Tuesday, July 31, 2012

మనం ఎక్కే రైలు క్షేమమేనా?

ప్రపంచ రైల్వేలన్నీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే, భారతీయ రైల్వే ఇంకా ప్రమాదాల దశనే దాటలేదు.. నెల్లూరులో తమిళనాడు ఎక్స్ ప్రెస్ బోగీ అగ్నికీలలకు ఆహుతి కావడం అసలు రైలు ప్రయాణం ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.. రైల్ సేఫ్టీ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 45 శాతం కూడా ఖర్చు చేయలేదట.. ప్రయాణీకుల భద్రతలో రైల్వే శాఖ చూపుతున్న అశ్రద్దకు ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందా?.. గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని ప్రాంతీయ నేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ రైల్వే మంత్రులుగా ఈ శాఖ పని తీరును భ్రష్టు పట్టించారు.. తమ రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, విస్తరణ, అభివృద్ధి, సురక్షిత అంశాలను నిర్వీర్యం చేశారన్నది సుస్పష్టం.. భారతీయ రైల్వే బిహారీ, బెంగాలీ బాబులకే పరిమితమా? ప్రాంతీయ ప్రయోజనాలకు అతీతంగా రైల్వే పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉంది..

Saturday, July 28, 2012

దేశ హితం లేని మీడియా

అసోంలో జరుగుతున్న మారణహోమంపై జాతీయ మీడియా స్పందన దారుణంగా ఉంది.. తెలుగు మీడియా కవరేజీ అలాగే ఉంది.. బంగ్లాదేశ్ చొరబాటుదారులు మతం పేరిట మన దేశ ప్రజలను ఏరేస్తుంటే ఇదేదో శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో జరిగుతున్న వ్యవహారం అన్నట్లు కేంద్రంలోని యూపీఏ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది.. అసోం నుండి దొడ్డి దారిన రాజ్యసభకు ఎన్నికై ప్రధానమంత్రి పదవిని వెలగబెడుతున్న మన్మోహన్ సింగ్ తీరుబడిగా వెళ్లి పరామర్శిచి వచ్చారు.. అక్కడ జరుగుతున్న అసలు వాస్తవాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు.. మీడియా ఎందుకు వాస్తవాలను తొక్కిపెడుతోందో అర్థం కావడం లేదు.. ఒకానొక జర్నలిస్టు మిత్రుడు జాతి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలని హితవు పలికాడు.. ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి...
ఇప్పటికే బంగ్లా చొరబాటుదారుల సమస్యతో ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతౌల్యం దెబ్బతింటోంది.. ఇప్పటికే చాలా జిల్లాలు మినీ బంగ్లాదేశ్లుగా మారిపోయాయి.. అక్కడ స్వదేశీ జనం కన్నా విదేశీ జనమే అధికంగా ఉన్నారు.. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిని ప్రోత్పహిస్తూ వచ్చింది.. అందుకు మూల్యం ఇప్పడు మన దేశం చెల్లిస్తోంది.. చివరగా నాదో ప్రశ్న గుజరాత్ రాష్ట్రంలో గోద్రా సంఘటన తర్వాత జరిగిన అల్లర్లపై ఏళ్ల తరబడిగా గగ్గోలు పెడుతున్న మీడియా, అసోం పరిణామాలపై ఎందుకు అంతగా స్పందించడంలేదు?.. మీడియాకు దేశ హితం పట్టదా?.
దేశ సంపదను పందికొక్కుల్లా దోచుకుతింటున్న అవినీతిపరులను ఎలా శిక్షించాలి? అనే ప్రశ్నకు ఈ సమాధానం సరిపోతుందంటారా?

Friday, July 27, 2012

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.. అందరికీ అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంపదలు కలగాలని ఆకాంక్షిస్తూ..

ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల పరిస్థితి దయనీయం.. ఒక మంత్రి ఇప్పటికే జైలులో ఉన్నారు.. మరో మంత్రికి శిక్ష పడింది.. ఇంకా ఎంత మంది మంత్రులు క్యూలో ఉన్నారో?.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తదుపరి క్యాబినెట్ మీటింగ్ చంచల్ గూడ జైలులో పెడతారేమో?
ఈ ప్రశ్నకు మీ దగ్గర ఉంటే సమాధానం ఇవ్వండి.. నా సమాధానం రేపు ఇస్తాను..


Thursday, July 26, 2012

ఆచార్యను మరచిపోయారా?

