాతం తెలుగు వారే.. బళ్లారిలో 80 శాతం తెలుగు ప్రజలున్నారు.. ఒడిషా, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో తెలుగు వారి ఆధిక్యతే ఎక్కువ.. హొసూరు, కొయంబత్తూరు, మధురై, రాయగడ, హుబ్లి, వారణాసి, షిరిడి, జగదల్పూర్, బెర్హంపూర్, ఖరగ్ పూర్, షొలాపూర్, సూరత్, ముంబై, భివాండి తదితర జిల్లాల్లో తెలుగువారు ఘననీయ సంఖ్యలో ఉన్నారు.. పలు దేశాల్లో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగువారు ఉంటారని అంచనా..

ఇంకో విషయం మీకు తెలుసా?.. దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. అంటే భాష ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం.. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు జిల్లాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.. ఆ తర్వాత 1956లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. ఆంధ్రప్రదేశ్ స్పూర్తిగా ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి..మరి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటం వల్ల తెలుగు భాషకు, తెలుగు వారికి ఏమైనా మేలు జరిగిందా?.. ఇప్పడు మనం అసలు విషయానికి వచ్చేశాం..

నిజం నిష్టూరంగా ఉన్నా మేలు కన్నా కీడే అధికంగా జరిగిందని చెప్పవచ్చు.. దేశంలోని ఇతర రాష్ట్రాలు చక్కగా తమ ప్రాంతీయ భాషల్లో వ్యవహారాలు సాగిస్తున్నాయి.. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హిందీ ఆధిక్య రాష్ట్రాలు.. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పేరుకు మాత్రమే అధికార భాష.. ఇక్కడ పరిపాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతాయి.. తెలుగు భాషకు గుర్తింపు అంతంత మాత్రమే.. తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు నానాటికీ తగ్గిపోతున్నారు.. చివరకు శాసనసభలో సైతం ఇంగ్లీషుకే పెద్ద పీట వేస్తారు.. ఎంగిలిపీసు(ఇంగ్లీషు) మాట్లాడం స్టేటస్ సింబల్..

మీకు ఇంకో విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గుర్తింపు తగ్గిపోయింది.. స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు ఉండేది.. బ్రిటిష్ వారు హిందీ, బెంగాళీ తర్వాత తెలుగుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.. మద్రాసు, మైసూరు రాష్ట్రాల్లో, స్వదేశీ సంస్థానాల్లో పరిపాలనా వ్యవహారాలు తెలుగు భాషలో సైతం కొనసాగాయి.. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు ఎంత అణచివేతకు గురైనా తనదైన అస్థిత్వాన్ని కాపాడుకుంది.. మద్రాసు ప్రసిడెన్సీ (రాష్ట్రం) ముఖ్యమంత్రుల జాబితా ఒక్కసారి పరిశీలిస్తే తెలుగువారే అత్యధికంగా కనిపిస్తారు.. మద్రాసుకు సీఎంగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పరిస్థితి తారుమారైంది..

మనం ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక గిరి (పరిధి) గీసుకున్నాక పొరుగు రాష్ట్రాల్లో నివసించే తోటి తెలుగువారు అనాధలైపోయారు.. అక్కడ తెలుగు భాషకు, సంస్కృతికి గుర్తింపు కరువైంది.. మనవాళ్లు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు.. తెలుగు మీడియం పాఠశాలలు మూతపడుతున్నాయి.. తెలుగువారు అనివార్యంగా తమ పిల్లలకు అన్యభాషల మీడియంలో చదివిస్తున్నారు.. క్రమంగా వారి భాషా సంస్కృతులకు గ్రహణం పడుతోంది.. తెలుగువారు అక్కడి ప్రభుత్వాలకు తమ గుర్తింపు కోసం దరఖాస్తులు పెట్టుకుంటే, మీకు ఆంధ్ర ప్రదేశ్ ఉందిగా అక్కడికే పొండి అని అవహేళన చేసిన ఉదంతాలు మద్రాసు రాష్ట్రం (నేటి తమిళనాడు)లో జరిగాయి.. గోడలపై ‘నాయుడు’ అని తెలుగులొ రాసి ఉంటే దాన్ని ‘నాయి’గా మార్చి అవమానించారు.. తమిళంలో నాయి అంటే కుక్క అని అర్థం..

