Friday, November 2, 2012

తెలుగుభాషకు చెరసాల

మీకు తెలుసా?.. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 13వ స్థానంలో ఉంది.. భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 8 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు.. అయితే అంతే సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగువారు నివసిస్తున్నారు.. తమిళనాడులో 42 శాతం ప్రజల మాతృభాష తెలుగే.. కర్ణాటకలోనూ ఘననీయంగా తెలుగువారున్నారు.. చెన్నయ్, బెంగళూరు నగరాల్లో 30 నుండి 40 శాతం తెలుగు వారే.. బళ్లారిలో 80 శాతం తెలుగు ప్రజలున్నారు.. ఒడిషా, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో తెలుగు వారి ఆధిక్యతే ఎక్కువ.. హొసూరు, కొయంబత్తూరు, మధురై, రాయగడ, హుబ్లి, వారణాసి, షిరిడి, జగదల్పూర్, బెర్హంపూర్, ఖరగ్ పూర్, షొలాపూర్, సూరత్, ముంబై, భివాండి తదితర జిల్లాల్లో తెలుగువారు ఘననీయ సంఖ్యలో ఉన్నారు.. పలు దేశాల్లో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగువారు ఉంటారని అంచనా..

ఇంకో విషయం మీకు తెలుసా?.. దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. అంటే భాష ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం.. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు జిల్లాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.. ఆ తర్వాత 1956లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. ఆంధ్రప్రదేశ్ స్పూర్తిగా ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి..మరి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటం వల్ల తెలుగు భాషకు, తెలుగు వారికి ఏమైనా మేలు జరిగిందా?.. ఇప్పడు మనం అసలు విషయానికి వచ్చేశాం..

నిజం నిష్టూరంగా ఉన్నా మేలు కన్నా కీడే అధికంగా జరిగిందని చెప్పవచ్చు.. దేశంలోని ఇతర రాష్ట్రాలు చక్కగా తమ ప్రాంతీయ భాషల్లో వ్యవహారాలు సాగిస్తున్నాయి.. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హిందీ ఆధిక్య రాష్ట్రాలు.. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పేరుకు మాత్రమే అధికార భాష.. ఇక్కడ పరిపాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతాయి.. తెలుగు భాషకు గుర్తింపు అంతంత మాత్రమే.. తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు నానాటికీ తగ్గిపోతున్నారు.. చివరకు శాసనసభలో సైతం ఇంగ్లీషుకే పెద్ద పీట వేస్తారు.. ఎంగిలిపీసు(ఇంగ్లీషు) మాట్లాడం స్టేటస్ సింబల్..

మీకు ఇంకో విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గుర్తింపు తగ్గిపోయింది.. స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు ఉండేది.. బ్రిటిష్ వారు హిందీ, బెంగాళీ తర్వాత తెలుగుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.. మద్రాసు, మైసూరు రాష్ట్రాల్లో, స్వదేశీ సంస్థానాల్లో పరిపాలనా వ్యవహారాలు తెలుగు భాషలో సైతం కొనసాగాయి.. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు ఎంత అణచివేతకు గురైనా తనదైన అస్థిత్వాన్ని కాపాడుకుంది.. మద్రాసు ప్రసిడెన్సీ (రాష్ట్రం) ముఖ్యమంత్రుల జాబితా ఒక్కసారి పరిశీలిస్తే తెలుగువారే అత్యధికంగా కనిపిస్తారు.. మద్రాసుకు సీఎంగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పరిస్థితి తారుమారైంది..