కార్గిల్ యుద్ధంలో అమరుడైన మేజర్ పద్మపాణి ఆచార్య మా హస్తినాపురం సెంట్రల్ నివాసి అని చెప్పుకోవడం నేనెంతో గర్వంగా భావిస్తాను.. 1999లో కార్గిల్ యుద్దంలో పద్మపాణి శత్రు సైనికులతో హోరాహోరీ పోరాడి ప్రాణాలు కోల్పోయాడనే వార్త వినగానే మా కాలనీ వాసులు చలించి పోయారు.. రాజకీయ నాయకులు, చుట్టు పక్కల కాలనీల ప్రజలు హస్తినాపురం తరలివచ్చి ఆచార్య అంతిమ యాత్రలో పాల్గొన్నారు.. మా కాలనీ అంతా మేజర్ ఆచార్య అమర్ హై, భారత్ మాతాకీ జై, పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో నిండిపోయింది.. ప్రజందరి మదిలో దేశ భక్తిని స్పష్టంగా చూశాను..
కాల చక్రంలో 13 ఏళ్లు గడచిపోయాయి.. కార్గిల్ విజయ్ దివస్ రోజున మా కాలనీలో పద్మపాణి ఆచార్యను తలచుకునే వారు ఎవరైనా ఉన్నారా అని ఆసక్తిగా గమనించాను.. కానీ ఎవరికీ ఈ విషయమే పట్టనట్లు కనిపించింది.. పద్మపాణి ఆచార్య అంటే ఎవరు అని కొందరు పాఠశాల విద్యార్థులను ప్రశ్నించా?.. ఏమో తెలియదని చెప్పారు.. ఇందులో వారి తప్పేమీ లేదు.. మరి వారి తల్లి దండ్రులకైనా ఆచార్య గుర్తున్నారో లేదో తెలియదు.. జనం ఆచార్యను మరచిపోయినట్లున్నారు.. హస్తినాపురం సెంట్రల్ కాలనీలో పద్మపాణి ఆచార్యకు నివాళిగా ఆయన పేరు పెట్టిన రోడ్డు ఫలకం, మెమోరియల్ హాలు మాత్రం మౌనంగా పలకరిస్తున్నాయి.. ఇక పద్మపాణి ఆచార్య శిలా విగ్రహం పెట్టాలనే ఆలోచనను కాలనీ వాసులు ఏనాడో మరచిపోయారు..

Wednesday, July 25, 2012

రాష్ట్రపతి భవన్లో దాదాగిరి


ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని అధిష్టించిన వారి చరిత్రను గమనిస్తే వారెవరూ ఆ పదవిని కోసం తమకు తాము ప్రయత్నించలేదు.. కోరుకోకుండానే వారిని ఆ పదవి వరించింది.. వెంకటస్వామి మాత్రమే రాష్ట్రపతి పదవి కోరుకొని భంగపడి ఉంటారు.. కానీ ప్రణబ్ ముఖర్జీ మాత్రమే పక్కాగా స్కెచ్ గీసి రాష్ట్రపతి పదవిని సాధించుకున్నారు.. ఈ పదవిని పొందిన వారు ఒక రాజకీయాల్లోంచి రిటైర్ అయినట్లే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తలపండిన ప్రణబ్ దాదా కోరి మరీ రాష్ట్రపతి పదవి దక్కించుకున్నారంటే ఆలోచించాల్సిన విషయమే..

గతంలోనే ప్రధాని పదవి ఆశించి భంగపడ్డ దాదాకు అది ఏనాటికీ అందని పండే అని స్పష్టంగా తెలుసు.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వ యూపీఏ పరాజయం ఖాయమని చెప్పడానికి జ్యతిష్కులే అవసరం లేదు.. కేంద్రంలో కనీసం మంత్రి పదవైనా రావాలంటే ఇక 2019 ఎన్నికలే గతి.. ఇప్పటికే వయస్సు మీరిపోయిన ప్రణబ్ అప్పటి దాకా ఎదురు చూడటం అత్యాయే.. ఇవన్నీ ఆలోచించే ఆయన మర్యాద పూర్వక రిటైర్మెంట్ కోరుకున్నారు..

అయితే సంకీర్ణ రాజకీయాల్లో రాష్ట్రపతి పదవి రబ్బరు మరీ స్టాంపేమీ కాదు.. ఇంకా చెప్పాలంటే రాష్ట్రపతే కీలక పాత్ర పోషిస్తారు.. సో దాదాజీ రాష్ట్రపతి పదవికి కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నారు..

సెటిమెంట్లతో ఆటలొద్దు

ఈ రెండు వార్తలు కలవర పరిచేవే.. ఒక దానితో ఒకటి సంబంధం లేనివే అయినా ఒక విషయంతో ముడిపడి ఉన్నాయి.. మొదటిది.. తిరుమలలో సాక్షాత్తు టీటీడీ ఉద్యోగులే అన్య మత ప్రచారం చేయడం. ఇందుకు కారకులైన ఉద్యోగులను బదిలీ చేయడం తప్ప విధించిన కఠిన శిక్ష ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వం ఏడు కొండలను రెండింటికే కుదించే కుట్ర పన్నింది.. పరమ భక్తుని ముసుగేసుకున్న ఓ నాస్తికుడు ఏకంగా టీడీడీ ఛైర్మన్ అయ్యాడు.. అతగాడు బ్రహ్మోత్సవాల సమయంలో ఏకంగా కొండపై శిలువ ఆకార స్థంబాలు నాటించే ప్రయత్నం చేయగా మీడియా బయట పెట్టింది.. పద్మావతి యూనివర్సిటీలో అప్పటి వైస్ ఛాన్సలర్ శ్రీవారి చిత్ర పటాలను తొలగించి క్రీస్తు ఫోటోలు పెట్టించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. గత కొన్నేళ్లుగా తిరుమల మెట్ల దారిలో, బస్సుల్లో యదేచ్ఛగా అన్యమత ప్రచారం జరుగుతున్న పట్టించుకునే నాధుడు లేడు.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి సన్నిధిలో ఏమిటీ దారుణం.. ఇతర మతస్తుల మనోభావాలతో ఇలాగే వ్యవహరిస్తే ఊరుకునే వారా? ఎన్ని గొడవలు జరిగేవి.. హిందువుల సహనశీలతను బలహీనతగా భావించే ఈ బరితెగింపా?