మరి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏమైనా చొరవ తీసుకుందా? తెలుగుకు ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపు అంతంత.. సొంత వ్యవహారాలే పట్టని మన పాలకులు పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారి సమస్యలు పట్టించుకుంటారని భావించడం హాస్యాస్పదమే.. తెలుగు విశ్వవిద్యాలయం, అధికారం భాషా సంఘం అనేవి అజాగళ స్థనాలుగా మారిపోయాయి.. తెలుగు దేశం పేరిట ఓ పార్టీ ఉన్నా ఇది నేతిబీరలో నెయ్యి లాటిదే.. మన నాయకులు తెలుగు వారంతా ఒక రాష్ట్రంగా ఉండాలి.. సమైక్యాంధ్ర వర్దిల్లాలి అని కోతలు కోస్తుంటారు.. కానీ తెలుగు భాషా సంస్కృతులను కాపాడేందుకు వారేమైనా చేస్తున్నారా? ఎంత మంది పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారు? గుండె మీద చేయి వేసుకొని చెప్పండి..

ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఇంగ్లీషు, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడేవారు కనిపించేవారు.. అలాగే హైదరాబాద్ స్టేట్లో తెలుగు, కన్నడం, మరాఠీ, ఉర్దూ, పార్శీ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడేవారు కనిపించేవారు.. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ.. మైసూరు రాష్ట్రంలోనూ బహుభాషా కోవిధులుండేవారు.. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాక ఇలాంటి విభిన్న భాషల సాంస్కృతిక వారసత్వం దెబ్బదిన్నది.. మాతృ భాషతో పాటు ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాలనే ఆలోచన కరువైపోయింది..

మనం ఆంధ్రప్రదేశ్ పేరిట తెలుగువారికి సొంత రాష్ట్రం ఏర్పరచుకున్నాం అనే భ్రమల్లో ఉన్నాం.. (మరోసారి మొదటి పేరా చదువుకోగలరు) కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి ఒక పరిధిగా ఏర్పడి చెరసాలగా మారిపోయింది.. రాష్ట్రంలో ఉన్న తెలుగువారి భాషా సంస్కృతులకే దిక్కు లేకుండా పోయింది.. మన నాయకుల సంకుచిత మనస్థత్వం కారణంగా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఎంతో అన్యాయం జరిగిపోతోంది.. నిజానికి తెలుగు భాషకు ఊపిరిని అందిస్తున్నది ప్రసార మాధ్యమాలే.. (తెలుగు భాషను కొంత ఖూనీ చేస్తున్నప్పటికీ) తెలుగువారు ఆంధ్రప్రదేశ్ అనే భౌగోళిక ఎల్లల పరిధిలోని వారు అనే విచిత్ర మనస్థత్వం నుండి మనం భయటపడాలి.. సమైక్య ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా తెలుగువారు వర్దిల్లాలి (వారు ఎక్కడ నివసించినా) అని నినదిద్దాం.. (ఆంధ్రప్రదేశ్ అనే తెలుగువారి చెరసాల లేదా పరిధి ఏర్పడిన రోజు సందర్భంగా..)


Thursday, November 1, 2012

ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డలం మనం.. విడిపోయినా మన మనసులు కలిసే ఉండాలి.. మన భాషా సంస్కృతులను రక్షించుకుందాం..


నిద్రిస్తున్న ప్రజాస్వామ్యం.. కేరళ అసెంబ్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తున్న వేళ ఆ రాష్ట్ర మంత్రులు ఎంత భేషుగ్గా ఆలకిస్తున్నారో చూడండి..

Wednesday, October 31, 2012

ఉక్కు మనిషి,  సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి నేడు..హైదరాబాద్ తో పటు ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నవభారత నిర్మాత సర్దార్ పటేల్.. పటేల్ ప్రధాన మంత్రి అయ్యుంటే కాశ్మీర్ తో సహా దేశ సమస్యలు అన్నింటిని సమర్ధంగా పరిష్కరించి ఉండేవారు.. సర్దార్ పటేల్జిని స్మరించుకోవడం భారతీయులుగా మన విధి..

Friday, October 26, 2012

కమలం బురద తొలగేనా?