మనం ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక గిరి (పరిధి) గీసుకున్నాక పొరుగు రాష్ట్రాల్లో నివసించే తోటి తెలుగువారు అనాధలైపోయారు.. అక్కడ తెలుగు భాషకు, సంస్కృతికి గుర్తింపు కరువైంది.. మనవాళ్లు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు.. తెలుగు మీడియం పాఠశాలలు మూతపడుతున్నాయి.. తెలుగువారు అనివార్యంగా తమ పిల్లలకు అన్యభాషల మీడియంలో చదివిస్తున్నారు.. క్రమంగా వారి భాషా సంస్కృతులకు గ్రహణం పడుతోంది.. తెలుగువారు అక్కడి ప్రభుత్వాలకు తమ గుర్తింపు కోసం దరఖాస్తులు పెట్టుకుంటే, మీకు ఆంధ్ర ప్రదేశ్ ఉందిగా అక్కడికే పొండి అని అవహేళన చేసిన ఉదంతాలు మద్రాసు రాష్ట్రం (నేటి తమిళనాడు)లో జరిగాయి.. గోడలపై ‘నాయుడు’ అని తెలుగులొ రాసి ఉంటే దాన్ని ‘నాయి’గా మార్చి అవమానించారు.. తమిళంలో నాయి అంటే కుక్క అని అర్థం..

మరి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏమైనా చొరవ తీసుకుందా? తెలుగుకు ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపు అంతంత.. సొంత వ్యవహారాలే పట్టని మన పాలకులు పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారి సమస్యలు పట్టించుకుంటారని భావించడం హాస్యాస్పదమే.. తెలుగు విశ్వవిద్యాలయం, అధికారం భాషా సంఘం అనేవి అజాగళ స్థనాలుగా మారిపోయాయి.. తెలుగు దేశం పేరిట ఓ పార్టీ ఉన్నా ఇది నేతిబీరలో నెయ్యి లాటిదే.. మన నాయకులు తెలుగు వారంతా ఒక రాష్ట్రంగా ఉండాలి.. సమైక్యాంధ్ర వర్దిల్లాలి అని కోతలు కోస్తుంటారు.. కానీ తెలుగు భాషా సంస్కృతులను కాపాడేందుకు వారేమైనా చేస్తున్నారా? ఎంత మంది పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారు? గుండె మీద చేయి వేసుకొని చెప్పండి..

ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఇంగ్లీషు, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడేవారు కనిపించేవారు.. అలాగే హైదరాబాద్ స్టేట్లో తెలుగు, కన్నడం, మరాఠీ, ఉర్దూ, పార్శీ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడేవారు కనిపించేవారు.. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ.. మైసూరు రాష్ట్రంలోనూ బహుభాషా కోవిధులుండేవారు.. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాక ఇలాంటి విభిన్న భాషల సాంస్కృతిక వారసత్వం దెబ్బదిన్నది.. మాతృ భాషతో పాటు ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాలనే ఆలోచన కరువైపోయింది..

మనం ఆంధ్రప్రదేశ్ పేరిట తెలుగువారికి సొంత రాష్ట్రం ఏర్పరచుకున్నాం అనే భ్రమల్లో ఉన్నాం.. (మరోసారి మొదటి పేరా చదువుకోగలరు) కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి ఒక పరిధిగా ఏర్పడి చెరసాలగా మారిపోయింది.. రాష్ట్రంలో ఉన్న తెలుగువారి భాషా సంస్కృతులకే దిక్కు లేకుండా పోయింది.. మన నాయకుల సంకుచిత మనస్థత్వం కారణంగా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఎంతో అన్యాయం జరిగిపోతోంది.. నిజానికి తెలుగు భాషకు ఊపిరిని అందిస్తున్నది ప్రసార మాధ్యమాలే.. (తెలుగు భాషను కొంత ఖూనీ చేస్తున్నప్పటికీ) తెలుగువారు ఆంధ్రప్రదేశ్ అనే భౌగోళిక ఎల్లల పరిధిలోని వారు అనే విచిత్ర మనస్థత్వం నుండి మనం భయటపడాలి.. సమైక్య ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా తెలుగువారు వర్దిల్లాలి (వారు ఎక్కడ నివసించినా) అని నినదిద్దాం.. (ఆంధ్రప్రదేశ్ అనే తెలుగువారి చెరసాల లేదా పరిధి ఏర్పడిన రోజు సందర్భంగా..)


No comments:

Post a Comment