ఇక రెండో విషయానికి వద్దాం.. విజయమ్మ గారు సిరిసిల్ల వెళ్లింది చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికా? లేక మత ప్రచార కూటములకా? ఆమె చేతిలో ఉన్న మత గ్రంధం దేనికి సంకేతం? విజయమ్మకు ఏ మతమైనా అనుసరించే స్వేచ్ఛ ఉండొచ్చు.. ఈ విషయంలో కామెంట్ చేయడం తప్పే కావచ్చు.. ఒక ముఖ్యమైన ప్రజా సమస్యపై జరిగే ఆందోళనా కార్యక్రమంలో బైబిల్ చేత పట్టుకోవడం దేనికి సంకేతం? అక్కడ ఉన్నమెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మన దేశంలో ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్చ ఉంది.. కానీ ఆ స్వేచ్ఛకూ హద్దు ఉంటుంది.. ప్రజా జీవితంలో ఉన్న వారు అన్ని మతాల సెంటిమెంట్లను గౌరవించాలి..

Tuesday, July 24, 2012

ఏమి’టీ’ గందరగోళం?..

సిరిసిల్లలో విజయమ్మ అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ప్రకటించింది తెరాస.. ఎలాగైనా వచ్చి తీరుతామని సవాలు స్వీకరించింది వైకాపా.. అడుగడుగునా నిరసనల మధ్య విజయమ్మ వెళ్లింది.. అడ్డుకోబోయిన వందలాది మంది తెరాస, టీజేఏసీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు తమ దమన నీతిని ప్రదర్శించారు.. ఇక్కడ ఎవరు ఓడారు? ఎవరు గెలిచారు? అన్నది అసలు ప్రశ్నే కాదు.. ఎవరి వైఖరి వారిది.. ఎవరికి కావాల్సిన కోణాల్లో వారు విశ్లేషించుకోవచ్చు.. కానీ నిష్పాక్షికంగా చూస్తే రెండు వైపులా తప్పులే కనిపిస్తున్నాయి..

తెలంగాణ విషయంలో దోబూచులాడుతూ, వీలైనంత రాజకీయ లబ్ది పాందాలన్నదే వైసీపీ లక్ష్యం.. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం’ అని గతంలో చేసిన అస్పష్ట ప్రకటనే ఇంత వరకూ ఆ పార్టీ ఇచ్చిన వివరణ.. ‘మాంసాహారుల విషయంలో మాకు పట్టింపులు లేవు’ అన్నంత క్లారిటీ ఉంది ఇందులో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా, వైకాపాల ద్వంద్వ వైఖరుల్లో ఏమాత్రం తేడా లేదు.. ఇద్దరిదీ దొందుకు దొందే..

ఇక తెరాస, టీజేఏసీల విషయానికి వద్దాం.. జగన్ గతంలో తెలంగాణలో జరిపిన ఇందిరాపార్క్ ఫీజు పోరు - ఆర్మూరు రైతు దీక్షల విషయంలో లేని అభ్యంతరాలు, విజయమ్మ సిరిసిల్ల చేనేత దీక్ష విషయంలో ఎందుకొచ్చాయి? అనే విషయంలో సరైన వివరణ లేదు.. నాకు అర్థమైనంత వరకూ ఈ ఎపిసోడ్ అంతా తెరాస, వైసీపీ రాజకీయ మైలేజీలకు సంబంధించిన వ్యవహారమే.. తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని అంశమిది.. ఉద్యమ క్రమంలో వీరి ద్వంద్వ విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. పాలమూరు ఉప ఎన్నికలో తటస్థంగా ఉన్న టీజేఏసీ, పరకాలలో ఏకపక్షంగా తెరాసకు మద్ధతు ఇచ్చి ఉద్యమ ఐక్యతను దెబ్బ తీసింది.. తెలంగాణ కోసం కలిసి వచ్చిన బీజేపీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించి, గంప గుత్తగా తెరాసను ఏకైక పేటెంట్ హోల్డర్ని చేసేశారు.. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ఇస్తుందనే సంకేతాలు తనకున్నట్లు తనకున్నాయని కేసీఆర్ ప్రకటిస్తే, తమకు నమ్మకం లేదని.. ఎలాంటి సంకేతాలు లేవని కోదండరామ్, విజయశాంతి అంటారు.. అసలేమిటీ గందరగోళం?.. తాము చేసిందే కరెక్ట్ అనే ఏకపక్ష ధోరణి ఐకమత్యాన్ని దెబ్బతీసి ఉద్యమ శత్రువులు బలోపేతం కావడానికి కారణమౌతోంది..

Sunday, July 22, 2012

ఈ పాపం ఎవరిది?

ఒక్కపూట భారీ వర్షానికే హైదరాబాద్ ఆహాకారాలు చేసింది.. రోడ్లు నదుల్లా మారాయి.. ఎన్నో బస్తీలు, కాలనీలు నీట మునిగాయి.. వర్షం విధ్వంసానికి 9 మంది చనిపోయారు.. 2000 సంవత్సరం తర్వాత భారీ విపత్తు ఇదే.. 420 సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరానికి ఏమిటీ దుస్థితి?.. వాన కురిస్తే భయపడాల్సిందేనా? ఈ పాపం ఎవరిది?.. ఒక్కసారి సంక్షిప్తంగా గత చరిత్రలోకి వెళదాం..