1980లో భారతీయ జనతా పార్టీ (గతంలో జన సంఘ్) ఏర్పడ్డప్పుడు బురదలో పుట్టిన పార్టీ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసారు.. ఎందుకంటే కమలం ఆ పార్టీ చిహ్నం.. కమలం బురదలో పుడుతుంది.. అప్పుడు అటల్ బిహారి వాజపేయి ఒక మాట చెప్పారు.. 'కమలం బురదలో బుట్టిన స్వచంగా ఉంటుంది.. అలాగే బురదగా మారిన రాజకీయాల్లో బి.జె.పి. తన ఆదర్శాలతో స్వచ్చమైన రాజకీయ పార్టీగా కొనసాగుతుంది..' 
కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కర్ణాటకలో అవినీతి అనే పందిలా పొర్లాడిన యడ్యురప్ప కారణంగా బిజెపి ప్రతిష్టకు మచ్చ పడింది.. అప్పను ఆలస్యంగా అయిన ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించినా, కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమై పక్కలో బల్లెంగా మారాడు.. కర్ణాటక యవ్వారం ఇలా ఉంటే ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి గతంలో చేసిన ఘన కార్యాలు బయట పడుతున్నాయి.. అవినీతి, అసమర్థ విధానాలతో కాంగ్రెస్ నేతృత్వ యు.పి.ఎ. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడంతో 2014లో అధికారం తమదే అని బి.జె.పి. ధీమాగా ఉంది.. కానీ ఇప్పుడు కేజ్రివాల్ గారి పుణ్యమా అని గడ్కారి బి.జె.పి.కి గుడి బండగా మారారు.. 
గడ్కారి అవినీతికి నిజంగా అవినీతికి పాల్పడ్డారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయస్థానమే అయినా, అది తేలేది 2014 ఎన్నికల తర్వాతే.. మరి ఈలోగా బి.జె.పి. ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకుంటుంది? పార్టీ అద్వానితో సహా పార్టీ అగ్ర నాయకులంతా గడ్కారిని వెనుకేసుకు వస్తున్నారు.. కానీ బి.జె.పి. కార్యకర్తలు ఓటర్లకు ఏమి సమాధానం చెబుతారు? కాంగ్రెస్ కు, బి.జె.పి. మధ్య ఎలాంటి తేడా ఉందని నిరూపిస్తారు? 

గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి సోకాల్డ్ గాంధీలు తప్ప ఇతరులు అధినాయకులు కాలేరు.. ప్రజాస్వామ్య విధానాలు ఉన్న బి.జె.పి.కి ఆ పరిస్థితి లేదు.. బి.జె.పి.కి నాయకత్వ సమస్య లేదు.. కానీ ఎవరు ఆధ్యక్ష పదవి చేపడతారు? ఎవరు ప్రధాని అభ్యర్థి అన్నదే సమస్య..  

Wednesday, October 24, 2012

హిందువులకు మనోభావాలు ఉండవా?


ఈ దేశంలో హిందువులకు ఎలాంటి మనోభావాలు ఉండవు.. మనోభావాలు ఉండేవి హైందవేతర మతస్తులకే.. విజయదశమి సందర్భంగా కొందరు వ్యక్తులు జరిపిన ప్రచారం ఆశ్చర్యాన్ని కలిగించింది.. దసరా రోజున రావణ దహనం బదులు రావణ వర్దంతి జరపాలట.. రావణుడు మంచివాడేనట.. అణువణువునా హిందూ మతంపై ద్వేషం పెంచుకున్న కొందరు వ్యక్తులు చేసిన రాద్దాంతం ఇది.. వాస్తవానికి వీరు హిందువులు కాదు.. హిందూమతం పై విశ్వాసం లేని వారు, హిందువుల విశ్వాసాలతో ఆటలాడే ఇలాంటి చర్చలు జరపడంలోని అంతర్యం ఏమిటి?.. హైందవేతర మతస్తుల విశ్వాసాలపై ఇలాంటి చర్చ జరిపే ధైర్యం వీరికి ఉందా?.. 
కొద్ది నెలల క్రితం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిపిన పెద్ద కూర పండుగను ఒక్క సరి గుర్తు తెచ్చుకోండి.. గొడ్డు మాంసం తినాలనుకుంటే తినొచ్చు.. అది వారి ఇష్టం.. కానీ ఇందు కోసం హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? హిందూ మత విశ్వాసాలను ద్వేషించే వారు, నాస్తికులు, అన్య మతస్తులే పెద్ద కూర పండుగ సూత్రధారులు.. ఇది అబద్దం అని నిరుపించాగలరా?  
ఎక్కడో కార్టున్ గీసారని, తమ విశ్వాసాలకు భంగం కలిగించారని ఒక మతం వారు చేసిన విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. హిందువులు ఉదార స్వభావులు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి.. ఈ ప్రపంచంలోని ప్రతి మతం విశ్వాసాల ఆధారంగా ఏర్పడిందే.. ఇష్టం లేకపోతె మాట విశ్వాసాలను పాటించాల్సిన అవసరం లేదు.. కానీ పైకి హిందువులుగా చలామణి అవుతూ, గుట్టుగా అన్య మతాలను పాటిస్తూ, హిందూమతంపై బురద చాల్లే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు.. 
విశ్వాసాలను నిష్టగా పాటించే వారిని అట పట్టించడం, మతోన్మాదులని ద్వేషించడం ఫ్యాషన్ అయిపొయింది.. హిందువులు ఉదార వాదులుగా ఉండటమే పాపమా? 

