Tuesday, July 24, 2012

ఏమి’టీ’ గందరగోళం?..

సిరిసిల్లలో విజయమ్మ అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ప్రకటించింది తెరాస.. ఎలాగైనా వచ్చి తీరుతామని సవాలు స్వీకరించింది వైకాపా.. అడుగడుగునా నిరసనల మధ్య విజయమ్మ వెళ్లింది.. అడ్డుకోబోయిన వందలాది మంది తెరాస, టీజేఏసీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు తమ దమన నీతిని ప్రదర్శించారు.. ఇక్కడ ఎవరు ఓడారు? ఎవరు గెలిచారు? అన్నది అసలు ప్రశ్నే కాదు.. ఎవరి వైఖరి వారిది.. ఎవరికి కావాల్సిన కోణాల్లో వారు విశ్లేషించుకోవచ్చు.. కానీ నిష్పాక్షికంగా చూస్తే రెండు వైపులా తప్పులే కనిపిస్తున్నాయి..

తెలంగాణ విషయంలో దోబూచులాడుతూ, వీలైనంత రాజకీయ లబ్ది పాందాలన్నదే వైసీపీ లక్ష్యం.. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం’ అని గతంలో చేసిన అస్పష్ట ప్రకటనే ఇంత వరకూ ఆ పార్టీ ఇచ్చిన వివరణ.. ‘మాంసాహారుల విషయంలో మాకు పట్టింపులు లేవు’ అన్నంత క్లారిటీ ఉంది ఇందులో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా, వైకాపాల ద్వంద్వ వైఖరుల్లో ఏమాత్రం తేడా లేదు.. ఇద్దరిదీ దొందుకు దొందే..

ఇక తెరాస, టీజేఏసీల విషయానికి వద్దాం.. జగన్ గతంలో తెలంగాణలో జరిపిన ఇందిరాపార్క్ ఫీజు పోరు - ఆర్మూరు రైతు దీక్షల విషయంలో లేని అభ్యంతరాలు, విజయమ్మ సిరిసిల్ల చేనేత దీక్ష విషయంలో ఎందుకొచ్చాయి? అనే విషయంలో సరైన వివరణ లేదు.. నాకు అర్థమైనంత వరకూ ఈ ఎపిసోడ్ అంతా తెరాస, వైసీపీ రాజకీయ మైలేజీలకు సంబంధించిన వ్యవహారమే.. తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని అంశమిది.. ఉద్యమ క్రమంలో వీరి ద్వంద్వ విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. పాలమూరు ఉప ఎన్నికలో తటస్థంగా ఉన్న టీజేఏసీ, పరకాలలో ఏకపక్షంగా తెరాసకు మద్ధతు ఇచ్చి ఉద్యమ ఐక్యతను దెబ్బ తీసింది.. తెలంగాణ కోసం కలిసి వచ్చిన బీజేపీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించి, గంప గుత్తగా తెరాసను ఏకైక పేటెంట్ హోల్డర్ని చేసేశారు.. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ఇస్తుందనే సంకేతాలు తనకున్నట్లు తనకున్నాయని కేసీఆర్ ప్రకటిస్తే, తమకు నమ్మకం లేదని.. ఎలాంటి సంకేతాలు లేవని కోదండరామ్, విజయశాంతి అంటారు.. అసలేమిటీ గందరగోళం?.. తాము చేసిందే కరెక్ట్ అనే ఏకపక్ష ధోరణి ఐకమత్యాన్ని దెబ్బతీసి ఉద్యమ శత్రువులు బలోపేతం కావడానికి కారణమౌతోంది..

No comments:

Post a Comment