1908లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో మూసీ నదికి వరదలు వచ్చి సగం నగరం మునిగిపోయింది.. 15 వేల మంది చనిపోయారు.. ఇళ్లు కోల్పోయి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.. చలించిపోయిన నిజాం ప్రభువు హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆనకట్టలు కట్టి మూసి నదికి కళ్లెం వేశారు.. నదికి ఇరు వైపులా భారీ గోడలు కట్టారు.. 2000 సంవత్సరంలో హైదరాబాద్ మరోసారి భారీ వర్షాల వరదలకు అల్లాడి పోయింది.. శివారు చెరువుల గట్లు తెగి హుస్సేన్ సాగర్ ఉగ్ర రూపం దాల్చింది.. గేట్లు తెరిస్తే దిగువన ఉన్న చిక్కడపల్లి, హిమయత్ నగర్, గాంధీనగర్, ముషీరాబాద్, నల్లకుంట, అంబర్ పేట తదితర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.. ఇలాంటి సంఘటనలు మరోసారి తలెత్తరాదనే ఆలోచనతో ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీని నియమించింది.. కానీ ఆ కమిటీ చేసిన ముఖ్యమైన సిఫార్సులు అటకెక్కాయి..

చరిత్ర పుటల్లోకి వెళ్లితే హైదరాబాద్ నగరం లేక్స్ సిటీ అని తెలుస్తోంది.. నగరంలో, శివారు ప్రాంతాల్లో 500 పైగా చెరువులు, కుంటలు ఉండేవి.. దురదృష్ట వశాత్తు నేడు వాటి ఆనవాళ్లు కూడా కనిపించడంలేదు.. నేను చిన్నప్పుడు చూసిన చెరువులెన్నో ఈనాడు కనిపించకుండాపోయాయి.. పెరుగుతున్న జనాభా, నగరీకరణ చెరువులను, కుంటలను మింగేసింది.. ఒకనాడు చెరువులున్న చోట ఈరోజున పెద్ద పెద్ద కాలనీలు, బస్తీలు కనిపిస్తున్నాయి.. నాలాలను అక్రమించి ఇండ్లు కట్టుకున్నారు..వాన నీటి కాలువలు చెరువులను చేరుతాయి.. చెరువులు నిండితే ఆ నీరు నదిలోకి వదులుతారు.. మరి చెరువులే లేకపోతే వాన నీరు ఎక్కడికి పోతుంది?.. వేరే దారేది?.. ఇదే హైదరాబాద్ దుస్థితికి కారణం.. పాత చెరువులను ఎలాగూ తిరిగి తెచ్చుకోలేం.. కనీసం ఉన్న చెరువులు, కాలువలైనా భవిష్యత్తు తరాల కోసం కాపాడుకుందాం..
ఈ చిత్రంలో హైదరాబాద్ నగరంలో, చుట్టు పక్కల ఉన్న చెరువులు, కుంటలు, కాలువలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి కదూ.. ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని లేక్స్ సిటీ అని పిలిచియే వారు.. 500లకు పైగా జలవనరులు ఉండేవి.. కానీ నగరీకరణ వాటిని మింగేసింది.. చెరువులు, కాలువల్ని అక్రమించేసి ఇళ్లు కట్టేశారు.. వాన నీరు పోయే మార్గమేది? దీని ఫలితంగానే హైదరాబాద్ నగరాన్ని వాన భయపెగుతోంది..

Saturday, July 21, 2012

ఇద్దరూ వేస్టే..

కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన ‘TIME’ పత్రిక మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ముఖ చిత్రంతో THE UNDERACHIVER అనే శీర్షిక పెట్టి, ఆయన విఫల నాయకుడంటూ వార్తా కథనాన్ని ఇచ్చింది.. విచిత్రంగా మన దేశానికి చెందిన OUTLOOK పత్రిక దెబ్బకు దెబ్బ అన్నట్లుగా అదే శీర్షికతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను విమర్శిస్తూ ముఖ చిత్ర కథనాన్ని ఇచ్చింది.. మన్మోహన్ వేస్ట్ ఆఫ్ ఇండియా అని టైమ్ పత్రిక చెప్పక ముందే భారత ప్రజలకు తెలుసు.. అలాగే ఒబామా కూడా ఇంతేనని అమెరికా, ఇండియా ప్రజలకే కాకుండా ప్రపంచమంతటికీ తెలుసు.. మొత్తానికి భలేగా ఉన్నాయి ఇద్దరు విఫల నాయకుల కథనాలు.. ప్రపంచంలో అత్యంత చెత్త నాయకుల జాబితాలో వీరిద్దరి స్థానం ఎక్కడుందో తెలిపే కథనాన్ని మరేదైనా పత్రిక ప్రచురిస్తే బాగుండు.. ఈ జాబితాలో మన ప్రధాని TOP TENలో మాత్రం ఉండొద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను..

Friday, July 20, 2012

ఉత్త(ర)కుమారొస్తున్నాడొహో..