Tuesday, October 23, 2012

జయ జయ హే.. మహిషాసుర మర్ధిని.. విజయ దశమి శుభాకాంక్షలు..

Monday, October 22, 2012

దుర్గాష్టమి శుభాకాంక్షలు

Sunday, October 21, 2012

ఇంకా నేర్చుకోని గుణపాఠం

 చైనాతో జరిగిన యుద్ధంలో మమమన దేశం ఓటమిపాలై ఏళ్లు గడచిపోయాయి.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే గుడ్డి విధానంతో నాటి భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్ లై మనస్సులో ఉన్న కుట్రను గ్రహించలేకపోయారు.. దానికి తోడు మన దేశం ఆనాడు అనుసరించిన అంతర్జాతీయ విధానంలోని లోపాలు కొంప ముంచాయి.. నాటి కేంద్ర రక్షణ మంత్రి కృష్ణ మీనన్ ను గుడ్డిగా నమ్మిన నెహ్రూ ఈ యుద్దంలో ఓటమితో ఎంతో వ్యధ చెందారు.. 1947లో మన దేశానికి స్వాతంత్రం రాగే నెహ్రూ చేసిన తప్పు అప్పటి వరకూ బ్రిటిష్ ఇండియా రక్షణలో ఉన్న టిబెట్ నుండి సైన్యాన్ని ఉపసంహరించడమే.. రెండో తప్పు టిబెట్ దేశాన్ని చైనా ఆక్రమించినప్పుడు ఖండించక పోవడం.. పైనా చైనాలో టిబెట్ అంతర్భాగమని అంగీకరిస్తూ, ఐక్యరాజ్య సమితిలో ఛైనాకు శాశ్వత సభ్యత్వం ఇప్పించే ప్రయత్నం చేశారు నెహ్రూ.. రక్తం రుచి మరగిన తోడేలు లాంటి చైనా అదను చూసి 1962 అక్టోబర్ 20న భారత దేశంపై దాడి చేసింది.. ఆనాటి యుద్దంలో చిత్తుగా ఓడిపోయాం..
ఆనాటి ఓటమి తాలూకూ పీడ కలలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కబలించిన చైనా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమదేనంటూ క్లెయిమ్ చేస్తోంది.. భారత దేశాన్ని సైనిక, ఆర్థిక దిగ్భందనాలతో కబలించే ప్రయత్నం చేస్తున్న చైనా విషయంలో మన దేశం ఇంకా తప్పిదాలు చేస్తూనే ఉంది.. ఆనాడు సైనిక పరంగా విజయం సాధించిన చైనా ఇప్పడు, తన పనికిరాని చవక చెత్త వస్తువులతో ఇండియా మార్కెట్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.. మన దేశానికి మొదటి శత్రువు పాకిస్తాన్ అని అందరూ భావిస్తారు.. నిజానికి చైనాయే మన ప్రథమ శత్రువు.. ఈ విషయాన్ని ఎన్డీయే ప్రభుత్వ హయంలో రక్షణ మంత్రిగా పని చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ ను ప్రతిపక్షాలు వెర్రి నాగన్నలా చూశాయి.. కానీ ఆయన చెప్పింది వాస్తవం అనే నిజం నిలకడమీదే అర్థం అవుతోంది..
చైనా యుద్దంలో మన దేశం కోసం పోరాడిన వీర జవానుల సేవలను గుర్తించేందుకు ఘనత వహించిన భారత ప్రభుత్వానికి 50 ఏళ్లు పట్టింది.. ఆనాటి జవాన్ల వీరోచిన పోరాటాన్ని గౌరవించి వారికి సల్యూట్ చేయడం భారతీయులుగా మన విధి.. అలాగే చైనాతో తస్మాత్ జాగ్రత్త..