రాహుల్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని మనస్పూర్తిగా కోరుకునే వారిలో నేనూ ఒకన్ని.. ఎందుకంటే ఇలాగైనా ఈ దేశానికి శనిలా దాపురించిన ఆ పార్టీ పాలన అంతం అవుతుంది.. ఈ విఫల ఉత్తర కుమారుడు ఏం సాధిస్తాడని ఆ పార్టీ నాయకులు సాగినపడుతున్నారో అర్థం కావడం లేదు.. ఈ ఐరన్ లెగ్ రాకుమారుడు ఎక్కడికి వెళ్లితే అక్కడ కాంగ్రెస్ ఢమాల్ అని గత ఉదంతాలు చెబుతున్నాయి.. పూర్వం రాజుల ఇళ్ళల్లో మొద్దబ్బయాలను ఉండేవారట.. రాకుమారుడు తప్పు చేస్తే శిక్ష మొద్దబ్బాయికే పడేది.. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే యూపీ నాయకులు మొద్దబ్బాయిల్లా తప్పు తమదేనంటూ శిక్ష అనుభవించేందుకు సిద్ధపడ్డారు.. ఈ నడి వయస్సు యువకుడు మన రాష్ట్రానికి కూడా వేంచేయక పోవడమే మంచిదేమో.. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కనీసం దశాబ్దకాలమైనా మాజీలైపోతారేమోనని భయమేస్తోంది.. మరో దశాబ్దం దాకా ఏపీ కా వంశ పారంపర్య పాలనతో కాంగ్రెస్ పార్టీలో ఇతరులను ఎదగనివ్వని సోకాల్డ్ గాంధీల కుటుంబంపై రాహుల్ ద్వారా అయినా భ్రమలు తొలగాలని నేను కోరుకుంటున్నారు..

రేషన్ దర్శనమా?

కలియుగ వైకుంఠనాధుని దర్శనానికి రేషన్ విధిస్తున్నారనే వార్త చూడగానే ఈ నిర్ణయం తీసుకున్న వారిని కొరడాతో.. కాదు కాదు చెప్పుతో కొట్టాలన్నంత ఆగ్రహం వచ్చింది.. ఇప్పటికే వీఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులను గంటలు, రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నారు.. దేవున్ని భక్తులకు దూరం చేస్తున్న నీచులను ఏం చేసినా పాపం లేదు.. ఈ నిర్ణయం తీసుకునే హక్కు వీరికి ఎవరిచ్చారు? కోట్లాది రూపాయల స్వామి వారి హుండీని సొమ్ములను భక్తుల సౌకర్యం కోసం వెచ్చించడం చేతగాని పాలక మండలి చివరకు ఇంతటి వికృత నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కలలో కూడా ఊహించలేదు.. భగవంతుడి ముందు అందరూ సమానమే.. అలాంటప్పుడు తిరుమలలో సాధారణ భక్తులపై ఎందుకీ వివక్షత? పాలకులైనా, వీఐపీలైనా, ధనికులైనా అందరూ ఒకే క్యూలో (చిలుకూరు పద్దతి) దైవ దర్శనం ఎందుకు చేసుకోరు? ఈ విధానాన్ని అమలు చేస్తే శ్రీవారి దర్శనం అందరికీ సులభంగా, వేగంగా పూర్తవుతుంది.. కానీ ఈ విధానాన్ని అమలు చేసే ధైర్యం లేని పాలక మండలి తన ప్రతాపాన్ని సాధారణ భక్తులపైనే చూపుతోంది..

ధృతరాష్ట్ర పుత్రులు

అసోం దుశ్శాసన పర్వం చూశాక కలిగిన బాధకన్నా, ఆ సంఘటనలో లైవ్ టీవీ రిపోర్టర్ ప్రమేయం ఉన్న విషయమే ఎక్కువ విచారం కలిగించింది.. కొద్ది సంవత్సరాల క్రితం ఒంగోలు కలెక్టరేట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న ఓ వ్యక్తిని అడ్డుకోవాలనే ఆలోచన కూడా కలగని మానవత్వం లోపించిన ఛానెళ్ల ప్రతినిధులు అతడు చచ్చేదాకా తమ కెమెరాల్లో చిత్రీకరించారు.. మనం జర్నలిస్టులం అనే కొమ్ములు తగిలించుకునే ముందు, మనుష్యులం కూడా అని గుర్తుంచుకోవాలి.. ఇక అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించేవారి విషయానికి వస్తే ఇలాంటి ధృతరాష్ట్ర పుత్రులు తమకు కూడా సోదరీమణులు ఉన్నారనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.. తమ కుటుంబ సభ్యులతో ఇతరులు కూడా అలాగే ప్రవర్తిస్తే అనే స్పృహ వారికి కలగడం మంచిది.. వెర్రితలలు మేస్తున్న ప్రాశ్చాత్యీకరణకు అసోం సంఘటన పరాకాష్ట.. అర్ధరాత్రి దాకా పబ్బులు,క్లబ్బుల చుట్టూ పార్టీ పేరిట తిరిగే తమ పిల్లలను కట్టడి చేయలేని తల్లిదండ్రులు ఈ భూమిపై రాక్షస సంతతిని పెంచుతున్నామని ఇకనైనా గ్రహిస్తారా?

Saturday, July 14, 2012

‘గ్యాస్’ కబుర్లు

స్వర్ణాంధ్ర పాయే.. హరితాంధ్ర పోయే.. అంధాంధ్ర మిగిలే.. ప్రభుత్వాలు, పార్టీలు మారినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్తు సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది.. పారిశ్రామిక వేత్తలు, రైతులు, సామాన్యులు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు.. ప్రాజెక్టుల్లో నీరు లేక హైడల్ పవర్ తగ్గిందనుకుందాం.. కానీ అపారమైన బొగ్గు నిల్వలు, సహజ వాయువు ఉన్న ఏపీకి ఏమిటీ దుస్థితి.. విద్యుత్తు సంక్షోభానికి సహజవాయువు కొరతే కారణమని ముఖ్యమంత్రి గ్యాస్ కబుర్లు చెబుతాడు.. రిలయన్స్ కంపెనీని తిడతాడు.. రిలయన్స్ గ్యాస్ ఏమన్నా ఆకాశంలో ఉత్పత్తి చేస్తోందా? రాష్ట్ర భూభాగంలేనే కదా ఉన్నది.. ఆ కంపెనీని ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా?.. కేంద్రంలో ఇతర పార్టీ ప్రభుత్వం ఉన్నట్లు ధీనంగా గ్యాస్ కోసం దేబిరించడం ఎందుకు? పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఏమైనా మన రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తా?.. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్లు? కరెంటు సమస్య కూడా తీర్చలేని ఈ అసమర్థ పాలకులును ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఇంకా భరించాలా? వీరు ఉండి ఎందుకు? సిగ్గుతో బంగాళాఖాతంలో పడొచ్చుకదా?

Thursday, July 12, 2012

పోగాలం దాపురిస్తే..

కేంద్ర హోంమంత్రి పలనియప్పన్ చిదంబరం గారి నెల జీతం రూ.80,000 (అలవెన్సులు+ 2G వగైరా అవినీతి సంపాదన అదనం).. అటెండర్ పార్సిగుట్ట చిన్నయ్య జీతం రూ.8,000 (నో అలవెన్స్).. పి.చిదంబరం పార్లమెంట్ క్యాంటీన్లో రూ.1 కే టీ తాగుతారు.. పి.చిన్నయ్య ఇరానీ హోటల్లో రూ.8 పెట్టి చాయ్ తాగుతాడు.. చిదంబరం రూ.2 తో సుష్టగా భోజనం చేస్తాడు.. చిన్నయ్య రూ.60 ఖర్చు చేయలేక ఇంటి నుండి సద్ది తెచ్చుకొని తింటాడు.. చిదంబరం రూ.24లకే చికెన్ బిర్యానీ లాగిస్తాడు.. చిన్నయ్య బావర్చీలో అదే బిర్యానీ తినాలంటే రూ.130 ఖర్చు.. చిదంబరం గారికి చెన్నయ్, శివగంగ ప్రాంతాల్లో అత్యాధునిక ఇళ్లు ఉండటంతో పాటు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ నివాసం ఉచితం.. ఎక్కడికి వెళ్లాలన్నా ఖర్చే లేదు.. మరి మన చిన్నయ్యకు సొంత ఇల్లు కూడా లేదు.. హైదరాబాద్ శివారులో సగం జీతం ఖర్చు పెట్టి అద్దె ఇంట్లో కాపురం చేస్తున్నాడు.. మరి మిగతా సగం జీవితంతో సంసారం నెట్టుకు రావడం ఎలాగో?..
కేంద్ర మంత్రిగా కారు చౌకగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎర్రగా బుర్రగా నిగనిగలాడుతున్న చిదంబరం గారు జనం మినరల్ వాటర్, ఐస్ క్రీమ్ లకు ఖర్చు చేస్తూ.. బియ్యం ధర పెరిగితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఏడుస్తున్నాడు.. సామాన్యుడు ప్రతి రోజూ మినరల్ వాటర్, ఐస్ క్రీమ్ కొంటున్నాడా? హర్వార్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఈ మంత్రిగారు మతి తప్పి మాట్లాడి చివరకు అలా అనలేదని నాలుక కరుచుకుంటున్నాడు..
18వ శతాబ్దంలో ప్రాన్స్ దేశంలో జనం బ్రెడ్డు దొరకక అల్లాడుతుంటే కేకులు తిని బతకొచ్చు కదా అని ఆ దేశ రాణి గారు పరిహాసమాడారు.. కడుపు మండిన ప్రజలు తిరుగుబాటు చేశారు.. అదే ఫ్రెంచ్ విప్లవంగా ప్రసిద్దికెక్కింది.. కడుపు మండుతున్న చిన్నయ్య లాంటి వారు ప్రజాస్వామ్యమనే ఓటుతో తిరగడబడి యూపీఏ సర్కారును కూల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. పోగాలం దాపురిస్తే పాలకులు పిచ్చి మాటలు మాట్లాడటం సహజం..

గాంధీజీ ‘పిత’ ఎలా అవుతారు?

మోహన్ దాస్ కరంచంద్ గాంధీని జాతిపితగా ఎప్పుడూ అధికారికంగా గుర్తించలేదని మన ప్రభుత్వం అంగీకరించింది.. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు తమ దగ్గర లేవరి ప్రధానమంత్రి కార్యాలయం ప్రటించింది.. సంతోషం.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే కానీ ఈ విషయం దేశ ప్రజలకు ఇప్పటిదాకా తెలియలేదు.. మరి ఇంత కాలం గాంధీజీని జాతిపితగా దేశ ప్రజలను భ్రమింపజేసిందెవరూ?..


మన దేశానికి వేలాది సంవత్సరాల చారిత్రిక వారసత్వం ఉంది.. ఎన్నో దేశీయ, విదేశీ రాజవంశాలు మన దేశాన్ని పాలించాయి.. గాంధీజీ క్రీ.శ.1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల్లో ఆయనా ఒకరు.. భారత దేశాన్ని మనమంతా తల్లిగా పూజిస్తాం.. భారతమాతగా ఆరాధిస్తాం.. వేలాది సంవత్సరాలుగా కొన సాగుతున్న మన జాతికి గాంధీజీ ‘పిత’ ఎలా అవుతారు? భారతమాత సుపుత్రుల్లో గాంధీజీ కూడా ఒకరు మాత్రమే.. అసలు ఈ ‘జాతి పిత’ను తయారు చేసిన మూర్ఖులెవరు?.. మన దేశాన్ని పాలించిన సోకాల్డ్ గాంధీ కుటుంబంతో మహాత్మాగాంధీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.. కానీ దర్జాగా గాంధీ పేరును క్లెయిమ్ చేసుకుంటోంది.. ఇంత జరుగుతుంటే మన చరిత్రకారులేం చేస్తున్నట్లు.. కల్పిత చరిత్రలతో దేశ ప్రజలను ఇంకా ఎంతకాలం మభ్యపెడతారు?