పూరీల సినిమాల చిచ్చు

సినిమాలను సమాజంతో వేరు చేయలేం.. అందునా మన రాష్ట్రంలో.. సినిమాలే లోకంగా జీవించే వారెందరో ఉన్న రాష్ట్రం మనది.. దిన పత్రికలు సినిమా వార్తలకు ప్రత్యేకంగా పేజీని కేటాయించడమే ఇందుకు ఉదాహరణ.. ఇటీవల రెండు చిత్రాలు పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు.. కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. ఈ రెండు చిత్రాలు పూరీలవే కావడం విశేషం.. కెమెరామెన్ గంగతో రాంబాబు ద్వారా పూరీ జగన్నాధ్ తెలంగాణ వాదుల మనోభావాలను, ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజంతో జీటీ పూరీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీశారు.. ఈ పూరీలు ఆశించిన సామాజిక ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ అశాంతిని సృష్టించారు.. సమాజంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. దీన్ని కాదనలేం.. కానీ ఈ స్వేచ్ఛకూ పరిమితులు ఉన్నాయి.. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం అంటే కుదరదు.. నచ్చకపోతే తిరస్కరించే స్వేచ్ఛ కూడా అవతలి పక్షానికి ఉంటుంది.. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు..  తమ భాష, సంస్కృతి, కట్టుబొట్టులపై ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి.. తమ వాదనే కరెక్టరనే మొండి వాదనతో తమ వ్యాపార ప్రయోజనాల కోసం తమ పెంటను అందరూ భరించాలంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి?

Tuesday, October 16, 2012

సర్కారీ దుబారా..

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్తు సంక్షోభం నెలకొంది.. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు..  పరిశ్రమల్లో పనులు స్థంభించి పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది.. రైతన్నలు పొలాలకు నీరు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది.. ముందు చూపులేక, చేతగాని విధానాలతో చేతులెత్తేసిన ప్రభుత్వం విద్యుత్తును ఆదా చేయమంటూ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చేసింది.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మన ప్రభుత్వం విద్యుత్తును ఎలా దుర్వినియోగం చేస్తోందో చూడండి.. ఆంధ్రప్రదేశ్ సచివాలయం రంగుదీపాల తోరణాలతో విద్యుత్ కాంతులతో ఎలా దగదగలాడిపోతోందో చూడండి.. ఈ ఫోటో నిన్న(15.10.2012) రాత్రి సరిగ్గా 9 గంటల 49 నిమిషాలకు తీసినది.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుంది కదూ.. అసెంబ్లీ భవనం కూడా ఇలాగే వెలిగిపోతోంది.. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన ఎందరు విదేశీ పర్యాటకులు రాత్రి వేళ నగర అందాలు తిలకిస్తున్నారో తెలియదు కానీ.. కష్ట పరిస్థితుల్లో విద్యుత్తును ఇలా దుబారా చేయడం మాత్రం దారుణం..

Monday, October 15, 2012

మన బతుకమ్మ.. మన పండుగ..

సినిమా పాటలు, డ్యాన్సులే మన కల్చర్ అని భ్రమపడుతున్న ఈ రోజుల్లో, నిజమైన సంస్కృతి, సంప్రదాయాలు పల్లెల నుండి పట్నాల దాకా ఇంకా బతికే ఉన్నాయనేందుకు బతుకమ్మే ఉదాహరణ.. కల్తీలేని అచ్చమైన తెలుగు భాషా సౌందర్యం జన పదుల నోట బతుకమ్మ పాటల రూపంలో కదలాడుతోంది.. ప్రజల కష్టాలు, సుఖాలు, చరిత్ర కలగలసి గౌరమ్మకు భక్తితో నివేదించుకునే తీరు అపురూపం, అనిర్వచనీయం.. నిన్న మొన్న హఠాత్తుగా పుట్టుకొచ్చిన పండుగ కాదిది.. తర తరాలుగా తొమ్మిది రోజుల పాటు నాలుగు కోట్ల తెలుగు ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగను గుర్తించాలని ప్రభుత్వాన్ని దేబిరించాల్సిన అవసరం లేనేలేదు.. చరిత్రలో ఏ ప్రభుత్వం గుర్తించడం వల్ల ఇంతకాలం బతుకమ్మ మనుగడ కొనసాగింది?.. బతుకమ్మ పేరులేనే శాశ్వతమైన గుర్తింపు ఉంది.. మన సంస్కృతి, మన సాంప్రదాయం.. మన బతుకమ్మ.. మన పండుగ.. ఇంతటి జీవవైవిధ్యం ఇంకెక్కడైనా ఉందా.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో..