సత్యమేవ జయతే

గనుల మాఫియా గాలి జనార్ధన రెడ్డి అరెస్టయి చంచల్ గూడ జైలుకు వెళ్లే ముందు సత్యమేవ జయతే అన్నాడు.. ఓ నేరగాడు ఎందుకలా అన్నాడోనని ఆశ్చర్యపోయాను.. తర్వాత కాలంలో అర్థం అయ్యింది.. న్యాయాన్ని కొనుగోలు చేసి నిర్ధోషిగా ముద్రేయించుకుందామనే కుట్ర పన్నాడని.. గాలి బెయిల్ స్కాములో న్యాయ మూర్తులు, రౌడీలు ములాఖత్ అయ్యి ఇంత పెద్ద కుట్ర పన్నడం బాధాకరం.. డబ్బున్నోడు న్యాయాన్ని ఇలా కొనుగోలు చేస్తే పేదోడి పరిస్థితి ఏమిటి? న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలిగేది ఎలా?

Wednesday, July 11, 2012

నిజం నిష్టూరమే..

రాజుగారి వంటి మీద వస్త్రాలు లేవు.. ఈ విషయం అందరికీ తెలుసు.. అయినా మనకెందుకు లెమ్మని మాయా వస్త్రాలు అద్భుతమని వంగమాగదులు ప్రశంసిస్తున్నారు.. ఉండబట్టలేక ఓ కొంటె వాడు వాస్తవాలు చెప్పేశాడు.. ఓరీ ద్రోహీ అంటూ అంతా వాడిపై విరుచుకు పడ్డారా మూర్ఖులు..

ఇక అసలు విషయానికి వస్తే దింపుడు కళ్లెంపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ అయినా, కేతు వచ్చినా ప్రాణం పోయలేడని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సల్మాన్ ఖర్షీద్ నోరు జారగానే ఆ పార్టీ నేతలు గయ్య్.. మని లేచారు.. అందుకే అన్నారేమో యదార్థ వాదీ లోక శత్రు అని..

‘కర్’ నాటకం..

కర్నాటకంలో మూడో కృష్ణడు వచ్చేశారు.. అవినీతి కేసుల్లో ఇరుక్కొని బలవంతాన గద్దె దిగిన యడ్యూరప్ప పట్టుపట్టీ తన వారసునిగా సదానంద గౌడను ముఖ్యమంత్రిని చేశారు.. గౌడ తనను ఖాతరు చేయడం లేదని ఇప్పడు జగదీష్ షెట్టర్ ను తెచ్చుకున్నారు.. రేపొద్దున షెట్టర్ కూడా మొండికేశాడని ఆయనా వద్దు నాకే తిరిగి సీఎం సీటు ఇవ్వమని యెడ్డి అధిష్టానంపై వత్తిడి తేడని గ్యారంటీ ఏముంది.. పాపం అంతో ఇంతో ప్రజాధరణ ఉన్న సదానంద సీఎం పదవి కోసం తన పార్టమెంట్ స్థానాన్ని కూడా వదులుకున్నాడు (ఉప ఎన్నికల్లో ఆ సీటు కాస్తా పోయింది).. కర్ణాటకలో ప్రజలు బీజేపీ నాయకుల అవినీతి, అసమర్ధ కార్యకలాపాలతో విసిగిపోయారు.. ఇక ఈ నాటకాలు ఇక చాలు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరపడమే మంచిదేమో..

జూనియర్.. జూ..నియ్యర్..

కొడాలి నాని, వల్లభనేని వంశీ తనకు సన్నిహితులైనా, వారి వ్యవహారలతో తనకు సంబంధం లేదంటారు జానియర్ ఎన్టీయార్.. తన వయస్సు చిన్నదని, కొత్తగా పెళ్లైనవాన్నని చెప్పుకొచ్చారు.. మరి 2009 ఎన్నికల ప్రచారంలో వయస్సుకు మించిన డైలాగులు ఎలా కొట్టారు.. ఈ కుర్రాడి వత్తిడితో బాబు గారు కొందరి రాజకీయ జీవితాలను బలిపెట్టి నాని, వంశీలకు సీట్లు ఇచ్చేశారు.. జూనియర్ గారిని వారు మోసం చేసినట్లా? లేక ఆయనకు తెలిసే ఇదంతా జరుగుతోందా?.. జీవితాంతం తాతగారు స్థాపించిన టీడీపీలోనే ఉంటానంటున్న జూనియర్ ఎన్టీయార్ కేవలం ఎన్నికలప్పడు ప్రచారానికే పరిమితం అవుతారా? లేక నాయకత్వ బాధ్యతలు స్వీకరించి తాతగారి పార్టీని కాపాడుకుంటారా?..