Sunday, October 14, 2012

కాంగ్రెస్ పచ్చడి..

ఆవకాయ పచ్చడి అంటే మనలో ఇష్టపడంది ఎవరో చెప్పండి?.. అయితే కాంగ్రెస్ మాత్రం భ్రష్ట్ అచార్ (భ్రష్టాచార్=అవినీతి, అచార్=పచ్చడి) అంటే పడి చస్తారు.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలకులు అవినీతి కంపును అంటించుకున్నారు.. రోజు రోజుకూ కొత్త కొత్త కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా దాకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఇంకా ఎంతకాలం మీరిని భరించాలి? ఎన్నికల దాకా వీరి లూఠీ కొనసాగాల్సిందేనా?

గాంధీజీ ఊరి ఎంపీ ఈయన

విఠల్ భాయ్ హన్స్ రాజ్ భాయ్ రదాడియా అలియాస్ విఠల్ రదాడియా.. గుజరాత్ లోని పోరుబందర్ ఎంపీ.. అంటే మహాత్మగాంధీ పుట్టిన ప్రాంతం.. గాంధేయ వాదం(?)కు హోల్ అండ్ సోల్ పేటెంట్ హోల్డర్ అయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ పై లోక్ సభకు ఎన్నికయ్యాడాయన.. ఇలాంటి శుద్ధ గాంధేయవాది పయనించే కారును వదోదర దగ్గర టోల్ గేట్ సిబ్బంది ఆపారు.. ఇది ఎంపీ వాహనం అని చెబితే గుర్తింపు కార్డు చూపమన్నారు.. కానీ గౌరవనీయులైన రదాడియా గారికి కోపం తన్నుకొచ్చేసింది.. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమన్న గాంధీ మాటను మరచిపోయాడేమో? వెంటనే గున్ను చూపించి బెదించాడు.. తన చర్యను రదాడియా సమర్దించుకోగా, సోకాల్డ్ గాంధీల పార్టీ మౌనం వహించింది..

Friday, October 12, 2012

కలంపై సర్కారు పగ

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై పగబట్టినట్లు కనిపిస్తోంది.. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా పావులు కదుపుతోంది.. ఈ ఏడాది ఇన్స్యూరెన్స్ కోసం జర్నలిస్టుల దగ్గర వారి వంతు ప్రీమియంలో కట్టించుకున్న ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకుండా, ఏకంగా ఫైలునే మాయం చేసింది.. ఫలితంగా వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడింది.. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, సమాచార శాఖ అధికారులు కుంటి సాకులు చెబుతున్నారు.. గతంలో జర్నలిస్టులందరి ఆరోగ్య బీమా ఒకే బీమా కంపెనీ కింద ఉండేది.. ప్రభుత్వం తెలివిగా రెండు కంపెనీల కింద విభజించింది.. ఫలితంగా ఎందరో జర్నలిస్టులు ఇన్స్యూరెన్స్ కంపెనీ సీనియారిటీ కోల్పోయారు.. ఈ విషయంలో అప్పుడే జర్నలిస్టు సంఘాలు అభ్యంతర పెట్టాల్సింది.. కానీ వారు నోరు మెదపక పోవడంతో కుట్ర సంపూర్ణమెంది.. ఏకంగా జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకానికే ఎసరొచ్చింది.. సమాజంలో అన్ని వర్గాలను దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు జర్నలిస్టుల కుటుంబాలకు కూడా శత్రువైపోయింది.. వినాశ కాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో?..

Wednesday, October 10, 2012

నైవేధ్యమా?.. వైధవ్యమా?

హైదరాబాద్ జీవ వైవిధ్య నగరంమంటూ ముఖ్యమంత్రి ఫోటోతో పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసి నిజమేనేమో అనుకున్నా.. కానీ వైవిధ్యం అంటే అడ్డగోలు పనులతో కాంట్రాక్టర్లకు నైవేధ్యం అని ఈ ఫోటో చూశాక తెలిసొచ్చింది.. పాపం ఓ విదేశీయుడు ఫుట్ పాత్ పై డ్రైనేజీలోకి ఎలా పడిపోయాడో చూడండి.. జీవ వైవిధ్యం పేరిట నగరంలో కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు అరకొర పనులు చేసి కోట్లాది రూపాయలు కాజేశారు.. ఈ పనుల పుణ్యమా అని నగర వాసులకు వైధవ్యం వచ్చేలా ఉంది..
జీవ వైవిధ్య సదస్సు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది.. కానీ భాగ్యనగర వాసులకు ఆ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశమే లేదు.. నగర ప్రజలు సదస్సు గురుంచి తెలుసుకునే అవకాశమే లేకుండా ఒకవైపు.. సదస్సు పేరిట జేబులు నింపుకునే పనిలో మరోవైపు మన పాలకులు బిజీగా ఉన్నారు..