Tuesday, July 10, 2012

మన టైమ్ బాగోలేదు

‘టైమ్’ పత్రిక రాసిందాంట్లో కొత్తేమీ లేదు.. మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధాని, కీలుబొమ్మ, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేని కారణంగా దేశం ఆర్థికంగా పతనం అవుతోందని అందరికీ తెలిసిన విషయాలే.. కాకపోతే మన దేశంలో ప్రతిపక్షాలు పత్రికలు చెప్పిన విషయాన్నే అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ చెప్పంది.. మనకు పొరిగింటి కూరే నచ్చుతుంది కదా? అందుకే టైమ్ కథనం సంచలన విషయంగా కనిపించింది.. నిజానికి టైమ్ పత్రిక ఆలోచనా దృక్పథం గమ్మత్తుగా ఉంటుంది.. అమెరికా ప్రభుత్వ పాలసీని సమర్థించే విధంగానే వారి రాతలు ఉంటాయి.. వారి దేశ భక్తిని మనం తప్పు పట్టలేం.. ఆ మాత్రం దేశ భక్తి మన దేశ పత్రికలకు లేకపోవడం మన దౌర్భాగ్యం.. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అణు పరీక్ష జరిపినప్పుడు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా టైమ్ పత్రిక ఇలాగే వార్తాకథనాలు రాసింది.. కొద్ది వారాల క్రితం గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని ప్రశంసిస్తున్నారో, విమర్శిస్తున్నారో తెలియని కథనం టైమ్ పత్రికలో వచ్చింది.. ప్రస్తుతం మన దేశం ‘టైమ్’ బాగోలేదనే విషయాన్ని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను..

అన్నట్లు ‘టైమ్’ పత్రికపై మీ ముఖాన్ని కూడా చూసుకోవాలని కోరుకుంటున్నారా? అదెలాగో త్వరలోనే చెబుతాను..

Friday, July 6, 2012

పీవీపై పగెందుకు?

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుపై చచ్చిన అర్జున్ సింగ్, ఇంకా బతికే ఉన్న కుల్దీప్ నయ్యర్ బురదజల్లలిన తీరు చూస్తుంటే వారు అసలు మనుషులేనా? అనే అనుమానం వచ్చింది.. సోకాల్డ్ గాంధీ కుటుంబానికి గులాంగిరీ చేయడంలో నడుములిరిగిపోయిన అర్జున్ సింగ్ చచ్చే ముందు అప్పటికే దివంగతులైన నరసింహారావుపై విషపు రాతలు రాసిన తీరు చూస్తుంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు పదిలంగా సాగాలని కోరుకున్న ఆరాటమే కనిపిస్తుంది.. సోనియా ప్రాపకం కోసం పీవీపై అర్జున్ మొదటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు.. 1992 డిసెంబర్ 6 నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంటే పీవీ ఎంత వత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. బాబ్రీ మసీదు కూలే సమయంలో ఆయన పూజలు చేస్తూ గడిపారని మరో దివంగత నేత మధు లిమాయే చెప్పాడని నయ్యరయ్య అంటున్నారు.. పీవీజీపై ఎందుకీ విషపు రాతలు? చచ్చి పైలోకాన ఉన్న నరసింహారావు, మధులిమాయే వివరణ ఇచ్చుకోగలరా? పీవీపై గుంట నక్కలాంటి అర్జున్ సింగ్ చేసిన విమర్శలను అర్థం చేసుకోవచ్చు.. కానీ కుల్దీప్ నయ్యర్ కు ఏమైనట్లు.. పాకిస్తాన్ భజనలో ఆరి తేరిన ఈయన గారికి ఆ దేశం మన దేశంలో చేసిన దాడులను ఖండించడంలో నోరు పెగలదు.. తెలంగాణ రాష్ట్రం ఒక అన్యాయమైన డిమాండ్ అంటాడు.. తొలి తెలుగు ప్రధాని పీవీపై ఇంత ఘోరమైన దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ఖండించడంలేదో అర్థం కావడం లేదు.. ఢిల్లీ అమ్మోరు కన్నెర్ర చేస్తుందని భయమా?.. నోరు మెదపాల్సిన బాధ్యత పీవీ తనయుడు రంగారావు, పాలడుగు వెంకటరావు, రుద్రరాజు పద్మరాజులకే ఉందా?.. ఇందిర, రాజీవ్ ల జయంతి, వర్ధంతులను ఘనంగా చేసుకునే కాంగ్రెస్ నేతలు ఇటీవలే పీవీ విషయంతో ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? నరసింహారావు చనిపోయాక ఢిల్లీలో ఆరడగుల సమాధి స్థలం ఇచ్చేందుకు కూడా సోనియా గాంధీ ఒప్పుకోలేదు.. ఏఐసీసీ కార్యాలయం బయటి నుండే శవాన్ని హైదరాబాద్ పంపిన ఘనత ఆమెది.. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి అప్పుల ఊబి నుండి కాపాడిన నరసింహారావుకు ఇచ్చే నివాళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నివాళి ఇదేనా? పీవీ పుణ్యమా అని ఆర్థిక మంత్రి అయ్యి, ఇప్పడు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా అమ్మగారికి జడిసి పీవీ పేరెత్తడంలేదు.. సోకాల్డ్ గాంధీ కుటుంబ సభ్యుడు కాకపోవడమే ఆయన చేసిన నేరమా?..

Thursday, July 5, 2012

నాయకులే గడ్డి తిన్నారు..


పశువులకు వేసే గ్రాసం కోసం రైతన్నలు గంటల కొద్ది క్యూలో నిల్చొని ఎదురు చూడటం దారుణం.. పాపం గడ్డి అంతా నాయకులే తినేస్తున్నారు.. పశువులకు మిగలడం లేదు అనే విషయం వారికి తెలియదు..