Monday, October 8, 2012

మన ప్రజాస్వామ్యానికి కాపలాగా..

అల్లుడా మజాకా..

అల్లుడు గారి గిల్లుడు అదిరింది.. అత్తగారి రిమోట్ కంట్రోల్ పాలనలో ఇళ్లు బాగానే చక్కబెట్టుకున్నాడు.. ఇంకా నయం అల్లుడు గారికి కట్నంగా పవర్ రాసిచ్చేస్తే?.. దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి?.. అల్లుడా మజాకా..


Sunday, October 7, 2012

జైరామ్.. నీది నోరేనా?..

ఇండియాలో మరుగుదొడ్ల కన్నా మొబైల్ ఫోన్లే ఎక్కువున్నాయనే పొంతన లేని వితండ వాదులను ఇప్పటి దాకా మనం భరిస్తూ వచ్చాం.. ఓ తిక్క కేంద్ర మంత్రి వీరిని మించిపోయాడు.. ఆలయాలకన్నా టాయిలెట్లే ముఖ్యం అంటున్నాడు జైరామ్ రమేశ్.. ఇదేమి పోలిక?.. ఈ కేంద్ర మంత్రి గారిది నోరేనా? పాయఖానా?.. ప్రజల మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బ తీసే హక్కు ఎవరిచ్చారు ఇతగాడికి? జైరామ్ రమేశ్ మానసిక ప్రశాంతత కోసం టాయిలెట్లో ప్రార్ధన చేసుకుంటారా? అక్కడే భోజనం చేస్తున్నారా?

పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ప్రజల కనీస అవసరాలు.. దేశంలో 64 శాతం ప్రజలు మల విసర్జన కోసం ఇంకా బహిర్భూమికే వెళ్లుతున్నారంటే అది జైరామ్ రమేశ్ లాంటి పాలకుల చేతగాని తనమే.. ఇందు కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా, అవన్నీ ఎక్కడికి చేరుతున్నట్లు? ఇవన్నీ పక్కన పెట్టి మరుగదొడ్లకు, ప్రార్థనాలయాలకు, సెల్ ఫోన్లకు లంకె పెట్టడం ఎందుకు?

Friday, October 5, 2012

మన వైవిధ్యం మాటేమిటి?

నా చిన్నప్పుడు ఎక్కడంటే అక్కడ కనిపించిన ఈ ప్రాణులు ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది.. మన ఇళ్ల చూరులోని పిచ్చుకలు.. చెట్లు, కరెంటు స్థంబాలపై గూడు కట్టుకునే కాకులు ఏమయ్యాయి.. సెల్ ఫోన్ల టవర్ల నుండి విడుదలయ్యే రేడియేషనే ఇందుకు కారణమేమో?.. నగరీకరణ గాడిదలను మింగేసింది.. గద్దలు అసలున్నాయా అనే అనుమానం కలుగుతోంది.. భాగ్యనగరంలో పుట్టి పెరిగిన నా అనుభవాలు ఇవి.. మన తరం ఈ ప్రాణులను చూసింది.. కాని భవిష్యత్తు తరం వీటిని చూడాలంటే జూపార్క్ వెళ్లాల్సిందేనేమో? లేదంటే పుస్తకాలే గతి..
జీవ వైవిధ్య సదస్సు పేరిట మన ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం అంతా ఇంతా కాదు.. ఎంత మంది నగరవాసులకు, రాష్ట్ర ప్రజలకు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం దక్కింది? మన ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటి? వారు పొందిన స్పూర్తి ఏమిటి? గుంతలు తేలిన రోడ్ల మీద తారు కార్పెట్లు వేసి, ఫ్లైఓవర్ల దగ్గర శిల్పాలు పెట్టి, గోడలపై బొమ్మలు వేసినంత మాత్రాన వైవిధ్యం కనిపిస్తుందా?.. అంతరిస్తున్న మన ప్రాణులపై కూడా కాస్త దృష్టి పెట్టాలి.. ఇతి ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రమే కాదు.. మన వంతు భాగస్వామ్యం కూడా ఉండాలి..

Tuesday, October 2, 2012

జై జవాన్.. జై కిసాన్

మిత్రులారా.. ఈ రోజు గాంధీజీతో పాటు శాస్త్రీజీని కూడా గుర్తు తెచ్చుకొండి.. లాల్ బహద్దూర్ శాస్త్రి భారత దేశ గొప్ప ప్రధానుల్లో ఒకరు.. జై జవాన్, జైకిసాన్ నినాదాన్ని అందించిన నాయకుడు.. పాకిస్తాన్ పై మన దేశం విజయం సాధించాక, తాష్కెంట్ ఒప్పందం సమయం...లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.. గాంధీజీ సిద్దాంతాలను అసలు, సిసలు వారసుడాయన.. అవినీతికు దూరంగా నిరాడంబరంగా జీవించడం ఎలాగో ఆచరణలో చూపించారు శాస్త్రీజీ.. ఆయనే జీవించి ప్రధానిగా కొనసాగి ఉంటే భారత దేశం ఈ దుస్థితిలో ఉండేది కాదని నేను కచ్చితంగా చెప్పగలను.


గాంధీజీని మరచిపోయిన కాంగ్రెస్..

మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానాయకుల్లో ప్రముఖులు.. భారతమాత గర్వించదగ్గ మహా పుత్రుల్లో ఆయన ఒకరు.. (జాతిపిత అనడం తప్పు) భారత స్వాతంత్ర్య సమరంలో ఆయన చూపిన సత్యాగ్రహ మార్గం ప్రపంచ ప్రసిద్ది పొందింది.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చిన గాంధీజీ, స్వయంగా వడికిన నూలు బట్టల ధరించారు.. ఒంటిపై రెండే వస్త్రాలు ధరించి జీవితాంతం నిరాడంబరంగా బతికారు.. అంటరానితనం, మద్యంపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు.. రామ రాజ్యం రావాలని కలలు కన్నారు.. దేశం పాడి పంటలతో కళకళలాడాలంటే గోవధపై నిషేధం విధించాలని సూచించారు.. మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై ధైర్యంగా తిరిగే రోజునే ఆ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుని గాంధీజీ చెప్పారు..

మరి గాంధీజీ బోధనలు ఆచరణలో ఉన్నాయా? ఈ దేశాన్ని పాలస్తున్నది ఆయన వారసులమని చెప్పుకునేవారే కదా? దీనికి సమాధానం చెప్పుకోవడానికి కాంగ్రెస్ పాలకులు సిగ్గు పడాలి.. కానీ వారికి ఈ విషయంలో పట్టింపు లేదు.. ఎందుకంటే వారికి తెలిసిన గాంధీలు వేరే ఉన్నారు.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ(వద్రా).. వీరంతా మహాత్మగాంధీ కుటుంబ సభ్యులని నమ్మే అమాయక కార్యకర్తలు కాంగ్రెస్లో చాలా మందే ఉన్నారు..
ఇప్పడు మన దేశాన్ని పాలిస్తున్న సోకాల్డ్ గాంధీ వారసులు మహాత్ముని సిద్దాంతాలకు ఏనాడో పాతర పెట్టేశారు.. సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరిట స్వదేశీని గాలికొదిలారు.. మద్యపానం, గోవధ నిషేధం మన పాలకులకు గిట్టని అంశాలు.. గాంధేయ వాదులమని చెప్పుకునే అర్హత వీరికి ఎక్కడిది? అవినీతి, కుంభకోణాలతో ఇందిర, రాజీవ్ కాలంలోనే కాంగ్రెస్ ప్రతిష్ట మంటగలిసింది సత్యం, అహింస వీరికి హాస్యాస్పదమైన విషయాలు.. ఎందుకంటే గాంధీగిరి కన్నా గుండాగిరిని నమ్ముకున్న పార్టీ ఇది..
మహత్మాగాంధీ ఈ విషయాలను ముందే ఊహించారు.. అందుకే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి కొత్త పార్టీతో ప్రజల మందుకు వెళ్లాలని సూచించారు.. కానీ ‘గాంధీ బ్రాండ్’ను సొమ్ము చేసుకోవాలనే దురాశతో ఆనాటి కాంగ్రెస్ నేతలు ఆయన సూచనను పెడచెవిన పెట్టారు.. దాని ఫలితమే ఇప్పడు దేశ ప్రజలమైన మనం అనుభవిస్తున్నేం.. మహాత్మా మీరిని క్షమించు..